అక్షర

సాహితీ ప్రియులకు స్వాధుఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవలా హృదయం-2
-వి.రాజా
రామమోహనరావు
ప్రతులకు:
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

ఇది ‘నవలా హృదయం’ సంపుటి-2. రచయిత వి.రాజా రామమోహనరావు కథకుడుగా, నవలాకారుడుగా సుమారు ముప్పైకి పైగా బహుమతులు, ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందిన సుపరిచిత సాహితీవేత్త. ఈ సంపుటంలో 68 తెలుగు నవలల పరిచయాలు, పరామర్శలు ఉన్నాయి. అన్నీ చతుర మాస పత్రిక, తెలుగునాడి, ఆంధ్రప్రభ డాట్‌కామ్‌లలో ప్రచురణ పొందినవి. శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి, పిలకా గణపతి శాస్ర్తీ, అంగర వేంకట కృష్ణారావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, మునిమాణిక్యం నరసింహారావు, పన్యాల రంగనాధరావు, విడి ప్రసాదరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, హితశ్రీ, టిఎస్‌ఏ కృష్ణమూర్తి-ఈపదిమంది రచయితలవీ రెండేసి నవలలు పరిచయం చేయబడినాయి. మల్లాదివారి సుప్రసిద్ధ నవల ‘కృష్ణాతీరం’తో మొదలై, వల్లంపాటి వెంకట సుబ్బయ్య నవల ‘ఇంద్రధనస్సు’తో పుస్తకం పూర్తయింది. ‘వీలున్నన్ని నవలల్ని ఇలా కూర్చాలన్నదే ప్రయత్నం. కాలక్రమం కానీ, మరే ఇతర క్రమం గానీ పాటించలేకపోయాను కారణం పుస్తక సేకరణలోని ఇబ్బంది’ అని తనమాటగా వివరణ ఇచ్చారు రచయిత.
సంపుటిలో-అధిక ప్రాచుర్యం పొందక, పాఠకులకు అందుబాటులో లేని -పోలవరపు శ్రీహరిరావు ‘నగ్ననగరం’, ఆలూరి బైరాగి ‘పాప పోయింది’, పరిమళా సోమేశ్వర్ ‘చేదునిజాలు’, కపిల కాశీపతి ‘ఇంతకీ నేనెవరు’, మధురాంతకం రాజారాం ‘త్రిశంకు స్వర్గం’, గంథం యాజ్ఞవల్క్య శర్మ ‘వెలుగులో వెలది’ వంటి మంచి నవలల్ని పరిచయం చేసి ఈనాటి ఒక సాహిత్యావసరాన్ని తీర్చారు రాజా రామమోహనరావు. అలాగే-యద్దనపూడి సులోచనారాణి ‘సెక్రటరీ’, ‘ఆరాధన’, శారద ‘మంచీ-చెడూ’, రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’, లత ‘మోహనవంశి’, పోలాప్రగడ సత్యనారాయణమూర్తి ‘కౌసల్య’, గోపీచంద్ ‘మెరుపుల మరకలు’, ఆనాటి దేవరాజు వేంకట కృష్ణారావు ‘వాడే వీడు‘, కొవ్వలి ‘సిపాయి కూతురు’ వంటి ప్రాచుర్యం పొందిన, విశిష్టమైన నవలల్ని ఈ సంపుటంలో పరిచయం చేయడం సముచితంగా ఉంది.
ఈ నవలా పరిచయాల్లో రాజారామమోహనరావు తాను నిర్దేశించుకున్న సాహిత్యపరమైన బాధ్యతకి అనుగుణమైన వ్యాసరచనా ప్రణాళికని రూపొందించుకుని, దాన్ని అన్ని వ్యాసాల్లోనూ అనుసరించారు. వ్యాసంలో ముందు ఒకటి రెండు పేరాల్లో నవలా హృదయాన్ని, ఇతివృత్త కేంద్ర బిందువుని వివరించి, ఆపైన నవల్లోని కథని-పాఠకుని కళ్ల ముందు దృశ్యమానమయ్యే రీతిలో విశదీకరించారు. అప్పుడు ఆ నవలా రచనలోని
నిర్మాణం,శిల్పం, శైలి వంటి గుణ విశేషాల్ని పేర్కొన్నారు. అవసరమైన చోట రచయిత పాత్ర చిత్రణ నైపుణ్యం, సంభాషణ రచనా చాతుర్యం వంటి ప్రత్యేకాంశాల్ని ఉదాహరణలతో సహా ఉటంకించారు. సులోచనారాణి ‘ఆరాధన’ పరిచయంలో ఇలా అంటారు ఈ రచయిత: ‘తక్కువ పాత్రలే అయినా, వివిధ సంఘటనలలో వాటి తీరుని ఒడిసి పట్టుకోగలగడం రచయిత్రి ప్రత్యేకత. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోని లోతైన విశే్లషణ, మనుషుల, మనసుల తీరుని నగ్నంగా బహిర్గత పరచడం ‘ఆరాధన’ స్థాయిని పెంచింది’.
అంగవైకల్యం ఉన్నవారి మీద అప్పుడప్పుడూ అందరూ జాలిపడతారు. కానీ మననుంచి వేరైన వారి మానసిక క్షోభ ఎలా ఉంటుందో తెలిపిందీ నవల. మనుషుల్ని మరింత దగ్గర చెయ్యగల నవల ఇది’ అని ముగింపు! నవలని విశే్లషించేటప్పుడు చిన్న అద్దంలో ఎంతో విస్తృతమైన భావనా పరిధిని చూపగలగడం రాజా రామమోహనరావు రచనానుభవానికీ, పరిణత సమీక్షా విధానానికీ నిదర్శనం.
కాగా, ఈ సంపుటంలో రెండు ప్రత్యేకంగా ప్రశంసార్హమైన అపూర్వ నవలా పరిచయాలు చోటు చేసుకున్నాయి. ఒకటి అంగర వెంకట కృష్ణారావు నవల ‘విరామం’. రెండవ ప్రపంచ యుద్ధం మాత్రమే నేపథ్యంగా, అప్పటి మన దేశపు క్లిష్టమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని వస్తువుగా స్వీకరించి, మనుషుల బతుకు గీతల్ని సహజంగాచిత్రించిన నవల ఈ ‘విరామం’. ‘మానవజీవితపు బాటలో ఒక మలుపు దిద్దిన’ ఆ యుద్ధ సంక్షోభం, మిలటరీ వారి సంక్షుభిత జీవిత పరిస్థితులు, ఎంతో అనుభూతి ప్రదంగా ఆవిష్కరింపబడిన నవల ఇది. ఆ రచయిత లోతైన దృష్టినీ, దృక్పథాన్నీ పట్టుకుని అంతే లోతైన ఉద్వేగంతో ఈ పరిచయాన్ని కూర్చారు ఈ సంపుటం రచయిత. అలాగే రెండవ నవల కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్లేగారి ‘బోయ కొట్టములు పండ్రెండు’. అద్దంకిలోని క్రీశ 848కి చెందిన పండరంగని శాసనం చూసి, చదివి ప్రేరణ పొంది ఆయా అంశాల చరిత్రని సేకరించి, అనేక వ్యయ ప్రయాసలకోర్చి, ఆ వాస్తవాల్ని నవలా నిర్మాణానికి అనువుగా మలుచుకుని అనన్య సామాన్యమైన శిల్పంతో ఉత్కంఠని ఉన్నతంగా పోషించే కథా కథనంతో ఈ నవలని రాశారు బాల సుబ్రహ్మణ్యం పిళ్లే. అటు ‘విరామం’ ఇటు ఈ ‘బోయ కొట్టములు పండ్రెండు’ కూడా ఈనాటి కాలానికి అరుదుగా లభించిన నవలా రత్నాలు. తెలుగువారి అదృష్ట ఫలాలుగా ఆ రచయితలు వీటిని మనకు అందించి అపూర్వమైన సాహిత్య సేవతో కీర్తిశేషులైనారు!
ఈ సంపుటంలోని విశే్లషణలన్నిటా కనిపించే మెరుపు-రాజారామమోహనరావు భాషా శైలి. అది ఎంతో సరళంగా, స్వాభావికంగా సాగి చదువరుల్ని అలరిస్తుంది. అసలు నవలన్ని తప్పక చదివి తీరాలి అనే ప్రేరణ ఇచ్చే విధంగా సాగిన ఈ ‘నవలా హృదయం-2’ సాహితీ ప్రియులకు నిక్కంగా ఒక స్వాధుఫలం!

-విహారి