అక్షర

అనుకుంటున్నదంతా కలలాంటిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టించే కళ
మూల: ఓషో
అనువాదం: భరత్
పుటలు: 144
వెల: రూ.225/-
ప్రతులకు: ధ్యానజ్యోతి పబ్లికేషన్స్
పోస్ట్ బాక్స్ నెం.1
జె.జె.నగర్ కాలనీ
పోస్ట్ఫాస్
యాప్రాల్,
సికిందరాబాద్- 87
040 24753218
9666155555
**
‘నా ఉనికి అద్దం వంటిది.. అద్దంలోకి మీరు చూస్తూ ఉండండి.. ఏదో జరుగుతుంటుంది.. ఆ జరిగేదంతా అద్దం ప్రతిబింబం మాత్రమే తప్ప యథార్థం కాదు. అలాగే నీ వాస్తవంలో కూడా ఏ మార్పూ ఉండదు. ఏదో జరిగింది, మరేదో జరుగుతోంది అని అనుకుంటున్నదంతా కలలాంటిదే! అలాగని ఆ కలను చెదిరిపోనీకు. అంతేకానీ ఆ కలలో భాగస్వామివి మాత్రం కాకు’ అని అంటాడు భగవాన్ రజనీష్ మే 9, 1986 సాయం సమయాన ఉరుగ్వేలో చేసిన ప్రసంగంలో.
అవును, ఈనాటి ‘ఓషో’ ఆనాటికి ఇంకా ‘రజనీషే’. అయితే భగవాన్ రజనీష్‌గా ప్రసిద్ధుడవుతున్న ఓషోని లండన్ ‘సండే టైమ్స్’ ‘1000 మేకర్స్ ఆఫ్ ది ట్వెంటియత్ సెంచరీ’లో ఒకరిని చేయటం ప్రతిభను గుర్తించి చేసిన అక్షర సత్కారమే. నిజానికి అక్షరాలా ఓషో అనబడే రజనీష్ తాత్విక, విప్లవ ప్రభంజనమే! ‘అవును’ అనిపించగల సత్తా, ‘కాదు’ అనగల ధీమా ఉన్న తాత్విక ప్రభంజనం రజనీష్. ఈ సందర్భంలో ఓషో స్పృశించని తాత్వికాంశం లేదని చెప్పుకోవటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అలాగే ఓషో ఆధ్యాత్మిక ప్రపంచంపై తిరగబడటం ఎంత యధార్థమో ఆ వ్యవస్థా ఓషోపై కనె్నర్ర చెయ్యటం అంతే వాస్తవం.
దాదాపు మూడున్నర దశాబ్దాల కాలంలో ఓషో ప్రసంగించని ఒక ఉదయం కానీ, ఒక సాయంత్రం కానీ లేదనటం నమ్మశక్యం కాని వాస్తవం. అలా ఓషో ప్రసంగాలన్నీ కొన్ని వందల పుస్తకాలయ్యాయి. ఆ దొంతరలో ‘హ్యూమానిటీ నీడ్స్ ఎ న్యూ సాయిల్ ది సాయిల్ ఆఫ్ ఫ్రీడమ్.. క్రియేటివిటీ ఈజ్ ది ఫ్రాగ్రన్స్ ఆఫ్ ఇన్‌డివిడ్యుయల్ ఫ్రీడమ్’ అని అంటాడు ‘క్రియేటివిటీ’ అన్న పుస్తకంలో.
ఓషో దృష్టిలో క్రియేటర్‌ది అందరూ నడిచే దారి కాదు.. మూస పోకడల మానసిక స్థితి నుండి ఏకాకి, ఒంటరి అయితేనే, సామూహిక మనస్తత్వం నుండి విడివడితేనే క్రియేటర్ కాగలగటం సాధ్యమవుతుంది. అందుకే, కాబోలు ఓషో ‘క్రియేటివిటీ’ని తెనిగించిన భరత్ ‘సృష్టించే కళ’గా తన పుస్తకాన్ని ‘దిద్ది’తీర్చాడు. తెనుగు సేతలో స్వతంత్రించాడు. తెలుగు మదికి చేరేలా మార్పులు చేర్పులు చేశాడు.. కొన్ని అప్రస్తుతాల్ని తెలుగు అక్షరాలకి అందకుండా చేశాడు. మొత్తానికి తెను‘గింపు’లో ఒక ‘లయ’ను తీసుకొచ్చాడు ‘పట్టు’ వదలకుండా, ‘పట్టు’ సడలకుండా, పట్టు సాధించాడు. అన్నట్టు, ముందు మాట వంటి ‘ది ఫ్రాగ్రన్స్ ఆఫ్ ఫ్రీడమ్’ని స్వేచ్ఛా సుగంధం చేసి సెభాష్ అనిపించుకున్న భరత్ ప్రథమాధ్యాయ శీర్షిక ‘ప్రిపేరింగ్ ది కాన్వాస్’ను ‘నేపథ్యాన్ని సిద్ధం చేయడం’గా చేసి కాన్వాస్ అర్థ పరిధిని కుదించాడు. బుద్ధుడ్ని మానవాతీతుడ్ని చేయటం, అతనిలో మానవ పార్శ్వం లోపించిందనటం, అతనిది భూమ్యాతీత సౌందర్యంగా పేర్కొనటం విప్లవీకరించిన ఓషో తప్ప మరే తాత్వికుడూ చేయలేడు. అంతేకాదు బుద్ధిమంతుల్లా పాఠాలు వినే బడిపిల్లల్ని బడిపంతుళ్ల ముందు ‘అతి బలహీనులు, నిస్సహాయులు, నిరాయుధులైన అమాయకపు బలి పశువులుగా’ (పే.18) ‘ప్రాథమిక పాఠశాలల్లో తప్ప వేరే ఎక్కడా కనిపించరు’ అని ఎలుగెత్తి చెప్పగలగటం ఓషోకే సాధ్యమయింది. ఈ స్టేట్‌మెంట్‌ని కాదనగలమా?
మానవుడ్ని ఉన్నత పథాన నిలిపే ప్రయత్నంలో - ‘దేవుడు ఒక వస్తువు కాదు, కాని ఒక కల్పన’ (పే.132) అని ఒకవైపు ధృవపరుస్తూనే, ఇంకొకవైపు భగవంతుడి ఉనికిని అంగీకరిస్తూనే, మరొకవైపు మానవ ‘క్రియ’ల్నే ‘సర్వం’గా చెప్పగల సమర్థత ఓషోది. ఆ క్రియాశీలతతో ‘లొంగిపోవడమే మీ అంతర్గత మూల కేంద్రానికి చేరుకునే మార్గం’ (58) అంటాడు. కాబట్టే ‘మీకు మీరు గుర్తున్నప్పుడు ఆ దేవుణ్ని మరచిపోతారు. మిమ్మల్ని మీరు మరచిపోయినప్పుడు ఆ దేవుడు మీకు గుర్తొస్తాడు. వీటిలో ఏదో ఒకటే సాధ్యపడుతుంది. రెండింటినీ గుర్తుంచుకోవడం అసాధ్యం.’ (పే.56) ఇలా మానవ ‘మరపు’ మెరుపులో మానవ అస్తిత్వాన్ని అందుకోగలగటం ఓషో ప్రత్యేకత. పైగా ఓషో ‘సృజనాత్మకత కలిగిన వ్యక్తి’గా ‘తన కాలంకంటే ముందు’ నడిచాడు. ఇలా నడవటానికి అంతర్గత భావన, అంతర్గత ప్రకాశం, అంతర్గత ఉత్సాహం కలిసి అడుగులేయాలి.
ఓషో దృష్టిలో ‘ఏదీ సాధారణమైనది కాదు, ప్రతీదీ అసాధారణమైనదే’ (పే.25) అంతే కాదు ‘క్రియను వదలకూడదు. దానిని వదిలితే జీవితాన్ని వదులుకున్నట్లే. అంటే మీరు మరణించినట్లే’ (పే.24) చాలా సింపుల్‌గా ఉన్న ఈ చావుదెబ్బలో ఎంత స్పష్టత.
‘మీరు ఉద్దేశ రహితంగా ఉప్పొంగి ప్రవహించే శక్తిలా స్పందించండి. దానిని పంచండి. అంతేకాని, బేరాలాడుతూ దానితో వ్యాపారం చెయ్యకండి. మీ దగ్గర ఉంది కాబట్టి ఇవ్వండి. తిరిగి తీసుకునేందుకు ఇవ్వకండి. అలా చేస్తే మీకు బాధ తప్పదు’ -ఈనాటి ఆధ్యాత్మిక వ్యవస్థకు, ఆ వ్యవస్థలో గద్దెనెక్కిన అధిపతుల అవస్థలకు దీనికి మించిన చురక అవసరమా?! అందుకే రజనీష్ మూస పోకడల తాత్వికులకు గొంగళి పురుగులా కనిపిస్తాడు. కానీ ఆ గొంగళి పురుగే సీతాకోకచిలుక అయ్యిందన్న విషయం కూపస్థ మండూకాలకి తెలీదు... తెలిసినా తమదే అద్భుత ప్రపంచం అనుకుంటుంటారు. ఆధ్యాత్మిక సంస్కృతి అంటే వ్యాపార సంస్కృతి కాదు. ఆత్మల రాకపోకలను పసిగట్టగల వారికి ఆర్థిక లావాదేవీలు తలకెక్కవు.
భరత్‌లోని భావుకుడు తాను అనువాదకుడినన్న శృంఖలాలను తెంచుకున్నాడు. ‘స్వేచ్ఛా విహంగమయ్యాడు.. విహంగయానం చేస్తూ - ప్రకృతిలో పరవశిస్తూ - అక్షరబద్ధుడయ్యాడు -చూడండి’
‘గ్రహించే తత్వమున్న సున్నిత మనస్కులందరూ భావుకులే. చల్లని మల్లెల తెల్లదనం, గులాబీల సొగసు, సన్నజాజుల నాజూకుతనం, మైమరపించే సంపంగి పరిమళం, చేమంతుల నిగనిగలు, బంతిపువ్వులలోని ఒద్దిక, కొద్దిగా వాడినా వాడనట్లుండే కనకాంబరాల గడుసుతనం, మందారాల అరుణిమ, కలువల సోయగం, పరవశించే పారిజాతాల సున్నితత్వం, కవ్వించే వెనె్నల, మంచు ముత్యాల నిగనిగలు - ఇలా ప్రకృతి సోయగాల కౌగిలిలో పరవశించే వారందరూ చక్కని భావుకులుగా, సృజనాత్మకులుగా అవుతారు.’ (పే.58)
ఓషో అన్నట్టు అతను ‘తన కళలో అంకిత భావంతో లీనమై తన ద్వారా జరిగేదాన్ని జరగనిస్తూ సంపూర్ణత్వాన్ని కోరుకుంటాడే కానీ పరిపూర్ణత్వాన్ని ఎప్పుడూ కోరుకోడు.’ (పే.61) భరత్ ఇలా సంపూర్ణత్వంతో ‘సృష్టించే కళ’కు అంకితమయ్యాడు. మరోచోట ‘కళాకారుడు అదృశ్యమయ్యేదే అసలైన కళ.. అప్పుడు అహం ప్రస్తావన ఉండదు. అలాంటి కళ ధార్మికతను సంతరించుకుంటుంది. అలాగే ఆ కళాకారుడు సాంకేతిక నవ్యతతోపాటు, అస్తిత్వపరమైన ప్రామాణికతను సంతరించుకున్న రహస్యవాది అవుతాడు.’
అవును, నిజంగానే ‘క్రియేటివిటీ’ని అక్షరబద్ధం చేసిన ఓషో అస్తిత్వ ప్రామాణికతను సంతరించుకున్న రహస్యవాదినే. ‘సృష్టించే కళ’గా సృజించిన భరత్ కూడా అహంకరించని అదృశ్య అక్షర శిల్పినే. మొత్తానికి నవ దివ్య జీవన మార్గదర్శకోపనిషత్తు వంటి భరత్ ‘సృష్టించే కళ’ను చదవటమంటే ఓషో ‘అనుగ్రహ సూత్రం’తో గతంతో, భవిష్యత్తుతో అనుబంధాన్ని వదలుకుని అన్నింటా ఎదగటమే! అన్నట్లు, మానసిక జ్ఞాపకాలను వదిలేసి మీరు కూడా అద్దంలా తయారవ్వాలంటే ఈ ‘సృష్టించే కళ’ను చదివి తీరవలసిందే! అప్పుడు కానీ ‘అస్తిత్వ సర్వస్వం మీ ద్వారా ఏదో చెయ్యాలనుకుంది, అందుకే ప్రత్యేకమైన, ప్రయోజనకరమైన పనిని అర్థవంతంగా చేసేందుకే అందరం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాం’ అన్నది ఆచరణ మార్గం పట్టదు.

**
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-వాసిలి వసంతకుమార్