అక్షర

కృష్ణస్తు భగవాన్ స్వయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కృష్ణం వందే జగద్గురుం’
ధారా రామనాధ శాస్ర్తీ
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక
కేంద్రాలలో

భాగవత పఠనము, శ్రవణమూ వలన ముందు భక్తి అంకురిస్తుంది. ఇదివరకే భక్తి భావం ఉంటే అది మరింత అధికమై సుస్థిరవౌతుంది. స్థిర భక్తి పరిపక్వమై, జ్ఞానంగా పరిణమించి మోక్షప్రాప్తిని కలుగచేస్తుంది. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అన్న మూలసూత్రం మీదే శ్రీ భాగవత రచన జరిగింది.
ధారా రామనాధ శాస్ర్తీగారి మరో అద్భుత రచన ‘కృష్ణం వందే జగద్గురుం’ను చదివి అక్షరార్చనలు అందచేయగల మహదావకాశాన్ని నాకు ప్రసాదించాడు నా ఆరాధ్య దైవం శ్రీకృష్ణ పరమాత్మ. ‘ముత్యాలపంట’తో మొదలై ‘కృష్ణ గుణార్ణవం’ దాకా చదివింపచేసి ఉత్కంఠను నింపి అంతర్యామి సాక్ష్యాత్కారాన్ని పొందగల స్థితిని అందచేస్తుంది.
ప్రతి అంశము శ్రీకృష్ణ తత్వామృత బిందువే
ఒక్కొక్క అంశము శ్రీకృష్ణ లీలామృత ప్రసాదమే.
‘ముత్యాలపంట’ గోపికల దినచర్యతో మొదలవుతుంది. యమునా తీరంలో శ్రీకృష్ణుని ప్రియబాంధవి నీలాదేవితో కూడిన వ్రజవనితలు శ్రీకృష్ణ దర్శనంతో పరవశులవుతారు. శ్రీకృష్ణుడు వారిని చేరబిలచి వారిలో మిగిలి ఉన్న ప్రలోభాలను దూరం చేసే నేపథ్యంలో సర్వం తనేగా నిరూపణ చేస్తూ ప్రకృతీ పురుషుల ఐక్యతకు నిదర్శనమై ఏకత్వ తత్త్వాన్ని అనుభవింపచేస్తూ అద్వైత సిద్ధిని ప్రసాదిస్తూ నిరాకారానికి నిజ దర్పణంగా రచయిత మలిచిన తీరు ఎంతైనా ప్రశంసనీయం
కన్నయ్య అల్లరిని భరించలేక పెట్టెలో బంధించి యశోద దగ్గరకు తీసుకువెడుతుందొక వ్రజసుందరి. కన్నయ్య బదులు తన కుమారుడు చిన్నయ్య సాక్ష్యాత్కరిస్తాడా పెట్టెలో. తన సర్వాంతర్యామి తత్త్వంతో బాటుగా మధుర భక్తి భావాలను నిక్షిప్తం చేస్తాడు ఆమెలో. వ్రజసుందరిలో చమత్కారపూరితమైన నిజ తత్వ నిరూపణ కన్పిస్తుంది. శ్రీకృష్ణుని వేణుగానానికి జగత్తు పరవశం చెందుతుంది. వేణు గానం కేవలం అధికార యుతలైన గోపికలకు మాత్రమే వినిపిస్తుంది.సుద్ధ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది. శివయ్య తన భార్య సారమ్మను నిలదీస్తాడు. ‘నడిరేయి దాకా ఎక్కడ వుండి వస్తున్నావని’ వేధిస్తూనే ఉంటాడు. జగన్నాటక సూత్రధారి శివయ్యను శివమ్మగా మార్చి వేణుగానంతో ఆకర్షించి మధుర ప్రేమ తత్త్వానికి అర్థాన్ని తెలియజేస్తాడు. తిరిగి శివమ్మను శివయ్యను చేసి అర్ధనారీశ్వర తత్వానికి నిరూపణ గావిస్తాడు. అతి తేలికైన భాషలో ‘ముదురుగోపిక’లో ఐక్యతారాగాలను పండించారు రచయిత.
సర్వులలోనూ భగవంతుని చూడగలగాలనీ ఎవరిని తూలనాడినా, ఎవరికి బాధ కలిగించినా అది భగవదపచారమే అవుతుందనీ, నిస్వార్థంగా భగవంతుని ప్రేమించిన వారికి సకల శుభాలు కలుగుతాయని, శ్రీకృష్ణపరమైన దివ్య ప్రేమామృతాన్ని ‘పద్మాక్షీ-పసిడి కంకణం’ పుటల్లో అద్భుతంగా వర్షింపచేసారు రచయిత.
భీష్మునిగా ప్రసిద్ధి చెందిన దేవవ్రతుడు శ్రీకృష్ణ భక్తుడు. అతని త్యాగనిరతని మరింతగా లోకానికి తెలియజెయ్యాలని, ప్రతిజ్ఞను సడలించి, వివాహం చేసుకుని, సింహాసనం అధిష్ఠించమని ‘అంతర్యామి’గా వత్తిడిని పెంచుతునే ఉంటాడు. వారి ఆంతరంగిక సంభాషణా సారాంశాన్ని ‘్భష్మ రాజుపెళ్లి’ పేరిట రచయిత ప్రదర్శించిన సృజనాత్మకత అత్యంత అభినందనీయం.
భాగవతోత్మయుడైన అక్రూరుని జగన్నాటక సూత్రధారి ద్వారకకు ఆహ్వానిస్తాడు. ఆ తరుణంలో ద్వారకలో క్షామం సమసి పోయేలా చేసి, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సన్మాన సభను ఏర్పాటు చేసి అక్రూరుని ప్రశంసిస్తూనే, శమంతక మణిని అతను చేజిక్కించుకున్న వైనాన్ని బహిర్గతం చేసి అక్రూరుని హృదయ ప్రక్షాళన గావిస్తాడు. అతి కొ ద్దిమందికి మాత్రమే తెలిసిన భాగవత కథలోని ఉప కథ ఇది. ‘‘యమలోకంలో అక్రూరుడు’’’ పుటల్లో, స్వప్నంలోనే అక్రూరుడు యమధర్మరాజును సందర్శించడం, శమంతకమణి విషయంలో అతనిని మందలించడం, మందలింపునకు తలవొగ్గిన అక్రూరుడు పాశ్చాతప్తుడవడం-హృద్యంగా రచించి సజీవంగా కళ్లముందు ఆవిష్కరించారు రచయిత.
ఉదంతుడు తపస్వి. ఐతే అతనికి కృష్ణుడిపైన అకారణ ద్వేషం ఉంటుంది. తాపసులకు అది తగదని శ్రీకృష్ణుడే అతనిలో పరివర్తన తెచ్చి ‘నమే భక్తఃప్రణశ్యతి’ అంటూ-తనను శరణుజొచ్చి కైవల్యాన్ని కైవశం చేసుకునేలా అనుగ్రహిస్తాడు ‘చెమటలో అమృతం’ పుటల్లో-శ్రీకృష్ణ దారకుల సంభాషణ శైలి కూడా దృశ్య కావ్యంలా సాగిపోతుంది.
శ్రీకృష్ణుడు యమునా తటిలో విరజాదేవితో విహరిస్తున్న సమయంలో రాధాదేవి అక్కడకు జేరులోగా శ్రీకృష్ణ సఖుడు శ్రీదాముడు అడ్డగించి ఆమె శాపానికి గురవుతాడు. అలాగే విరజాదేవి శాపగ్రస్థయై నదీ రూపం పొంది, విరహార్తితో విరజగా తిరిగి శ్రీకృష్ణ సన్నిధిని చేరుకుంటుంది. అద్వైత సిద్ధిని పొందుతుంది. అత్యున్నత ఆధ్యాత్మికతకు నిదర్శనం ‘రాధకు సవితి పోరు’. ఆసక్తిదాయకంగా మలిచారు రచయిత ‘శతాంశురమృతార్పణమ్’ అంశ కుబ్జకు సంబంధించినది. పంచవటీ తీరంలో శ్రీరాముని మోహించిన శూర్పణఖ లక్ష్మణుని కోపానికి గురవుతుంది. అవమానాగ్రహంతో రావణ సోదరి రాముని పొందుకోసం శివునికై ఘోర తపస్సు చేసి ద్వాపరంలో తన కోరిక తీరేలా వరం పొందుతుంది. కుబ్జగా జన్మించి శ్రీకృష్ణుని స్పర్శతో జగన్మోహినిగా మారి ఉహ్లాకుని పుత్రుడిగా పొంది శ్రీకృష్ణునిలో ఐక్యమైపోతుంది. శ్రీకృష్ణుడు రసస్వరూపుడు. కుబ్జతో మాత్రమే కాదు, రాధా సమేత వ్రజ భామలందరితోడి కలయికా పాంచ భౌతిక శరీర సంబంధమైనది కాదు. ఇది ఆత్మాపరమాత్మల కలయిక. ప్రేమకు త్యాగాపేక్ష ఉంటుంది. మోహానికి భాగాపేక్ష మాత్రమే ఉంటుంది. వియోగం ద్వారా విశిష్ట యోగాన్ని సొంతం చేసి కామాన్ని దగ్ధం చేసి పునీతులను చేస్తాడు కృష్ణ భగవానుడు. రాసలీలా మర్మాన్ని చక్కగా విశే్లషించారు రచయిత.
శివుడు సదా శ్రీకృష్ణుని ధ్యానం లో ఉంటాడు. శ్రీకృష్ణుడు సర్వదా శివధ్యానం లోనే ఉంటాడు. శివకేశవుల ఐక్యతానురాగమే, ఐక్య స్వరానురాగమే, అన్యోన్య రాగాంతరంగమే ‘శివాయ విష్ణురూపాయ’ అంటూ ధారా వారి కలంలో పరవళ్లు తొక్కి అక్షరాకృతి దాల్చింది. ఈ అంశంలో కురుక్షేత్ర మహా సంగ్రామానికి సంబంధించిన అంశాలెన్నో చోటుచేసుకున్నాయి. శివ కేశవుల సంభాషణీయాన్ని రచయిత పరమ రమణీయంగా ఆవిష్కృతం చేసారు.
చివరగా శ్రీకృష్ణ తత్వామృత సాగరంలోని తరంగాలకు వివిధ నామాలనాపాదిస్తూ భాగవత కథాంశాలలోని వివిధ సన్నివేశాలను ఆవిష్కరిస్తూ పాఠకులను ఆకట్టుకునే విధంగా ‘శ్రీకృష్ణ గుణార్ణవ’ రచనా ప్రయోగం నభూతో నభవిష్యతి. శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టంతో ముగిస్తూ- ‘ఏవంవిధ సద్గుణ గణనం నక్షత్రాలను లెక్కించడం వంటిది. సాగర తరంగాలను గణించడం వంటిది. అనంత కాలగమనంలో లిప్తలను కూడిక చేయడం వంటిది. అనంత గుణ ప్రపూర్ణుడై ‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని స్తుతింపబడిన శ్రీకృష్ణ గుణామృత తరంగాలు మాత్రమే’’ అంటూ స్వస్తి పలికారు రచయిత.
ధారావారు శ్రీకృష్ణ్భక్తులు. కనుక ఈ గ్రంథం ద్వారా కృష్ణదర్శనం చేయించారు. అధ్యాపకులు కనుక చదువరులకు అర్ధమయ్యే భాషలో కృష్ణతత్వాన్ని బోధించారు. కళాకారులు కనుక పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ప్రతి దృశ్యానికీ, ప్రాణ ప్రతిష్ఠ చేసారు. నాట్యావధాన కళా ద్రష్ట కనుక అక్షరాక్షరాన, హావభావాలను నిక్షిప్తం చేస్తూ అంతర్యామిని దర్శింపచేసారు. బహుగ్రంథ కర్తా, సాహితీవేత్తలు కనుక శ్రీకృష్ణుని గ్రంథ పుటలలోను మనో వీధులలలోను ఆవిష్కృతుని చేసారు.
ఈ గ్రంథంలో ధర్మ సూక్ష్మాలెన్నో ఉన్నాయి. సర్వులకు అవగతమయ్యేలా భాగవతాన్ని ఆవిష్కరించడం సామాన్యం కాదు.
శ్రీకృష్ణునికి ఒకసారి నమస్కరిస్తే చాలు పది అశ్వమేథ యాగాలు జరిపి అవభృధధ స్నానం చేయడంతో సమానం. పది అశ్వమేధ యాగాలు చేసిన వాడు మళ్లీ భూమిమీద జన్మించడం జరుగుతుంది. కాని శ్రీకృష్ణునికి నమస్కరించిన వారికి మాత్రం పునర్జన్మ ఉండదన్నది భీష్మ ఉవాచ. ఆధ్యాత్మికత అంతరిస్తున్న తరుణంలో ‘కృష్ణం వందే జగద్గురుం’ అందించిన ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ ధారా రామనాధ శాస్ర్తీగారు ఎంతైనా అభినందనీయులు.

-డా.కె.వి.కృష్ణకుమారి