అక్షర

తెలంగాణ పల్లె సంస్కృతి పరిమళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర తెలంగాణ పల్లె సంస్కృతి
(శాతవాహన పరిశోధక వ్యాసాలు)
సంపా. కె.ముత్యం
తెలుగు విభాగం
శాతవాహన విశ్వవిద్యాలయం
కరీంనగర్
వెల: రూ.250
పే.188
ప్రతులకు: నవోదయ, హైదరాబాద్

**

ఈ వ్యాసాలన్నీ శాతవాహన విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలోని పరిశోధక విద్యార్థులు
రాసినవే. వీరంతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినవారు. కాబట్టి వారు
తమ చుట్టుపక్కల ఊళ్లల్లో జరుగుతున్న సాంస్కృతిక సంబరాల పట్ల ఆకర్షితులై, వాటి గురించి ఇతరులకు తెలియజేయాలనే కోరికతో ఈ వ్యాసాలను రాశారు.

**
‘ఉత్తర తెలంగాణ పల్లె సంస్కృతి’ అనే ఈ పరిశోధన వ్యాసాలు - పల్లె ప్రాంతాల్లో జరిగే పండుగలు, జాతరలు, గ్రామ దేవతల పెళ్లి లాంటి కర్మకాండలను విశే్లషించడం, ప్రత్యేక స్థలాల సాగే ఆరాధనలను అధ్యయనం చేసి మరీ తెలియజేస్తున్నాయి. అలాగే కులాల పండుగలు, ఉప కులాల కళా ప్రదర్శనలు, కర్మకాండలు, సంచార తెగల సంస్కృతి కూడా వీటిలో కనిపిస్తుంది. ఇందులో మొదటి అధ్యాయం ‘ఊరుమ్మడి పండుగలు’ బొడ్రాయి పండుగతో ప్రారంభమవుతుంది. ఊరికి మధ్యను తెలిపే ఈ చిహ్నం, ఈ ప్రతీక కాలాంతరంలో దైవీకరణం చెంది బొడ్డురాయి దేవతగా మారింది. శాక్తేయ స్థానిక దేవతల నేపథ్యం, పరిసరాలు, ప్రభావం ఆ బొడ్రాయి దాకా విస్తరించాయి. క్రమంగా బొడ్రాయి గ్రామ దేవతగా మారి వివిధ సందర్భాలలో పూజలందుకుంటున్నది. వరంగల్లు ప్రాంతానికి సంబంధించి ఈ బొడ్రాయి ఆరాధనలో దాదాపు యాభై ఏళ్ల నుంచి వస్తున్న మార్పులను ఒక వ్యాసంలో తెలియజేశారు. అలాగే దుర్గమ్మ పండుగను, అనాదిగా వున్న గ్రామ దేవతల పండుగలను స్థానచలనం చేసిన, ఇటీవలి పండుగగా భావించాలి. ఈ దేవత పంటలని, ఊరిని రక్షించే దేవతగా విస్తరించడం నేటి పరిణామం. ఈ పండుగను ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎట్లా చేస్తారో మహమ్మద్ అక్బర్ తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ సంస్కృతిలో భాగంగా ‘పొలాల అమావాస్య’ను మూడు రోజుల పండుగగా చేసుకుంటారు. వ్యవసాయ నిర్వహణకు ఎడ్ల పాత్ర కీలకమైనది. వ్యవసాయ పనులలో అమావాస్యతో ఎడ్లతో అవసరమున్న దుక్కులు, రొంప, చేరవేతలన్నీ అయిపోతాయి. ఆ అమావాస్యను పండుగ దినంగా, ఎడ్లను నందీశ్వరుని అవతారంగా భావించిన రైతులు వాటిని పూజించి తమ భక్తిని చాటుకుంటారు. దర్గా దగ్గర హిందువులు, ముస్లింలు కలిసి మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజును ఉర్సు పండుగగా చేసుకుంటారు. అలాగే కుతుబ్‌షాహీల కాలం నుండి ఆచరణలోకి వస్తున్నటువంటి మొహర్రం పండుగ ఎన్నో ప్రత్యేకతలతో, స్థానిక కథనాలతో, కర్మకాండలతో నేటికీ కొనసాగుతున్నది. హిందూ, ముస్లిం భేదం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. ఉత్తర తెలంగాణలో పోశమ్మను గ్రామ దేవతగా కొలుస్తారు. జీవితంలో పెండ్లి లాంటి ముఖ్య సన్నివేశాలకు ముందు పోశమ్మ పండుగ చేసి, తర్వాత పనులను మొదలుపెడతారు. పోశమ్మ పండుగను సబ్బండ కులం చేస్తది. ఒక్కో జిల్లాలో ఈ పండుగ ఒక్కో పద్ధతిలో ఉంటుంది. అలాగే ఈ వ్యాసంలో పోశమ్మ పుట్టుకపై వున్న కథలను, బోనాలను చేసే తీరును వివరంగా తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కులానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజులలో ఇందుర్తి గ్రామంలో ఎల్లమ్మ పండుగనాడు ప్రతి ఒక్కరూ కుల భేదాలు లేకుండా ‘ఎల్లమ్మ పండుగ’ను మూడు రోజులు జరుపుకుంటారు.
రెండవ అధ్యాయం ‘కులం - వృత్తి - సంస్కృతి’ చేసే పనినిబట్టి వృత్తులు ఏర్పడినాయి. వృత్తులను ఆధారంగా చేసుకుని కులాలు పుట్టుకొచ్చాయి. ప్రతి వృత్తి వారికి ప్రత్యేక జీవనం ఉంటుంది. ఇది తమవైన ఆచారాలు, అలవాట్లు, దేవీ దేవతలు, పూజలు, వ్రతాలతో ముడిపడి ఉంటుంది. అటువంటి ప్రత్యేకత కలిగిన ఒక కులం కురుమ. కురుమ వాళ్లకు ఒగ్గు వాళ్లు అనే ఉపకులం వున్నది. వీళ్లు మల్లన్న పురాణం అనే కుల పురాణాన్ని చెబుతారు. కురుమ కులానికి పూజారులుగా, కుల కర్మకాండలకు పురోహితులుగా కూడా వ్యవహరిస్తారు. కురుమల కుల దైవం అయిన బీరన్న పండుగను కురుమలందరూ ఘనంగా జరుపుకుంటారు. బీరన్న ఎవరు? బీరన్న పండుగ ఎవరు చేస్తారు? ఎలా చేస్తారో ఒక వ్యాసం వివరిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో గౌడులకు చెందిన కాటమయ్య పురాణంగా ప్రసిద్ధి పొందిన జానపద పురాణమే శ్రీకంఠ మహేశ్వర పటం కథ. గౌడ కులస్తులు వారి పురాణం ఆధారంగా, వారి సంస్కృతిని తెలిపే విధంగా కాటమయ్య (కంఠ మహేశ్వరుడు) పండుగను నిర్వహిస్తారు. అసలు కాటమయ్య ఎవరు? ఈయనను గౌడకుల వారు ఎందుకు కొలుస్తారు? కాటమయ్య పండుగ ఎలా జరుపుకుంటారో ఇంకో వ్యాసం వివరిస్తుంది. తెలంగాణలోని అనేక గ్రామాల్లో విశ్వకర్మల జీవనశైలి విశిష్టమైంది. ఉక్కు తయారయ్యే గ్రామాల్లో ముమ్మాయి దేవత ఆలయం ఉంటుంది. ఆమె లోహ పనివారి దేవత. ముమ్మాయి దేవతకి గుళ్లు కట్టి పూజలు జరిపి, ఉత్సవాలు నిర్వహించడం ఒక ప్రత్యేకత. వీటన్నింటిని వివరించే వ్యాసం కూడా ఇందులో ఉంది. ఏదైనా ఒక కులం వాళ్లు పురాణంగా ఒక కథను ఏర్పాటు చేసుకుని, ఒక దేవుడిని పూజిస్తూ, వృత్తి నైపుణ్య విషయాలను అందరికీ తెలియజేస్తూ, వారివారి కులాల గొప్పదనాన్ని తెలియజేయడం జరుగుతుంది. పై వ్యాసాలన్నీ ఈ విషయానే్న నిర్ధారిస్తాయి.
మూడవ అధ్యాయం ‘ఉప కులాలు - తెగ - సంస్కృతి’ ఒక చారిత్రక సందర్భంలో అనివార్య అవసరాల కారణంగా సమాజంలో ఉన్న ఎన్నో ముఖ్య కులాలకు ఉపకులాలు లేదా ఆశ్రీత కులాలు పుట్టుకొచ్చాయి. ఈ ఆశ్రీత కులాల వారు తమకంటే గొప్పవారయిన ఆయా పెద్ద కులస్తుల యొక్క పూర్వీకుల ఔన్నత్యం గురించిన చరిత్రను చెబుతూ, సమాజంలోని మిగతా కులస్తుల కంటే మేమే గొప్ప అనుకునే మనోనిబ్బరాన్ని కలిగిస్తారు. ముదిరాజులు లేదా తెనుగు వాళ్లకు సంబంధించిన పూర్వీకుల కథను ముదిరాజుల పురాణంగా వారి ఆశ్రీత జాతులైన కాకి పడగల కళాకారులు వౌఖిక పద్ధతిలో చెబుతున్నారు. ఈ కాకి పడగల వాళ్లు ముదిరాజులకు పాండవుల కథలు ఎందుకు చెబుతారు? పాండవులకు ముదిరాజులకు మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాలను ఒక వ్యాసం వివరిస్తుంది.
ఈ వ్యాసాలన్నీ శాతవాహన విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలోని పరిశోధక విద్యార్థులు రాసినవే. వీరంతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినవారు. కాబట్టి వారు తమ చుట్టుపక్కల ఊళ్లల్లో జరుగుతున్న సాంస్కృతిక సంబరాల పట్ల ఆకర్షితులై, వాటి గురించి ఇతరులకు తెలియజేయాలనే కోరికతో ఈ వ్యాసాలను రాశారు. క్షేత్ర పర్యటనా పద్ధతిలో కొనసాగిన వారి పరిశోధనలో భాగంగా ఆయా అంశాల పట్ల వారి సునిశిత పరిశీలనతోపాటు, సంబంధిత వ్యక్తుల ఇంటర్వ్యూ ఆధారంగా సేకరించిన సమాచారాన్ని విశే్లషించుకుని, ఈ వ్యాసాలను రూపొందించడంలో ప్రామాణికత కోసం పడిన తపన అభినందించదగింది.

-కె.పి.అశోక్‌కుమార్