అక్షర

తెలంగాణలో తెలుగు భాష సొబగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ప్రపంచీకరణలో
తెలంగాణ భాష-
తెలుగు భాష - గిరిజన భాషలు - ప్రామాణికత - అమలు - అస్తిత్వం
సంపాదకుడు: డా.కె.ముత్యం
తెలుగు విభాగం
శాతవాహన విశ్వవిద్యాలయం
కరీంనగర్
వెల: రూ.150
**
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966లో తెలుగు భాషను అధికార భాషగా చట్టం చేసి అమలుపరుస్తున్నది. గడిచిన దాదాపు అర్ధశతాబ్ది కాలంలో అన్ని రంగాలలో తెలుగు భాష అమలవుతున్న తీరును, దానికి ఎదురవుతున్న సమస్యల్ని చర్చించడం, సమీక్షించడం నేటి అవసరం. దీన్ని ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో విశే్లషించుకోవాలి. మొత్తానికి అధికార భాషగా తెలుగు సరియైన రీతిలో, సరియైన ప్రాతినిధ్యంతో రూపొందకపోవడాన్ని ఈ పుస్తకం చర్చిస్తుంది. దీనిలోని మొదటి భాగం ‘తెలంగాణ భాషకు ప్రామాణికత’ అవసరాన్ని ప్రతిపాదిస్తుంది. ఇందులో తెలంగాణలోని మొత్తం పది జిల్లాల్లో ఉన్న పదజాలాన్ని వడబోసి, ఆయా జిల్లాల క్రియారూపాల్ని బాగా పట్టుకొని, వాక్య విన్యాస రీతుల్ని గాలించి, పలుకుబడుల్ని పని పెట్టుకుని గ్రహించి, అందరికీ ఆమోదకరమైన ఒక ప్రామాణిక భాషను స్థిరీకరించుకోవాలని’ నలిమెల భాస్కర్ అభిప్రాయపడుతున్నారు. వాడుక భాషగా తెలంగాణ భాషని ఉపయోగించాలంటే ముందు మన భాషని మనం వెలికితీయాలి. తెలంగాణ భాషా ధ్వనులకీ, పదాలకీ, జాతీయాలకీ, సామెతలకీ తదితర భాషా అంశాలకు వినియోగ అవకాశం కల్పించాలి. విస్తృతంగా తెలంగాణ భాషని వాడాలి -అని డా.టి.సురేష్, డా.ఎస్.జైకిషన్ అంటున్నారు. నన్నయ, తిక్కనలు స్వర్గము నుండి దిగి వచ్చినచో వారు తెలంగాణపు గ్రామీణులతో ఎలాంటి తిప్పలు లేకుండానే మాట్లాడగలరు. కాని వారు రాజమహేంద్రవరమునకో, నెల్లూరునకో పోయిన యెడల అక్కడి వారు మాట్లాడు భాష అర్థముకాక బిక్కమొగం వేసెదరని బిరుదు రాజు రామరాజుగారి నమ్మకము. ఎందుకంటే తెలంగాణ భాష గ్రాంథికానికి చాలా దగ్గరిగా ఉంటుంది. ఇతరాంధ్రమున కన్న నిచ్చటి దేశి - జాను తెలుగు, మరియూ వైకృత పద సమూహమధికము. అందుకే తెలంగాణ భాష వైపు పరిశీలనాత్మక దృష్టి ఏర్పరచుకోవల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నారు. వివిధ పద రూపాలను ఇచ్చి తెలుగు ఏ ప్రాంతంలో ఎట్లా వుందో, ఎలా మారిందో చూపుతూ డా.మలయశ్రీ ‘తెలంగాణ తెలుగు భాషా స్వరూపం’ వివరించారు. కొంత సహనంతో, కొంత అనే్వషణా దృష్టితో యాస ముసుగు తీసి పరిశీలిస్తే, తెలంగాణ భాషలో అమూల్యమైన రత్నరాసులెన్నో లభ్యమవుతాయి అంటూ అనేకానేక కావ్య ప్రయోగాల్ని చూపుతూ, అపురూపమైన ప్రయోగ వైచిత్రిని ఉదహరిస్తూ పాకాల యశోదారెడ్డి ‘తెలంగాణ భాష - సాహిత్య గౌరవాన్ని’ ఇనుమడింపజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేకన్నా ముందే తెలంగాణ భాషను అధికార భాషగా ఇతర భాషల వాళ్లు నేర్చుకోగలిగే భాషా భాగాలను కొన్ని సూత్రాలను, వ్యాకరణాలను కూడా రూపొందించాల్సిన అవసరముంది. భాష అలవాటు తొందరగా మారదు. కనుక ఇప్పటి నుండే అన్ని స్థాయిల్లో ప్రజలు మాట్లాడుకునే ఇంటి భాషను, బాటసారి భాషను సేకరించి రాసిపోసి, ఒక మంచి తెలంగాణ ప్రామాణిక వ్యవహార భాషగా మలచుకోవడం అవసరమని బి.ఎస్.రాములు అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతం భాషా విషయంలోనూ, సాహిత్య విషయంలోను ఎన్నో విధాలుగా తన ప్రత్యేకతను కోల్పోయింది, నష్టపోయిందని రవ్వా శ్రీహరి తెలియజేస్తున్నారు. ఔను తెనుగే మన తెలంగాణ తెలుగు అని నిర్ధారిస్తూ డా.కనకయ్య ‘తెలంగాణ పలుకుబడులు - సౌందర్యాల వెలుగులు’ అని అభివర్ణిస్తూ, వాటిని సోదాహరణంగా తెలియజేసే ప్రయత్నం చేశారు.
ఈ పుస్తకంలోని రెండవ భాగం ‘అధికార భాషగా యాభయి ఏళ్ల తెలుగు అమలుతీరు’ను సమీక్షిస్తుంది. అధికార భాషగా తెలుగు అమలు చేయడంలో ఏపాటి పురోగతి ఉన్నదో చెప్పలేము. ఎంతో కొంత తెలుగు అమలు జరుగుతున్న మాట నిజమేనని పోరంకి దక్షిణామూర్తి అంటున్నారు. ఆధునిక భాషగా తెలుగు పురోగతి - అధికార భాషగా తెలుగు అమలు ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. భాష పురోగతి అమలుకు దోహదకారి అవుతుంది. అమలు సమర్థంగా, సంపూర్ణంగా ఉంటే ప్రభుత్వంలోని రెండు వందలకు పైగా వున్న శాఖల పదసంపద భాష పురోగతికి తోడ్పడుతుందని గోవిందరాజు రామకృష్ణారావు అభిప్రాయపడుతున్నారు. ‘అధికార భాషగా తెలుగు అమలు - సమస్యలు - పరిష్కారాలు’ను డా.కాలువ మల్లయ్య సోదాహరణంగా వివరించారు. తెలుగు అధికార భాషగా గాని, పాలనా భాషగా గాని దాని అమలులో వున్న లోటుపాట్లేమిటి? వాటిని సరిచేయడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని జి.ఎస్.వరదాచారి చర్చించారు. టెలిఫోన్, రేడియో, సినిమా, టీవీ, ఇంటర్నెట్ కారణంగా తెలుగు భాషలోగాని, వ్యక్తీకరణలోగాని వచ్చిన పరిణామాలను స్థూలంగా పరిశీలించే ప్రయత్నాన్ని డా.నాగసూరి వేణుగోపాల్ చేశారు. తెలుగును అన్ని రంగాలలో వినియోగించడమే లక్ష్యంగా మన ఆలోచనలు సాగాలి. ఉద్యమాలు సాగాలి. అంతే తప్ప పరిమిత ప్రయోజనాల నాశించి, తాత్కాలిక చర్యల వల్ల సాధించేదేమి ఉండదని డా.సామల రమేశ్‌బాబు అభిప్రాయపడుతున్నారు. డా.తప్పెట రాంప్రసాద్‌రెడ్డి ‘గ్లోబలీకరణ నేపథ్యంలో తెలుగు భాషా పరిరక్షణ - ఆవశ్యకత’ పేరిట ఎన్నో విలువైన సూచనలు చేశారు.
పుస్తకంలోని మూడవ భాగం ‘ఆదివాసీ భాషల అస్తిత్వ తండ్లాట’ల్ని రూపుకడుతుంది. ఒక భాష అంతరించిపోతే, ఆ భాషా సమూహపు సంస్కృతి, సాహిత్యం, జ్ఞానం అంతరించిపోతుంది. కోయ, గోండీ, సవర భాషల అనుభవాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మైదాన ప్రాంత భాషల మోజులో పడిన గిరిజన జాతులు, ఇవ్వాళ నీళ్లులేని చేపలా తన్నుకుంటున్నారు. ఎన్నో గిరిజన భాషలు రాజ్యాంగం సాక్షిగా గుర్తింపునకు నోచుకోక కనుమరుగు అవుతున్నాయనడంలో పద్దం అనసూయ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. మూలవాసుల సంస్కృతీ సంప్రదాయాల్ని, వాళ్ల భాషల మాధ్యమంగా బోధించడం ద్వారానే కాపాడగలం అని మెస్రం మనోహర్ అభిప్రాయపడుతున్నారు. కొండరెడ్డి తెలుగు మాండలికంలో ఉన్న ప్రత్యేకతలను డా.టి.చక్రధరస్వామి తెలియజేశారు.
డా.అల్లంసెట్టి చంద్రశేఖరరావు ‘సవర భాషలో విద్యాబోధన’ వ్యాసం సమగ్రంగా ఉండి ఎన్నో విషయాలను తెలియజేసింది. కుర్రా జితేంద్రబాబు ప్రత్యేక పత్రం ‘తెలుగు ప్రాకృత భాషాజన్యమే’ సమాచారాత్మకంగానే కాకుండా, విజ్ఞానదాయకంగా కూడా ఉంది. భాషపై జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించి, పరిశోధకుల పత్రాలను పరివర్థితం చేయించి, ఎన్నో శ్రమలకోర్చి ఇప్పుడు గ్రంథంగా వెలువరించడంలో శాతవాహన విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం వారు, ముఖ్యంగా సంపాదకుడు డా.కె.ముత్యం చేసిన కృషి ప్రశంసనీయం.

-కె.పి.అశోక్‌కుమార్