అక్షర

ఆనాటి కథల్లో నానాటి బతుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌలత్ బేగం కథలు
(కథల సంపుటి)
ప్రతులకు
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

దౌలత్ బేగంగారి ఇతర కథల్లోనూ ఆనాటి లోకం రీతీ రివాజునీ, సంఘంలోని
విపర్యాయాల్నీ చూస్తాం. మనిషి బతుకులోని వంకర గీతల
చిత్రణనీ చూస్తాం. ఆమె కథల్లో దృశ్య స్ఫురణ కలిగించే ప్రకృతి వర్ణనలూ, మనుషుల ఆకార వికారాల్ని రూపుకట్టించే
వివరణలూ - ఎంతో
స్వాభావికంగా సాగి
చదువరుల్ని అలరిస్తాయి.

21 కథల సంపుటి ఇది. ఈ కథలన్నీ 1966 నుంచీ 1968 వరకూ వివిధ దిన వార మాస పత్రికల్లో ప్రచురింపబడినవి. మారుతున్న సామాజిక సందర్భాలూ, ప్రజల బతుకు తీరు, వారి మనస్తత్వాలు, విభిన్న సమూహాల అస్తిత్వ చైతన్యం వంటి కారణాల వలన ఈనాటి కథా రచనలో కొన్ని మార్పుల్ని అనివార్యం చేశాయి. వస్తు విస్తృతితోపాటు, దానికి అనుగుణమైన శిల్ప పరిణతీ వర్తమాన కథా సాహిత్యం ప్రతిబింబిస్తోంది. అయితే, ఈ పరిణామాలకు ముందు తరంలోని సాంఘిక సమస్యల వైవిధ్యం, మనుషుల మనస్తత్వాల్లోని వైరుధ్యాలు, వారు పాటించిన కొన్ని జీవిత విలువల పర్యవసానాలు - దౌలత్ బేగం కథల్లో ద్యోతకవౌతున్నాయి.
ఒంటరిగా ఉంటూ, ఉద్యోగం చేస్తున్న యువతి చుట్టూ అనేకానేక అపప్రధల కథలల్లటం- సమాజం పోకడల్లో ఒక చీకటి పర్వం. దీనికి కొంతమంది నరం లేని నాలుకల విజృంభణ. తీరా అసలు నిజాలు బయటపడే సరికీ పుణ్యకాలం గడిచిపోతుంది. ఆ ప్రచారంలో గొంతు కలిపిన వారికి పశ్చాత్తాపం, జ్ఞానోదయం అప్పుడు కలుగుతాయి. ఈ సంపుటిలోని మొదటి కథ ‘అపోహ’లోని ఇతివృత్తం ఇదే!
అందమూ, సత్ప్రవర్తనా, ప్రకృతి పట్ల ఆరాధనాభావం, అనాథల పట్ల కరుణ, మధురమైన కంఠస్వరం, మంచి మనసూ ఉన్న నిప్పు లాంటి యువతి శాంతి. కానీ, ఆశ్రమ నిర్మాణ దాతే ఆమెపై కనే్నసి, దేవతలాంటి ఆమెకి సుఖం లేకుండా ఏడిపించుకు తింటాడు. చివరికి ఆమెకు ఆత్మహత్యే శరణ్యవౌతుంది. ఆ కాలంలోని కథానికల్లో చాలా వాటిలో ఇలాంటి ముగింపుల్ని చూసేవాళ్లం. కథ పేరు ‘శాంతి’.
‘మనసిచ్చిన మగువ’ కథలో అందం, ఆనందం అందించే భార్య మనసుని స్వీకరించాల్సిన భర్త ‘ఊళ్ల వెంట తిరుగుతూ’ ఉంటాడు.
అసలు జీవితంలో పెళ్లి చేసుకోనే చేసుకోనని కబుర్లు చెప్పి, ఆరంభశూరత్వం చూపిన రాధ - పెళ్లి ఆవశ్యకతని గుర్తించి పెళ్లి చేసుకుంటుంది ‘ఓటమి’ కథలో!
దేశసేవకు జీవితాన్ని అంకితం చేసి యుద్ధంలో అసువులు బాసిన వీరుని కొడుకుని ‘తండ్రి లేని పిల్లవాడు’గా నలుగురూ ఎత్తిపొడవటం, ఆ పిల్ల వానిని మానసికంగా హింసించటం - అదే పేరుగల కథలోని ఇతివృత్తం.
బతికే వున్న పదేళ్ల కొడుకుని చనిపోయాడని శవంలా రోడ్డుపక్కన పడుకోబెట్టి అడుక్కునే తల్లి దైన్యాన్ని ‘చావు చచ్చిపోయింది’ కథ చిత్రించింది. చివరికి ఆ పిల్లవాణ్ని నిజంగానే శవంగా భావించిన దళారులు ఆ తల్లి చేతిలో వంద రూపాయలు పెట్టి బలవంతంగా అవయవ దానానికి లాక్కుపోతే, ఆమె భర్త ముందు ఆక్రోశంతో విలపిస్తుంది ‘చావు చచ్చిపోయింది’ అని! సంభావ్యత కొరవడి, కల్పనపాలు మరీ ఎక్కువైన కథ!
దౌలత్ బేగంగారి ఇతర కథల్లోనూ ఆనాటి లోకం రీతీ రివాజునీ, సంఘంలోని విపర్యాయాల్నీ చూస్తాం. మనిషి బతుకులోని వంకర గీతల చిత్రణనీ చూస్తాం. ఆమె కథల్లో దృశ్య స్ఫురణ కలిగించే ప్రకృతి వర్ణనలూ, మనుషుల ఆకార వికారాల్ని రూపుకట్టించే వివరణలూ - ఎంతో స్వాభావికంగా సాగి చదువరుల్ని అలరిస్తాయి. అయితే, ఇతివృత్త కేంద్రీకరణ లేనందువలన చాలా కథలు పఠితల మనసులపై గాఢమైన ముద్రని వేయవు. మనస్తాత్వికం ప్రధానమైన ‘గతి తప్పిన విధి’ ‘వీడిన మబ్బు’ వంటి కథలు కొంత అనుభూతిప్రదంగా నడిచాయి. ఏభై ఏళ్లనాటి తెలుగు సమాజ జీవన దృశ్యాన్ని పరిమిత రీతిలో దర్శింపజేసే ‘దౌలత్ బేగం కథలు’ సంపుటి చదివించే గుణాన్ని నిండుగా సంతరించుకున్న రచన.

-విహారి