అక్షర

రేపటి ఉషోదయానికి ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి అడుగుజాడల్లో
కవి: ఆచార్య పసుల వెంకటరెడ్డి
పుటలు: 196.. వెల: రు.100/-
ప్రతులకు: కవి, 2-7-210, ఎక్సైజ్ కాలనీ,
సుబేదారి, హనుమకొండ, వరంగల్-506001
**
విలక్షణ ప్రాకృతిక కవితలు.
రాత్రివేళల్లో పైకి చూస్తే విభ్రాంతికర నక్షత్రాల సమూహాల పాలపుంతలు.
పగటివేళల్లో ప్రకృతిలోకి లోతుగా చూడగలిగితే ఖేచరాలు, వన చరాలు, జలచరాలు, భూచరాలు ఎనె్నన్నో! వాటిని చూస్తే వాటి గురించి ఆలోచిస్తే ఆశ్చర్యాలు కలుగుతాయి. అద్భుతాలు కనపడతాయి. ఆనందాల బలాలు చేకూరుతాయి. కానీ తప్పనిసరైన యాంత్రిక జీవితంలో ఎన్నిటినో పోగొట్టుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో ఒక శాస్తవ్రేత్త పరిశోధకుడు, కవి అయి మన కళ్లు తెరిపించేలా రాసిన కవితా సంకలనం ఈ ‘ప్రకృతి అడుగు జాడల్లో’.
అబ్బురపరిచే ఆలోచనలతో డెబ్బయి మూడు కవితలు. ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రప్రభ, సాహితీకిరణం, ప్రస్థానం, నేటి నిజం, ఆకాశిక్ వంటి పత్రికా పాఠకులకు పసుల వెంకటరెడ్డి కవితలు పరిచితాలే.
అల్లికల అందచందాలు, నిర్మాణ సౌందర్యం, లాలిత్యం, గట్టితనం గూడుకట్టుకునేలా తాను కట్టుకున్న గూటిపై నిర్మాతగా నిలిచిన పక్షి చిత్రంకల ముఖ చిత్రం చూస్తూనే అలా వుండిపోతాం. ఇంక కవితల్లోకి పోతే సరేసరి.
ఏమైపోయిందా సందడి? ఖండికలో ‘మా పెరట్లో ఏపుగా పెరిగిన జామ చెట్టు/దాని కొమ్మల్లో ఆడుకునే రామచిలకల పలకరింపులు/అవి సగం కొరికి పడేసిన దోర దోర జామ పండ్లు/ఉషోదయాల్లో మా పెరట్లో ఎంత సందడి/...../గినె్నల్లో వాలి/సమృద్ధిగా అంట్లు తింటూ ఆనందించే కాకిమూకల అరుపులతో/ఇంటి చూరుల్లో గూళ్లు కట్టుకుని సంసారం చేసి, పిల్లల్ని కని/ఆ పిల్లల నోళ్లల్లో ఆహారాన్ని కూరుతూ/చూరుకు కట్టిన వరి కంకుల చుట్టూరా/కిచకిచ శబ్దాలతో/మాతో సహజీవనం చేసే పిచ్చుకల గోలతో రోజూ సూర్యోదయాల్లో ఎంత సందడి!-ఈ సందళ్లు పోతున్నందుకు కవి బాధపడతారు, మనల్ని ఆలోచింపచేసి బాధపెడతారు.
విద్వత్కవి అనుమాండ్ల భూమయ్య ‘అంతచ్చేతన జాగృతమైతే’ పేర ఆలోచనాత్మకమైన అంశాలతో పీఠిక రాశారు. వేద మంత్రాల్ని ఉటంకిస్తూ ‘ప్రకృతి మానవుని సంబంధం గురు శిష్యుల వంటిదే. ప్రకృతి వుంది. ప్రకృతిలో మానవుడు ఉన్నాడు. మానవుడు ప్రకృతిపట్ల వినయం, శ్రద్ధ్భాక్తులు కలిగి ప్రవర్తిస్తున్నట్టయితే ప్రకృతి గురువుగా సాక్షాత్కరిస్తుంది. ప్రకృతి మన గురువు. బతకడానికి మనకు ప్రాణభూతమైన ప్రకృతికి నష్టం చేసే హక్కు మనకు లేదని ఇందలి కవితలు సూచిస్తున్నా’యన్నారు. ఐతే వెల్చాల కొండలరావు కవితా పిపాస, రసజిజ్ఞాస, రసపిపాస వున్న కవిగా ప్రశంసించారు, రెడ్డిగారిని. డా.అంపశయ్య నవీన్ ఈ కవిత్వాన్ని విజ్ఞాన శాస్త్ర ఆధారిత కవిత్వం అన్నారు కానీ అంతకన్నా ప్రకృతి ఆధారిత కవిత్వంగానే అనిపిస్తుంది. నవీన్ అన్నట్టు కవి ప్రకృతిలోని సహజమైన వైచిత్రికి, కళాత్మకతకు నివాళులెత్తారు.
వెంకటరెడ్డి ‘నేను కవిని కాను’ అని వినయంగా చెప్పుకున్నారు కానీ ఇందులోని కవితల్లో చాలా కవితలు ఆయన మంచి కవి అని సాక్ష్యాలు పలుకుతున్నాయి. తాను చూసినది మనం చూసేలా, తాను ఆలోచించేది మనం ఆలోచించేలా చేస్తారు వివరణాత్మక కవితల ద్వారా. అల్లికలో దిట్ట గిజిగాడులో ‘అది బంగారు పిచ్చుక, అల్లికలో దిట్ట/అదే మన గిజిగాడు/్భతలంపై వందకు పైగా జాతులతో/వైవిధ్యభరితమైన ఆకృతులతో గూళ్లు/...వంగిన చెట్ల చిటారు కొమ్మల్లో, రెమ్మల్లో/కళాత్మకంగా వేలాడే గూడునిర్మాణ శైలి/కవిత్వానికి అందని సౌందర్యం సృజనే/మృదువైన ఆకుపచ్చని తాటి ఆకుల ఈనెలు/గడ్డిపోచలు, నులితీగలే వాటి నిర్మాణ సామగ్రి/తన ముక్కు కాళ్ల సమన్వయంతో/గడ్డిపోచల రెండు కొనలను ఒడిసిపట్టి/కోమ్మలకు వేసే చిక్కుముడి దృశ్యం అపురూపం/గూడులో దళసరిగా ఎక్కడ వుండాలో/ఎక్కడ పలచగా, వంపులతో లోతుగా వుండాలో సరైన నిర్ణయం తీసుకుంటుంది/ అంటూ ‘మనిషిలో రసచేతన మొదలైతే/సుతారంగా ఊగే గూళ్లు రసరమ్య లోకానివే’ అని బరువు తలపును మన ఎదల్లో మెదలజేస్తారు.
ముక్కుకో రంగు, రెక్కకో రంగు తోకకో రంగు ఇలా వుండే రంగురంగుల అందచందాలొలికే పక్షులు రూపలావణ్యాల రీత్యా మానవులకన్నా మిన్న అనిపిస్తాయి.
మామూలుగా చెపుతున్నట్టు రాస్తూ సారాంశ కవితా వాక్యాలతో ప్రాకృతిక సందేశమివ్వడం...సందేశమివ్వడం కాదు, సహానుభూతితో సూచించడం, ప్రకృతి వైరుధ్యాలను సౌందర్యాలను పంచుకునేలా చేయడం గమనార్హ అంశాలు.
శ్రమైక జీవులు చీమలు ఖండికలో ‘బుల్లి బుల్లి పాదాలతో..చిట్టి చిట్టి అడుగులతో చిరుచీమలు’ క్రమశిక్షణే క్రియాశీలతగా ఉంటాయంటూ చీమల ఆశావాదం, సంకల్ప బలం ప్రతి మనిషికి అనుసరణీయం అంటారు.
భామలమీద కవితలల్లేవారు ఎంతోమంది వుండవచ్చు. చీమలమీద ఆదర్శవంతంగా రాసిన కవి ఈ గ్రంథ కర్త. చీమలమీద మూడు ఖండికలు ఈ పుస్తకంలో వున్నాయి. మూడూ ప్రత్యేకతలున్నవే.చీమల జీవన వేదంలో ‘చీమల జీవన విధానం/మనిషి కలలు గనాల్సిన ఆదర్శ సాంఘిక జీవనం’ అన్నారు.
ఇంటి వసారాలో అద్దం ముందు పక్షుల జంటపై వీరి కవిత కవి భావుకతకు అద్దం పట్టింది. ‘ఒక్కసారిగా పక్షుల నిష్క్రమణ/మన్ఫఃలకంపై సుందర దృశ్యం చెదరిపోతుంది/కొంతసేపు మనసులో ఏదో వెలితి/ అందుకే రేపటి ఉషోదయానికి ఆరాటం’ అంటారు.
ఈ కవితా సంపుటి చదివితే నగరంనుండి ఒక్కసారిగా పల్లెటూళ్లకి వెళ్లిపోతే బాగుండును కదా అనిపిస్తుంది.

-సన్నిధానం నరసింహశర్మ