అక్షర

చలసాని లేఖల సన్నిధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలసాని ప్రసాద్ లేఖలు
(సన్నిధానం
నరసింహశర్మకు రాసినవి)
సంపాదకుడు: మలసాని
శ్రీనివాస్
స్పృహ సాహితీ సంస్థ
హైదరాబాద్.
*
ప్రసిద్ధి చెందిన ఇద్దరు చలసాని ప్రసాదులతో 15 ఏళ్ల క్రితం వరకూ ప్రగతిశీల సాహిత్య శిబిరంలో కొంత కన్ఫ్యూజన్ ఉండేది. ఇద్దరూ కృష్ణాజిల్లా దివి తాలూకా, కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం బలంగా గల భట్లపెనుమర్రు గ్రామానికి చెందినవారే గానీ ఒకరు ప్రసాదరావు, మరొకరు ప్రసాద్. ఒకరిని ‘కబుర్లు’ (ఈనాడులో రాసేవారు) ప్రసాదరావు అనీ, మరొకర్ని విశాఖ ప్రసాద్ లేక విరసం ప్రసాద్ అనీ స్పష్టం చేసుకునేవారు. విరసం ప్రసాద్ బాల్యంలోనే వారి తండ్రి (బసవయ్య) కుటుంబం చల్లపల్లికి దగ్గరగా, కృష్ణానది ఒడ్డున వుండే నాదెండ్లవారి పాలెంకు వెళ్లిపోయిన కారణంగా ఈయన హైస్కూలు చదువు చల్లపల్లిలో జరిగింది. నేను ఖమ్మంలో జరిగిన మొదటి విరసం సభలకు హాజరయ్యే నాటికి ఆయన ముగ్గురు మేనల్లుళ్ల స్నేహితుడిని మాత్రమే. 1971లో నేను దివి తాలూకా వెళ్లిన తర్వాత నుండి ఆయన తల్లిదండ్రులతో సహా పరిచయమున్న కుటుంబ స్నేహితుడిని. అంతకు మించి, భిన్నాభిప్రాయాలతో వున్నా, మేము విప్లవోద్యమ సహచరులమి.
‘అన్నిసార్లు మద్రాసు చుట్టూ, ఆ శ్రీశ్రీగాడి చుట్టూ తిరుగుతాడు. ఒక్కసారన్నా ఇంటికొచ్చి మమ్మల్ని చూసిపోగూడదంట్రా. ఈడుగానీ ఆ శ్రీశ్రీగాడికి మూడో పెళ్లామా ఏందిరా?’ విరసం ప్రసాద్ గురించి తండ్రి బసవయ్యగారు అంటుండే మాట ఇది. తన తమ్ముడినీ, కొడుకునీ, అల్లుడినీ కమ్యూనిస్టు ఉద్యమం కోసం త్యాగం చేసిన కుటుంబంగా జిల్లాలోనే బసవయ్య గారిని ఎరగని వారు లేరంటే ఆశ్చర్యంలేదు.
అవును. విరసం ప్రసాద్ ఎప్పుడు కలిసినా హడావిడి, ఉరుకులు - పరుగులు. కాలం తన కంటే ఎక్కడ ముందుకు పరిగెట్టి అందకుండా పోతుందేమోనన్నట్టు ఉండేవాడు. ఆయన కలివిడితనానికి వయసు అడ్డంకి ఎప్పుడూ కాదు. తన సాహిత్య బోధన కోసం ఎవరినైనా ఆప్యాయంగా పలకరించేవాడు. అక్కున చేర్చుకునేవాడు. మినహాయింపులు లేకుండా ‘ఉడత’ సాయాన్నయినా పొందేవాడు. ఎంత మారుమూలనున్న గ్రంథాలయాన్ని అయినా వొడిసి పట్టుకునేవాడు. అలాంటిది రాజమండ్రిలోని ప్రసిద్ధ గౌతమి గ్రంథాలయాన్ని విడిచిపెడతాడా? ఆ గ్రంథాలయాధికారిని కూడా తన ‘సన్నిధానం’లోకి తెచ్చుకున్నాడు. ఉత్తరాల మీద ఉత్తరాలు రాశాడు. కుటుంబ స్నేహితుడిని చేసేసుకున్నాడు.
శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ సమగ్ర రచనల ప్రచురణకు ఆ రచనల సేకరణ బాధ్యత, బరువు మోసినది చలసాని ప్రసాద్. రావిశాస్ర్తీ రచనలను అన్నీ కలిపి తొలిగా ప్రచురించిన ‘మనసు’ ఫౌండేషన్ వారికి చలసాని అందించిన సహకారం మనం ఊహించుకోవచ్చు.
నేను 1968లో రాజమండ్రి పేపర్ మిల్లులో పని చేసిన రోజులలో మొదటిసారి గౌతమి గ్రంథాలయానికి వెళ్లాను కానీ అప్పటికి సన్నిధానం నరసింహశర్మ అందులో ఉన్నారో లేదో నాకు తెలియదు. 1983లో జనసాహితి 4వ రాష్ట్ర మహాసభలు రాజమండ్రిలో నిర్వహించినపుడు నెలరోజులు పైగా ఏకబిగిన ఉన్నాం. అప్పటి నుంచీ పరిచయం. అరుదైన గ్రంథాలయ అధికారి కాదు - పూజారి ఆయన. ఈ పుస్తకం ముందు మాటలో సతీష్ చందర్ చెప్పినట్టు ‘ఎంత గొప్ప గ్రంథాలయాధికారి అయినా ఏ పుస్తకం ఎక్కడ ఉందో మాత్రమే చెప్పగలరు. కానీ ఏ పుస్తకంలో ఏముందో మాత్రం చెప్పలేరు. కానీ శర్మగారలా కాదు. నాలుగు గోడల మధ్య వుండే షెల్ఫుల వివరాల మీదనే కాదు రెండు అట్టల లోపలి విషయాలపైనా ‘పట్టు’ ఎక్కువ’.
చలసానికి శ్రీశ్రీ, కొ.కు.ల రచనలే కాదు. ఎం.ఎన్.రాయ్ మీద ఎం.సి. (మానికొండ చలపతిరావు) రాసినదీ, కొత్తపల్లి వీరభద్రరావు అలాగే మధునాపంతుల వారి రెండు భాగాలు.. కావాలి.. కావాలి.. అంతే. అది దొరికేదాకా ఉత్తరాల రూపంలో వెంటపడుతూనే ఉంటాడు. ఆ చిట్టాకూ, ఉత్తరాలకు లేక తదనంతర కాలపు ఫోన్లకు ముగింపు వుండదు. అలా చలసాని రాయగా, సన్నిధానం మిగుల్చుకున్న ఉత్తరాలు ఇరవై మూడింటిని మలసాని శ్రీనివాస్ సంపాదకుడుగా స్పృహ సాహితీ సంస్థ, హైదరాబాద్ వారు ప్రచురించిన పుస్తకమే చలసాని ప్రసాద్ లేఖలు. ఇందులో మొదటి ఉత్తరం 1987 నాటిదయితే చివరిది 2009ది. 18 సంవత్సరాల కాలంలో రాసిన 23 ఉత్తరాలివి. వాటిల్లో బెంగుళూరు, భాగ్యనగరంల నుండి రాసినవి కూడా ఉన్నాయి. నిజానికి ఇంతకంటే ఎక్కువే రాసి ఉంటాడు కానీ, సన్నిధానం మిగుల్చుకున్నవి ఇవీ. ఈ పుస్తకానికి సంపాదకుని ముందు మాట, సన్నిధానంవి రెండు ముందు మాటలు కాక మరో ముగ్గురు ప్రముఖుల (జయధీర్ తిరుమలరావు, కాకరాల, సతీష్‌చందర్) ముందు మాటలు కూడా ఉన్నాయి. జయధీర్ ముందు మాట అచ్చులో 11 పేజీలు, కాకరాలది 13 పేజీలు, సతీష్‌చందర్‌ది ఏడు పేజీలు ఉన్నాయి. చలసాని రాసిన ఉత్తరాలు ఫొటోస్టాటీవి కనుక 48 పేజీలు వచ్చింది. అవి అచ్చువేయిస్తే నాలుగో వంతు కూడా ఉండకపోవచ్చు.
‘దారినిపోయే పామును కూడా పోనివ్వడు’ అని మనకొక సామెత ఉంది. అంటే పగవానికి కూడా పని అప్పజెప్పే లక్షణమన్నమాట. అలా తన పరిశోధనకు (అదేం వ్యక్తిగతం కాదు సామాజిక సాహిత్య సేవే) ఎలాంటి వారి సహకారాన్నైనా రాబట్టటం చలసాని వ్యవహార శైలి. ఇక నిబద్ధుడైన సన్నిధానంతో పని చేయించుకోవటం చలసానికి ఆవకాయ పచ్చడంత అభిరుచి. అయితే ఆరుద్ర సాహిత్య పక్షోత్సవాలు రాజమండ్రిలో నిర్వహించటంతో ఆరుద్రపై ఒక ఛార్జిషీట్ తరహా ఉత్తరమొకదాన్ని చలసాని సన్నిధానానికి రాశారు. ఆరుద్ర పట్ల పరిశోధనాభిమానం సన్నిధానానికి. ఆ ఉత్తరం ఎంత బాధ కలిగించిందో గాని, దాన్ని ముక్కలు కింద చించి పారేశాడు. ఉత్తరాలు కూడా చరిత్ర రచనకు చాలా సహాయకారి కాగలవని జయధీర్ తిరుమలరావు (ముందు మాట)కి తెలిసినట్టు అప్పటికి సన్నిధానానికి తెలియలేదు. బహుశా ఆ ఉత్తరమే మిగిలి వుంటే సాహిత్య పాఠకులకూ, పరిశోధకులకూ ఎక్కువ ఆసక్తికరంగా ఉండేది.
తెలంగాణలో ఒక సామెత ఉంది ‘చద్దికంటె ఊరగాయ ఎక్కువైనట్టు’ అని. ఈ పుస్తకం ముందు మాటలకు ఈ సామెత నప్పుతుందనుకుంటాను. జయధీర్ తిరుమలరావు సన్నిధానం భుజాల మీద తుపాకీ పెట్టి తనకెవరెవరి మీదో వున్న ఆగ్రహాన్ని ప్రకటించుకున్నారు. కొడవటిగంటి కుటుంబరావు, కె.వి.రమణారెడ్డి, సి.వి. లాంటి ప్రముఖులు చాలా కలంపేర్లు వాడి రచనలు చేశారు. నా అనుభవం ఏమంటే అందరికీ తెలిసిన నా కలం పేరుతో రచనలు పంపిస్తే ప్రచురించని ఒక ప్రముఖ దినపత్రిక, వేరే పేర్లతో రాస్తే వేసేది. ఒక సామాజిక చర్చలో నా వ్యాసాన్ని ప్రచురించని పత్రిక, నా వ్యాసాంశంపైన విమర్శను ప్రచురించింది. 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనే విడుదలయిన సాహితీ బూతు కరపత్రం లాంటివి పూర్తిగా గర్హించదగినవి. అలాంటి రచనలను తమదిగా నిర్భయంగా చెప్పుకోగలిగే రోజు బహుశా ఎవరికీ, ఎప్పుడూ రాదేమో! ఇవన్నీ ఎలా వున్నా ఉత్తరాలకుండే చారిత్రక ప్రాముఖ్యతను, అందులోని ఆత్మీయ స్పర్శను తెలిపే మంచి మాటలు జయధీర్ తిరుమలరావు ముందు మాటలో వున్నాయి.
చాలామంది చేసే ఒక పొరపాటే కాకరాల కూడా చేశారు. అది చలసాని ప్రసాద్ అన్న వాసుదేవరావు అని రాయటం. వాసుదేవరావు గారు 1937లో ఇచ్ఛాపురం నుండి చెన్నపట్నం దాకా సాగిన మహా రైతు యాత్రకు నాయకత్వం వహించిన ప్రముఖులు ఇద్దరిలో ఒకరు. ఇంకొకరు కొమ్మారెడ్డి సూర్యనారాయణ. చలసాని ప్రసాద్ అన్న పేరు శ్రీనివాసరావు దివి తాలూకాలో 20 ఏళ్లలోపు యువకులు ముగ్గురిని మలబారు పోలీసులు కాల్చేశారు. అందులో పీతా అంకినీడు, రావి భీమారావుతోపాటు చలసాని శ్రీనివాసరావు ఒకరు. కొల్లి శ్రీనివాసు (సినిమా దర్శకుడు ‘వాసు’గా ప్రసిద్ధుడు) కొల్లు శ్రీనివాసు ఆయన మేనల్లుళ్లు. పోలీసుల కాల్చివేతకు బలయిన చలసాని బావగారు నాదెండ్ల వెంకటకృష్ణయ్య (కృష్ణారావు అని రాశారు) చలసానినీ - సన్నిధానాన్ని తన సహజ శైలిలో కలిపి కొట్టిన ముందు మాట సతీష్‌చందర్‌ది.
ఆరుద్ర విషయంలో చలసాని సన్నిధానంతో ‘వ్యక్తిగత ఆరాధన ఉండకూడదు. సమాజం ముఖ్యం’ అన్నారు గానీ, శ్రీశ్రీ విషయంలో చలసాని అందుకు అతీతుడుగా ఉండగలిగాడా? అని ప్రశ్నించుకుంటే సతీష్‌చందర్ ముందు మాటల్లో చెప్పాలంటే ‘శ్రీశ్రీ మీద ఈగ వాలినా, ఈయన రాతిగద ఇచ్చుకుని కొడతాడు’
‘నూరు దోషాలలో ఒక సుగుణం, నూరు పుణ్యాలలో ఒక ఘోరం’ అన్నాడు శ్రీశ్రీ. వాటిని అర్థం చేసుకుని వొడిసి పట్టుకోవాలనేది నిరంతరం అభ్యసించాల్సిన కళ. అది చరిత్రకూ, సాహిత్యానికీ.. ఇదుగో ఈ చలసాని ప్రసాద్ లేఖలకు కూడా వర్తిస్తుంది.

-దివికుమార్