అక్షర

రామానుజ వైభవానికి అసలైన భాష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీభాష్యకారులు రామానుజాచార్యుల జీవితచరిత్ర
-డా.కె.వి.రాఘవాచార్య
వెల: 234/-
పేజీలు: 280
ప్రతులకు: రచయత
106, శ్రీపాద కేశవ టవర్స్,
11-35, ఎస్.వి.నగర్, తిరుపతి- 517 502.
**

భారత భూమండలం మీద భక్తి ఉద్యమానికి ఊపిరులు పోసినవారు ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకులు అయిన మధ్వ, శంకర, రామానుజులు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకులైన శ్రీ భగవద్రామానుజుల జీవిత చరిత్రపై లోగడ అనేకానేక గ్రంథాలు వెలువడ్డాయి. తిరుపతి వాస్తవ్యులు డా.కె.వి.రాఘవాచార్యులు, రామానుజుల జీవిత విశేషాలను అమూలాగ్రంగా పరిశోధించి, పరిశీలనాత్మక దృష్టితో రచించిన గ్రంథం ‘శ్రీ్భష్యకారులు రామానుజాచార్యుల జీవిత చరిత్ర’.
శ్రీమన్నారాయణుడు రామకృష్ణాది అవతారములు దాల్చినందువల్ల, అయోధ్య మధుర ఎలాగైతే మోక్షదాయిక క్షేత్రాలుగా ప్రసిద్ధాలో అలాగే యతి శేఖరులయిన శ్రీ భగవద్రామానుజుల ఆవిర్భవించుట చేత భూతపురి (శ్రీపెరుంబుదూరు) పునీతమైనదిగా విరాజిల్లుతోంది- అని సాంప్రదాయ ప్రవణులైన పెద్దల మాట.
శ్రీ రామానుజులకు ముందే దేశంలో అనేకానేక వేద ప్రమాణ సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. రామానుజులు యాదవ ప్రకాశుని వద్ద విద్యాభ్యాసం చేసే సమయంలో, యాదవుడు ఉపనిషద్వాక్యానికి అర్ధాన్ని చెప్పే సన్నివేశాన్ని చూడండి. ‘కప్యాసం పుండరీకమేవ మక్షిణీ’(1-6-7 ఛాందోగ్యోపనిషత్) ఈ వాక్యానికి యాదవుడు..శ్రీమన్నారాయణుని కనులు కోతి పృష్ఠ భాగాన్ని పోలి ఎర్రగా తామర రేకు వలె ఉన్నవి..అని అర్థాన్ని చెప్పేడు. ఇంతటి నీచోపమానాన్ని విన్న రామానుజులకు హృదయం ద్రవించి, కనుల వెంట నీరు ఉబికి గురువుపై బడింది. అందుకు గురువుగారు రామానుజా! ఎందుకు ఏడుస్తున్నావు? అని అడగగా రామానుజులు గురువర్యా! క్షమించండి. తమరు శ్రీమన్నారాయణుని నేత్రాలను నీచోపమానంతో చెప్పినందుకు బాధ కలిగింది అనగా యాదవుడు కోపగించుకుని ఇంతకంటే ఉన్నతంగా నీవు చెప్పగలిగిన చెప్పమనెను. దానికి రామానుజులు...కం=నీరు, పిబతి=త్రాగునది అనగా కం పిబతి=కపి=సూర్యుడు ఆస్యతే=వికసింపచేయబడునది, కప్యాసం=సూర్య కిరణములచేత వికసింపబడునది=పద్మము. శ్రీమన్నారాయణుడు వికసించిన పద్మము వంటి నేత్రములు కలవాడు అని ఉపనిషద్వాక్యమునకు చక్కటి అర్థాన్నిచ్చేరు. (రామానుజ జీవిత చరిత్ర-పే.6)
అంటే భగవానుని మనసా అవలోకించిన వారు నీచోపమానాలతో కాక, విశిష్టంగా అతన్ని సేవింపగలడు, విశిష్టమైన అర్థంతో వేదాన్ని అన్వయించే సామర్ధ్యమూ కలుగుతుంది. రామానుజులు ఏనాటినుండో ప్రవర్తిల్లుతూ వస్తున్న వేద ప్రామాణిక సిద్ధాంతాలను విశేషమైన అర్థాలతో భగవద్విషయిక గ్రంథాలలో ముఖ్యంగా శ్రీ్భష్య రచనలో విశ్వవ్యాప్తం చేసిన మహానుభావులు. ఆ విధంగా అద్వైతానికి ఒక విశిష్టతను కల్పించి, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు రామానుజులు. దీనికే రామానుజ సిద్ధాంతమనీ, శ్రీ సంప్రదాయమనీ దేశంలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
శ్రీఆచార్యులవారు తమ గ్రంథంలో శ్రీ రామానుజుల జీవిత విశేషాలను చాలా చక్కగా అభివర్ణించారు. ముఖ్యంగా గోష్ఠీపూర్ణుల వద్ద తిరుమంత్ర అర్థాన్ని ఉపదేశం పొందిన తరువాత, మంత్రం చాలా గోప్యమనీ, ఎవరికి పడితే వారికి చెప్పరాదని గురువు దగ్గర ప్రమాణం చేసినప్పటికీ, తాను ఒక్కడూ నరకానికి పోయినా ఈ మంత్రాన్ని విన్న జనమంతా సద్గతిని పొంది తరిస్తారనే లోకహితైక దృష్టితో రామానుజులు గోష్ఠీపుర దేవాలయ గోపురమెక్కి తిరుమంత్రార్థాన్ని అక్కడ చేరిన జనులందరికీ పంచిపెట్టినారు. ఇందులో రామానుజుల హృదయ వైశాల్యం, లోకహితాభిలాషను ఎరుకపరచడం చదువరులకు సామాజిక స్పృహను కలిగించేట్టు వుంది
రామానుజులు ఎలాగైతే మంత్ర రాజ మహాత్మ్యాన్ని వెదజల్లారో, శ్రీ ఆచార్యులవారు తిరుమంత్ర వైభవాన్ని సంక్షిప్తంగా ఈ గ్రంథమందు ఉటంకించడం చదువరులకు శ్రీసంప్రదాయాన్ని పరిచయం చేసేట్టుగా ఉంది
పంచసంస్కార ప్రసంగంలో 23వ పేజీలో పుండ్ర సంస్కారాన్ని తెలియజేస్తూ ద్వాదశోర్ధ్వపుండ్ర స్థానాలను తెలియజేసారు ఆచార్యులవారు. కానీ, అది విశిష్ఠాద్వైత సిద్ధాంతపరంగా లేదు. శ్రీవైష్ణవులు ఊర్ధ్వపుండ్రం ధరించేటప్పుడు ఆయా చోటుల నామాలను అనుసంధించు కుంటారు. (శ్రీవైష్ణవాహ్నికము - పుండ్రధారణ క్రమము -పే.71 శ్రీ ములుగు రామానుజాచార్య స్వామి, పూర్వ ప్రయోగానుక్రమణిక, ఊర్ధ్వపుండ్ర ధారణ విధానమ్, పే.352, శ్రీ కందాడై శ్రీనివాసాచార్య.)
శ్రీ రామానుజులు తిరుమలతో గల సంబంధం అచ్చటి కైంకర్య విశేషాలు, వారు ఏర్పరిచిన నియమాలు, శ్రీనివాసునికి శంఖ చక్రములను ధరింపచేసి ఆచార్యత్వమును పొందిన విశేషాలు ఉత్సవాల క్రమబద్ధీకరణ ఇత్యాది అంశాలన్నీ చాలా చక్కగా వివరించారు.
ఇక రామానుజుల జైత్రయాత్రలో దేశ పర్యాటనం చేస్తూ జగన్నాధం (పూరీ) శ్రీకూర్మం సింహాచలం రావటం ఇత్యాది విశేషాలతో సింహాచలంలో కృష్ణమాచార్యులతో భేటీ ప్రస్తావించారు. నిజానికి రామానుజుల కాలం వేరు, కృష్ణమాచార్యులవారి కాలం వేరు. రామానుజుల తరువాత రెండు శతాబ్దాలకు కృష్ణమాచార్యుల అవతరణం.(సింహగిరి నరహరి వచనములు’, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ, సంపాదకులు డా.ఎమ్.కులశేఖరరావు, ‘కృష్ణమయ్య-సంపాదకులు శ్రీ.తి.ప.శ్రీరామచంద్రాచార్య, సింహాచలం) బహశః ఆచార్యులవారు ఈ కథను ఆచార్య సూక్తి ముక్తావళినుండి స్వీకరించి ఉండవచ్చు. సర్వతంత్ర స్వతంత్రుడుగా సింహాచలేశునితో మంతనాలు సాగించే కృష్ణమాచార్యులను, ఆచార్య సమాశ్రయణం ద్వారానే మోక్షప్రాప్తి అనే నిరూపణ కోసం, రామానుజ సాంప్రదాయానికి ఊతమివ్వడం కోసమని, ఆచార్య సూక్తిముక్తావళీ గ్రంథ కర్త కేశవాచార్యులవారు ఈ ఉదంతాన్ని కల్పించి ఉండవచ్చు.
ధనుర్దాసు కథను చాలా విపులంగా ప్రస్తావించారు. పిలకా గణపతిశాస్ర్తీ గారి ‘విశాల నేత్రాల’ను గుర్తుకు తెచ్చేరు. కృష్ణశాస్ర్తీగారి ధనుర్దాసు రేడియో నాటిక కూడా గుర్తురాక మానదు. ధనుర్దాసునకు రంగనాథ సాక్షాత్కారాన్ని కలిగించే సందర్భంలో శాస్ర్తీగారి...‘ఏలా దాచితివిన్నినాళ్లు దయలేనే లేదటయ్యా..’ అనే పద్యం మనకే స్వామి సాక్షాత్కరించినట్టుంటుంది.
రామానుజుల ఢిల్లీ విజయం, తిరునారాయణ స్వామి ప్రతిష్ఠ, బీబీ నాంచారు కథలు మత సామరస్యాన్ని చాటేట్టుంటాయి. తిరునారాయణ స్వామి ప్రతిష్ఠ సందర్భంగా హరిజనులకు ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తారు రామానుజులు. వెయ్య సంవత్సరాలకు పూర్వమే రామానుజులు అట్టి అవకాశాన్ని వారికి కల్పించి సర్వ మానవ సౌభ్రాత్రానికి పునాదులు వేసారు.
చివరగా రామానుజ దర్శనంతో గ్రంథ పరిసమాపనం చేస్తూ, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజ దర్శనమనీ, ఇది ఆచార్యానుగ్రహం ద్వారానే భగవత్రాప్తికి సాధకమనీ నిరూపించారు. గ్రంథం మొత్తం ఆమూలాగ్రం చదువరులను చదివించే రీతిన, నవలా రూపంగా తీర్చిదిద్దడంలో శ్రీ ఆచార్యులు కృతకృత్యులయ్యారు. లోగడ ఎన్నో గ్రంథాలు రామానుజుల చరిత్రను తెలిపినప్పటికీ శ్రీ రాఘవాచార్యులు, ఇండియన్ ఎఫిమరీస్‌ను అనుసరించి ఇదమిత్ధంగా శ్రీ రామానుజుల అవతరణ దినము, పరమపద ప్రాప్తినొందిన రోజును తారీకులతో సహా నిరూపణ చేయడం విశేషం. ఈ గ్రంథం పరిశోధనాత్మక ప్రమాణంగా నిలుస్తుందనడంలో ఏ రకమైన సందేహం లేదు.

-ఎస్.టి.పి. వేణుగోపాలస్వామి