అక్షర

ఆణిముత్యాల్లాంటి కథల సమాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచసప్తతి
డైరెక్ట్ కథా సంకలనం: 2016
సంపాదకుడు: డా.వేదగిరిరాంబాబు
పేజీలు: 613.. వెల: రూ.300/-
ప్రతులకు: వేదగిరి కమ్యూనికేషన్స్
హెచ్‌ఐజి-1, బ్లాక్-6, ఫ్లాట్-10
బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్-500 044
9391343916
**
డా.వేదగిరి రాంబాబు సంపాదకత్వంలో వెలువడిన కథల సంకలనం ‘పంచసప్తతి’లో పేరు సూచించినట్లుగానే డెబ్బయి అయిదు కథలున్నాయి. వీటిలో సుప్రసిద్ధ రచయితల కథలతోపాటు కొత్తగా రాస్తున్న రచయితల కథలూ ఉన్నాయి. ఎవరు రాసిన కథలను వారు అచ్చువేయించుకోవటమే, అనేక కష్టనష్టాలతో కూడియున్న ఈ రోజుల్లో, ఇంతమంది రచయితల చేత కథలు రాయించి, సంకలనం వెలువరించటం, నిజంగా ఒక సాహితీ యజ్ఞం లాంటిదే అని చెప్పుకోవాలి. ఈ యజ్ఞ్ఫలం మాత్రం పాఠకులు అందరికీ చెందుతుంది. ఏ ఒక్క రచయిత రాసిన కథలను చూసినా, అన్ని కథలూ ఒకే స్థాయిలో ఉండవు. ఇక ఇంతమంది పాత కొత్త రచయితల సమ్మిళితం గనుక కథల స్థాయి విషయంలో మిట్టపల్లాలు ఉండనే ఉంటాయి. తను కథలు రాయటంకన్నా, ఇతరుల చేత కథలు రాయించటం తనకు ఇష్టం - అని, అందువల్ల సమాజానికి కొంత మేలు జరుగుతుందనీ ‘సంపాదకుడి స్వగతం’లో రాంబాబు పేర్కొన్నారు. ఈ కోణంలో నుంచి చూస్తే, సంపాదకుడికి ఉత్తమ లక్ష్యమే తప్ప, దీని ద్వారా ఏమీ గడించాలన్న ఆశ లేదన్న విషయం వెల్లడవుతోంది. ఈ ఆశయం అసలు ఎలా మొదలైంది, ఎలా ముగిసిందీ కూడా సంపాదకుడు వివరించాడు. ఇన్ని శ్రమదమాదులకు ఓర్చి, ఈ సంకలనం వెలువరించినందుకు డా.వేదగిరి రాంబాబు అభినందనీయుడు.
రచయితల విషయానికొస్తే, అన్ని ప్రాంతాల వారూ ఉన్నారు. అన్ని మాండలికల్లోనూ రాశారు. వీరిలో సగం మంది గ్రామీణ వాతావరణాన్ని నేపథ్యంగా ఎంచుకుంటే, సగం మంది పట్టణ, నగర వాతావరణాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. కథాంశం విషయంలో విస్తృతమైన పరిధి కన్పిస్తుంది. ప్రతి కథా, వస్తువు పరంగా ప్రత్యేకమైనది. కథలన్నీ చదివిన తరువాత విశాలమైన తెలుగు ప్రపంచంలోని అనేక మంది వ్యక్తులను కల్సుకున్న అనుభూతి కలుగుతుంది. వారి సమస్యలను, మనోవేదనలను, వారు ఎంచుకున్న పరిష్కార మార్గాలను ఈ కథల్లో చూడగలుగుతాము. ఒకే కథాంశం మీద ఇద్దరు ముగ్గురు రచయితల కథలు రాశారు. రైతుల భూములు ప్రభుత్వం లాక్కోవటం, అవయవ దానం, లైంగిక వేధింపులు, వృద్ధాప్యంలోని సమస్యలు, సెంటిమెంట్లు, అక్రమ సంబంధాలు, భార్యాభర్తల అనుమానాలు - వంటి అంశాలపైన ఇద్దరు ముగ్గురు రచయితలు రాసినా, ఏ కథకు అదే ప్రత్యేకమని చెప్పాలి. ఆ మాటకొస్తే ఏ దేశంలో అయినా, ఏ భాషలో అయినా జీవన విధానం ఒకటిగానే ఉంటుంది. అందులోనే అతను పడే తపన, ఆరాటం, జీవన పోరాటం పరికించి చూస్తే, ఒకే కొమ్మకు పుట్టిన అనేక రెమ్మలు, ఆకులు, పూలు, పండ్లు లాగా, ఎన్నో, ఎనె్నన్నో కథలు, నవలలు, పాటలూ, పద్యాలూ పుట్టుకొస్తయి మరి.
డెబ్బయి అయిదు కథలూ చెప్పుకోదగ్గవే అయినా, స్థలాభావం వల్ల, అన్నిటినీ పేర్కొనలేనందున, స్థాలీపులాకములాగా, కొన్నిటిని ప్రస్తావిస్తే, మిగిలిన వాటిని అంచనా వేసుకోవచ్చు.
ఈ తరం యువతీ యువకులను పట్టి కుదిపేస్తున్న వారి అలవాట్లను, వాటివల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తుంది - డా.ఆలూరి విజయలక్ష్మి రాసిన ‘మథనం’ కథ. టీవీ, సెల్‌ఫోన్, ఫేస్‌బుక్‌లు, మెసేజ్‌లు, మితిమీరిన స్నేహాలు - అన్ని వైపుల నుంచీ యువతరం మీద దాడిచేస్తున్న దరిద్రపు సంస్కృతి నుంచీ తప్పించుకుని బయటపడటానికి వాళ్లకు శక్తి చాలటం లేదని చెప్పే ఈ కథ ఒక ఆణిముత్యం అనే చెప్పాలి.
కరువుతో అతలాకుతలం అవుతున్న రాయలసీమ ప్రజల జీవనయానాన్ని చూసి చలించిపోయిన యువకుడు, బలమైన సామాజిక ఉద్యమం ద్వారా సమస్యను పరిష్కరించబోయి, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో తెలియజెబుతుంది ఉప్పరపాటి వెంకటేసులు రాసిన ‘మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే’ కథ.
కొడుకు ప్రయాణంలో మరణించినప్పుడు, ఇద్దరు పిల్లలకు అవయవ దానం చేశాడు. ఆ అవయవాలను దానంగా పొందిన పిల్లలను అక్కున చేర్చుకుని తృప్తిపడే తల్లి బాధను సలీం ‘రెండు జీవితాలు’ కథలో వివరించాడు.
గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు తమ కింద పనిచేసే వారితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు గానీ, తక్కువ కులం పిల్లాడు, తమ పిల్లను ముద్దుపెట్టుకోవటం సహించలేని భూస్వామి ఆధిపత్య వివరణే చిలుకూరి దేవపుత్ర రాసిన ‘నేను పెసిడెంటు సుట్టమురాలిని’ కథ.
ఉద్యోగరీత్యా భార్యాభర్తలు దూర ప్రదేశాలలో ఉన్నందున, యవ్వనంలో శారీరక సంబంధం కొరవడిన పర్యవసానం అంబల్ల జనార్దన్ రాసిన ‘అణచబడిన అలలు’ కథలో వివరించబడింది.
ఒకర్నొకరు చంపుకోవటానికి వెనుకాడని ఇద్దరు బద్ధశత్రువులు, ప్రాణ భయంతో రాత్రంతా అడవిలో గడుపుతారు. ఆ భయమే వాళ్ల పగని చల్లారుస్తుందని భువనచంద్ర రాసిన ‘్భయం’ కథ తెలియజేస్తుంది.
పుట్టింటి నించి ఇంకా ఆస్తిపాస్తులు రావాలన్న ఆరాటమే తప్ప, ప్రేమానుబంధాలకు ఏ మాత్రం విలువనివ్వని వ్యక్తులను డా.శాంతినారాయణ రాసిన ‘మైలపడుతున్న మనుషులు’ కథలో చూడవచ్చు.
రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నుంచి ఆశించిన సాయం అందకపోవటంతో వాళ్లు రోడ్డున పడ్డారు అన్న విషయాన్ని డా.ఎమ్.వి.జె.్భవనేశ్వరరావు కథ చెబుతుంది.
భర్త మరో స్ర్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందున, తానూ మరొకనితో ప్రేమలో పడి, భర్తకు విడాకులు ఇవ్వటమే పరిష్కారం అని నిర్ణయించుకున్న స్ర్తిమూర్తి కథ రాజేశ్ యాళ్ల రాసిన ‘నవజీవనం’.
పంచసప్తతి కథాసంకలనంలో ఉన్న అనేక మంచి కథల్లోని కొన్ని కథల పరిచయ వాక్యాలు మాత్రమే ఇవి. ప్రతివారు తమ ఇంటి గ్రంథాలయంలో ఉంచుకోదగిన మంచి పుస్తకాల్లో ఇదొకటి.

-శ్రీ్ధర