అక్షర

బతుకు కథల పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి పేజి
(కథల సంపుటి)
-జగన్నాథశర్మ
వెల: రూ.300/-
అమరావతి పబ్లికేషన్స్
4-21-81, చైతన్యపురి
సాయిబాబా రోడ్
గుంటూరు - 522 007
**
ఏ లోహాన్నయినా బంగారంగా మార్చగలదిలాగా, లోకంలోని ఏ విషయాన్నయినా - కథగా మార్చగల ‘పరుసవేది’ విద్య ఏదో అయల సోమయాజుల నీలకంఠ జగన్నాథశర్మకు చేతనయినట్లుగా ఉంది. లేకపోతే ఇనే్నసి కథలు రాయడం, రాసి మెప్పించడం సామాన్యమైన సంగతేమీ కాదు! ‘రాజధాని కథలు’ ‘మా ఊరి కథలు’ ‘అగ్రహారం కథలు’ అంటూ పరంపరగా రాసి మెప్పించిన కలంతోనే ‘పేగు కాలిన వాసన’ పేర రాసి వెలువరించిన కథల సంపుటికి ఇప్పటికి సుమారు పాతిక సంస్థల నుండి అవార్డులు పుచ్చుకున్నవాడు తను. నవలలు కొన్ని రాసినా, టీవీ, సినిమా రచయితగానూ రాణించినా, నవ్య వారపత్రిక సంపాదకునిగా జగన్నాథ ‘కథ’ చక్రాల్ దూసుకుపోతున్నాయి!
అమరావతి పబ్లికేషన్స్ ప్రచురణగా వెలువడిన జగన్నాథ శర్మ ‘మొదటి పేజి’ - ఒక విలక్షణ కథాసంపుటి. వారపత్రికకు వారం వారం సంపాదకీయంగా మొదటి పేజీలో ఓ కథ రాసే ఈ వైఖరి నిజంగా ‘నవ్య’మే! సంపాదకీయ కథనాలను ఇలా సార్వకాలిక విలువలు గల కథలుగా మలచగలిగిన ప్రజ్ఞ, ఆ ఆలోచన గొప్పవి. అలా శర్మ రాసిన ఎంపిక చేసిన మొదటి పేజీల 180 కథల సంపుటి ఇది.
ఈ కథల్లో నవ్వులు, కన్నీళ్లు, ఇష్టాలు, కష్టాలు అన్నీ ఉన్నాయి. మనుషుల మంచితనం ఉంది, ఒకనాటి తరం పెన్నిథులుగా నిలిపిన విలువలూ, ఈ తరం అందిపుచ్చుకోదగిన వ్యక్తిత్వ వికాస అంశాలూ ఉన్నాయి. ప్రకృతితో మమేకం కావడం ఉంది. ఇవన్నీ నిజానికి చిన్నిచిన్ని కథలు. కానీ వీటన్నింటినీ ఒకచోట చదువుతూంటే - విస్తారమైన జీవితపు కాన్వాస్ కనిపిస్తుంది. బ్రతుకులోని రంగులు, పొంగులు, దిగుళ్లు, పగుళ్లు దృశ్యమానమవుతాయి. కంట తడిపెట్టించేవి కొన్ని, దరహాస రేఖలు వికసింపజేసేవి కొన్ని, హృదయపు ఆర్ద్ర ద్యుతులు కొన్ని, ‘సారపు ధర్మమున్, విమల సత్యము..’ తెలిపే నీతులు కొన్ని. బ్రతుకు బాటకు దారులు చూపే దిశా నిర్దేశాలు కొన్ని. ఇలా కథలను బట్టి కల్పనలుగా కాక, జీవన వాస్తవాలుగా సాక్షాత్కరింపజేసే పేజీలున్నాయి.
ఉదాహరణకు ‘సెల్‌ఫోన్’ అనే ఓ కథ - పదహారేళ్ల కుర్రాడు. తండ్రి పోయాడు. చదువు ఆగిపోయింది. ఉద్యోగం అనివార్యం. ఆఫీస్ బాయ్ కావాలన్న ప్రకటన చూసి వెళ్లాడు. ఓ రోజు చేయించుకు చూసారు. నచ్చాడు. ‘సెల్‌ఫోన్ నెంబర్ చెప్పు. రెండు మూడు రోజుల్లో పిలుస్తాం’ అన్నాడు యజమాని. ‘నాకు సెల్‌ఫోన్ లేదండి’ అన్నాడు కుర్రాడు. ‘అయితే కుదరదు. వెళ్లిరా’ అన్నారు. నిరాశతో ఇంటికొచ్చాడు. తండ్రి ఇచ్చిన సొమ్ము అంతా కలిసి వెయ్యి రూపాయలున్నాయి. సెకండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొందామనుకుని, వద్దనుకుని, అదే పెట్టుబడిగా రైతుబజార్ నుంచి కూరగాయలు తెచ్చి, సంచుల్లో వేసుకుని, సైకిల్‌కు తగిలించుకుని, కాలనీలో అమ్మడం మొదలెట్టాడు. సాయంత్రానికి మూడు వందలు లాభం! అలా కూరగాయలు అమ్ముతూ - క్రమంగా ‘ఆటో’ కొని మరికొన్ని కాలనీల్లోనూ అమ్మకాలు మొదలుపెట్టాడు. క్రమేపీ ట్రక్కు కొన్నాడు. రెండు పూటలా తాజా కూరగాయలు అందుబాటులోకి తెస్తూ.. తండ్రి పేర ‘ఫ్రెష్’ పెట్టాడు. సంచార కూరగాయల షాపులతోబాటు, గొలుసుకట్టు షాపులు పెట్టాడు. ఆ షాపులకు కూరగాయలు అందించడానికి ఎకరాలకు ఎకరాలు పొలాలు కొని, కూరగాయలు పండించసాగాడు. దేశంలో అతని పంట పొలాలు వ్యాపించాయి. ప్రఖ్యాతుడయ్యాడు. అయినా ఒదిగే ఉంటాడు. ప్రచారానికి దూరంగానే ఉండిపోయాడు. ఓసారి ఓ పత్రిక్కి ఇంటర్వ్యూ ఇవ్వడం విధాయకమైంది. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ‘మీ జీవితం ఎందరికో స్ఫూర్తివంతంగా ఉంటుంది. మీ సెల్‌ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇంటర్వ్యూ క్రింద ఆ నెంబర్ ఇస్తాం. ఎందరో మీతో మాట్లాడుతారు. బాగుపడతారు’ అడిగాడతను. ‘నాకు సెల్‌ఫోన్ లేదండి..’ ‘లేదా?’ ఆశ్చర్యపోయాడ తను. ‘ముందు నుంచీ లేదా?.. వాడే అలవాటే లేదా చెప్పండి’ ‘లేదు’ ‘సెల్‌ఫోన్ కనుక ఉండి ఉంటే మీరే స్థాయిలో ఉండేవారో కదా!’ అన్నాడు ఇంటర్వ్యూ చేసినతను. ‘ఆఫీస్ బాయ్‌గా ఉండేవాణ్ణి’ అంటూ బోర్డు మీటింగ్ ఉందని లేచి నమస్కరించి వెళ్లిపోయాడతను. ఆధునిక సాంకేతిక అంటకుండానే ఉనికిని, మనికిని ఉత్తాలంగా నిలుపుకోవచ్చనిపిస్తుంది మరి ఈ కథ చదివితే.
ఇలాంటి కథలు ఎన్నో! వీటిల్లో మళ్లీ జానపద కథలు, రాజుల కాలం కథలు వంటివీ వున్నాయి. ‘్ఫలించిన వృక్షమునకే రాతి దెబ్బలు’ అన్నట్లు మామిడిచెట్లు వున్నవాళ్లకు పెరట్లో రాళ్ల దాడి తప్పదు. వాచ్‌మెన్‌ను పెట్టినా, పోలీసులకు చెప్పినా ఫలితం శూన్యం! చెట్టంతా కాయలతో కళకళ లాడుతూంటే, ఓ కుక్కను కొని దానికి కట్టినా, అది మరో కుక్కతో జతకట్టి, కట్టు తెంచుకు పోయిందిట! ఆఖరికి బాబాయ్ మామిడి చెట్టుకు బోర్డు పెట్టాడు - ‘మామిడికాయ కావాలా! దయచేసి రాయి పెట్టి చెట్టును కొట్టకండి. ఇంటి తలుపు తట్టండి. ఉప్పు, కారంతోబాటు మామిడి కాయను మీకు అందజేస్తాం. తిని ఆనందించండి. ఆశీర్వదించండి’ అని. క్రమేపీ అది ఫలించింది. ‘మాకిప్పుడు రాళ్ల దెబ్బలు లేవు. శత్రువులు లేరు. అంతా స్నేహితులే. కాయను దించి అమ్ముకుంటే కాణీపరకి వస్తుందేమో కానీ, ఇలా దించి పంచుకుంటే ఎంతమంది మిత్రులో! ఇప్పుడు హాయిగా వున్నాం. చెట్టమ్మ ఒళ్లో చల్లగా ఉన్నాం’ అని ‘మామిడికొమ్మ’ అనే కథ ముగుస్తుంది.
ఉల్లాసాన్నీ, హాసాన్నీ, ఉదాత్త విలువలనీ, మానవీయ మహోదారతనూ ప్రోది చేస్తూ ‘వాట్సప్’లో కూడా పంచుకునే లాంటి కథలు - జగన్నాథశర్మ ‘మొదటి పేజీ’ కథలు. ఒక యజ్ఞంలో వారం వారం పాఠకులకు మమకారం పెంచుతూ సాగుతున్న కథాక్రతువు ఇది! అరణి, అనీలజ, వైనతేయ, శివసతీపురం శర్మ, లహరి వంటి కలం పేర్లతోనూ రచనలు సాగిస్తూ భారత, భాగవత, రామాయణాలను సైతం సామాన్యులకు కథలుగా అందించిన జగన్మాథశర్మ - పఠిత లోకానికి అందించిన మంచి ఉపాయనం ఈ ‘మొదటి పేజి’. ఇది మంచి బతుకు కథల పుస్తకం.

-సుధామ