అక్షర

అలరించే అ.ఇ. ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు-2,
శ్యామలాదేవి దశిక
- పుటలు: 166
వెల: రూ.200
ప్రతులకు: నవోదయా బుక్‌హౌస్,
తెలుగు బుక్‌హౌస్,
ప్రముఖ పుస్తకాలయాలు
--

ఏ దేశమేగినా, ఎక్కడ స్థిరపడినా మాతృభాషాభిమానాన్ని వదలుకోలేనివారు, ఆ అభిమానాన్ని అనేక రకాలుగా ప్రకటించవచ్చు. వాటిలో ఒకటి వ్యాసాలు రాయడం. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు ఎన్ని చెప్పుకున్నా, చెప్పాల్సినవి ఇంకా ఉండడం సహజం కాబట్టి, దశిక శ్యామలాదేవి ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు’ రెండవ పుస్తకాన్ని తెలుగు పాఠకుల ముందుంచారు. ఈ పుస్తకంలో ఇరవై తొమ్మిది వ్యాసాలున్నాయి. అమెరికా అనుభవాల స్ఫూర్తితోనే రాయబడినవి. ఈ మాట, సుజనరంజిని, తెలుగుజ్యోతి, న్యూజెర్సీ నించి వెలువడే ‘ప్రతిభ’ కౌముది, నాట్స్ ప్రత్యేక సంచిక తదితర పత్రికలలో ప్రచురింపబడినవే.
తెలుగువారికి ఇంగ్లీషులో మాట్లాడడం ఆనందదాయకం. ఒకే పదాన్ని ప్రతీ వాక్యంలోనూ ఇమడ్చాలన్న కోరికకూడా ఎక్కువే. ‘టైలర్ సూపర్‌గా కుడతాడు’, అబ్బో ‘సినిమా సూపర్ లెక్కుంది’, పరీక్ష ఎలా రాశావన్న ప్రశ్నకు ‘సూపర్‌గా రాశా’లాంటి వాక్యాలు వినబడని ఇళ్లు ఉండవని ‘సూపరే సూపర్’ వ్యాసం చదివిన వారికి అర్థమవుతుంది.
అమెరికాలో ఉన్న తెలుగువారికి ఏడాదికో రెండేళ్లకో ఒకసారి మాతృభూమికి రావాలన్న తపన ఉంది. అమెరికాలో ఉన్నవారు ‘మా బంధువులకి ఈ వస్తువు అందజేయండి- వారే మీ ఇంటికి వచ్చి తీసుకుంటారు’ అనీ, అడుగుతారు. భారతదేశంలోని బంధుమిత్రులు ఫలానా వస్తువు తీసుకురమ్మని పురమాయిస్తారు. ఇలాంటి వివరాలు కొంత హాస్యం జోడించి రాసిన వ్యాసం ‘ఇండియా ప్రయాణం’.
కోడలు, ఆడపడచుల మధ్య సంబంధం అత్తాకోడళ్లమధ్య ఉన్నట్టుగానే కొంత ఘర్షణ వాతావరణంలోనే తెలుగు లోగిళ్లలో సహజమే. ఈ ధోరణికి భిన్నంగా ఇద్దరిమధ్యా స్నేహం ఏర్పడి, విడదీయరాని బంధం ఏర్పడడం ‘నా ప్రియనేస్తం’ వ్యాసంలో ప్రస్తావించబడింది.
తలిదండ్రులు, అమ్మమ్మ/నానమ్మ తాతలుగా ప్రమోషన్ వచ్చినపుడు కలిగే జీవన సరళిలోని మార్పులు ఇతివృత్తంతో రాయబడిన వ్యాసం ‘గ్రాండ్ పేరెంట్స్’, మనవడి అభివృద్ధిని గమనించగలిగిన అదృష్టం పాత తరానికి దక్కకపోయినా కొత్తతరానికి దక్కడం ఆనందదాయకం అన్న అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారతదేశంలో టాయ్‌లెట్స్‌కన్నా సెల్‌ఫోనులు ఎక్కువ ఉన్నాయని ఒక మంత్రిగారు సెలవిచ్చారు. నేటి జీవన సరళిలో సెల్‌ఫోను విడదీయలేని అనుబంధం అయిందన్నది నిర్వివాదాంశం. లాండ్‌ఫోను వాడకం తగ్గిపోయి సెల్‌ఫోను వాడకం పెరిగింది. సెల్‌ఫోనులో కూతురు తన సమస్యలు చెప్పుకున్నపుడు, తల్లి తనకి తోచిన పరిష్కారం చెబితే కోపం తెచ్చుకుంటుంది కూతురు. కొడుకు కోడలు మీద తల్లికి ఫిర్యాదు చేయడానికి సెల్‌ఫోను వాడతాడు. మన ఎదుట ఉన్నవారితో మాటాడకుండా ఎక్కడో ఉన్నవాళ్లతో మాటాడ్డం, లేదా మెసెజీలు చూసుకోడం సెల్‌ఫోన్ తెచ్చిన మార్పులు. పిల్లాడు ఏడుస్తున్నాడు కదా అని వెతికితే అది సెల్‌ఫోన్ రింగ్‌టోన్ అని తెలుసుకోడం తదితర ఆసక్తికరమైన అంశాలున్నాయి ‘సెల్‌ఫోన్’ వ్యాసంలో.
అర్జునుడు బాణం గురిపెట్టినపుడు పక్షి కంటి గుడ్డు తప్ప మరేమీ కనబడలేదంటాడు. అభినవ అర్జునులు కేవలం రెండు చేతులతో ఒకేసారి అనేక పనులు నిర్వహించడం (మల్టీటాస్కింగ్) నేటి జీవన విధానంలో కనబడుతోంది. టి.విలో మాచ్ చూస్తూ, కంప్యూటర్ పాటలు వింటూ, ఆన్‌లైనులో బిల్లులుకడుతూ, అడ్వర్టయిజ్‌మెంటు వచ్చినపుడు పేపరు చదవడం చేయగలిగినవారు అష్టావధానం శతావధానం అవలీలగా చేయగలరు అన్న ధ్వని ‘ఉరుకులు-పరుగులు’ వ్యాసంలో కనబడుతుంది.
తల్లినుంచి అమ్మమ్మగా ప్రమోషన్ వచ్చినపుడు ఎదురయ్యే అనుభవాలు ‘గుర్తింపు’ వ్యాసంలో పొందుపరచబడ్డాయి. ‘పిల్లల్ని కనడం వాళ్ల స్వవిషయం, మనకెందుకూ అని మాట్లాడకుండా ఊరుకోలేరు. ఎప్పుడో కనాలనుకుంటున్నారో అడుగుతూండండి లేకపోతే మాలాగే ఉన్నపళ్లంగా ఉన్న ఊరుని, వాకిలినీ వదిలేసుకోవాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అన్న హెచ్చరిక అమెరికాలో పిల్లలున్న అందరికీ వర్తిస్తుంది.
ఇలాగే ప్లాస్టిక్ బాగులూ, తెలుగు సంఘాల పనితీరు, సాహితీ సదస్సులు, శ్రావణమాసం నోములు, యాంకర్ల తీరు, తదితర అంశాల మీద రాసిన వ్యాసాలు చదువరుల ఆసక్తిని చూరగొంటాయి. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు మూడవ సంపుటం కూడా వస్తుందని ఆశించవచ్చు.

-పాలంకి సత్యనారాయణ