అక్షర

ఆకాశవాణిలో దివి అనుభవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశవాణిలో
నా అనుభవాలు
-డి.వెంకట్రామయ్య
ఎమెస్కో ప్రచురణలు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మూడున్నర దశాబ్దాల పాటు, వార్తా విభాగంలో న్యూస్ రీడర్ పదవితో సహా, నాటక రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా పనిచేసిన సాహిత్యరంగ ప్రముఖుడు, కథకుడు దివి వెంకట్రామయ్య రాసిన ‘ఆకాశవాణిలో నా అనుభవాలు’ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టిన వారికి అది పూర్తయ్యే వరకు పరిపరి విధాల ఆసక్తిని, జిజ్ఞాసను రేకెత్తిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. డీవీ గారి జీవితంలో, ఆయనకు ఎన్నో అపూర్వమైన అనుభవాలు కలిగించిన ‘ఆకాశవాణి’ అనే ఒక గొప్ప సంస్థ, వ్యవస్థ గురించి ఆయన అభిప్రాయాల సంకలనమే ఈ పుస్తకం.
ఎనౌన్సర్‌గా రేడియోరంగ ప్రవేశం చేసిన వెంకట్రామయ్య కొద్ది రోజులకే తాను రాక ముందు నుంచే పని చేస్తున్న సీనియర్లతో తాను ఎలా అనుబంధం, సాన్నిహిత్యం పెంచుకుంది అన్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ పుస్తకంలో.
మొదటిసారి ఆకాశవాణి ఇంటర్వ్యూకు హాజరైనపుడు సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరైన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ వెంకట్రామయ్య ఇంటి పేరు అడిగి తెలుసుకుని ‘దివి నుంచి భువికి దిగి వచ్చావు అన్న మాట’ అని వ్యాఖ్యానించడాన్ని పేర్కొన్నారు డీవీ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెంకట్రామయ్య చేరిన నాటికి అక్కడ పని చేసే పదవీ విరమణ చేసిన, ఇంకా అప్పటికి పని చేస్తున్న పలువురు లబ్ధప్రతిష్టులైన వారి గురించి, వారితో ఆయన సాహచర్యం, సాన్నిహిత్యం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పుస్తకంలో పేర్కొన్నారు. వీరిలో దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, త్రిపురనేని గోపిచంద్, మునిమాణిక్యం, నరసింహారావు, బాలాంత్రపు రజనీకాంతరావు, బుచ్చిబాబు, న్యాయపతి రాఘవరావు, చిత్తరంజన్, దండమూడి మహీధర్, రావూరి భరద్వాజ, తురగా కృష్ణమోహన్‌రావు, నళినీ మోహన్ లాంటి ఎందరో ఉన్నారు. వీరందరితో తాను ఎలా కలసిమెలసి పని చేసిందీ వారి అనుభవాలు, తనకు ఎలా ఉపయోగపడిందీ సవివరంగా పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ప్రముఖ రచయిత, గొప్ప పాఠకులు, నిరంతర అధ్యయనశీలి బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు)తో సుమారు నాలుగేళ్ల పాటు ఆయన ప్రత్యక్ష, పర్యవేక్షణలో పనిచేసే అవకాశం తనకు లభించిందని వెంకట్రామయ్య అంటారు.
ఆకాశవాణిలో తెలుగు ప్రకటనలకు వాడే భాష చాలా రోజుల వరకు వాడుక భాష కాకుండా గ్రాంథికంగా ఉండేదని, అన్ని రకమైన ప్రకటనలకు ఒకే రకమైన భాష ఉపయోగిస్తూ, వైవిధ్యం లేకుండా పోయేదని, తాను కొంత చొరవ తీసుకుని ఆ పద్ధతిలో బుచ్చిబాబు అనుమతితో కొన్ని మార్పులు తీసుకుని రాగలిగానని డీవీ రాశారు. బుచ్చిబాబు మరణించిన దుర్వార్తను తానే రాసి చదవాల్సి వచ్చిందని, అలాగే జవహర్‌లాల్ నెహ్రూ హఠాన్మరణం వార్త కూడా తానే ప్రకటించానని వెంకట్రామయ్య రాశారు. నెహ్రూ చనిపోయినప్పుడు డ్యూటీలో వున్న వెంకట్రామయ్య ‘ఒక ముఖ్య ప్రకటన.. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కొద్దిసేపటి క్రితం కొత్త ఢిల్లీలో ఆకస్మికంగా మరణించారని తెలియపర్చడానికి చింతిస్తున్నాం’ అని చెప్పారు వెంకట్రామయ్య. అలాంటి ముఖ్యమైన వార్త, విషాదకర మైన వార్త శ్రోతలకు వినిపించేటప్పుడు కంఠస్వరంలో విషాదం, గాంభీర్యం కనపర్చాలి కాని, మరీ ఏడుస్తున్నట్లుగా మాట్లాడకూడదని రాశారాయన. తనకు కూడా ఉద్వేగం వచ్చిందనీ, కాని అదుపులో ఉంచుకున్నానని అంటారు.
ప్రభుత్వం చేతుల్లో వున్న అత్యంత శక్తివంతమైన సాధనం ఆకాశవాణి అయినప్పటికీ, అటువంటి సాధనాన్ని వినియోగించుకోవడలో ఎంతో కొంత విచక్షణ కనపర్చాలని, నిగ్రహం పాటించాలని అంటారు వెంకట్రామయ్య. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు కూడా శ్రోతలను ఆకర్షించుకుని, ఆకట్టుకోవాలే గాని విసుగెత్తించకూడదనేది ఆయన అభిప్రాయం. ఆకాశవాణి ఘోరాలను గురించి కూడా ఆయన రాశారు. మునిమాణిక్యం నరసింహారావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్ర్తీ ప్రస్తావన తెచ్చారాయన. మునిమాణిక్యం అసిస్టెంట్ ప్రొడ్యూసర్‌గా చేరి, పదవీ విరమణ చేసేదాకా అదే ఉద్యోగంలోను, జలసూత్రం జూనియర్ గ్రేడ్ స్క్రిప్టు రచయితగా చేరి అదే గ్రేడ్‌లో రిటైర్ అయ్యేదాకా పని చేయాల్సి వచ్చింది. ఇది అన్యాయమంటారు డీవీ. అలనాటి మహానుభావులే కాకుండా, ఆకాశవాణిలో ‘ఆర్టిస్ట్’ వర్గానికి చెందిన వారి గతి ఈనాటికీ ఇంతేనని, ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అనే సామెత ఆకాశవాణి కళాకారులకు అక్షరాలా వర్తిస్తుందని అంటారాయన.
వెంకట్రామయ్య తన పుస్తకంలో తనతో కలిసి పని చేసిన వారందరి గురించి విపులంగానో, క్లుప్తంగానో రాశారు. కాజువల్ ఆర్టిస్టుల గురించీ రాశారు. ఆయన తమ గురించి రాసిన వాక్యాలను వారందరూ విలువైనవిగా భద్రపరచుకునే విధంగా రాశారాయన. మొత్తం మీద అందరూ, ముఖ్యంగా ఆకాశవాణి గురించి తెలుసుకోవాల్సిన అందరూ చదవాల్సిన, చదివించాల్సిన అపురూపమైన పుస్తకం ఇది.
...............................................................................
మొదటిసారి ఆకాశవాణి ఇంటర్వ్యూకు హాజరైనపుడు సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరైన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ వెంకట్రామయ్య ఇంటి పేరు అడిగి తెలుసుకుని ‘దివి నుంచి భువికి దిగి వచ్చావు అన్న మాట’ అని వ్యాఖ్యానించడాన్ని పేర్కొన్నారు డీవీ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెంకట్రామయ్య చేరిన నాటికి అక్కడ పని చేసే పదవీ విరమణ చేసిన, ఇంకా అప్పటికి పని చేస్తున్న పలువురు లబ్ధప్రతిష్టులైన వారి గురించి, వారితో ఆయన సాహచర్యం, సాన్నిహిత్యం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పుస్తకంలో పేర్కొన్నారు.

-వనం జ్వాలా నరసింహారావు