అక్షర

కరుణశ్రీ కరుణాంతరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరుణశ్రీ సాహిత్యం-5
(వ్యాసవేదిక)
పుటలు: 300
వెల: 200/-
ప్రతులకు: నవచేతన
బుక్‌హౌస్
ఆబిడ్స్, హైదరాబాద్.
ఇతర శాఖలు

అచ్చపు జుంటి తేనియల, ఐందవబింబ సుధారసాల గో
ర్వెచ్చని పాలు మీగడల, విచ్చిన కనె్నగులాబి బుగ్గలన్
మచ్చరికించు ఈ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ
వెచ్చట నెర్చినావొ సుకవీ! సుకుమార కావ్య కళానిధీ!
ఉదయశ్రీ, కుంతీకుమారి, పుష్పవిలాపం, పాకీపిల్ల మొదలగు ఖండికలు మనిషిలో గూడుకట్టుకొన్న సౌకుమార్యానికి ఎత్తిన జయపతాకలు. ఆయన పద్యరచనం, ఆయన మనస్తత్వం శిరీష కుసుమపేశల సదృశం. నిలువెల్లా మూర్త్భీవించిన మార్దవం కరుణశ్రీ జంధ్యాల పాపయశాస్ర్తీ. ఆయన పద్యాలను చదువుకోవడం, ఆస్వాదించడం, ఆనందించడం అంటే యాంత్రిక నాగరికపు టెడారిలో అనూహ్యంగా కురిసిన తుషారశీకరాలకు పరవశించడం లాంటిది. నవచేతనగా పేరు మార్చుకున్న విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రకటించిన జంధ్యాల పాపయ్య శాస్ర్తీ సమగ్ర రచన సంపుటాల్లో ఐదవది ఇది. దీనిలో జంధ్యాల వారి వ్యాసాలు చోటు చేసుకున్నాయి. జంధ్యాల వారి పద్యం ఎంత అనవద్య హృద్యమో, గద్యం సైతం అంతే సమ్మోహనం. ఈ గ్రంథంలో కొలువుదీరిన 21 వ్యాసాలు ఉదాత్తంగాను, ఉజ్జ్వలంగాను సాగుతూ రసజ్ఞులను ఉర్రూతలూగిస్తాయి. విషయసాంద్రం, మనోహర నివేదనం ఈ వ్యాసాల లక్షణం.
ఈ వ్యాసాల్లో కొన్ని ప్రత్యేక సంచికల కోసం రాసినవి. మరికొన్ని పీఠికలుగా, సంపాదకీయాలుగా, సమీక్షలుగా రాసినవి. మరి కొన్ని ఆకాశవాణి ప్రసంగాలు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాసిన వ్యాసం ఆత్మకథాత్మకంగా సాగుతుంది. పోతన మీది వ్యాసం ఎదురుగా ఉన్న పోతనతో చేసిన సరస సంభాషణ. రంగనాథ, మొల్ల రామాయణాలు మొదలుకొని విశ్వనాథ, కంబ రామాయణాల దాక వచ్చిన వివిధ రామాయణాల పరిచయం ఒక సాహిత్యోపన్యాస సముచ్చయం. దీనిలో పేర్కొనబడిన తంగిరాల జగన్నాథశాస్ర్తీ జగన్నాథ రామాయణం, కొత్తపల్లి అచ్చయ్య కవి దాశరథీ విలాసం, రంగయకవి రామోదయం మొదలగు కావ్యాలు ఎప్పుడూ విననివి. కననివి.
ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్రను, మహత్యాన్ని తెలుపుతూ రాసిన సంపాదకీయ వ్యాసం ఆస్తిక జనులను అలరిస్తుంది. కవిత్వం ఎట్లా ఉండాలో చెప్తూ కరుణశ్రీ వారు చెప్పిన మాటలు..
కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగ వీచినట్లు, క్రొ
వ్వలపులు లేచనట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, తీ
వలు తలలూచినట్లు, చెలువల్ కడకన్నుల చూచినట్లు, ఆ
త్మలు పెనవైచినట్లు కవితల్ రచియింతురహో! మహాకవుల్
ఆచార్య ఎస్వీ జోగారావు ప్రసన్న కుసుమాయుధం ఒక విలక్షణ కృతి. ఎస్వీ జోగారావు ఊహావైదగ్ధిని, పద్య రచనా రామణీయాకాన్ని, కమనీయ కల్పనా విలాసాన్ని, చతుర సమాస నిర్మాణ విన్యాసాన్ని ఉగ్గడిస్తు కరుణశ్రీ చేసిన సమీక్ష రసికులకు, మృదు హృదయ సారసికులకు షడ్రసోపేతమైన విందు భోజనం.
ఘంటసాల వెంకటేశ్వరరావు పాటలు, వడ్డాది పాపయ్య చిత్రాలు, కరుణశ్రీ పద్యాలు, శ్రీశ్రీ మహాప్రస్థాన కవిత్వం ప్రజల గుండెల్లో ఎప్పుడూ వెలుగులు పంచుతూనే ఉంటాయి. ఆకాశవాణి ప్రత్యేక జనరంజని కోసం ఘంటసాల పాటల మీద కరుణశ్రీ చేసిన సోదాహరణ వ్యాఖ్యానాత్మక ప్రసంగం బాగుంది. ఘంటసాల ఏ పాట పాడినా, ఏ పద్యం పాడినా, ఏ శ్లోకం చదివినా సంగీతానికి ప్రాధాన్యమిచ్చి సాహిత్య సౌందర్యాన్ని చెడగొట్టలేదు. సంగీత సాహిత్యాలకున్న సన్నిహిత సంబంధాన్ని సరసంగా సముచితంగా సర్వాంగ సుందరంగా దర్శించి ప్రదర్శించిన గాయక సార్వభౌముడు (పు.251) అని కరుణశ్రీ వ్యాఖ్యానించి 42 ఏళ్లయింది. నేటికీ ఘంటసాల పాటలు విని పరవశిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తీ (జననం 1912 ఆగస్టు 4, అస్తమయ్య 1992 జూన్ 21) చిరకాలం ఆంధ్రోపన్యాసకులుగా పని చేశారు. ఉదయశ్రీ కావ్యం 50 ముద్రణలు పొందిందంటే ప్రజలు దాన్ని ఎంత అక్కున చేర్చుకున్నారో అవగతమవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరఫున పోతన భాగవతాన్ని తాత్పర్య సహితంగా 16 భాగాల్లో వెలువరించారు. గౌతమబుద్ధుని జీవితాన్ని అక్షరాభిషేకం చేయడమే గాక మనస్సు, మాట, పేరు ‘కరుణశ్రీ’గా మలచుకున్నారు. రాష్టప్రతి జ్ఞాని జైల్‌సింగ్, ముఖ్యమంత్రులు టి.అంజయ్య, నందమూరి తారకరామారావు, పుట్టపర్తి సాయిబాబా, విశ్వయోగి విశ్వంజీ లాంటి పెద్దలెందరో కరుణశ్రీని సన్మానించి ఔచిత్యాన్ని ప్రకటించారు. కరుణశ్రీ మరణవార్తను అమెరికా, జపాను పత్రికలు ప్రకటించాయి. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఒక పార్కుకు కరుణశ్రీ పేరు పెట్టారంటే కరుణశ్రీ కీర్తి ఎంతదాకా వ్యాపించిందో తెలుస్తుంది.

-ఆచార్య వెలుదండ నిత్యానందరావు