అక్షర

మాల్గుడిని గుర్తు చేసే మరో లోకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్గుడి నుండి మకొండో దాకా
ఆంగ్ల మూలం: ఆర్ విశ్వనాధన్
అనువాదం: డా.మాడభూషణం రాజగోపాలాచారి
సంపాదకుడు : డాక్టర్ ఇంద్రసేనారెడ్డి కంచర్ల
ధర : 35 రూ.
పేజీలు: 150
ప్రచురణ: తెలుగు అకాడమి,
హిమాయత్ నగర్, హైదరాబాద్
**
పుస్తకం పేరు మాల్గుడి నుండి మకొండో దాకా...ఆర్ కె నారాయణ్ నవలల్లో కాల్పనిక గ్రామం మాల్గుడి కాగా, నోబెల్ బహుమతి గ్రహీత కొలంబియన్ రచయిత గాబ్రియెల్ గార్సియా మార్క్విజ్ నవలల్లోని కాల్పనిక గ్రామం మకొండో ..ఒకటి భారతీయ ఆత్మను ఆవిష్కరించగా, మరొకటి లాటిన్ అమెరికన్ ఆత్మను ఆవిష్కరిస్తుంది. చిన్న పట్టణాల్లో సంప్రదాయక జీవనాన్ని గడిపే సామాన్య గ్రామస్తుల విలువలను ‘మాల్గుడి’ ప్రతిబింబిస్తుంది. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో ఈ రెండు దేశాల విభిన్నత్వాన్ని మూల రచయిత ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. భారతీయుల నిష్కామకర్మ, వైరాగ్య భావనలు ఒకవైపు, లాటిన్ అమెరికన్ల జీవితానురక్తి, భోగపరాయణత్వం మరోవైపు వారి సాంస్కృతిక వైరుధ్యానికి దర్పణం పడతాయి. లాటిన్ అమెరికన్లు భారతీయులకు ఆహారోత్పత్తులను సరఫరా చేయగా, వారికి భారత్ ఆధ్యాత్మికాహారాన్ని అందించిందని చమత్కరిస్తారు విశ్వనాధన్. లాటిన్ అమెరికన్లకు జీవితం అంటే ఒక పండుగ. ఉత్సవం.అర్జంటీనా పాప్ గాయకుడు ఎక్జెల్ పాడినట్టు జీవితం ఆస్వాదయోగ్యం. క్షణ క్షణం జీవితాన్ని ఆస్వాదించు, దేన్నీ నిరోధించకు, జీవితానికి నీ సర్వస్వం అర్పించు...అన్నట్టే మకొండో గ్రామం తీరు ఉంటుంది. కాని ఇందుకు విరుద్ధంగా మాల్గుడిలో సంస్కృతి మనకు కనిపిస్తుంది. సాధారణ జీవితం, ఉన్నత ఆలోచనలు, త్యాగశీలం, సుఖాల పట్ల నిర్లిప్తత, వృద్ధ భారతీయుడు తన జీవన చరమాంకంలో వైరాగ్యంతో ఏ వారణాసికో హిమాలయాలకో వెళ్లి ధ్యానం చేస్తూ రుషి వలే జీవించాలని అనుకుంటాడు. కాని లాటిన్ అమెరికన్లు జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడరు. మొత్తం మీద ఈ పుస్తకం లాటిన్ అమెరికా సాహిత్యంపై కూడా ఒక విహంగ వీక్షణం కల్పిస్తుంది.
ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికా దేశాలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ప్రోది చేసి నూతన ప్రగతికి బాటలు వేశాయి. భారత్‌తో వాటికి ఉన్న సంబంధాలు మరింత పరిపుష్టం అయ్యాయి. జీవితం పట్ల అనురక్తి, వస్తువాద దృక్పథం కలిగిన ఆ దేశ ప్రజల్లో భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యం పట్ల ఆసక్తి పెరిగింది. ఆ దేశాల సాహిత్యం ఇతివృత్తంలో కాని, పాత్ర చిత్రణలో కానీ ప్రయోగాత్మక అభివ్యక్తిలో కానీ అత్యున్నత ప్రమాణాలతో నూతన పుంతలు తొక్కింది. గాబ్రియెల్ గార్సియా మార్క్వెజ్ నోబెల్ బహుమతి సాధించడం ఇందుకొక ఉదాహరణ. మాంత్రక వాస్తవికత (మాజిక్‌రీయలిజం) అనే ప్రయోగాత్మక ప్రక్రియ ఆయన సృష్టే. అది మనదేశంతో సహా ప్రపంచ దేశాలు రచయితలను ప్రభావితం చేశాయి. మన భరత నాట్యం, కూచిపూడి నృత్యాలు ఆ దేశ నాయకుల ప్రజాస్వామ్య స్ఫూర్తి, కర్తవ్యనిష్టపై ముద్ర వేశాయి. లాటిన్ అమెరికా దేశాలతో గాఢానుబంధం ఉన్న మాజీ భారత రాయబారి ఆర్ విశ్వనాధన్ ఈ అంశాలు అన్నింటినీ స్పృశిస్తూ చక్కటి శైలిలో మాల్గుడి నుండి మకొండో అనే పేరుతో రాసిన ఆంగ్ల గ్రంథానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. అర్జెంటీనా, ఉరుగ్వే, పెరుగ్వే, వెనుజులా దేశాల్లో విస్తృతంగా పర్యటించి అక్కడి ప్రజల జీవన విధానాన్ని , సాహిత్య, సాంస్కృతిక, కళారంగాలపై అభిమానంతో ఆకళింపు చేసుకున్న విశ్వనాధన్ ఆ అంశాలను కళ్లకు కట్టినట్టు ఇందులో రాశారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఆధ్యాత్మికత వారిని ఎంతగా ఆకట్టుకున్నాయో ఈ గ్రంథంలోని మెడెలిన్ గాంధీ ఫౌండేషన్, హస్తినాపూర్ ఫౌండేషన్, లాటినో గాయకుడు రిక్కీ మార్టిన్, నృత్యకారిణి మిర్జా బార్వీ, రేడియో జాకీ ,డిజైనర్ మోనికా సొకోలోవ్‌స్కీల జీవిత విశేషాల ద్వారా తెలుస్తుంది. భారతీయ శాస్తవ్రేత్త డాక్టర్ మోహన్ కొహ్లి, పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు, మద్యవ్యాపారి అబ్దుల్ అజీజ్, గెరిల్లా ఉద్యమకారుడి నుండి ఉరుగ్వే దేశాధ్యక్షుడైన జోస్ ముజీకా జీవన ప్రస్థానాలు, యువతకు వ్యక్తిత్వ వికాస నిర్మాణానికి ఎంతో ప్రేరణ ఇస్తాయి. కాళ్లతో కాఫీ, బ్యూనోస్ ఎయిర్స్‌లో పుస్తకసమయం వంటి అధ్యాయాలు లాటిన్ అమెరికా ప్రజల విలాస జీవనంతో పాటు వారి పుస్తకాల పట్ల అభినివేశాన్ని ప్రతిబింబిస్తాయి. మూల గ్రంథంలో 40 అధ్యాయాలుండగా, రచయిత అనుమతితో వాణిజ్యపరమైన అధ్యాయాలను వదిలి , సాహితీ సంస్కృతపరమైన అంశాలను స్పృశిస్తూ ఎన్నో నూతన విషయాలను ఆసక్తికరంగా వెలుగులోకి తెచ్చే 26 అధ్యాయాలు మాత్రమే అనువాదం కోసం ఎంపిక చేసుకున్నట్టు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. సాధారణ వ్యవహారిక భాషలోకి గ్రంధాన్ని సామాన్యుడి దగ్గరకు తీసుకురావడంలో ఇంద్రసేనారెడ్డి విజయం సాధించారు. మరిన్ని ఈ తరహా గ్రంథాలు తెలుగులో రావల్సిన అవసరం ఎంతైనా ఉంది...ఈపుస్తకాన్ని తెలుగు అకాడమి ప్రచురించడం విచిత్రమే.

-బి.వి.ప్రసాద్