అక్షర

దృశ్యాదృశ్యంగా సమాజం పోకడ.. మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశ్శబ్ద ప్రతిధ్వని
(కథా సంపుటి)
-యల్.రాజా గణేష్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
1971 నుంచీ 1978 వరకూ 28 కథలు రాశారు యల్.రాజా గణేష్. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2014 నుంచీ మళ్లీ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ, రెండేళ్లలో 20 కథలు రాశారు. ఆ ఇరవై కథల సంపుటి ఈ ‘నిశ్శబ్ద ప్రతిధ్వని’. రాజా గణేష్ విస్తృతమైన లోకానుభవం సృజనాత్మకంగా ఈ కథలన్నిటా కనిపిస్తుంది. అందువల్లనే వారి కథల్లో వస్తు వైవిధ్యం ఎక్కువగా ఉంది.
‘పరాధీనం’లో వర్తమాన సామాజిక పరిణామాల ధాటికీ, గ్లోబలీ ప్రభావానికీ రూపురేఖల్ని మార్చుకున్న క్షురకుల కులవృత్తినీ, దాన్ని నమ్ముకున్న వారి జీవనంలోని మార్పునీ కళాత్మకంగా ఆవిష్కరించారు. మెన్స్ బ్యూటీ పార్లర్ హైటెక్ హంగుల్ని సామాజికావసరం చేశారు. సంక్షేమ పథకాలూ, రుణ మాఫీలూ నీటి మీది రాతలుగా మాసిపోతుంటే, రైతు జీవితం ఏనాటికీ ఛిద్ర చిత్రపటమే. బతుకు మీది ఆశ మబ్బు బొమ్మగా ప్రలోభపెడుతోంది. వ్యవస్థ మొత్తం కల్తీ పాల బాపతే అని ధ్వని. ఇదే కథ - ‘నోటికీ చేతికీ దూరం’.
అలాగే ‘కాల్‌మనీ’లో ఆ సామాజిక భూతం వికృత రూపాన్ని చిత్రిస్తే, ‘జాతి చెట్టుకు వేరు పురుగులు’లో చీటీలూ, లాటరీలూ, గొలుసుకట్టు మార్కెటింగ్ మాయాజాలాన్ని ఇతివృత్తంగా ఆవిష్కరించారు రచయిత. ‘మాతృభాష’ కథ శీర్షికకు తగినట్లే అమ్మ నుడి ప్రాముఖ్యాన్ని చెబుతుంది.
మానవ సంబంధాల్లోని వైచిత్రి చాలా కథల్లో అభివర్ణింపబడింది. అపకారికి ఉపకారం సూక్తి స్ఫూర్తిని ‘నెత్తి మీది కళ్లు’ కథ తెలుపుతుంది. తండ్రి చనిపోతే, ఆదరించే వారు లేనందున, చదువు మానేసి, హోల్‌సేల్ పండ్ల దుకాణంలో కలాసీగా చేరి తల్లీ చెల్లెలు బరువు బాధ్యతల్ని నెత్తికెత్తుకుంటాడు రాజశేఖర్. కథ పేరే ‘బరువు బాధ్యతలు’.
‘ఓ కుక్క కథ’ కుక్కకీ మనిషికీ మధ్యన పెనవేసుకున్న అనుబంధాన్ని కాల్పనిక వాస్తవికతతో ఆవిష్కరించింది. మనిషి చేష్టల్లోని అపరాధ తత్వాన్నీ, కుక్క నైజంలోని విశ్వాసాన్నీ చిత్రించింది. సంపుటిలోని ఇతర కథల్లో ‘రాతి విగ్రహం’ ‘ఆత్మదీపం’ వంటివి కేవలం మనసుకు తట్టిన మెరుపు ఆలోచన ఆధారంగా స్కిట్‌లుగా, స్కెచ్‌లుగా తయారైనాయి.
కాగా, ఈ సంపుటికి పేరుగా ఎన్నుకొన్న ‘నిశ్శబ్ద ప్రతిధ్వని’ చాలా మంచి కథ. ఒక అందవికారి జీవితంలో ప్రేమ రాహిత్యాన్నీ, అతని బతుకు నేపథ్యాన్నీ ఎంతో ఆర్ద్రంగా చిత్రించారు రచయిత. అతని మానసిక వ్యథనీ, అతని పట్ల ఒక కుష్టు రోగి ఆదరణనీ, ఆరాధననీ - ఉత్కంఠభరితమైన కథనంతో రాశారు రాజా గణేష్. వాస్తవానికి భిన్నంగా ఉన్నవనుకునే సంఘటనలు తటస్థపడినా, ఆ కల్పనల్ని తగిన సంభావ్యతతో మలచి కథని రక్తి కట్టించారు. చివరికి - కుష్టురోగి మృగాళ్ల వేటని తప్పించుకోవటానికి ఆ వేషాన్ని దాల్చి బతుకుతున్న అందమైన యువతే కావటం - ఆహ్లాదకరమైన కొసమెరుపు. కల్పనతో కూడిన మలుపులు - ఇతివృత్త పరిధిలో - ఎదురుకావటం కూడా, కథానికకు చదివించే గుణాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.
సంఘంలో నెలకొన్న ఈనాటి స్థితిగతుల నేపథ్యంలో మనిషి ఆనంద విషాదాల్ని కథాగతం చేస్తున్న రచయిత నుండి తెలుగు సాహితి మరిన్ని మంచి కథల్ని ఆశిద్దాం.

-విహారి