అక్షర

మేలైన భావనలు.. మామూలు కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనామా బీచ్‌లో...
కథాసంపుటి
-తరానా
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
‘తరానా’ కలం పేరుతో రచనలు చేసే ఆచార్య తానిపర్తి నారాయణరావు రెండవ కథా సంపుటి ఇది. సంపుటిలో 12 కథలు ఉన్నాయి. మొదటి కథ ‘చిన్న సార్’ అమలిన ప్రేమ భావన, ఆరాధన ఆలంబనగా సాగిన కథ. ఒక బుద్ధిమంతుడైన విద్యార్థి విద్యాధర్. ఆర్‌డివో గారి ఆదరణతో వారింట్లో ఉండి చదువుకుంటున్నాడు. ఆర్‌డివో గారి కూతురు దివ్య. విద్యాధర్ - దివ్య - ఇరువురికీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆరాధన. ఆర్‌డివో గారికి బదిలీ అయింది. ఆ కుటుంబం ‘వేరే’ జిల్లాకి వెళ్లిపోయింది. విద్యాధర్ చదువు పూర్తయి రాజధానిలో ఉద్యోగంలో చేరాడు. పెళ్లి, పిల్లలు, స్వంత ఇల్లు.. దివ్యతో సంబంధం తెగిపోయినా ఆమె స్మృతులు వీడలేదు. తన ఇంట్లో ఆమె జ్ఞాపకంగా ఒక మల్లె పొదని పెంచుకున్నాడు. భార్య అనుమానం - ఆ మల్లె పొదని మాయం చేస్తుంది. అది ఇతనికి ‘తీవ్ర శరాఘాత’మైంది. దివ్యని కల గంటాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. కలుసుకున్నాడు. ‘కడసారి మిమ్మల్ని చూసే ఈ లోకం వదిలి వెళ్తానని.. నా అంతరాత్మ చెబుతూనే ఉన్నది’ అంటూ అతని కుడిచేతిని గుండె మీద ఆనించుకున్నది. ‘వచ్చే జన్మలోనైనా మీరు నాతోనే ఉంటారుగా. గుండె మీది చేయి తియ్యకుండా మీకు సమ్మతమేనని చెప్పండి’ అంటే, ‘అలాగే దివ్య’ అంటాడతను. ‘ఎంతో హాయిగా ఉందం’టూ ‘కళ్లు మూసుకుందా’మె! ‘ఆ ప్రసన్న వదనం యోగ నిద్రా సదృశ్యంగా వెలిగిపోతున్నది’ అంటూ కథ ముగుస్తుంది! ‘పున్నమి రేయి’ కూడా ఇలాంటి ప్రేమ గాథే. బావ మరదళ్లు విడివడటం, కలవటం, మనసులూ మాటలూ కలబోసుకోవటం, చివరికి మరదలు ‘బావ వక్షంలో వొదిగిపోవటం’ నాలుగైదు దశాబ్దాల క్రితం విరివిగా వచ్చిన నవలా చిత్రాల ఇతివృత్తాలూ, మలుపులూ, పాత్రల కన్నీళ్లూ అన్నీ వున్నాయి. ‘రంగుల కల’ ధ్యానం ప్రాధాన్యాన్నీ, మనిషి జీవన ప్రశాంతతపై దాని ప్రభావాన్నీ చెప్పిన వ్యాస కథ! చిన్ననాటి స్నేహితుని సహకారంతో శాడిస్ట్ భర్త నుండి విముక్తి చెందిన స్ర్తి కథ ‘పిచ్చుక గూళ్లు’. చివరికి ఆ బాల్య స్నేహితుల సహ జీవన పథ నిర్దేశకంగా ముగుస్తుంది కథ.
‘పనామా బీచ్..’లో అపార్థాలూ, మానసిక అలజడులూ, పశ్చాత్తాపాల మధ్య మలుపులతో తిరిగిన ప్రేమకథ. మతాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిన అక్క- భర్తా, ఇద్దరు పిల్లలతో సుఖ జీవనం సాగిస్తుండగాచూసి ఆనందించే తమ్ముని కథ ‘అక్క’. అక్కాతమ్ముళ్ళ ‘హృదయాలను కలిపిన అనురాగ ఘరి మనోనేత్రానికే అనుభవైకవేద్యం కాని బాహిర వర్ణన అసాధ్యం!’ అన్న వాక్యం తో కథ ముగుస్తుందనుకుంటాం. కానీ, అప్పుడు వేరెవరో యువ ప్రేమికుల జంట ప్రవేశించి (తమకు ఈ కథని చెప్పారనుకోవలసిన) మాస్టారికి కృతజ్ఞతలు తెలపటం వగైరా సంభాషణలు వస్తాయి. కథా ప్రారంభాన్ని మరోలా ఊహించుకుని, ఆ ప్రారంభాన్ని రాయకుండా, ముగింపులో ఆ రాయని ఇతివృత్తం కొనసాగింపుని మాత్రం ఇక్కడ కూర్చారనిపిస్తుంది!
తరానా గారి కథలన్నిటా ఈనాటి సామాజిక స్పృహ వున్నది. ఆ సమస్యలతో సతమతమవుతున్న మనుషుల బాధా వ్యథల ఉపరితల స్పర్శ ఉన్నది. అయిత, పాత్రలన్నీ ఆదర్శవాదాన్నీ, భావుకతనీ ఆశ్రయించుకుని ఆలోచిస్తాయి, ప్రవర్తిస్తాయి, చదువరికి ఏ అనుభూతినీ మిగల్చకుండా ముగుస్తాయి. భాషా శైలీ సంస్కారవంతంగా, పరిశుభ్రంగా సాగినా, కథనం గానీ, సంభాషణలు గానీ, స్వాభావికంగా కనిపించవు. ‘తన దగ్గరగా తీసుకొని బిగ్గరగా అలుముకున్నాడు’ ‘అత్తా మామా- వాళ్లది భారీ మనసు’. ‘నేను లేచి అక్క దగ్గరకెళ్లి నిలబడి తన తలను నా ఒడికి ఆనించుకుని నిమిరాను’ ‘ఆమె మీదికి వంగి ఆ మస్తిష్కాన్ని చుంబించాను’ వంటి వాక్యాలు చదువరిని ఇబ్బందికి గురి చేస్తాయి.
‘రచయిత ఆశావహ దృక్పథం, మనుషుల మంచితనం మీద ఆయనకున్న నమ్మకం - ఈ కథలన్నింటిలోనూ స్పష్టంగా కనిపించే అంశాలు.. అందుకే ఈ కథల్లో వాస్తవికత కంటే ఆదర్శమే ఎక్కువగా ఉందనిపిస్తుంది’ అన్నారు డా.మృణాళిని. అవును. అది నిజం!

-విహారి