అక్షర

సహస్రాబ్ది వేళ... ప్రబంధమాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామానుజాభ్యుదయము
ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యులు
(ప్రబంధము)
పరిష్కర్త: డా.శ్రీరంగాచార్య
ప్రతులకు: 11-14-25, హరిపురి కాలనీ,
హైదరాబాద్-500102
వెల: రూ.200/-
**
ఇది భగవద్రామానుజుల వారి పుణ్య సహస్రాబ్ది సందర్భం. సుమారు 300 సంవత్సరాల నాటి ఈ ప్రబంధం ఇప్పుడు పరిష్కృతమై వెలుగులోనికి రావటం మరీ ఉచితమైన సందర్భం.
మన దేశ చరిత్రలో భక్తి ఉద్యమం చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పరచిన కట్టుబాట్లను సడలించి - భగవద్భక్తులందరూ సమానులే అన్న ఒక సర్వ సమభావాన్ని లోకంలో ప్రచారం చేసేందుకు వచ్చింది. దక్షిణ దేశంలో ఆళ్వారులు, నాయన్మారులు ఈ భక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే దానికి దార్శనిక ప్రతిపత్తినీ, బహుళ వ్యాప్తినీ తెచ్చినవారు శ్రీరామానుజులు, బసవేశ్వరులు, వల్లభులు, నింబార్కులు, చైతన్యులు. ఈ మహాత్ములు విధర్మీయుల దాడులతో కకావికలైన సమాజాన్ని ధీరతతో ఏకీకృతం చేయటంలో సాఫల్యం పొందారు. శ్రీ శంకరులు మోక్ష సాధన సామగ్య్రాం భక్తి రేవ గరీయసీ అన్న సందర్భం ఇంకా వారు నెలకొల్పిన షణ్మతాల స్థాపనమైనా ఈ తత్త్వానే్న సూక్ష్మంగా ప్రవచించింది.
రామానుజులు, బసవేశ్వరులు సంస్కృత ప్రస్థాన గ్రంథాలను ప్రక్కనబెట్టి - భక్తుల గేయ వచన సాహిత్యాన్ని ప్రధానం చేసి సామాన్యుల చైతన్యం తమ ఆశయానికి సన్నిహితమయ్యేటట్లు చేశారు. అంతకు ముందు జైన బౌద్ధాలు ఈ పనే చేశాయి. భక్తుల సాహిత్యానికి వేదములతో సమానంగా - కొండొకచో వాటికంటే అధికమైన స్థితిని కలిగించారు. శ్రీరామానుజులు సంపూర్ణ జీవితాన్ని కొనసాగించి ఈ మత ప్రచారానికి అష్టదిగ్గజములను, 74 ఆచార్య పీఠాలను, 700 మంది త్రిదండులను ఏర్పరచి, ఆ తత్త్వ ఆచారాలను తమ అనంతరం నెలకొని ఉండేటట్లు చేశారు. శ్రీరంగం, తిరుమల మొదలైన దేవాలయాల అర్చనలు, ఉత్సవాలు మొదలైన వాటికి వ్యవస్థను ఏర్పరిచారు. ఈ క్షేత్రాలలో ఈనాటికీ చెక్కుచెదరకుండా వారేర్పరచిన వ్యవస్థ కొనసాగుతున్నది.
భగవద్రామానుజుల జీవిత చరిత్రను వర్ణించే ఈ ప్రబంధం తెలంగాణా ప్రాంతం నుంచి వెలువడిన తొలి రచనగా భావించవచ్చు.
16వ శతాబ్దం నాటికి తెలంగాణ ప్రాంతంలో బహమనీల కుతుబ్షాల పాలన నెలకొనటం, దేశీయ విద్యలకు పోషణ లేకపోవటం, విద్యాబోధనకు తగిన విద్యా స్థానాలు క్రమంగా అంతరించిపోవటం జరిగింది. సంస్కృతాంధ్రాలలో రచన సాగుతున్నా ప్రయోగశీలం ప్రధానంగా ఉన్నది. అచ్చ తెనుగు కావ్యాలు, చిత్రబంధ కవితలు ప్రబలాయి. తాళ్లపాక వారి రచనలలో వలె - మాండలికాలు, వ్యాకరణ విరుద్ధ ప్రయోజనాలు, ఛందస్సులో వింత పోకడలు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో పాల్కురికి సోమనాథుని నుంచి వారసత్వంగా సంక్రమించిన దేశీయ రచనా ధోరణి బలంగానే ఉన్నది. అందువల్ల ప్రస్తుత ప్రబంధంలో ఈ లక్షణాలు అధికంగానే కాన వస్తున్నాయి.
ఒకసారి నాతో ఆచార్య దేవర్ల చిన్నికృష్ణయ్యగారు అన్నారు - ‘తెలంగాణ కవిత్వంలో ముఖ్యంగా 16వ శతాబ్దం తరువాతి రచనల్లో పద్యం లక్షణ శాస్త్రానికి, వ్యాకరణానికి లొంగదు. దీని కోసం ప్రత్యేకంగా ఛందో వ్యాకరణ నియతి ఏర్పరచుకోవలసి ఉంది’ అని.
ఈ ప్రబంధం పరిశీలిస్తే ఈ అంశం స్పష్టమవుతున్నది.
4వ పద్యంలో - వినతౌ తనూ భవ్య విభవమెంచి.. ఇక్కడ భవ్య బదులు భవ అని ఉంటే సరిపోతుంది కదా. యతి భంగములకు-
విరజ కవ్వల వెల్గు నట్టి పదముల
పూర్ణంబుగా కరు నొప్పు పదము
త్రిపాద్విభూతి మయమగు పరమ పదము (1-72)
మూడవ ప్రయోగ సందర్భంలో మయమ్మగు అని మారిస్తే యతి కుదురుతుంది.
మరొక చోట విచిత్రమయిన యతిభంగం కనిపిస్తుంది.
వ్యత్యస్తము లేక మీరు వేం చేయంగా (2-239)
తొలి అక్షరమైన తాలవ్యయకార స్పర్శ వలన యతి స్థానంలో ‘వే’ వచ్చి ఆక్రమించింది.
విసంధులు
దేవర వారలు నస్మదారులన్ (2-271)
ఇది చాలా వరకు లాక్షణికులు అంగీకరించిందే. ఇటువంటి ప్రయోగాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.
మాండలికం
మిన్నతి - మిన్నదనమనే అర్థంలో (1-4లో) ప్రయోగింపబడింది.
ఈ ప్రబంధం శ్రీరామానుజాభ్యుదయం తృతీయా శ్వాసం చివర కొంత మిగిలిపోయింది. అది శిథిలమైందో, రచింపబడలేదో చెప్పలేము. కావ్యం నిండా వర్ణనలు సమృద్ధిగా కనులకు కట్టినట్లుగా ఉన్నాయి. శ్రీవైకుంఠము, స్పష్టమైన లోకము ఆయా క్షేత్రములు కావ్యానికి శోభను కలిగిస్తున్నాయి.
మొదటి ఆశ్వాసంలో మహాలక్ష్మి స్వామిని జీవకోటి నుద్ధరింపుమని ప్రార్థించిన సందర్భంలో ఆమె కోరు శివ స్వభావం చక్కగా చిత్రింపబడింది. సీతాదేవి సుందర కాండలో రాక్షస స్ర్తిలను శిక్షించటానికి పూనుకొనగా ఆ లోక జనని లోకంలో తప్పు చేయన వారెవరన ‘న వశ్చినా పరాధ్యతి’ అని ప్రశ్నిస్తుంది. ఆ ఘట్టం గుర్తుకు వస్తుందిక్కడ.
తాత్త్విక చర్చలకు, సంప్రదాయ విశేషాంశములకు ఈ గ్రంథం గని వంటిది. ఈ ప్రాంతంలోని శిష్య వత్సలురైన ఆచార్య పురుషులు కాలక్షేపాదులలో నిరంతరం ప్రపంచించే అంశాలు ఎన్నో ఈ కావ్యంలో వ్యాఖ్యానింపబడి ఉన్నవి.
కవితా శైలి సుబోధకమైంది. సరళమైంది.
తెలంగాణ సాహిత్యంలోని అనేక ప్రబంధాలను పరిశోధించి పరిష్కరించిన శ్రీపెరుంబూదూరు రంగాచార్యుల కృషి ప్రశంసనీయం.

-కోవెల సంతోష్‌కుమార్