అక్షర

అనుభూతుల ఇంద్రచాపం ‘అలౌకికం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలౌకికం
లలితానంద్ కవిత
పుటలు:272,
వెల:రూ.200/-
ప్రతులకు: బి.లలితానంద ప్రసాద్, 12-24, ‘సృజన’ రాధాశాల వీధి, దుగ్గిరాల-522 330, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
08644-277559
9247499715
**

జీవితం ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలు వెలిసిపోయి కేవలం దుఃఖవర్ణమే మిగిలినపుడు మంచి కవిత్వం మనల్ని కన్నతల్లిలా గుండెలకు హత్తుకొంటుంది. ఉత్సాహం ఉత్తేజం సీతాకోకచిలుకల రెక్కలు తెగి బతుకు నిరాసక్తంగా, నిర్మొహమాటంగా పరిణమించినపుడు కవిత్వం మన మనస్సుకు మళ్లీ రెక్కలు మొలిపిస్తుంది. అలౌకికానంద వీధుల్లో విహరింపజేస్తుంది. అలాంటి కవితా సంపుటి ‘అలౌకికం’ కవి లలితానంద్.
ఈ లోకంలో పిల్లలను ప్రేమించనివాళ్ళు, పువ్వులను ఇష్టపడనివారెవరూ ఉండరు. అలాంటి పిల్లల గురించి ‘అలౌకికం’ కవితలో ‘‘ ఓ మెత్తటి ఈక / పసివాని కనుగ్రుడ్ల కాంతి గోళాలై / నను గ్రహాంతరవాసం చేయిస్తాయి’’ అంటూ విరబూసిన వారి నవ్వుల తోటలో విహారానికై నా అణువణువూ కనుపుకనుపుగా సీతాకోకలై వలసలై పోతాయి అని చెప్తూ అన్నిటికన్నా పరాకాష్ఠగా ‘‘పసివారికన్నా పరమాత్ముడెవ్వడు పృధ్విలో / లౌకికాన్నుంచి అలౌకికాలకు కొనిపోయే / వారిని కొలవలేని కాంచలేని హీనుడెవ్వడు!’’ అని లౌకిక జగత్తునుంచి అలౌకిక జగత్తులోకి తీసుకువెళ్లి ఆనందాన్ని కలిగించే పిల్లల్ని ప్రేమించనివారికంటే హీనులెవరూ ఉండరని అంటారు.
కవిత్వాన్ని గురించి ప్రాచీనులు అనేక నిర్వచనాలు చెప్పారు. ‘కవిత్వం ఒక ఆల్కెమీ’ అని తిలక్ అంటే, ‘కదిలేదీ కదిలించేదీ’ కవిత్వమని శ్రీశ్రీ అంటాడు. ‘కవితాజలం’ కవితలో ‘‘కరుణించే నీటిలో / కరిగించే కవితలు / స్థిరాగమన కవితలా నీరు / భావోద్వేగ శిఖరం నుండి తేట నీటిలా కవిత/’’ అంటూ ‘‘కన్నీటి చుక్కలో పారే కారుణ్య కిరణాలు / సృజనాకాశంలో కవిగాంచే ఇంద్రధనుస్సులు’’ అని అంటారు. సృజనాత్మకత అనే ఆకాశంలో భావాల ఇంద్రధనుస్సులు సృష్టించడం కవి స్వభావం అని కవిత్వానికి తనదైన నిర్వచనం ఇస్తారు. కవికి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ప్రధానం. ఈ మూడిట్లో ప్రతిభ ప్రధానం. ప్రతిభ లేకపోతే మిగతా రెండూ వున్నా ఏం ప్రయోజనం వుండదు.
ప్రపంచీకరణ వలన పాశ్చాత్య దేశాల ప్రభావం ప్రాచ్య దేశాలపై బాగా పడుతుంది. ఆ సంస్కృతీ ప్రభావంవలన భారతీయ సంస్కృతిలో పెనుమార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇంటికొకరు అమెరికాకు ఎగిరిపోతున్నారు. చదువుకోసమో, ఉద్యోగం కోసమో వెళ్లి ఆ దేశంలోనే స్థిరనివాసం ఏర్పరచుకొంటున్నారు. తల్లిదండ్రులేమో భారతదేశంలో. కొడుకులేమో డాలర్ల దేశంలో. తల్లి కానీ తండ్రి కానీ మరణించినా ఇక్కడకు రావడానికి వాళ్లకు సెలవు దొరకదు. ఈ కారణంతో తల్లి చావుబతుకుల్లో వుంటే చూడడానికి కూడా రాకుండా వున్న వాళ్ళు మనకు కనిపిస్తూనే వుంటారు. కానీ ‘వీడియో మరణం’ కవితలో తల్లి అంతిమ క్షణాల్ని, ఆ తర్వాత జరిగే అంత్యక్రియల్ని వీడియో తీసి పంపించమంటాడు ఒక ప్రబుద్ధుడు. భారతీయ భాషల్లో వచ్చిన గొప్ప కవితగా పేరుపొందిన దీన్ని మలయాళం లో అయ్యప్ప ఫణికర్ రచించాడు. దానికి తెలుగు అనువాదమిది.
ఈ కవిత చదివాక మనసంతా వికలమైపోతుంది. జీవితమంతా తల్లిదండ్రుల్ని చూడకపోయినా ఆఖరికి చివరి ఘడియల్లోనైనా వచ్చి చివరి చూపు చూస్తారు. కానీ ఇక్కడ మరణాన్ని కూడా వీడియో తీసి మిత్రులకి చూపించాలనుకోవడం ఎంత అమానుషమో అనిపిస్తుంది.
ఈనాడు వస్తువ్యామోహం విపరీతంగా పెరిగిపోయింది. ఇంట్లో ఫ్రిజ్ మీద చిన్న గీత పడితె విలవిల లాడిపోతున్నారు కానీ, సాటి మనిషి మనసుకు ఎన్ని గాయాలైనా పట్టించుకోవడంలేదు. మనిషి మార్కెట్ వస్తువైపోతున్నాడు. ఈ వైనాన్ని గురించి ‘బద్ధలవుతున్న భూగోళం’లో ‘‘వ్యక్తి వస్తువైన ప్రపంచం / ఇల్లు ఓ వికళాత్మక మ్యూజియం / కుటుంబ సంబంధాలు సృజనాత్మక హింసాత్మకం / కన్నవారిని పొలిమేరకు తరిమించి / చిన్నవారిని ఎగరేసుకుపోతుంది’’ అని వాస్తవ భారతాన్ని వ్యాఖ్యానిస్తారు.
బాల కార్మిక వ్యవస్థ చట్టం చేసినా మన సమాజంలో బాల కార్మికులకు కొరతలేదు. అక్షరాలు దిద్దాల్సిన చేతులు ఆకలికి తట్టుకోలేక ఫేక్టరీల్లో కూలీలుగా, హోటళ్ళలో సర్వర్లుగా పనిచేస్తున్న ముక్కుపచ్చలారని బాలలు మన కళ్లెదుట కనిపిస్తూనే వుంటారు. ‘బతుకుబండి’లో దూది చేతులు మంత్రజలంతో బతుకంత బరువైన పెట్టెతో స్తూపాల్ని కరిగిస్తున్నది. దూదిలాగా సుకుమారమైన చేతులతో కష్టపడి పనిచేస్తున్నాడని, బట్టలకి ఇస్ర్తి పెట్టి బతుకుబండిని నెట్టుకొస్తున్నాడని అంటారు. ఆ ఇస్ర్తిపెట్టె బతుకంత బరువైనదని ఆ పసిబాలుని వ్యథాచిత్రాన్ని చిత్రీకరిస్తారు.
ఈ ప్రపంచంలో నేల, గాలి, నీళ్లు అందరివే. ఇప్పుడు పెద్ద పెద్ద నగరాల్లో ఆక్సిజన్ పార్లర్లు వెలిశాయి. ఈ జాబితాలో ఇప్పుడు నీళ్ళు కూడా చేరాయి. జీవనదీ జలాలను వ్యాపార జలాలుగా మార్చేస్తున్నారు. నీళ్ళమీద కోట్ల కొద్దీ వ్యాపారాలు చేస్తున్నారు.
ఒకప్పుడు బాటసారులకు చలివేంద్రాలమర్చిన దేశంలో అడుగడుగునా అమ్మకానికి నీళ్ళ సీసాలు ప్రత్యక్షం. ‘సీసాలో విశ్వం’ కవితలో ‘‘ప్రాణికి ఊపిరులూదిన జలం / భూబంతిని తేలియాడించే బిందువు / లేబిళ్ల గుప్పిట్లో మార్కెట్లో జపం / మానవాళి స్వయంకృతాపరాధం’’ అని ఉచితంగా దొరికే నీళ్ళు కొనుక్కునే వస్తువైపోయిందని వ్యాఖ్యానిస్తారు.
ఇప్పటికీ మనం వరకట్న హత్యల ఉదంతాలు చదువుతూనే వుంటాం. కట్నాల కోసం అత్తింటివారి ఆరళ్ళు తట్టుకోలేక తనువు చాలించిన తరుణుల విషాద వృత్తాంతాలు చూస్తూనే ఉంటాం. మామూలుగా పెళ్లిచూపుల్లో వధువుకి ‘ఇలాంటి లక్షణాలుండాలి. ఇంత కట్నమివ్వాలి’ అనుకొంటారు. దీనికి విరుద్ధంగా కవిగారు ‘కారుణ్యం తప్ప- కార్పణ్యం, కపటం ఎరుగని / వధువు కావాలి’’ అంటారు ‘అనే్వషణ’ కవితలో. ‘‘మా నట్టింట కొలువుదీరే - అమ్మలాంటి అవనిలాంటి- ఆమని లాంటి వధువు కావాలి- మా అబ్బాయికి - ఓ వధువు కావాలి/రావాలి మా ఇంట కంటి పాపగా / మా పెద్దమ్మాయిగా’’ అంటారు. నిజంగా కోడల్ని కూతురిగా చూసుకోవడంకన్నా కావాల్సిందేముంది ఈ ప్రపంచంలో. అప్పుడు ఈ హింసా సంఘటనలుండవు కదా!
మనసును ఆర్ద్రపరచే మరో కవిత ‘అమ్మ అమ్మే’ - ఈ ప్రపంచంలో మనను నిస్వార్థంగా ప్రేమించేది అమ్మ. అమ్మను మించిన దైవం లేదు. ఈ కవితలో ‘ఎవరికైతేనేం అమ్మ అమ్మే / ఏ అమ్మను చూసినా మా అమ్మను చూసినట్లే’’ అంటారు. ఈ పాదాలకు ఎంతైనా వ్యాఖ్యానం రాయవచ్చు.
ఈ పుస్తకంలో హైకూలు కూడా ఉన్నాయి. ‘‘ప్రయాణంలో /తెరచిన పుస్తకంపై సీతాకోక/ ఇక చదువెందుకు’’ ప్రయాణం చేస్తూ పుస్తకం తెరచాడు ఓ పుస్తక ప్రియుడు. ఆ పుస్తకం పుటలమీద ఓ అందమైన సీతాకోకచిలుక వాలింది. ఆ రంగు రంగుల సీతాకోచిలుక అందాన్ని చూస్తూ మైమరచిపోతాడు. ఆ భావకుడు ఇంకా చదువెందుకు’’ అనిపిస్తుంది మనక్కూడా.
రైతు కొంగ, లాలిత్యలోకాలు, శరీరాలయాలు, సూర్యతిలకం, ఎడారి హరితం, కారుణ్యకిరణాలు, నాసికాశిఖరం, బాల్యం బుడగ, ఎదకొలను, వౌనవనం, ఆర్ద్రతా నైవేద్యం, బతుకు శిల మొదలగు రూపకాలు మనసును అలరింపజేస్తాయి.
ఆధునిక సమాజంలోని సంక్లిష్టతను, మానవ జీవితంలోని బహుముఖ పార్శ్వాలను స్పృశించిన ఈ సంపుటిలని కవితలు పాఠకునిలో రసానుభూతిని సృష్టించి అలౌకికానందాన్ని కలిగిస్తాయి. అద్భుతానుభూతి జగత్తులో విహరింపజేస్తాయి.

-మందరపు హైమవతి