అక్షర

కవిత్వ విమర్శలో మరో మలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ
సాధారణ
కవిత్వ విశే్లషణా వ్యాసాలు
-ఎం.నారాయణశర్మ
వెల: రూ.45
పేజీలు: 128
ప్రతులకు:
98483 48502

కవిత్వంపై రాసిన విశే్లషణా వ్యాసాల సంపుటి ‘సాధారణ’. ఇందులోని వ్యాసాలలో దీర్ఘ కవిత, వచన కవిత, మినీ కవిత, నానీలు అనే వివిధ రూపాలకు సంబంధించిన విశే్లషణలున్నాయి. ప్రధానంగా ఆధునిక కవిత్వంపై, వాటి నిర్మాణ రీతులపై కేంద్రీకరించిన వ్యాసాలివి. విమర్శను ఇజాల కళ్లద్దాల నుండే చూడాల్సిన అవసరం లేదని నారాయణశర్మ వాదన. కవిత్వంలో ప్రాంతాల నేపథ్యం, వాటి రాజకీయ స్థితిగతులు, సామాజికత, వ్యక్తివాదం, అనుభూతి, అనుభవాలలోని వైరుధ్యాలను విమర్శతో తడమాల్సిన అవసరం ఉందని శర్మ విశ్వసిస్తున్నారు. ఆయా విమర్శా వ్యాసాలన్నింటిలో ఆ పనిని ఆయన సమర్థవంతంగా చేయగలిగారు.
సాహిత్యంలో వెలుగు చూసిన ఏ ఉద్యమం, ధోరణి, వాదం ఏదయినా తమ ఎజెండాను చెప్పుకోవడానికో, ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికో ఒక సంచిక, సంకలనాన్ని తేవడం తప్పనిసరి అవసరంగా మారింది. ఈ సంచికలు సంకలనాలే చరిత్రలోని ఒక ప్రధాన పరిణామాన్ని రికార్డు చేస్తున్నాయంటూ ‘గోలకొండ కవుల సంచిక నుండి పొక్కిలి దాకా’ వున్న సంకలనాలను పరామర్శించారు. సాధారణంగా ఉద్యమ కవిత్వానికి కొన్ని స్వభావాలుంటాయి. శత్రువుని, శత్రు సంబంధమైన ఇతరాంశాలని నిందించడం, ఆకాంక్షని పట్టించుకోని రాజకీయాన్ని, ప్రభుతని తిరస్కరించ డం, ఆయా ప్రాంతాల సాంస్కృతికాస్తిత్వాన్ని చెప్పడం, ఆ వారసత్వాన్ని గాఢంగా ప్రశంసించడం మొదలయిన వ్యూహాలు కనిపిస్తాయి. అలా తెలంగాణ ఉద్యమం అస్తిత్వాన్ని ముక్తకంఠంతో నినదిస్తూ వచ్చిందే ‘వల్లుబండ’ సంకలనమని తెలియజేశారు. ఓ సుదీర్ఘ ప్రయాణం తర్వాత కవి తన తరువాత తరానికి ఏం మిగుల్చుతున్నాడు? ఎలా మార్గనిర్దేశనం చేస్తున్నాడు అనేదే ఆ కవికి సాహిత్య లోకంలో స్థానాన్ని మిగుల్చుతుంది. అది కవిత్వానికి సంబంధించిన రూపం, నిర్మాణం, వస్తువు, దర్శనం ఏదైనా కావచ్చు. ఇలా మార్గనిర్దేశం చేయగలిగిన వాళ్లే సాహిత్య చరిత్రలో మైలురాళ్లుగా మిగులుతారని నాలుగున్నర దశాబ్దాల డా.ఎన్.గోపి కృషిని తెలియజేశారు. గతంలో ముఖ్యంగా ‘నడక’లో ఉద్వేగం, ఉద్రేకం, ఆగ్రహావేశాలు ప్రస్ఫుటంగా కనిపించే కవిత్వం రాసిన అన్నవరం దేవేందర్ ‘మంకమ్మతోట లేబర్ అడ్డా’ సంపుటిలో సాంద్రీకృతమై, గాఢమైన అభివ్యక్తి కలిగిన కవిత్వాన్ని రచించాడంటారు. సమాజ వాస్తవాన్ని కేంద్రంగా చేసుకుని, తెల్లబడుతున్న రంగుల్ని, ఆవిరౌతున్న ఆశల్ని శివకుమార్ ‘పాలకంకుల వల’గా స్వప్నించారు. మనిషిగా ఆయన చవిచూసిన అనుభవాలు, జ్ఞాపకాలతో పడ్డ మానసిక సంఘర్షణ ‘పాలకంకుల వల’లో కనిపిస్తుందంటారు. ఒక ఆర్థిక స్థితి, దానికి కారణమైన రాజకీయం, రాజ్యం, వాటివల్ల పరిణామాలు, వాటివల్ల బీభత్సమైన ప్రజా జీవితాల తండ్లాటే నందిని సిధారెడ్డి కవిత్వమంటారు. విప్లవ కవిత్వాన్ని జీవితానికి దగ్గరగా తేవటంగాక జీవితంలోని అనేక సందర్భాల్లో, సంఘటనల్లో, సన్నివేశాల్లో ఎదిరించాల్సిన, తిరస్కరించాల్సిన విషయాలననేకం ‘ఆట’లో కవిత్వం చేశారు దర్భశయనం శ్రీనివాసాచార్య అని చెబుతారు. జూకంటి జగన్నాథం కవిత్వంలో ఆయన తడిమిన అంశాన్ని తాత్విక, తార్కిక దృష్టితో పరిశీలించడం కనిపిస్తుంది. పద బంధాల్లో, అభివ్యక్తిలో, నిర్మాణ క్రమంలో ఆయన శైలి తన సహజత్వాన్ని నిలబెట్టుకుంది. ‘గంగడోలు’లో జగన్నాథం కవితా దృష్టి ప్రతి అంశాన్ని పలకరించిందని తెలియజేస్తారు. నేటి సమకాలీన కవిత్వంలో వస్తువు, వాస్తవికత, సమాజం ముఖ్యాంశాలుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సమకాలీన సంఘటనలకు సంబంధించి ఉద్యమ కవిత్వం కూడా లెక్కించదగిన రీతిలో వస్తుందని ఉదాహరణలతో సహా తెలియజేశారు. ‘లోలోన...’ రవీంద్ర కొత్త కవిత్వం. ఇందులోని కవితల్ని వస్తుముఖంగా పరిశీలిస్తే కొన్నిసార్లు దళిత కవిగా, కొన్నిసార్లు వైప్లవిక భావాలు కలవాడుగా, ఇంకొన్నిసార్లు కళా దృక్పథం కలిగినట్లుగా, కనిపిస్తాడంటారు. శ్రీమతి అరుణ కవిత్వాన్ని నిర్మాణ ముఖంగా పరిశీలిస్తే దార్శనిక, అభివ్యక్తి భాగాలే ప్రధానంగా కనిపిస్తాయి. వీరి కవిత్వంలోని చాలా భాగాల్లో భిన్న పార్శ్వాల్లో, వైవిధ్యమైన చైతన్యంతో స్ర్తి అస్తిత్వం అందులోనూ ఒక వినూత్న దార్శనికత కనిపిస్తుందంటారు. సుమారు 1972 కాలాన్నుండి కనిపించే కవితల్లో ఓల్గాలోని నిబద్ధ, సృజనలు పోటీ పడతాయి. ప్రాతిపదికంగా కనిపించే నినాదంకన్నా విధానమే ఇందులో ఎక్కువ. ఇందులో అనువాద, స్వీయ కవితలున్నాయి. స్వీయోద్దీపన, స్థితిగతాశంస, అతి సున్నితమైన తిరస్కారం ఇందులో కనిపిస్తాయి. స్వరపునరుక్తి, గొలుసుకట్టు వాక్యాలు, సంభాషణలని భావచిత్రాలుగా చిత్రించడం ఇలాంటి వాటి ద్వారా ఉద్వేగాన్ని పెంచడం. గుప్త భాగాన్ని ప్రతీకాత్మక చైతన్యంతో చెప్పడం లాంటి నిర్మాణాంశాలున్నాయంటారు. విప్లవంకన్నా, ఉద్యమంకన్నా శివారెడ్డి కవిత్వంలో మనిషి మీద, మట్టి మీద ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది. శివారెడ్డి వాక్య నిర్మాణంలో నిర్దుష్టమైన పద్ధతులు కనిపిస్తాయని, వాటిని సోదాహరణంగా వివరిస్తారు. ‘మో’ కవిత్వంలో భాషకు - అందులోనూ ప్రయోగవంతమైన భాషకు ఓ ప్రత్యేకత ఉంటుందని నిరూపించారు. అనువాదకుడు కేవలం భాషాజ్ఞానం వున్నవారు, తగిన తాత్వికాభినివేశం ఉన్నవారయితే సరిపోదు. తాను కూడా కవి, కవిలోని తాత్త్విక దృష్టిని పలికించగల తాత్త్వికుడే అయితే ఎంత నిసర్గమైన కవిత్వాన్ని, అనువాదాన్ని అందించగలడో ‘అదే ఆకాశం’ ద్వారా ముకుంద రామారావు నిరూపించాడని చెబుతారు. విస్తృత అధ్యయనం, సునిశిత పరిశీలన, సరియైన అవగాహనతో నారాయణశర్మ ఈ వ్యాసాలను రాసాడని ఎవరైనా ఇట్టే గుర్తించవచ్చు. పుస్తక పరిచయ వ్యాసాలు అయినప్పటికీ విస్తృత దృష్టితో, ఇందులోని కవిత్వాంశాలను వెలికితీయడం కనిపిస్తుంది. ప్రస్తుత గ్రంథాన్ని ఆయా రచయితల పూర్వ గ్రంథాలతో బేరీజు వేసుకుని రచయిత ఎదుగుదలను, ఆయన కవిత్వంలో వస్తున్న మార్పులను చక్కగా అంచనా వేయగలిగారు. ఈ వ్యాసాలలో ఎక్కడా కవిని కించబరచడం గానీ, అనవసర వ్యాఖ్యలు గాని చేయడం కనిపించదు. కవిత్వం పట్ల శ్రద్ధాసక్తులు, ప్రేమ వున్న ఒక సహృదయ విమర్శకుడ్ని ఈ వ్యాసాలు మనకు పరిచయం చేస్తాయి.

-కె.పి.అశోక్‌కుమార్