అక్షర

ఆదర్శ పాత్రికేయ జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాపకాల వరద
డా.జి.ఎస్.వరదాచారి
పుటలు: 272.. వెల: రూ.150
ప్రచురణ: ఎమెస్కో బుక్స్ ప్రై.లి.
గగన్‌మహల్‌రోడ్
హైదరాబాద్-500 029.
**

భాష ఏదైనా జర్నలిజంలో జీవిత కాలం పనిచేసి లబ్ధప్రతిష్ఠులైన జర్నలిస్టుల జీవిత చరిత్రలు మరితర రంగాల గొప్ప వ్యక్తుల కొన్ని జీవిత చరిత్రల వలనే ఎంతో విలువైనవి. పాఠకులకు ఆసక్తి కలిగించి, చదివించి, లోకరీతి, జీవిత విలువల అవగాహనను పెంచుతాయి. ‘వరదాచారి జ్ఞాపకాలు’ ఇలా వచ్చిన ఒక కొత్త గ్రంథం.
డా.జి.ఎస్.వరదాచారి దీర్ఘకాలం పత్రికలలో పనిచేయడమే కాదు, జీవితాన్ని జర్నలిజానికి అంకితం చేసిన పత్రికా రచయిత. 20వ శతాబ్ది ఆరవ దశకం నుంచి పత్రికా రంగంలో ఉన్న గొప్ప జర్నలిస్టులలో ఆయన ఒకరు. జర్నలిస్టుల కీర్తి, ఉన్నతి వారు చేసే ఉద్యోగాలను బట్టి మాత్రమే ఉండవు. ఉద్యోగ పదవులు కీర్తి కలిగించవని కాదు. కాని, వాటితో నిమిత్తం లేకుండా జర్నలిస్టుకు అతడి రచనలు కీర్తి కలిగిస్తాయి. జర్నలిజం రాజకీయాల వంటి రంగం కాదు. పత్రికా రచయితల ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు. సమర్థుడు ఏ పత్రికలో అయినా రాణిస్తాడు. పాఠకుల ఆదరాన్నీ, సాటి పత్రికా రచయితల నుంచి గౌరవాన్నీ పొందుతాడు. వరదాచారి కీర్తి అతడు పని చేసిన ఏ ఒక పత్రికకో పరిమితమై లేదు. ఎక్కడ తెలుగు భాష ఉంటే అక్కడెల్లా ఆయనకు జర్నలిస్టుగా గుర్తింపు ఉంది. ఆ విధంగా వరదాచారి తెలుగునాట సుప్రసిద్ధ జర్నలిస్టులలో ఒకరు. ఎనభై నాలుగు సంవత్సరాల పరిణత వయస్సులో ఆయన స్వీయ చరిత్ర రాశారు. ‘జ్ఞాపకాలు’ అని పేరు పెట్టారు. పేరు ఏమి పెట్టితేనేమి అది ఆత్మకథే. తెలుగువారిలో గొప్ప జర్నలిస్టులు గణనీయంగా ఉన్నా స్వీయ చరిత్రలు రాసిన వారు తక్కువే. అందులోనూ ఇంగ్లీషు జర్నలిజంలో రాణించిన జర్నలిస్టుల స్వీయచరిత్రలే ఎక్కువ. ఇంగ్లీషులో రాశారు కనుక జాతీయ స్థాయిలో అవి ప్రాచుర్యం పొందాయి. వరదాచారి ఆత్మకథ తెలుగులో స్వీయ చరిత్ర సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నది.
వరదాచారి తన రచన ప్రారంభిస్తూనే తనది ‘అతి సామాన్యమైన జీవితం, గొప్పగా చెప్పుకోడానికి ఏమీ లేదు’ అని రాశారు. అది ఆయన వినయం. తన బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఆయన జీవితంలో కొత్త తరాలు తెలుసుకోవలసిన, ముఖ్యంగా జర్నలిస్టులకు ఉపయోగపడే విశేషాలు చాలా ఉన్నాయి. పత్రికా రచనలోనేగాక ఆయన జీవితానికి ఒక విశిష్టతను కలిగించే కొన్ని ఘట్టాలు, సాధించిన విజయాలు ఉన్నాయి. వాటిని ఆయన గ్రంథం సంక్షిప్తంగా తెలియజేస్తున్నది.
వరదాచారి పుస్తకం ప్రథమాధ్యాయాలలో తన చిన్ననాటి ముచ్చట్లు, వివాహం మొదలైన విశేషాలు రాశారు. వాటిని ‘అంతేకదా’ అనుకోడానికి వీలులేదు. అలనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను గురించి ఆయన చిత్రించినంత నిజాయితీగా సమకాలీన జీవిత చరిత్రలలో, నాకు తెలిసినంతవరకు, మరెవరూ రాయలేదు. కుటుంబ జీవితంలోను ఇతరులు తెలుసుకొని నేర్చుకొనవలసిన విశేషాలు ఉన్నాయి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబంలో ఇతరులపట్ల వ్యక్తికి ఉండే బాధ్యతలను అవి తెలియజేస్తాయి. ఆదాయం తక్కువైనా ఉన్నంతలో తృప్తిగా జీవితం గడపటం, నలుగురి చేత మంచి అనిపించుకోవటం ఆయన జీవితంలో చూడవలసిన ముఖ్య పార్శ్వం. వరదాచారి 22 సంవత్సరాలు ఆంధ్రభూమికి సేవలు అందించటం ఆయన జీవితంలో ఒక గొప్ప అధ్యాయం. న్యూస్ ఎడిటర్‌గానే ఉద్యోగం చేస్తేనేమి, చాలాకాలం ‘ఆయనే ఆంధ్రభూమి, ఆంధ్రభూమే ఆయన’ అనే పేరు ఉండేది. అక్కడే ఆయన ఎడిటరై ఉండవలసింది, కాలేదు. యాజమాన్యాలు ఎడిటర్లను నియమించేటప్పుడు అనేక కోణాల నుంచి పరిశీలన చేస్తాయి. ఎడిటరు కానందువల్ల ఆయనకు అక్కడ అంతకంటె తక్కువ గౌరవం ఎప్పుడూ కలగలేదు. ఇతర పత్రికా సంపాదకులకు వచ్చి, ఆయనకు రాని గొప్ప అవార్డులు ఏమీ లేవు.
జర్నలిస్టుకు వృత్తి పట్ల నిబద్ధత, సత్యనిష్ఠ, సమగ్ర విషయ పరిజ్ఞానం, భాష మీద పట్టు ముఖ్యమైన యోగ్యతలు. అవి వరదాచారికి పుష్కలంగా ఉన్నాయి. సాధన వాటిని శిఖర స్థాయికి చేర్చింది. ఆయన జీవితారంభంలోనే ఎంచుకొన్న మార్గం జర్నలిజం. అదే ఆయన జీవితమైంది. ఏ సంస్థలో ఎలా పని చేసినదీ, ఏమి అనుభవాలైనవీ ఆయన రాశారు. ఇవిగాక ఆయన ప్రత్యేకతలు కొన్నింటిని ‘జ్ఞాపకాలు’ గ్రంథం తెలియజేస్తున్నది.
వరదాచారి ఏ పత్రికలో పని చేసినా యాజమాన్యాల నుంచి కంటె సాటి ఉద్యోగస్తుల నుంచి, ముఖ్యంగా సంపాదక విభాగం సిబ్బంది నుండి ఎక్కువ గౌరవాన్ని, అభిమానాన్ని పొందారు. కారణం ఏమిటంటే ఆయన తన సహచరులను ప్రేమగా చూసేవారు. వారి శ్రేయస్సు చూడటం ఆయనకు ‘సహజ ధర్మం’గా తోచేది. జర్నలిస్టుగా ఆయన రాసుకొన్న అనుభవాలను చదివితే ఎవరికైనా అదే అనిపిస్తుంది. సహచరులకు సాయపడటం ఆయన జీవిత ప్రత్యేకతలలో ఒకటి.
బాల్యంలో తండ్రి చెప్పిన, చెప్పించిన చదువు ఆయనలో గొప్ప సంస్కారాన్ని కలిగించింది. తనకున్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవటం కూడా ఆయనకు సహజ విధానమే అనిపిస్తుంది. ఎవరికైనా ఏదైనా తెలియనిది చెప్పటంలో ఆయనకు గొప్ప సంతృప్తి ఉంది. అది అధ్యాపక లక్షణం. మరి, ఆయన ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు ఎంచుకోలేదు? ఆయనే తన గ్రంథంలో ఇలా చెప్పారు. ‘ఉపాధ్యాయ వృత్తి, పత్రికా రచనా వ్యాసం - రెండూ సమాజాన్ని సర్వశ్రేయో మార్గం దిశగా నడుపుతాయని నమ్మకం. రెంటిలో జర్నలిజానికే కొంత పైచేయి. కనుక జర్నలిజం వైపే మొగ్గాను.’ పత్రికలలో పని చేయటం మానేసిన తరువాత ఆయన శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశారు. విధి ఆయన సహజ అధ్యాపక లక్షణాన్ని ఆ పదవికి చేర్చింది.
వరదాచారి ప్రత్యేక యోగ్యతలలో మరొకటి ఆయన తెలుగు భాషాభిమానం, భాషాభినివేశం. చిన్నప్పటి నుంచి తెలుగంటే ఇష్టం. ఆయన కావాలనుకొంటే ఇంగ్లీషు జర్నలిజంలోకి వెళ్లి ఉండవచ్చు. కాని తెలుగునే ఎంచుకున్నారు. ‘వరదాచారి జ్ఞాపకాలు’ పుస్తకం చదివితే ఆయన భాషాభిమానం తెలుస్తుంది. అందుకే అది ఇటీవల వచ్చిన చాలా మంచి తెలుగు రచనలలో ఒకటి అనిపించుకొంటుంది. ఎంతోమంది విని ఉండని చక్కని తెలుగు పదాలు ఈ గ్రంథంలో కనిపిస్తాయి. ‘తంతె’ (మెట్టు), ‘తనియ’ ‘మణియారీ’ ‘దిలాసా’ లాంటి అందమైన పదాలు గ్రంథంలో వాక్యాల సౌరభాన్ని పెంచాయి. తన సహచరులకు చెప్పినట్లే ఈ పుస్తకంలోనూ కొన్ని పదాలను ఆయన పాఠాలుగా చెప్పటం మరొక విశేషం.
నిజాన్ని నిర్భయంగా చెప్పటం జర్నలిజంలో ఒక వౌలిక సూత్రం. వరదాచారి ఈ గ్రంథ రచనలోనూ అది పాటించారు. ఎవరికి కోపం వస్తుందో అని సంకోచించకుండా ఆయన ఒకప్పుడు తెలంగాణలో జరిగిన రజాకార్ల దుష్కృత్యాలను తెలియజేశారు. ఎవరైనా తప్పుచేస్తే, రాస్తే మర్యాదకు భంగం రాకుండా సరిచేయటం కూడా ఆయన పద్ధతులలో ఒకటి. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లినపుడు తనను ప్రశ్నలు వేసిన పెద్దలలో ఒకరిని తప్పు పట్టడానికి వెనుకాడలేదు. ‘ఉద్యోగం ఎలాగూ రాదని తెలుసు కనుక అంత నిర్మొహమాటంగా మాట్లాడాననుకొంటున్నారు కదూ? సరికాదు. ఎవరు తప్పు చేసినా దాన్ని మర్యాద తప్పకుండా సరిదిద్దటం నా స్వభావం. ఉద్యోగంపై ఆశ ఉన్నా అలాగే చేసేవాణ్ణి’ అన్నారాయన. వరదాచారి రాసిన ఒక పుస్తకం పేరే ‘దిద్దుబాటు’.
డాక్టర్ వరదాచారి వైయక్తిక జీవితమూ, పాత్రికేయ జీవితమూ రెండూ ఆదర్శప్రాయంగానే గడిచాయి. స్వభావరీత్యా సాటి ఉద్యోగులకు సహాయం చేయటం మొదటి నుంచీ ఉన్నది కనుక ఆయనకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంస్థతో దాదాపు దాని ఆరంభం నుంచి సంబంధాలు ఉండేవి. కొన్నాళ్లకు ఆయన దానికి అధ్యక్షుడైనాడు. కష్టాల్లో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు యూనియన్ అండగా ఉండేది. అలాగే ఆయనే స్థాపించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కూడా మంచి పేరు సంపాదించుకొన్నది.
జీవితంలో ఆయనకు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, ఆయన స్వయంగా రాసుకొన్న ‘జ్ఞాపకాలు’ అన్నింటిని కాకపోయినా కొన్నింటిని పాఠకుల ముందు ఆవిష్కరిస్తున్నది. ఈ గ్రంథంలో మరొక ప్రత్యేకత ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా కానీ ఆయన ఎవరి మీద నిందలు వేయలేదు. విమర్శలు చేయలేదు. నిర్మాణాత్మక సూచనలూ, గుణాత్మక వ్యాఖ్యలే కనిపిస్తాయి. కొత్త తరం పత్రికా రచయితలు చదివి తీరవలసిన ఒక అగ్రశ్రేణి పత్రికా రచయిత జీవిత చరిత్ర ఇది.

-పొత్తూరి వెంకటేశ్వరరావు