అక్షర

గురితప్పని ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతి తప్పిన గమ్యం
విద్యారంగం తీరుతెన్నులు
-ఎడమ శ్రీనివాసరెడ్డి
పేజీలు: 216
వెల: రూ.120/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

**
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పిజి) అనే మూడు భూతాలు ప్రపంచాన్ని పట్టి పీడించడం మొదలై రెండున్నర దశాబ్దాలు దాటింది. వీటి ప్రారంభంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న, వెనుకబడిన దేశాలన్నీ ఏకీకృతంగా మారుతాయని, సమానత్వాన్ని సాధిస్తాయని, ఆరోగ్యకరమైన ప్రపంచం ఆవిష్కరించబడుతుందని, పర పీడన నుంచి విముక్తి పొందుతాయని, వలసవాద కోరలు పెకిలించబడుతాయని ప్రపంచ బ్యాంక్‌తోపాటు దాని అనుంగు సంస్థలు ఏకధాటిగా ప్రచారం చేశాయి. వీటికి పుట్టిన విష బీజాలే గాట్ (జిఎటిటి), ట్రిప్స్ (టిఆర్‌ఐపిఎస్), గాట్స్ (జిఎటిఎస్) లాంటి ప్రపంచ హంతక సంస్థలు. అప్పటి దాకా స్వయం నిర్ణయాధికారంతో, స్థానిక ఆలోచనా విధానంతో, పరస్పర సహకారంతో కొనసాగిన ఆయా దేశాల స్వయం పాలనంతా పరాధీనతకు గురైంది. దేశ స్థాయి సార్వభౌమాధికారం దెబ్బతిన్నది. ఏదో ఒక వర్గం ప్రయోజనాలకై, అవసరాలకై మానవ వనరులు అభివృద్ధి జరగాలని, సంబంధిత జ్ఞాన నిర్మాణం జరగాలని ఆదేశాలు ఇవ్వడం మొదలైంది. పార్టీలతో సంబంధం లేకుండా ఆయా దేశాల పాలకులు తలలూపడం, ఇదే అభివృద్ధి నమూనా అంటూ ప్రచారం ప్రారంభమైంది. వీటి ఫలితాల్ని ఒకటి, రెండు దేశాలు తప్ప అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా నేడు అనుభవిస్తున్నాయి.
ఈ విధ్వంసకర ఎజెండా నిరాటంకంగా సాగుతూ ఓ పుష్కరం దాటిన తర్వాత ఎడమ శ్రీనివాసరెడ్డి తన అంతరాత్మ అనే మూడో కన్నుతో విద్యారంగ పతనాన్ని వీక్షించి మరో పుష్కరంపాటు (2003-2015) మదనపడి, క్షోభిత హృదయంతో రాసిన వ్యాసాల సంకలనమే ‘గతి తప్పిన గమ్యం’. ఏడు భాగాలుగా గల ఈ సంకలనంలో మొత్తంగా 52 వ్యాసాలున్నాయి. ఇతర వ్యాసాలనే శీర్షికతోగల ఏడో భాగంలోని వ్యాసాలతో సహా అన్నింటా పతనవౌతున్న విద్యా వ్యవస్థ గూర్చి, మార్కెట్ సరకుగా మారిన విద్య గూర్చి, దినదినాభివృద్ధి చెందుతూ విజృంభిస్తున్న కార్పొరేట్ విద్య గూర్చి, కేవలం మార్కులే కొలమానంగా, పోటీలో నిలదొక్కుకోవడానికే విద్య అనే సూత్రీకరణతో, సామాజిక, భాషా శాస్త్రాల్ని, ముఖ్యంగా మాతృభాషను సమాధి చేస్తూ, కేవలం గణితం, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల ప్రయోగాత్మకత లేని బట్టీ చదువులతో ఎలా పక్కదారి పట్టిందో దాదాపు ప్రతీ వ్యాసంలో వివరించడం జరిగింది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, విద్య, వైద్యాన్ని ప్రైవేటీకరించుకుంటూ, తమ బాధ్యతా రాహిత్యాన్ని ఎలా ప్రదర్శించాయో స్పష్టంగా విశే్లషించడం జరిగింది. సందర్భానుసారంగా జాతీయ, అంతర్జాతీయ నివేదికల్ని, విద్యా కమీషన్ల సూచనల్ని, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు జరిపిన నేపథ్యాల్ని, వాటి అన్వయాన్ని రచయిత వాదనకు అనుబంధంగా చూపడం వ్యాసకర్త ప్రాపంచిక దృక్పథాన్ని తెలుపుతుంది.
ఈ వ్యాసాల్ని పుస్తక రూపంలో తీసుకురావాలని అనుకున్నప్పుడు, వ్యాసాలు రాసిన సందర్భం వర్తమానానికి అతుకుతాయా అన్న ప్రశ్న ఉదయించిందని ‘నా మాట’లో వ్యాసకర్తనే ప్రస్తావిస్తూ, వ్యాసాల్ని తిరిగి చూసినప్పుడు నాటి సమస్యలు నేటి వర్తమానంలో కూడా సజీవంగా కొనసాగుతున్నట్లు గుర్తించి ప్రచురణకు పూనుకోవడం సమంజసంగానే ఉంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు దోపిడీనే ఎజెండాగా చేసి పరిపాలిస్తే, సమస్యలు మరింత సంక్లిష్ట స్థితికి చేరుకొని, సంక్షోభం ముదిరి పాకాన పడుతుందని చెప్పడానికి విద్యారంగమే చక్కని ఉదాహరణ. ఇలా 12 సం.ల కాలవ్యవధిలో రాయబడిన ప్రతీ వ్యాసం వర్తమాన విద్యారంగ సమస్యల్ని నిలువుటద్దంలో చూపినట్లుగా ఉంది. ప్రపంచ స్థాయిలో జరిగిన వివిధ సర్వేలను, కొన్ని దేశాల్లో విద్యారంగ అనుబంధంగా వాడే పదాల్ని (హాగ్వాన్లు/ జూకూలు/ షాడో) అవసరానికి అనుగుణంగా, భారతీయ విద్యా రంగానికి అనుసంధానంగా ప్రస్తావించి, వ్యాసకర్త నిరంతర అధ్యయన శీలిగా నిరూపించుకుంటూనే, తానో రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడై కూడా విద్యారంగంపై ఓ పెడగాజిస్ట్‌గా వ్యాసాలు రాయడం అభినందనీయం. ఈ రంగంలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బోధకులు విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని కాంక్షిస్తూ నిరంతరం ఉపాధ్యాయ సంక్షేమానికై పాటుపడుతున్నామంటూ చెపుతున్న కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆత్మావలోకనం చేసుకునేలా ఈ వ్యాస పరంపర కొనసాగడం అందరూ గుర్తించాల్సిన అంశం.
ఇక మొదటి భాగంలోని మూడో వ్యాసంలో కార్పొరేట్ దిగ్గజాలతో విద్యారంగంపై సూచనలివ్వాలని కేంద్ర ప్రభుత్వం కమీషన్లను ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టిన వ్యాసకర్త, ఇంతే ప్రమాదకర నివేదిక నిచ్చిన అమెరికన్ భారతీయుడైన శ్యాం పిట్రోడా నాలెడ్జ్ కమిషన్‌ను కూడా ప్రస్తావించాల్సింది. అలాగే మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ సైన్స్ టీచింగ్ ప్రాజెక్టును నిలిపివేయడాన్ని ప్రస్తావించి, హైదరాబాద్ నడిబొడ్డున, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ ఆవరణలో మర్రిచెన్నారెడ్డి హయాంలో పి.ఎం.్భర్గవ నేతృత్వంలో ఏర్పాటై, తర్వాత మూతపడిన మెథడాఫ్ సైన్స్ సంస్థను ప్రస్తావించక పోవడం గమనించాలి. అలాగే 1986 జాతీయ విద్యా విధానం నుంచి 2009 యశ్‌పాల్ కమిటీ వరకు.. ప్రైవేటీకరణకు ఊతమిచ్చేవిగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం జరిగింది. నిజానికి రాజీవ్‌గాంధీ హయాంలో ఏర్పాటైన 1986 నాటి జాతీయ విద్యా విధాన నమూనా విద్యారంగంపై దృష్టి సారించేలా చేసింది. యస్‌యుపిడబ్ల్యు, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ లాంటి పథకాలకు అవకాశాన్నిచ్చిన ఈ విధానం విశాలమైన వరండాతో తరగతి గదుల నిర్మాణానికి, ఏకోపాధ్యాయ పాఠశాలల్ని ద్వి ఉపాధ్యాయ పాఠశాలలుగా ఎదిగించడానికి, ఇందులో ఒకరు విధిగా మహిళా ఉపాధ్యాయురాలు వుండేలా చూడడం జరిగింది. ఇక 2009లో యశ్‌పాల్ కమిటీ అంటూ ఏ నివేదిక ఉన్నట్లు తెలియకపోగా, ఎన్‌సిఇఆర్‌టి సంచాలకునిగా యశ్‌పాల్ ఏనాడూ ప్రైవేటీకరణను ప్రోత్సహించినట్లు తెలియదు. పైగా 1993లో ఈయన నాయకత్వంలోనే ‘్భరంలేని చదువు’ అనే నివేదిక తయారుచేయబడినా, నేటికీ పిల్లల వీపులపై భారాన్ని తగ్గించలేక పోయింది మన విద్యా వ్యవస్థ. 2009 నాటి విద్యాహక్కు చట్టానికి ముందే 2005లో జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టాన్ని తయారుచేయుటలో కీలక పాత్రను పోషించిన వ్యక్తి యశ్‌పాల్. ఈ విషయాన్ని వ్యాసకర్త మరోసారి పరిశీలిస్తే బాగుంటుంది.
చిన్నచిన్న లోపాల్ని మినహాయిస్తే వ్యాసాలన్నీ సమగ్రతతో, చక్కని సందేశంతో ఆలోచనల్ని రేకెత్తించేలా వుండడంతోపాటు, పుస్తకం ఆకర్షణీయంగా తేవడాన్ని అభినందించాల్సిందే!

-డా.లచ్చయ్య గాండ్ల