అక్షర

బూర్గుల సాహిత్య పరిమళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బూర్గుల రంగనాథరావు సాహిత్యం
మొదటి సంపుటం
-ఆచార్య ఎస్వీ రామారావు
పుటలు: 248
వెల: రూ.200/-
ప్రతులకు: తెలంగాణ సాహిత్య పరిశోధన కేంద్రం
ఎఫ్-205, చిత్ర లే అవుట్
ఎల్‌బి నగర్,
హైదరాబాద్-500 074
**
తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన గొప్ప పరిణామం వెతికి వెతికి తెలంగాణ రచయితల గ్రంథాలను పునర్ముద్రించి అందుబాటులోకి తేవాలనుకోవడం. ఈ పరిణామ పరంపరలో భాగమే బూర్గుల రంగనాథరావు రచనలను రెండు సంపుటాలలో వెలువరించడం. ఈ సంపుటాల ప్రచురణకు కారకులైన బూర్గుల రంగనాథరావు సుపుత్రులు బూర్గుల లక్ష్మీకాంత్‌గారు, సంపాదకత్వం వహించిన ఆచార్య ఎస్వీ రామారావు గారు ఎంతో అభినందనీయులు.
బూర్గుల రంగనాథరావు 20వ శతాబ్దం మధ్య ఒక వెలుగు వెలిగిన వారు. ఇప్పటి తరానికి దాదాపు అపరిచితులు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ విద్వాంసులు బూర్గుల రామకృష్ణారావుగారి కుమారులు. బూర్గుల రంగనాథరావు (జననం 12.10.1917, మరణం 24.7.2008) 1940లో మద్రాసు లయోలా కళాశాలలో డిగ్రీ చేశారు. పూనేలోని ప్రసిద్ధి గాంచిన ఫెర్గూసన్ కళాశాల నుండి న్యాయవాద పట్ట్భద్రులయ్యారు. సచివాలయంలో డిప్యూటీ సెక్రటరీ హోదాలో పనిచేశారు. ‘సాధన సమితి’ నెలకొల్పి 1939-50 ప్రాంతాల్లో అంజలి, ప్రత్యూష, పాలవెల్లి, రంగవల్లి లాంటి 18 గ్రంథాలు వెలువడడానికి కారణభూతులయ్యారు. వాహ్యాళి (1943) కథలు, అభియానం (1995) కవితలు రాశారు. తిరుప్పావై, ఆళవన్దార్ స్తోత్రం, ముకుందమాల, గోదాస్తుతి లాంటి స్తోత్ర వాఙ్మయాన్ని తెనిగించారు. ఇలా గతంలో రంగనాథరావు చేసిన సాహిత్య వ్యాసంగాన్నంతా రెండు సంపుటాల్లో ఒకచోటికి తెచ్చారు. మొదటి సంపుటంలో వాహ్యాళి కథలు 18, కదంబమాల కవితలు చోటు చేసుకోగా రెండవ సంపుటంలో వివిధ స్తోత్రానువాదాలు చోటు రంగనాథరావు కథలన్నీ నిజాం పరిపాలన, స్వాతంత్య్రోద్యమం ఆనాటి భావజాలాలు, సంఘటనలు, ఉద్వేగాలను, అప్పటి భాషా వాక్య నిర్మాణ రీతులను అనుసరించి ఉంటాయి. కనుక పాఠకులు కాస్త ఓపికతో చదువుకోవలసి వుంటుంది. గోష్ఠి అనే కథానికలో భాషాపరమైన భేదాలను చక్కగా చిత్రించారు. ఉర్దూ పద బాహుళ్యంతో కూడిన తెలంగాణ తెలుగు, ఆంగ్ల పదాలతో కూడిన ఆంగ్లేయాంధ్రం లేదా బ్రిటీషాంధ్రం, గ్రాంథికాలను కలగలిపి ఒక సినీ నటి ఇతివృత్తాన్ని వినిపిస్తారు. వీరి కథల్లో వివిధ యుద్ధాల్లో బలి అయిన వారి పరిస్థితి, రాచరిక స్థితి, హిందు మహమ్మదీయ ఘర్షణలు, ప్రణయాలు - పునర్వివాహాలు, కుటుంబ సంబంధాలు గోచరిస్తాయి. వ్యావహారికం, గ్రాంథికం రెండు జమిలీగా సాగుతూ సమకాలీన సమాజ స్థితిగతులను ప్రతిఫలిస్తాయి.
అభియానం కవితా సంకలనంలో 1934 నుండి 1946 దాకా రాసిన కవితలు, కొన్ని అనువాద కవితలు, ఒకటి రెండు తర్వాతివి ఈ సంపుటంలో ఉన్నాయి. 1938, 39, 40 సంవత్సరాల ఉగాది కవితలు, భోగరాజు పట్ట్భా సీతారామయ్యకు మద్రాసు లయోలా కళాశాల విద్యార్థుల పక్షాన సమర్పించిన అభినందన పద్యాలు, ప్రజాకవి కాళోజి అభినందన, కాశీనాథుని నాగేశ్వరరావు, నేతాజీ సుభాష్ బోసుల అస్తమయం వేళ రాసిన స్మృతి పద్యాలు, నవకాళి దురంతాన్ని చిత్రించిన పద్యాలున్నాయి.
బహద్దూర్ యార్ జంగ్ అంజుమన్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ సంస్థకు మొదటి అధ్యక్షుడు. ఆయన అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతాన్ని కూడా నిజాం రాష్ట్రంలో కలపాలని 1941 ప్రాంతంలో లేవదీసిన నినాదానికి స్పందనగా రంగనాథరావు పద్యాలు రాశారు. ఇది కొత్త అంశమే. పెద్దగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు లేదు.
రంగనాథరావు భావుకుడు. జీవితాన్ని సుందరంగా మలచుకోవాలని తపించే సౌందర్య పిపాసి. మునిమాణిక్యం వారన్నట్లు ‘నిస్సారమై నిరుత్సాహమైన జీవితాన్ని సారవంతంగాను ప్రోత్సాహంగానూ చేసుకోగల భావుకుడు ఇతడు. ఈతని హృదయంలో దిక్కులను చప్పరిస్తు వచ్చే ఎండ పొలుపులూ, వెచ్చని మధ్యాహ్నంలో గంభీరమైన నిశీధాలు ఉన్నాయి. మెలికలు చుట్టుకొన్న పొగమంచులూ ఉన్నవి. తన కాంతికి తానే దిగ్భ్రమ చెంది ఆశ్చర్యంతో చూస్తున్న చంద్రుడూ ఉన్నాడు’. అట్లాగే కవిత్వం దగ్గరికి వస్తే ‘ఇందులో కొన్ని కన్నీటి కాలువలు, కొన్ని పన్నీటి జల్లులు, కొన్ని నిరాశా నిస్పృహ పూరాలు, మరికొన్ని భక్తి రసనిర్భరాలు, భగవన్మహిమానుభావములు, ఆత్మవేదన శీలములు ఉన్నాయ’ని ఆచార్య బి.రామరాజు వ్యాఖ్యానించినది వాస్తవం. తండ్రిగారైన బూర్గుల రామకృష్ణారావు రచనలను ప్రచురించడానికి రంగనాథరావు కృషి చేశారు.

**
సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.

-ఆచార్య వెలుదండ నిత్యానందరావు