అక్షర

దంపతుల కవిత్వ సంభాషణలో అసలు జీవితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు పక్షులూ..
ఒక జీవితం
-బూర్ల వేంకటేశ్వర్లు
పేజీలు: 90.. వెల: రూ.100
ప్రతులకు: బి.సంతోష
ఇ.నెం.2-10-1524/10
ఫ్లాట్ నెం.403
వెంకటేశ్వర టవర్స్, జ్యోతినగర్
కరీంనగర్-505 001
9491598040
**
సృష్టిలో చెరి సగంగా భావించబడే భార్యాభర్తల మధ్య అవగాహనను పెంపొందించేందుకు కవి బూర్ల వెంకటేశ్వర్లు... ఓ వైవిధ్యమైన గ్రంథాన్ని ‘రెండు పక్షులూ.. ఒక జీవితం’ పేరుతో కవిత్వ సంభాషణను ప్రకటించారు.
జీవితానికి దంపతులిద్దరూ కొత్తవాళ్లే అయినప్పటికీ... వారి మధ్య అర్థాలు.. ఆలోచనలు భిన్నమైనప్పటికీ... ఇరువురి మధ్య ఒకింత సమన్వయాన్ని కలిగించడానికి.. ఈ గ్రంథంలో కవి ‘అతడు’ ‘ఆమె’ మాట్లాడుకునే సంభాషణను కవితాత్మకంగాను.. రమణీయంగాను రూపకల్పన చేశారు. వారిరువురూ పరస్పర ఆకర్షితులు, ఆశ్రీతులు, అవసరార్థులు కనుక ఇద్దరి మధ్య సాగే మాటలకు కవిత్వపు సొబగులద్ది.. వారి చేష్టలకు అక్షరాకృతి నిచ్చారు.
ఇద్దరి ఆలోచనల్లో వైరుధ్యం ఉన్నప్పటికీ... జీవితం ఒక్కటేనన్న సంగతిని కవి చక్కగా ఆయా సంభాషణల ద్వారా తేల్చి చెప్పారు. ఒకరికొకరు తోడుంటూ.. ఒకరినొకరు అనుసరిస్తూ... సమన్వయంతో సాగితే... జీవితం సరస విరసాలతో కొనసాగుతుందని కవి తమ కవిత్వం ద్వారా విడమరిచి వివరించారు. దంపతుల మధ్య అపోహలు.. అసూయలు.. అవమానాలు.. అహంకారాలు.. ఆధిపత్యాలు.. అలకలు... సాధింపులు.. భేదాభిప్రాయాలు.. ఇలా సర్వసాధారణం.. వాటిని అధిగమించి.. ఆనందమయంగా జీవనం గడపడానికి.. సంసారం సాఫీగా కొనసాగడానికి.. కవి వేంకటేశ్వర్లు.. వివిధ సన్నివేశాలు.. ఘట్టాలు సృష్టించి.. సరస సంభాషణలతో ఈ గ్రంథాన్ని రూపొందించారు. ఇరువురి మధ్య అవగాహన లోపించకుండా ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఇందలి కవితా పంక్తులు ఉపకరిస్తాయి.
అన్యోన్యంగా రెండు పక్షుల్లా.. ఒక్క జీవితాన్ని గడపడానికి, ఒకే గమనాన్ని.. ఒకే గమ్యాన్ని చేరడానికి చక్కని అవగాహన కల్పించే ప్రయత్నం కవి ద్వారా జరగడం ప్రశంసనీయం.
ధ్వని ప్రధానంగా జరిగే ఇందలి సంభాషణల్లో దంపతుల మధ్య సరసం ఉంది. ఒకింత చమత్కారం ఉంది. మరి కొంత వ్యంగ్యం ఉంది. కోపాలు.. తాపాలు.. ఆనందం, దుఃఖం అన్నీ కలగలిపి సాగేదే దాంపత్యం అనీ.. ఇద్దరిలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదనీ.. ఇద్దరూ ఒకరినొకరు నొకరు అర్థం చేసుకుంటే.. భార్యాభర్తల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లగలదని ఇందలి సంభాషణలు తెలుపుతాయి. ఆనందమయ జీవనానికి అవగాహన ముఖ్యమనీ.. అవగాహన కోసం సరస సల్లాపాలతో సాగే మాటలు.. చేష్టలు ఎంతగానో ఉపకరిస్తాయని కవి తమ కవిత్వం ద్వారా చక్కగా ఆవిష్కరించారు.
ఇక ఇద్దరి మధ్య జరిగిన కొన్ని సంభాషణలను పరిశీలిద్దాం...
నల్లతుమ్మ మొద్దుపై/ వీపు కనిపించేలా
ఆమె కూర్చున్నది/ రంగులతో అలంకృతమైన
సుందరాంగుల కనుబొమలు
కాంతిహీనమయ్యాయి..
అతడన్నాడు.../ సూర్యుడు
మేఘాల వెనుక నిద్రపోతున్నాడు గానీ..
లేకుంటే/ తనకంటే గొప్పగా
పరిసరాలను వెలిగిస్తున్న నిన్ను చూసి
మరో నక్షత్ర మండలానికి వెళ్లి ఉండేవాడూ...’ అని
అతడితో చెప్పిస్తూ ఆమెను ఉన్నతంగా చిత్రించారు.. ఆమె పట్ల అతడికున్న ప్రేమభావాన్ని.. అందంగా ఆవిష్కరించారు.
అలాగే.. మరోచోట కవి అతడిచే ఆమెను ఇలా వర్ణించ యత్నించారు.
అతడన్నాడూ...
కాసె గడ్డి మధ్యలో ఉదయించే/ వెండి వెనె్నల లాంటి/ నీ ముఖ దర్శనం లేకుండా/ నేనుండగలనా.. అని...
ఆమె అన్నదీ...
ఆ నిరాడంబరమయిన/ కాసె గడ్డి ఆలంబనే కదా/ నా అందాన్ని ద్విగుణీకృతం చేసి/ నిలిచేలా చేస్తున్నదీ...’ అని.
ఇలా ఒకరికొకరు తమ అన్యోన్యతను అందమైన భావాలతో పంచుకునేలా... కవి తమ కవితా ప్రతిభను ప్రదర్శించారు.
ఆకాశంలో భూమి, భూమిలో నీరు, నీటిలో గాలి, గాలిలో అగ్ని నిలిచి ఉన్నాయనీ.. అన్నింటిలో ఘర్షణా సమన్వయమూ ఉన్నాయనీ.. అయినా దేని అస్తిత్వం దానిదే అని చెబుతూ, దంపతులు కూడా ఒకరు లేక మరొకరు లేరనీ.. ఒకరికొకరుగా అన్యోన్యంగా మనుగడ సాగించాలన్న చక్కని సందేశంతో గ్రంథాన్ని తీర్చిదిద్దిన కవి వేంకటేశ్వర్లుకు అభినందనలు.

-దాస్యం సేనాధిపతి