అక్షర

వచన కవితారూపంలో భాషా పరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలంగాణ మాండలిక కవిత్వం’
(సిద్ధాంత గ్రంథం)
ఎ.పరమాత్మ; వరలక్ష్మీ పబ్లికేషన్స్,
హైదరాబాద్-74
వెల:రు.80/-
పేజీలు: 143,
ప్రతులకు: 9848254745

ఒక కాలంలో ఒక భాషకు చెందిన ప్రజలందరు ఒకే విధంగా మాట్లాడరు. ఈ భాషా వ్యవహారం ప్రాంతాన్ని బట్టి కుల, వృత్తి, వర్గాన్ని బట్టి సాంఘిక, సాంస్కృతిక స్థారుూ భేదాలను బట్టి ఆయా వ్యక్తుల అభిభాషణల్లో భేదాలుంటాయి. అంటే ప్రజా వ్యవహారంలోని ఒకే భాషలోని పదాలు, వాక్యాలూ వాటి ఉచ్ఛారణ భేదాలతోపాటు అర్ధాలలోనూ, పత్యయాలలోను భిన్నత కనిపిస్తూ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకానికి చెందిన భాషలుగా భ్రమింపజేస్తాయి. ఒకే భాషకు వున్న ఇటువంటి రకాలన్నీ ఆయా మండలాలకు, ప్రాంతాలకు చెందిన ‘మాండలికాలు’గా గుర్తిస్తున్నాము.
ఏ భాషా మాండలికాలైనా ఒక దానితో మరొకటి కలుస్తున్న సరిహద్దుల్లోనే కాక అన్యభాషా ప్రాంతాల పొలిమేరల్లో కలిసేచోట పరస్పర ప్రభావం తప్పకుండా వుంటుంది. ఇవేకాక తెలుగువారి వలసల కారణంగా ఏర్పడ్డ మాండలికాలు ఎన్నో వున్నాయి.
తిరువనంతపురం, రాజపాలియం, సేలం, కోయంబత్తూర్, కోలార్, మైసూర్ మున్నగు ప్రాంతాల్లోని తెలుగువారు ఇండ్లలో మాట్లాడు భాష తెలుగు మాండలికమే. ఇక తెలుగు దేశానికి సంబంధించినంతవరకు శ్రీకాకుళం, విశాఖ మండల సరిహద్దులలో ఒరియా భాషా పదాలు తెలుగులో తత్సమ, తద్భవాలుగా కనిపిస్తాయి. తెలంగాణ పశ్చిమోత్తర జిల్లాలైన అదిలాబాదు, నిజామాబాదు సరిహద్దులలో మరాఠీ పదాలు- అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్ సరిహద్దులలో కన్నడ భాషల యొక్క ప్రభావం గోచరిస్తుంది. చిత్తూరు, నెల్ల్లూరు మండల దక్షిణపు సరిహద్దులలో తమిళ ప్రభావంవల్ల చేరిన కొన్ని పదాలు కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతంలోని భాషలో అన్యభాషా పదాలు కనిపించడం సహజమే. ఇది ప్రతి భాషకుతప్పనిసరి. ఇవే సరిహద్దు మాండలికాలు.
తెలుగు దేశంలోని అంతర్గత భాషా విషయానికొస్తే తెలంగాణ ప్రాంతం చాలాకాలం ముస్లింల పాలనలో వుండడంవలన హిందూస్తానీ పదాలు (హిందీ, పర్షియన్, అరబిక్, ఉర్దూ) తెలుగు మాటలను త్రోసిపుచ్చి వాటి స్థానంలో తత్సమ, తద్భవాలుగా వాడుకకెక్కాయి. అలాగే ఆంగ్లేయుల ప్రభావం మన కోస్తా, రాయలసీమ ఆంగ్ల పదాల వాడకం ఎక్కువ. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు వ్యవసాయ వృత్తి పదశోధన ఆధారంగా ఆంధ్ర దేశాన్ని కళింగ మాండలికం, కోస్తా మాండలికం, రాయలసీమ మాండలికం, తెలంగాణ మాండలికం అంటూ నాలుగు మండలాలుగా విభజించారు. తెలంగాణ ప్రాంత వాడుక భాషలోని ఉచ్ఛారణ వైవిధ్యం, పదాలు వాటి అర్ధాలు, వివిధ జిల్లాల్లో వాటి విస్తృతి ఆధారంగా భద్రిరాజు కృష్ణమూర్తిగారు భాషా మండలాల విభజనలో ఈ ప్రాంతాన్నంతటిని ‘ఉత్తర మండలం’ గా గుర్తించారు. ఉత్తర మండలంగా పిలువబడుతున్న ఈ తెలంగాణ ప్రాంతీయ మాండలికంలో కూడ భిన్న ప్రదేశాల్లో భిన్న వాడుక రూపాలు కనిపిస్తాయి. ఈ మార్పులవల్ల ప్రాంతీయ మాండలికానికి లోబడ్డ అనేక స్థానిక మాండలికాలు కూడా వుంటాయని తెలుస్తుంది. భాషా సమిష్టిలో స్థల, కుల, వృత్తి భేదాలనుబట్టి వైవిధ్యం వున్నట్లే పోలికలు వుంటాయి. ఈ పోలికలే భాషా సామాన్య లక్షణాలను స్పష్టీకరిస్తాయి.
ఒక ప్రాంత జనం ఊపిరిని ఆ ఉచ్ఛారణ విధేయంగానే అక్షరబద్ధం చేసిన కథ, కవిత్వం, నవల, నాటకం, పాట, వ్యాసం ఏదైనా మాండలికం సాహిత్య ప్రక్రియ అనిపించుకుంటుంది. పాత్రోచిత మాండలికం కాకుండా పూర్తి మాండలికంలోనున్న ప్రక్రియ ఏదైనా మాండలిక సాహిత్యంగా గుర్తించబడుతుంది. శాసనాలు, కావ్యాల్లోను అక్కడక్కడ కొన్ని మాండలిక పదాలు చోటుచేసుకున్నాయని తెలిపిన పరిశోధకుడు నాటకంలో గురజాడ, కథల్లో మా గోఖలే, నవలల్లో పోరంకి దక్షిణామూర్తి మాండలికాలకు ఆద్యులని తెలపడంతోపాటు నూరేళ్ళ కాలంలో వచ్చిన మాండలిక సాహిత్య వికాసాన్ని వివరంగా తెలియజేశారు.
వచన కవితారూపంలో భాషాపరమైన పరిణామం ఇంకా వికాసవంతమై అట్టడుగు జనాన్ని చేరాలనే దృక్పథంతో ప్రాంతీయ మాండలికాన్ని కవిత్వంలో ప్రయోగించటం జరిగింది. లయాన్వితమైన ప్రజాపోరాట పాటల్లో జనం ఉచ్ఛారణ విధేయమైన మాండలిక భాష అద్భుతంగా అమరింది. ఇదే విధానాన్ని వచన కవిత్వంలో ప్రవేశపెట్టాలని చేసిన ప్రయోగమే ‘మాండలిక కవిత్వం’. తెలుగులో మాండలిక కవిత్వానికి ఆద్యులు రంధి సోమరాజు. వీరి తర్వాత తెలంగాణలో విస్తృతంగా మాండలిక కవిత్వం రాసిన దేవరాజు మహారాజు ఆ కవిత్వంతో 1974లో ‘గుడిసె గుండె’ పేరుతో సంపుటం వెలువరించారు. పంచరెడ్డి లక్ష్మణ ‘‘ఇసిత్రం’ 1973లో, తెలిదేవర భానుమూర్తి ‘‘ఊరోల్లు’’ 1983లో, టి.కృష్ణమూర్తి యాదవ్ ‘తొక్కుడుబండ’ 1988లో తమ మాండలిక కవితా సంకలనాలను వెలువరించారు. పరిశోధకుడు ఈ తెలంగాణ మాండలిక కవితా సంపుటాలను పరిచయం చేస్తూ, వాటిలోని వస్తువైవిధ్యాన్ని, పద చిత్రాలను వివరంగా తెలియజేస్తూ ఆయా సంపుటాల గొప్పదనాన్ని వివరించారు. వీరు కాకుండా తెలంగాణ మాండలికంలో కవిత్వం రాసిన వాళ్ళు పదిహేను మందికి పైగా వున్నారని తెలియజేస్తున్నారు.
తెలంగాణలోని జమీందార్లు, భూస్వాములు ప్రజల మీద సాగించిన దోపిడి, దౌర్జన్యాలు, వెట్టి బానిసత్వానికి తెలంగాణ మాండలిక కవిత్వం అక్షర రూపమయింది. దేశంలోని ఆకలి చావులు, దారిద్య్రం, ఆర్థిక దివాళాకోరుతనం, రాజకీయ నాయకుల కపట వేషాలు, రూపుల్ని తలపించే వాగ్దానాలు, స్వాతంత్య్రం పేరుతో జనాల్ని అణచివేస్తున్న తీరును సూటిగా ప్రశ్నిస్తుంది. వర్గ దృక్పథంతో అధోజగత్ సహోదరుల తిరుగుబాటు కేతనమై రేపటి ఉషోదయం కోసం స్పందననిస్తుంది. జనం మూఢ నమ్మకాల వెన్ను చరిచి, యువతరం బాధ్యతల్ని గుర్తుచేస్తూ ఆశావహంగా ముందుకు నడిపిస్తుంది. విస్తృతమైన వస్తువైవిధ్యం, కవితాశిల్పం, అద్భుతమైన పద చిత్రాలతో కవిత్వమంతా అందరినీ ఆకట్టుకుంటుంది.
ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన మాండలిక సాహిత్య ప్రయోజనం పరిమితమైనదే అయినప్పటికీ ఆ ప్రాంతం జన జీవితంలోని సంస్కృతి, సమస్యలు వాళ్ళ భాషలోనే రచించటంవల్ల ఆ రచయితల నిజాయితీతోపాటు ఇతర ప్రాంతాల వారికి ఆ భాషలోని పదాలు, పద బంధాలు, అర్థబేదాలు, ఉచ్ఛారణ వైవిధ్యం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవ్వాళ విభిన్న ప్రాంతాల మాండలికాలు వివిధ రూపాల్లో కనిపిస్తూనే వున్నాయి. రేడియో, టీవిల్లో వస్తున్న కార్యక్రమాల్లోను, సినిమాల్లోను, ప్రాంతీయ దినపత్రికల్లోనూ మాండలికం విస్తృతంగా వస్తూనే వుంది. కొంతకాలం తర్వాత అన్ని ప్రాంతాల మాండలికం అందరి పరిచయంలోకి వచ్చి మాండలికం అవసరమా? అనవసరమా అనే వివాదం సమసిపోతుంది. అప్పుడు తెలుగు భాష మరింత సుసంపన్నమవుతుందని ఆశిద్దాం. మంచి పరిశోధనాంశాన్ని ఎన్నుకున్న ఏ.పరమాత్మ తెలుగులో వచ్చిన మాండలిక సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు. అలభ్యంగా వున్న మాండలిక కవితా సంపుటాలను, విడివిడిగా వున్న మాండలిక కవిత్వాన్ని వెలికితీసి విశే్లషించడంలో ఆయన చేసిన కృషి, పట్టుదల ప్రశంసనీయం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి వెలువడిన ఈ సిద్ధాంత గ్రంథానికి ఆచార్య యం.కులశేఖరరావు పర్యవేక్షకుడిగా వ్యవహరించారు.
......................................................................................................................
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-కె.పి.అశోక్‌కుమార్