అక్షర

యథార్థ సంఘటనలకు హాస్య రూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కథలు- హాస్య కథలు’’
భీమరాజు వెంకటరమణ,
పాలపిట్ట బుక్స్,
వెల: రు.80/-
పేజీలు: 112
**
భీమరాజు వెంకటరమణ మంచి హాస్య కథారచయిత. ఆయన హాస్య కథలతోపాటు మామూలు కథలు అనగా ప్రేమకథలు, కుటుంబ సంబంధాల కథలు కూడా రాశారు. అలా రాసిన వాటిలో నుండి తొమ్మిది మామూలు కథలు, తొమ్మిది హాస్య కథలతో కలిపి ఒక సంకలనంగా తీసుకురావడం విశేషం.
ఇందులో తన మనసు దోచిన నీలిమ తనకు దూరం కావడంతో భగ్నప్రేమికుడిగా, అవివాహితుడిగా వుండిపోతాడు అభిరాం. ఈ సంగతి తెలుసుకున్న నీలిమ చిన్న ట్రిక్ ప్లేచేసి, తనను మరిచిపోయి వేరే అమ్మాయిని పెళ్ళిచేసుకునేలా చేస్తుంది. ఆమె ఆడిన నాటకమేమిటో, చివరకు ‘‘ఆమె మనసు’’ ఏమిటో కొసమెరుపుగా తెలియజేయడం బాగుంది. తాను ప్రేమించిన అమ్మాయికంటే తనను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటేనే సుఖపడగలనని గుర్తించిన యువకుడు ‘‘సారీ...సారీ... వైదేహి’’ కథలో కనిపిస్తాడు. రేపు నిశ్చితార్థం అనగా ఇవాళ శ్రీరాం ఉద్యోగం పోతుంది. కాబోయే వధువుకూడా ఉద్యోగిని. ఆమె నిరుద్యోగిని పెళ్ళిచేసుకుంటుందా అన్న అనుమానంతో ఈ విషయం దాచిపెడదామంటారు. వాళ్ళ అబద్ధంతోనే నిశ్చితార్ధం నిర్విఘ్నంగా జరిగిపోయిందనుకుంటారు. కాని అసలు విషయం శ్రీరాం అప్పుడు తెలియచేస్తాడు. కాబోయే భార్య దగ్గర నిజాన్ని దాయకూడదని భావించి అమ్మాయికి ఫోన్ చేయడం, అతని నిజాయితీకి మెచ్చి ఆమె ఒప్పుకోవడం గురించి తెలుస్తుంది. పెళ్ళికానీ, కాపురం కానీ ‘‘నమ్మకం’’మీద ఆధారపడి వుంటుందని ఈ కథ బోధపరుస్తుంది. ‘‘సంశయ ఫలం’’ కథలో పెళ్ళిపీటల మీద వున్న అమ్మాయి, ఇంతకుముందు పెళ్ళిచూపులలో చూసిన అమ్మాయి ఒకరు కాదు అని అనుమానించి మొగపెళ్ళివారు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. పెళ్ళి పెద్దగా నరసింహం వాళ్ళ మూర్ఖత్వాన్ని బహుతార్కికంగా ఖండించి పెళ్ళి జరిపిస్తారు. అలాగే తనను పెళ్ళిచేసుకోవడానికి నిరాకరించిన అందమైన అమ్మాయి మోహన్‌తో, తన పెళ్ళాన్ని పోల్చుకుని నిరాశలో మునిగిపోతాడు. అజీర్ణంతో బాధపడే తనకు మోహన్ బిర్యానీ అనీ, తన భార్య సొంఠికొమ్ములు అని తెలుసుకోవడం బాగుంది. దంపతులన్న తర్వాత అపోహలు రావడం, అవి చిలికి చిలికి గాలివాన కావడం, దాంతో వాళ్ళు ఎడమొగం- పెడమొగం పెట్టడం మామూలే. చాలావరకు ఇందులో ఈగోకు సంబంధించిన సమస్యలే వుంటాయి. ఎవరైనా మధ్యలో కల్పించుకుని వారికి సర్దిచెప్పి కలిపే ప్రయత్నం చేయాలి. కాని రెచ్చగొట్టి విడిపోయేలా చేయకూడదని తెలిపే కథ ‘‘మధనం’’. ఒక మంచి రచయిత దారిద్య్రాన్ని ఆసరాచేసుకుని అతడ్ని ఘోస్టు రైటర్‌గా మలచుకుని, తాను ప్రముఖ రచయితగా కొనసాగేవాడే ‘అల్పజీవి’అని ఒక కథ చెబుతుంది. ఇతరుల సంభాషణలు విని, వాటిని తన సమస్యలుగా భావించి గందరగోళ పడటం ‘అమ్మ చెప్పేది’లో చూడవచ్చు. నిజాయితీగా పనిచేసేవాళ్ళను ఇంటా-బయటా బ్రతకడం చేతకాని అసమర్ధులు గానే చూస్తుంటారు. బడిలో పోటీలో తన కూతురు తన తండ్రినే ఆదర్శంగా చూపించి నీలాంటి ‘‘అసమర్ధులే ఈరోజు దేశానికి అవసరం’’అని చెప్పడంతో ఉప్పొంగిపోతాడు. స్ర్తివాదం పేరిట కాపురాలను కూల్చే మహిళామణులపై వేసిన చొరవయే ‘‘మధనం’’. పొరుగింటి పుల్లకూర రుచియని పొరబడడం ‘‘సత్యమేవ జయతే’’లో కనిపించగా, నీతి-నిజాయితీలకు కాలం చెల్లలేదని ‘‘అసమర్థులు కావలెను’’నిరూపిస్తుంది. తార్కికంగా, హేతుబద్ధతతో కొనసాగిన ‘‘సంశయ ఫలం’’ కథలు నిస్సందేహంగా మంచి కథలనే చెప్పాలి. ఇక హాస్యకథలలో- టి.వి.్ఛనెల్ వాళ్ళు ఏర్పాటుచేసే పోటీ, క్విజ్ కార్యక్రమాలను అవహేళన చేస్తూ ‘‘ఆదర్శ దంపతులు’’ పోటీలో పాల్గొన్న, ఎప్పుడూ కీచులాడుకునే దంపతులు ఎలా ఆ బహుమతి గెలుచుకున్నారు. ‘‘టి.వి.007’’లో చూడవచ్చు. ‘‘లాస్యం’’కథలోని పెద్దవయసు దంపతులకు ఏమీ తోచక సరదాగా గొడవపడుతుంటారు. అది నిజమనుకుని కలుగజేసుకున్నవారిని ఇద్దరూ కలిసి పిచ్చోళ్ళుగా చేస్తారు. అమ్మాయి పుడుతుందని ముందుగానే తెలిస్తే వద్దని అబార్షన్లు చేసుకుంటున్నారు. దాంతో భవిష్యత్తులో అమ్మాయిలు దొరక్క కన్యాశుల్క పద్ధతులు, ఆడపిల్లల వారి ఆధిపత్యపు ధోరణులు- వేధింపులు ఎలా సహజమైపోతాయో వ్యంగ్యంగా చిత్రీకరించిన కథ ‘‘విజన్ 2040’’ టీనేజ్ లవ్‌స్టోరీలు చూసి చదువుమానేసి ప్రేమ పేరుతో ఆడపిల్లల వెనుక పడుతున్న అబ్బాయిని ఈ-మెయిల్స్ ద్వారా దారికి తెచ్చుకున్న తండ్రి కథే ‘‘రమ్య...రమేశ్... రామ్మూర్తి’’. అద్దెచౌక అని ఎంతో సంబరంగా ఆ ఇంట్లో దిగిన తర్వాత గానీ వారికి తెలిసిరాదు. ఎందుకు అద్దె చౌకగావుందో. ఇక భార్య కథారచయిత్రిగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవడంతో భర్త ఆత్మాభిమానం దెబ్బతిని, తనూ కథలురాయాలనే పట్టుదలతో బయలుదేరి ‘‘కథావస్తువు’’కోసం వెతుకుతూ ఎలా అవస్థపడ్డాడో ఈ కథ తెలియజేస్తుంది. ఇతరులను మోసంచేయడానికి ప్రయత్నించబోయి తానే మోసపోయిన వైనం ‘‘హతఃకుంజరః’’లో కనిపిస్తుంది. ఇందులో శబ్దాశ్రయ హాస్యం రెండు కథల్లో కనిపిస్తే, మిగతా కథల్లో సన్నివేశపరమైన హాస్యం కనిపిస్తుంది. హాస్య కథలన్నీ కొసమెరుపు కథలుగా తయారుకావడం విశేషం. మన కళ్ళముందు జరిగే సంఘటనలను హాస్య రూపంలో మనకు అందివ్వడంవల్ల ఇవి ఆసక్తికరంగా తయారై హాయిగా నవ్విస్తాయి. అవును కదాయని ఒకింత మనల్ని ఆలోచింపజేస్తాయి.

-కె.పి.అశోక్‌కుమార్