అక్షర

దిగ్గజాలు మెచ్చిన ‘ఇసిత్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇసిత్రం’
పంచరెడ్డి లక్ష్మణ
ప్రతులకు: అన్నిప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
సాహిత్య గమనంలో ఒక్కోసారి అనూహ్యంగా కొందరు సొంతబాట వేసుకొని తమ సత్తా చాటుతారు. తమకున్న భాషా, సామాజిక అవగాహన పరిధుల్లోనే కదిలి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సాహితీ కృషీవలులు పదికాలాలు శ్రమించి అందుకున్న శిఖరాల్ని ఒకే బాణం వేసి సాధిస్తారు. విచిత్రాలే సృష్టిస్తారు. ఆ కోవకు చెందినదే పంచరెడ్డి లక్ష్మణ ‘ఇసిత్రం’.
1973 చివర్లో మొదటిసారి వెలువడిన పంచరెడ్డి కవితల మాల ‘ఇసిత్రం’ అప్పుడే పెద్ద కవులను, రచయితలను అలరించింది. ఆరుద్ర ‘లక్ష్మణా! శభాష్’ అన్నారు. ఊహాజనిత కవిత్వం కాదు... ఉప్పెన లాంటి నిజాలు’ అని రావూరి భరద్వాజ దీవించారు. ఇంకా డా.వాసిరెడ్డి సీతాదేవి, దాశరథి, సినారె లాంటి దిగ్గజాలు ‘ఇసిత్ర’పడ్డారు. ఆనాటి సుప్రసిద్ధ సాహితీ మాసపత్రిక ‘్భరతి’ మే 1974 సంచికలో ‘ఇసిత్రం’పై సునిశిత, సుదీర్ఘ సమీక్ష ప్రచురించింది. ‘ఇసిత్రం’ అనే కవితా సంకలనం భాషాదృష్టితో చూస్తే ఒక ప్రయోగం అంటూ సమీక్షకులు టి.ఎల్.కాంతారావు పేర్కొన్నారు.
1969లో నిజామాబాద్‌లో ఆరంభించిన సాహితీ సంస్థ ఇందూరు భారతి సాంగత్యంలో రచనారీతులు అబ్బిన లక్ష్మణ 1972లో తనదైన రీతిలో మాండలిక, మాట్లాడుకునే పల్లె పదాలతో కవిత్వం రాయనారంభించారు. ఇందూరు భారతి పల్లెల్లో జరిపే కవి సమ్మేళనాలలో లక్ష్మణ కవితలకు విశేష స్పందన లభించేది. పల్లె జనం ఇసిత్రం కవితలు మళ్లీమళ్లీ చదివించుకొని చప్పట్లతో కవినభినందించేవాళ్లు.
‘ఇసిత్రం’ కవితలకున్న తొలి ప్రత్యేకత వాటిని జనం మాటల్లో రాయడమే. ఆ జనం మాటల్ని ముత్యాల్లా ఏరి కవితల్లో పొదుగడంలో కవి పనితనం మెరుపులీనుతుంది. ఎలాంటి స్పందన వచ్చినా సరే జనం పదాలకు మాత్రం ప్రాచుర్యం లభించాలనే కవి సంకల్పం దొడ్డది. స్పందన కవి ఆశించిన దానికన్నా ఎక్కువే వచ్చింది. తెలంగాణ మాండలిక కవిత్వం అనగానే సాహితీ ప్రియులందరికీ పంచరెడ్డి లక్ష్మణ ‘ఇసిత్రం’ మదిలో మెదులుతుంది. దానిలోని భిన్నత్వం, భాషలోని ఆకర్షణ, భావంలోని తెగింపు కలగలిసి అవి జనానికి చేరువయ్యాయి.
కేవలం పల్లె పదాలే కాకుండా పల్లె ప్రజల మానసిక స్థితిగతులను, ఆలోచనా ధోరణులను, నమ్మకాలను, అమాయకత్వాన్ని అన్నింటిని అక్షరాల్లో దింపాడు లక్ష్మణ. కవిత్వంలో సింహభాగం ప్రథమ పురుషంలో తమ గోడు వెల్లబుచ్చుకున్నట్లు ఉంటుంది. బోడి ఆదర్శాలకు పోకుండా గ్రామీణులు మంచిచెడులను ఎలా స్వీకరిస్తే అట్లానే కవిత్వీకరించాడు.
భాష విషయంలో ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రాంతంలో వాడుతున్న పదాలనే ఎంచుకున్నాడు. ‘ఆనల్ పడకచ్చినై’ అనే ఒక్క పదబంధంతో ఈ కవి నిలబడిపోయాడు. వానలు రావడం లేదు అనే అర్థం వచ్చే ఈ రెండు పదాలు ప్రత్యేకంగా ఇందూరు పరిసరాల్లో వాడుకలో ఉన్నయి. ఆశించినా, ఎదురుచూసినా కాని పనిని అలా సంబోధిస్తారు. ‘అన్నం తినకచ్చింది’ అంటే తినాలని ఉన్నా తినలేకపోయే గుణాన్ని సూచిస్తుంది.
ఆనాటి ‘ఇసిత్రం’ తిరిగి నాలుగు దశాబ్దాల అనంతరం పునర్ముద్రణ ద్వారా నేటి తరానికి పరిచయం కావడం హర్షించదగినది. ‘ఇసిత్రం’ కవితల్ని భాషా సంకుచితత్వంలోంచి చూడకుండా భిన్నతీరులో వచ్చిన రచనలుగా తెలుగు నేలంతా అక్కున చేర్చుకోవడం తెలగుజాతి సుగుణం. నా భాష, నీ భాష అనే రంగుటద్దాలు ‘ఇప్పుడచ్చినయి గాని తెలుగు నేల నాలుగు దిక్కుల్లోంచి వచ్చిన సాహిత్యం సమాన హోదా పొందేది. ఆ గౌరవం ‘ఇసిత్రం’కు దక్కింది.
1970 ప్రాంతంలో తెలంగాణ జిల్లాలో కొనసాగిన దొరతనం, దాన్ని నిలదీసేందుకు తయారైన విప్లవతరం కవిని కదిలించాయి. గ్రామీణ పేదరికం, మూఢ నమ్మకాలు, పై కులాల ఆధిపత్యాన్ని ఎదుర్కోలేని నిస్సహాయత ఈ కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
‘ఆనల్ పడకచ్చినై’లో - ‘వోడో ఇంగిలీషోడు రాకిటు మీద/ సంద్రుడి దగ్గర్కి పొయ్యిండంట/ సందురుడికి కోపమొచ్చిందంట/ గందుకే ఆనలు పడకచ్చినయంట’ అంటాడు. ఇవి కవి అభియోగం కాదు, పల్లె ప్రజల్లో ఆ రోజుల్లో ఈ అపోహ ప్రచారంలో ఉండేది.
‘ఇసిత్రం’లో - ‘పల్లెల పని దొరక్కచ్చిందని/ పట్నం పోయింటి/ ముల్లె తగిలిందని/ ఏంబే? పాగల్? దిమాగిలేద్?/ కండ్లు కనబడకచ్చినై’ అనడు’ అనే పంక్తులు పల్లెలో పని దొరకని దశ అప్పుడే మొదలయిందని, గ్రామీణులకు నగరంలో గౌరవం లేదని తెలియజేస్తాయి.
‘నీ మేరంగనే/ ఎగిరీ ఎగిరీ సల్లబడ్డోళ్లను/ అందర్ని ఒకటేసారి/ తీసుకొనెగురు/ నీ శక్తేందో అందర్కి ఎరుకైతది’ అని సమూహ శక్తిని గుర్తుచేస్తాడు.
‘దివ్లె’ కవితలో - ఇది ఉన్నోల్ల పండుగ/ బతకలేని బామనోల్లతోని/ బలమైన ఘడెల/ దొంగ కాతాలను సురుసేసే పండుగ’ అనడంలో తామే బతకలేని బ్రాహ్మలు ముహూర్త బలం ఎలా నిర్ణయిస్తారనే ప్రశ్న దాగి ఉంది.
‘అన్నా/ గిట్లాంటియి మనం ఎన్ని సూడలేదు/ పంట పోంగనే/ పరేశానై కూసుంటే/ గీ దునియాల ఇగ ఎవుసంజేసేటోల్లే/ మిగలరు’ అని ధైర్యం మాట రైతుకు ఆనాడే చెప్పిండు పంచరెడ్డి.
నలుపై ఏళ్ల పైబడిన కవిత్వం ఇంకా పచ్చిపచ్చిగా, రైతు, శ్రామికుడి బాధలను పంచుకుంటున్నట్లు ఉండడం కవిత్వం గొప్పతనమా, రాజ్యం వెనుకబాటుతనమా ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది.
మరోసారి ముద్రించి ‘ఇసిత్రం’ కవితల్ని పాఠకులకు అందించడమే కాకుండా ఆనాటి నిజామాబాద్ సాహితీ ప్రపంచాన్ని కూడా గుర్తుచేసే విధంగా ఎంతో సమాచారం అందులో అందించారు.
ఆనాటి నుండి నేటికీ కవులుగా నిలబడ్డ సిహెచ్.మధు, కందాళై రాఘవాచార్య, వి.పి.చందన్‌రావులు పునర్ముద్రణకు తోడై నిలిచారు.

-బి.నర్సన్