అక్షర

సురవౌళి కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్
పేజీలు: 172,
వెల: రూ.100/-
ప్రతులకు: కవిలె,
హైదరాబాద్ 9849220321
**
సురవౌళి అనగానే పాత తరం రేడియో ప్రియులకు ‘ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జి.సురవౌళి’ అనే గొంతు జ్ఞాపకాల పొరల్లో పెగులుతుంది. సోషలిస్టు పంథాను ఇష్టపడ్డ వాళ్లకు ఆయన అనువాదం చేసిన రామ్‌మనోహర్ లోహియా ఆలోచనా పుస్తకాలు గుర్తుకొస్తాయి. హేతువాదం, కుల నిర్మూలన అనుకూలురకు ఆయన నిర్మొహమాట వాదనలు, నిర్వహించిన నాస్తిక సమావేశాలు, కులాంతర వివాహాలు మదిలో మెదులుతాయి. ఆనాటి పాత్రికేయ మిత్రులకు ఆంధ్రభూమి, ఆంధ్ర జనత పత్రికలలో సంపాదక స్థాయిలో సురవౌళి వృత్త్ధిర్మం యాదికొస్తుంది.
అలా సురవౌళి వివిధ అంశాలపై తన ఆలోచనాసరళికి దన్నుగా కథలు కూడా రాశారు. అందులో అత్యధికం 1958కి ముందు రాసినవే. 1962-63 తిరిగి 1970లో కొన్ని రాశారు. ఈ కథలు ఆనాటి ఆంధ్రపత్రిక, ఆంధ్ర జనత, తెలుగు స్వతంత్ర, పొలికేక పత్రికల్లో అచ్చయ్యాయి.
హేతువాదం, కుల నిర్మూలన పట్ల బలమైన విశ్వాసం కలిగిన సురవౌళి తన భావజాలాన్ని విస్తృతపరిచేందుకే కథలను ఆశ్రయించారు. తన ఆలోచనలకు సమాజంనుండి ఎదురైన ప్రతికూలతను ఎండగట్టే క్రమంలో కథను ఆయుధంగా మలుచుకున్నారు.
ఎప్పుడో అరవై ఏళ్లక్రితం రాసిన కథల గురించి ఇప్పుడు నాలుగు మాటలు చెప్పుకోవడానికి, సురవౌళిని స్మరించుకోవడానికి దోహదపడే ఏకైక ఆధారం ‘సురవౌళి కథలు’ అనే ఈ కథల సంపుటి. ఆనాటి కథల సేకరణ అంటే కాలచక్రాన్ని వెనక్కి తిప్పినంత శ్రమ. ఎందరినో తట్టి, గ్రంథాలయాలు వెదికి, ఎన్నో పుస్తకాలను దులుపుతే గాని సాధ్యంకాని పని ఇది. ఏళ్లతరబడి ఎంతో శ్రమకోర్చి ‘సురవౌళి కథలు’ సేకరించిన సంగిశెట్టి శ్రీనివాస్ కృషి ఎంతో అభినందనీయం.
సురవౌళికి సంబంధించిన విలువైన వ్యాఖ్యానాలతో, సమాచార వివరాలతో పుస్తకాన్ని సమగ్రం తీర్చిదిద్దిన తీరు ప్రశంసనీయం.
‘నా వౌళి- సురవౌళి’అంటూ సురవౌళి భార్య సక్కుబాయిగారు రాసిన నాలుగు వాక్యాలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ‘జంగందేవుడు లాంటి వాన్ని, బిక్షమెత్తుకొని బతికేవాన్ని, ఆస్తిలేని వాన్ని, ఇల్లువాకిలి లేని వాన్ని, పెళ్లిచేసుకుని పిల్లలను కని వాళ్లను ఎట్లా పెంచాలి’అని పెళ్లి ప్రతిపాదన వచ్చినపుడు సురవౌళి ఆమెతో అన్నమాటలు ఆయన స్వచ్ఛమైన మనసును కనబరుస్తాయి.
సాహితీ విశే్లషకుడు, రచయిత అయిన ఎ.కె.ప్రభాకర్ పరిచయ వాక్యాలు ఈ పుస్తకానికి వనె్నతెచ్చాయి. ‘విస్తృత కథకుడి యాదిలో’ అంటూ ఆయన 1989-90లో సురవౌళిని స్వయంగా కలిసిన అనుభవాల్ని పరిశోధక కోణంలో విశే్లషించారు. సురవౌళితో నెరిపిన సుదీర్ఘచర్చలో వచ్చిన ఎన్నో అంశాలను ఆయన మాటల్లో ప్రస్తావించారు.
‘సాహసి సురవౌళి’అని సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన ముందుమాటలో సురవౌళి జీవితం- సాహిత్యంపై వివరణాత్మక వ్యాఖ్యానం ఉంది. చరిత్ర, సాహిత్య పరిశోధకులు అయిన సంగిశెట్టి తెలంగాణ సాంస్కృతిక వారసత్వ నేపథ్యంలో సురవౌళి కథాసాహిత్య ప్రాధాన్యతను లోతైన అవగాహనతో వివరించారు. ఇందులోని ఒక్కొక్క కథను విశే్లషిస్తూ వాటికి సురవౌళి సామాజిక జీవితానికి ఉన్న లంకెను విస్పష్టం చేశారు.
సురవౌళి రాసిన కథల సంఖ్య ఇతమిత్తంగా తెలియకపోయినా లభించిన 16 కథలతో ఈ సంపుటి వెలువడింది. సురవౌళి ఆలంఆర్ వేదికపై చదివిన ‘ఒట్టు’, తన మొదటి కథగా చెప్పుకొన్న ‘నిరుద్యోగం’ ఇంకా అలభ్యాలే. పాములపర్తి సదాశివరావు సంపాదకత్వంలో ఆనాడు వెలువడిన ‘కాకతీయ’ పత్రికలో సురవౌళి కథలు వచ్చాయి. ఆ పత్రిక ప్రతులు అందుబాటులో లేకపోవడంవల్ల సురవౌళితోపాటు ఎందరో తెలంగాణ తొలితరం కథకుల సాహిత్యం వెలుగు చూడలేకపోయింది.
ఈ సంపుటిలోని మొత్తం 16 కథల్లో మొదటి కథ రక్తపూజ 1953లో రాసింది. చివరి కథ ఏంజెయ్యాలె 12 జూన్ 1970 పొలికేకలో అచ్చయింది. ప్రతి కథకూ ఒక సందర్భమూ, సామాజిక ప్రయోజనమూ ఉంది.
తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో ‘రక్తపూజ’ సాగుతుంది. ‘అంగురయి పొద్దు’ ఆలంపూర్‌లోని సారస్వత పరిషత్ సమావేశ సన్నివేశాలతో నడుస్తుంది. సభలకు వెళ్లిన ఓ పెద్దమనిషి అదే వూరి కూలీని సభలో చూసీచూడనట్లు ప్రవర్తించడం ఇందులోని కథాంశం.
పల్నాటిసీమలో ప్రాచుర్యమున్న ఓ వీరనారి జానపద గాథను ‘వీర రాజమ్మ’ కథగా మలిచారు సురవౌళి. రచనల్లో చూపిన ఔదార్యం ఆచరణలో చూపడానికి వెనుకాడే గుణాన్ని ‘రచయిత’లో నిలదీశారు. రాజకీయంగా తనతో విబేధించిన మిత్రునితో సంవాదం ‘స్వాతి చినుకుల్లో’ చూడవచ్చు.
‘తమసోమా జ్యోతిర్గమయ’ హాస్పిటల్‌లో అనారోగ్య మిత్రునికి తోడుగా ఉండే కథాంశం. అయితే నర్సుల జీవితాన్ని, వారి సేవ గుణాన్ని మానవీయ కోణంలో కథ ఆవిష్కరిస్తుంది. ‘కలిసి బతుకుదాం’ కథంతా సహకార సంఘాల ఆవశ్యకత చుట్టూ తిరుగుతుంది.
‘వలయం’ కథలో సీతారామారావు పాత్రలో సురవౌళి వ్యక్తిత్వ నీడ కనబడుతుంది. ‘తొలిచావు’ దళితుల పక్షాన నిలబడే కథ.
ఆంధ్రప్రదేశ్ అవతరణానంతరం సురవౌళి రాసిన ‘ముక్కోటి బలగకమోయి...’ కథ తెలుగు స్వతంత్ర 14.12.56 సంచికలో వచ్చింది. ఆంధ్ర ప్రాంతంలోని ఉద్యోగులు హైదరాబాద్‌కు బదిలీపై వచ్చినపుడు వారి వ్యవహార శైలిని, స్వభావాన్ని తెలంగాణావాసులు ఎదుర్కొన్న తీరు ఈ కథలోని వస్తువు.
డెన్మార్క్‌లో పుట్టి దేశదేశాలు తిరుగుకుంటూ ఓ పల్లెలో ఆగిపోయిన కోరట్‌సాబు కథ ఇప్పసారా. అనుకోకుండా ఇప్పసారాకు, ఆ గ్రామ ప్రజలతీరుకు ఆకర్షితుడైన కోరటుసాబు జీవితం అక్కడే ముగుస్తుంది.
సురవౌళి కథల్లోని అంశాలన్నీ జీవితాల్లోంచి తీసుకున్నవే. పాత్రల నడక సమాజానికి దగ్గరగా సహజంగా ఉంటుంది. కథారచనలో శైలి గురించి, వాడాల్సిన భాష గురించి రచయితకు సంపూర్ణ సాధికారిత ఉంది అనడానికి ఈ కథలే సాక్ష్యం.
తాను విశ్వసించిన దృక్పథాలను రాతల్లోచెబుతూ కడదాకా చేతల్లో సైతం చూపిన ఆచరణశీలి రచయిత సురవౌళి. ఈ కథలను సేకరించి పుస్తక రూపమిచ్చిన ‘కవిలె’ తెలంగాణ రిసెర్చ్ అండ్ రెఫరల్ సెంటర్, హైదరాబాద్ కృషి నిలిచి ఉంటుంది.

-బి.నర్సన్