అక్షర

ఏ కథలోనూ శషభిషలు ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మ అజ్ఞానం’
-గుండు సుబ్రహ్మణ్య
దీక్షితులు
సంపాదకులు:
డా.డి.చంద్రశేఖరరెడ్డి
పేజీలు: 248;
వెల: రూ.125
లభ్యస్థానాలు: ఎమెస్కో- హైదరాబాదు
సాహితీ ప్రచురణలు-
విజయవాడ
**
ఓ మంచి కథను చదివిన పాఠకుని మనస్సు ఆహ్లాదభరితవౌతుంది. కనులు చెమరుస్తాయి. కారణం- మనస్సు రసప్లావితమవడమే. మన మనస్సుకీ అలాంటి ఆనందం కలగాలంటే గుండు సుబ్రహ్మణ్యదీక్షితులుగారి కథాసంపుటి ‘అమ్మ అజ్ఞానం’ కొని చదువవలసిందే!
‘అమ్మ అజ్ఞానం’తో మొదలైన కథాసంపుటి మరో ముప్ఫై కథల్ని కడుపులో దాచుకొని ‘శ.ష.స.ల శషభిషలు’తో ముగుస్తుంది. విషయమేమంటే- సంపుటిలోని ముప్ఫైరెండు కథల్లో ఏ కథలోనూ శషభిషలు లేవు. రచయిత తాను చెప్పదల్చుకొన్న విషయాలను ఎలాంటి శషభిషలు లేకుండా సూటిగా చెప్పేశారు.
ప్రాచీన భారత వాఙ్మయాన్ని కథలుకథలుగా తన పిల్లలకు చెప్తూంటుంది ప్రశాంతి. పిల్లలూ శ్రద్ధగా వింటూంటారు. ఈ కథలన్నీ విన్న పిల్లలు మూఢాచార భరితమైన అశాస్ర్తియ వాతావరణంలోకి వెళ్ళిపోయి తమ జీవితాలను పాడుచేసుకోకుండా చూచుకోవాలని తండ్రి శ్రీ్ధర్ ప్రయత్నం. అందుకే వీలున్నప్పుడల్లా అత్యంతాధునిక శాస్త్ర విషయాల్ని పిల్లలకు బోధించే యత్నం చేస్తూంటాడాతండ్రి. విషయ క్లిష్టత కారణంగా శ్రీ్ధర్ చెప్పే విషయాలను వినడానికిష్టపడరు పిల్లలు. ఈ విషయమై జరిగిన గొడవతో ‘నీది అజ్ఞానం’అని కూడా భార్యను నిందిస్తాడు శ్రీ్ధర్. తరువాత ఒక రోజున భార్య తన పిల్లలకు చెప్తున్న విషయాలను శ్రద్ధగా వింటాడు. ప్రాచీన గాథలను ఆధునిక సమాజానికి అన్వయం చేస్తూ, శాస్త్రాంశాలను మానవుల నడవడికి అనుసంధానం చేస్తున్న ఆవిడ విధానాన్ని చూచి ముగ్ధుడవుతాడు. పిల్లలు తల్లి మాటకెందుకు విలువనిస్తున్నారో గ్రహిస్తాడు.
వేద మంత్రార్థాలనూ, ఉపనిషత్సారాన్నీ, ప్రాచీన వాఙ్మయంలోని శాస్ర్తియాంశాలనూ వివరించే సన్నివేశాలు ఈ కథల్లో పుష్కలంగా ఉన్నాయి. అనుచానంగా వస్తున్న ఈ విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తరువాతి తరాలకెలా అందజేయాలి అన్న వివరమూ ఉంది. ఈ జ్ఞానం చిన్న వయసువారి కందించడంలోనే దేశోన్నత ఉంటుందన్న ఆలోచనా ఉన్నది. రచయిత స్వయంగా అధ్యాపకుడై నందున విషయ ప్రాధాన్యతను చక్కగా అవగతం చేయించగలరు.
ఎత్తుగడ, శిల్పం, కథాంశం ఇలా పోల్చి చూచినప్పుడు కథను పోలిన కథ కన్పించదు. వైవిధ్యం ఈ కథా సంపుటి సొత్తు.
శుద్ధ శ్రోత్రియ కుటుంబానికి చెందిన ఎనభై ఏళ్ళ మామ్మగారు తను మరణించే క్షణంలో మాత్రమే తన పిల్లలకు చెప్పదలచుకొన్న కథ ‘ఆ కథ చెప్పాలిరా!’. తను కాపురానికొచ్చిన కొత్తల్లో జరిగిన కథ అది. అత్యాచారం చేసి తన జీవితాన్ని సర్వనాశనం చేయడానికుద్యమించిన రజాకార్లను నిలువరించే యత్నంలో ప్రాణాలు పోగొట్టుకొన్న పోలీస్ యాక్షన్ టీంకు చెందిన భారత సైనికుణ్ణి సోదరునిగా స్వీకరించి, అతడి జేబులో లభించిన గుర్తింపుకార్డుని తన పూజా మందిరంలో దాచుకొంటుంది. ఈ దేశపు ఆడపడుచులకు ఇలాంటి సోదరుడినొకడిని తన కుటుంబాన్నుండి కూడా అందించాలన్న పట్టుదలతో తన చిన్నమనుమడిని సైన్యంలో చేర్పించాలని కోరుకొంటుంది. ఆ మనుమడు కూడా ఉత్సాహంగా అంగీకరిస్తాడు. ఆవిడ ఆనందంతో కన్నుమూస్తుంది. ఇంతకూ అనుదినమూ ఆవిడ పూజిస్తూ వస్తున్న అతడి గుర్తింపుకార్డులో ఉన్న పేరు లాన్స్‌నాయక్ అబ్దుల్ రెహ్మాన్. ఆ కార్డుతోపాటు ఉన్న చిన్న పుస్తకం ఖురాను.
కుల మతాలతో సంబంధం లేకుండా ఒకరి ఆచారాలను ఒకరు శ్రద్ధ్భాక్తులతో మన్నించే సంప్రదాయం ఈ దేశంలో ఇంకా నిలచే ఉందని చెప్పే కథ ‘ఐక్యతా సూత్రం.’
ఈ పుస్తకం చదువుతుంటే దీక్షితులుగారు సంపూర్ణ భారత యాత్రను పలు పర్యాయాలు చేసినట్లుగా తెలిసిపోతుంది. యాత్రాకథనానికి సంబంధించిన కథలుకూడా చాలానే ఉన్నాయి. అవి యాత్రాకథనాలవలె ఉండవు. మనము కూడా వారితోపాటు యాత్రలకు వెళతాము. ఆ పాత్రలతో ముచ్చటిస్తూంటాము.
స్థానీయతా, అందుకు తగిన నేపథ్యమూ, పాత్రచిత్రణా కథను వాస్తవానికి దగ్గరగా తీసుకువస్తాయి. ఇది నిజంగానే జరిగిందేమోనన్న భ్రాంతిని కథ కలుగజేస్తుంది. ఈ రకమైన రచనలో గుండు సుబ్రహ్మణ్యంగారు సిద్ధహస్తులు.
కన్నడ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒరియా, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాల నేపథ్యాల్ని బాగా పండించారు రచయిత. కథాస్థలాలకు తగినట్లుగానే పాత్రల నడవడికూడా ఉంటుంది. ఉత్తమ పురుష కారణంగా పాఠకుడు కథలో లీనమైపోతాడు.
‘కేదార్‌నాథ్ యాత్రలో దోపిడి’ కథలో మనకు దోపిడివలె కనిపించేది దోపిడి కాదని, డోలీలు, గుఱ్ఱాలవాళ్ళ బ్రతుకు పోరాటమని కళ్ళకు కట్టిస్తారు రచయిత. విషయం హృదయానికి హత్తుకునేలా చేశారు. కథానాయకుడు పోగొట్టుకొన్న విలువైన కెమెరా అతనింటికి కొరియర్‌లో చేరడం కథకు కొసమెరుపైతే- తనను దోచుకొన్నాడనుకొన్న- డోలీల నాయకుడు చౌహాన్ తండ్రి ఆ కెమెరాను పంపించడం మరొక మలుపు. తన జీవనాధారమైన కొడుకు చౌహాన్ మందాకిని నది వరదల్లో కొట్టుకుపోయినట్లుగా ఆ తండ్రి రాసిన ఉత్తరంలో ఉండడం గుండెలు పిండేసే విషయం.
స్వతంత్ర భారతదేశంలోని కాశ్మీర్‌లో జరిగిన హిందువుల ఊచకోతను ప్రభుత్వాలు పట్టించుకొన్నట్లే తోచదు. అది తమకు వార్తాంశమే కానట్లుగా ప్రవర్తించాయి ఆనాటి ప్రసార మాధ్యమాలు. ఈ సత్యాన్ని సాధికారికంగా ప్రవచించే కథ ‘మార్తాండ్ బోధ’. అది రచయిత అనుభవం మాత్రమేకాదు- టూరిజం ప్యాకేజిలోలేని కాశ్మీర్‌లోని హిందూ దేవాలయాలకు వెళ్ళివచ్చే ప్రతి యాత్రికునికి అనుభవైక వేద్యమైన విషయమే.
సముద్ర ప్రయాణులున్న ఉద్యోగుల భార్యాపిల్లల కష్టాల్ని, వాట్ని చమత్కారయుతంగా అధిగమించే భార్యామణుల చాకచక్యాన్ని చెప్పే కథ ‘వచ్చిందొచ్చింది ఓడొచ్చింది!’.
ఈ సంపుటిలో కుటుంబ విషయాలకు సంబంధించిన కథలూ ఉన్నాయి. ఆడపడుచులూ, వదినగార్లూ, అత్తాకోడళ్ళూ, రాజకీయాలూ, సంసారం గొడవలూ మాత్రమేగాక శృంగార రసంతోసహా అన్ని విషయాలనూ ఆస్వాదించే భాగ్యం కలుగుతుంది పాఠకుడికి.
పాతకాలపు భోగమ్మేళానికి సంబంధించిన కథ ఒకటి హాస్యంతోపాటు శ్రుతిమించిన శృంగారాన్నీ పంచిస్తుంది. అది ఆనాటి భోగమువాళ్ళ ప్రవర్తన మరి.
తనకు తెలియకుండా తనంతటతానే అమాయకులైన భక్తులకు దేవుడైపోయి, తనకుతాను విచికిత్సకులోనైన నాస్తికుని కథ ‘నా తిరుమల విలాసయాత్ర.’
వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను చేర్చి సుఖపడే జంటలతోపాటు పక్షవాతం వచ్చిన వృద్ధురాలైన అత్తగారిని ‘పసి పిల్ల’లా చూచుకొంటున్న కోడలు కూడా మనకీ కథల్లో మనకు దర్శనమిస్తుంది.
కథను ఉపోద్ఘాతంలోనే ముగించివేయడం అనన్య సామాన్యమైన శిల్పం. కథకుడు కథలోకి వెళతాడు, వెళతాడు అనుకుంటూంటాం. కథ అయిపోతుంది. వెనక్కి చూచుకుంటే ‘కథకుడు కథ చెప్పే వున్నాడు కదా!’అనిపిస్తుంది. అటువంటి కథల్ని కేవలం గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు మాత్రమే రాయగలరు. కథ పేరుకూడా విచిత్రంగా ‘చెప్పనా!’
చిన్ననాటి జ్ఞాపకంగా మిగిలిపోయే సంఘటన ‘ఎస్.వి.పి. సింగిల్ ఓట్ ప్రెసిడెంట్’ అన్న కథ, పూర్తి కథారూపాన్ని సంతరించుకోలేకపోయింది. అందమైన మొహానికి దీన్నొక దిష్టిచుక్కగా భావించాలి.
ఈ కథల్లోని విన్యాసాల లోతుపాతుల్ని మరింతగా తెలుసుకోవాలంటే- పుస్తకాన్ని ‘నవ రసకథితం’గా పేర్కొంటూ ముందుమాట రాసిన ప్రఖ్యాత రచయిత డా.అక్కిరాజు రమాపతిరావుగారిని సంప్రదించాల్సిందే.
రెండువందలకి పైగా కథలురాసిన గుండు సుబ్రహ్మణ్యదీక్షితులుగారి కథా సంపుటులు రెండు మాత్రమే వెలువడడం హర్షణీయం కాని విషయం. మొదటి సంపుటిని ఆయన తమ్ముళ్ళు పూనుకొని షష్టిపూర్తి ఉపాయనంగా ప్రకటిస్తే, అమృతోత్సవ ఉపాయనంగా ఎమెస్కోవారు రెండవ సంపుటిని ప్రకటించారు. డా.డి.చంద్రశేఖరరెడ్డి సంపాదకులుగా వ్యవహరించారు.

-వరిగొండ కాంతారావు