అక్షర

‘జిందం’ గుండె సవ్వడులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవ్వలు
-జిందం అశోక్
వెల: రూ.60/-
ప్రతులకు: జిందం శ్రీలేఖ, 8/5/546 బి,
పోచమ్మవాడ,
కోతిరాంపూర్
కరీంనగర్ - 505 001
8978532225
**
‘బొమ్మరింట్లో/ అవ్వంట బువ్వంట
మట్టి గురుగుల్లో ఒదిగిన బాల్యం’ అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను అందంగా ఆవిష్కరించిన కవి జిందం అశోక్ ‘గవ్వలు’ పేరుతో ఓ మినీ కవితా సంపుటిని ప్రకటించారు. త్రిపదలో సాగే తన కవిత్వాన్ని ‘గవ్వలు’గా జిందం తన గుండె సవ్వడులను వినిపించారు.
‘నల్లబల్ల మీద/ చుక్కల్లేని ముగ్గు/ తెలంగాణ నా జన్మహక్కు’ అని స్వాభిమానంతో తెలంగాణ వాదాన్ని తన నినాదం ద్వారా ప్రకటించిన ఆయన ఇందులో తన మనసుని భావాలకు అక్షర సొబగులు అద్దారు.
జిందం అశోక్‌కు లోగడ రెండు కవితా సంపుటులు వెలువరించిన అనుభవం ఉంది. అంతేగాక ఒక నానీల సంపుటిని కూడా ప్రకటించారు. ఇప్పుడు తన నాలుగో గ్రంథంగా వచ్చిన ఈ ‘గవ్వలు’లో సమకాలీన అంశాలను కవితా వస్తువులుగా ఎంపిక చేసుకుని తన భావుకతను చాటుకున్నారు.
‘నవమాసాలు మోసి/ నొప్పులు పడి బిడ్డకు జన్మనిచ్చింది/ బ్రహ్మకన్న గొప్పది ‘అమ్మ’ -అంటూ ఓ కవితలో అమ్మను ఉన్నతంగా చిత్రించారు.
ప్రభుత్వ పథకాలను ఎండగడుతూ..
‘కులాలకేనా!/ కళ్యాణలక్ష్మి కానుక/ పేదలందరిది శుభలగ్నమే!’ అని వ్యాఖ్యానించారు.
ప్రమాణం రాజ్యాంగం మేరకు/ పాలన వాస్తు ప్రకారం
ప్రజల సొమ్ము.. ‘కట్టడాలపాలు’ అంటూ పాలకులకు తమ కలాన్ని ఎక్కుపెట్టారు.
‘వాళ్లకు లక్షల్లో.../ వీళ్లకు వేలల్లో.../ రాజులు రాజులు కల్సి బత్తెం పంచుకున్నారు’ అని ఓ కవితలో ప్రజాప్రతినిధుల నిర్వాకాన్ని నిలదీశారు.
‘చింతచెట్టు సిగలో/ మల్లెలు పూసినై/ ‘పుష్పగుచ్ఛంలా’ కొంగల గుంపు’ అంటూ కవి తన భావుకతను ప్రదర్శించారు.
ఏడ్వాలి కంటినిండ/ నవ్వాలి కడుపునిండ/ అప్పుడే తెలుస్తుంది. ‘బతుకు రుచి’ అంటూ హితవు పలికారు.
అతనికి తెలుగు రాదు/ అర్థంకాదు
అయినా తెలుగు మహాసభలకు ‘ముఖ్య అతితి’ అంటూ చమత్కరించారు.
మా సారు/ బతుకు పాఠాలు చెప్పిండు/ చదివింది.. ‘సర్కారు బడి’ అంటూ జిందం అశోక్ సర్కార్ అధ్యాపకుడిగా తన స్వాభిమానాన్ని చాటుకున్నాడు.
ఇలా సాదాసీదా కవిత్వంతో రూపుదిద్దుకున్న గవ్వలు పాఠకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినా.. కవి లోక పరిశీలనను అభినందించి తీరుతారు. నాలుగో గ్రంథంగా అశోక్ వెలువరించిన ఈ గ్రంథంలో ఆశించినంత కవిత్వంలో పరిణతి సాధించలేదని పాఠకులు ఇట్టే పసిగడతారు. మున్ముందు కవి మరింత చిక్కని కవిత్వం పండించాలని కోరుకుందాం.

-దాస్యం సేనాధిపతి