అక్షర

మల్లన్న సాగర్ కష్టాలూ కన్నీళ్లూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నీటి సాగరాలొద్దురా మల్లన్న
క్షేత్ర పర్యటన నివేదిక
వ్యాసాలు - సాహిత్యం
పేజీలు: 180
వెల: రూ.120
సంపాదకులు: జయధీర్ తిరుమలరావు, ఎ.కె.ప్రభాకర్
ప్రతులకు: ఎ.కె.ప్రభాకర్
9951942242
**
ఉరుకుల పరుగుల మీదున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన అంశమిది. చకచకా పనులు అనుకున్నట్లు సాగుతున్న తరుణంలో ప్రభుత్వానికి మల్లన్న సాగర్ వద్ద మడుగులో కాలిరికినట్లయింది. ఈ భారీ ప్రాజెక్టు పనులలో దాని విస్తీర్ణం, నిర్మాణం, భూసేకరణ విషయాల్లో ప్రభుత్వానికి మరియు ఆయా గ్రామాల ప్రజలకు, ప్రతిపక్షాలకు, ప్రజాసంఘాలకు మధ్య పలు భేదాభిప్రాయాలు పొడసూపాయి.
50 టిఎంసిల నీటి నిలువ సామర్థ్యాన్ని లక్షించి నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు సరిపడే భూమిని గ్రామ ప్రజల నుండి షార్ట్‌కట్‌లో బదలాయించుకోవాలనేది ప్రభుత్వ సంకల్పం. ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలని చెబుతూ దాని భూసేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పరచిన భూసేకరణ చట్టం 2013ను పక్కనపెట్టి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే 2015లోజీవో 123 ని రచించి రెవిన్యూ అధికారుల చేతిలో పెట్టింది.
ఒకవైపు జీవో 123 ప్రకారం రైతులు భూవిక్రయ పత్రాలపై వేలిముద్రలు వేస్తుండగా మరోవైపు 2013 చట్టం గురించి తెలుసుకున్న యువత, రైతులు ప్రభుత్వ తీరుకు విరుద్ధంగా ఆందోళన చేపట్టారు. దాంతో ఇక్కడేదో అపసవ్యంగా నడుస్తోందని బయటి లోకానికి తెలిసింది. నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ పాత జిల్లాల పరిధిలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించదలిచిన ఈ మల్లన్న సాగర్ నిర్మాణంలో సర్వం కోల్పోయిన 14 గ్రామాల ప్రజల తరఫున ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరాహార దీక్షా శిబిరం వెలిసింది.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రచయిత వేదిక వివిధ జిల్లాల కవుల, రచయితలను కలుపుకొని ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్లింది. ఆందోళన సాగుతున్న శిబిరాన్ని, రైతులను, వివిధ వృత్తుల వారిని పలకరించింది. వారి ఆవేదనలను రికార్డు చేసింది. బాధితుల రోదనలను, వేదిక క్షేత్ర పర్యటన అనుభవాలను, సామాజిక, పత్రికా మాధ్యమాల కథనాలను క్రోడీకరించి అందరికీ ఈ విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ‘కన్నీళ్ల సాగరాలొద్దురా మల్లన్న’ అనే పుస్తకాన్ని ప్రచురించి, విడుదల చేసింది.
భూసేకరణలో సర్వం కోల్పోతున్నా తగిన పరిహారం అందుకోలేని ఆ గ్రామీణ కుటుంబాల వ్యధలు ఈ పుస్తకంలోని అక్షరాల్లో వినిపిస్తాయి. కేంద్రం రూపొందించిన 2013 చట్టాన్ని కాదని రాష్ట్రం సొంతంగా జీవో 123 ను ప్రయోగించటమే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. కేంద్ర చట్టంలో ఉన్న ఎన్నో రక్షిత విధానాలు జీవోలో గల్లంతయ్యాయి. ఎవరెంత మొత్తుకునాన జీవో 123 అద్భుతమని ప్రభుత్వం చెబుతోంది. 2013 చట్టాన్ని అమలుచేస్తే కాలహరణ జరిగి నిర్మాణంలో జాప్యం, వ్యయం పెరుగుతుందని ప్రభుత్వ వాదన. కాలహరణ కన్నా పౌరుల రక్షణ ప్రధానమని విపక్షాల పట్టు.
తెరవే అధ్యక్షులు జయధీర్ తిరుమలరావు మరియు 14 మంది రచయితల బృందం సేకరించిన ప్రత్యక్ష సమాచారం నిర్వాసితులవుతున్న వారి బాధలకు అద్దం పడుతుంది.
‘మాకు వాగున్నది, కోమటి చెరువున్నది, కొత్త కుంటున్నది, నల్ల చెరువున్నది, తెల్ల కంటున్నది, మస్తుగ నీళ్లున్నయి, మూడు పంటలు పండుతయి. కూరగాయల బస్సు వస్తది. ఎకరానికి లక్ష రూపాయల పంట తీస్తం. మళ్లీ ఇలాంటి భూమి సర్కారు ఇచ్చే పైకానికి దొరుకుతుందా?’ అనే 65 ఏళ్ల ఒగ్గు లక్ష్మి ప్రశ్నకు జవాబే కాదు, దాన్ని వినే నాథుడు కూడా లేడు.
‘పరిహారం హెచ్చుతగ్గుల విషయంలో కోర్టుకు వెళ్లను అని ఫారం ని, నిని లపై సంతకాలు తీసుకుంటున్నారని’ ఎల్దండి చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన.
నలుగురైదుగురు రైతులను వెంటపెట్టుకొని దానికి మల్లన్న సాగర్ సాధన సమితి అని పేరు పెట్టి ధర్నాలు, ర్యాలీలు తీయడం చూస్తున్నాం. ఇదేనా మీరు సాటి రైతు ఆవేదనను, బాధను అర్థం చేసుకునే తీరు’ అని ఆవుల యాదగిరి దిక్కుతోచని స్థితి.
‘ప్రాణహిత రిడిజైనింగ్‌లో ఎలాంటి మెరుగులు దిద్దాలి’ అని చెబుతూ నీటి నిపుణులు టి.హనుమంతరావు గారి వ్యాసం సవివరంగా, సచిత్రంగా ఉంది.
‘మేమిచ్చిన డబ్బులు తీసుకోవడం తప్ప మీకు మరో మార్గం లేదు. మీరు తీసుకోకపోతే కోర్టులో జమ చేస్తాం. భూములు తీసుకుంటాం. మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తది’ అని స్వయాన కలెక్టర్ చెప్పినట్లు శ్రీశైల్‌రెడ్డి పంజాగుల వ్యాసంలో అంది.
తిరుమల ప్రసాద్ పాటిల్ ఫేస్‌బుక్ నుంచి సేకరించిన ‘మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిహారం - పాలకుల వితండ వాదం’ వ్యాసంలో భూసేకరణ చట్టం 2013ను రాష్ట్ర ప్రభుత్వపు జీవో 123కు మధ్య నున్న పరిహార, పునరావాస వ్యత్యాసాల గురించి సవివరంగా ఉంది.
గత ఏడాదంతా సాగిన మల్లన్న సాగర్ భూసేకరణ పట్ల వివిధ పక్షాల నిరసనలు, కోర్టులో భంగపాటును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం శరణుజొచ్చింది. భూసేకరణ చట్టం 2013లోని ఆర్టికల్ 254 రాష్ట్రాలకు ఓ వెసలుబాటును కల్పించిన విషయం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వరమైంది. దాని ఆధారంగా జీవో 123ని ఓ బిల్లుగా మార్చి 30.4.2017 నాడు జరిపిన శాసనసభలో సభా ఆమోదం తీసుకొని పార్లమెంటుకు పంపింది. క్యాబినెట్ ఆమోదం, రాష్టప్రతి అధికారిక ముద్రతో అది ఇప్పుడు చట్టమైంది.
కేంద్రం సూచించిన చిన్నచిన్న సవరణలతో జీవో 123 కాస్తా యాక్ట్ 21, 2017గా రూపుదిద్దుకుంది. ఇక నుండి 2013 చట్టాన్ని అమలు చేయమనే హక్కు ప్రజలకు, ఆదేశించే వీలు కోర్టుకు ఉండవు.
అభివృద్ధి చావుకు ఎలాంటి నమూనా కాకుండా ఉండాలన్నదే తెలంగాణ ప్రజల అభిమతం’ అన్న విషయాన్ని మాత్రం ఈ పుస్తకం ద్వారా తెలంగాణ రచయితల వేదిక స్పష్టం చేసింది. ‘కష్టాల సాగరాలొద్దురా మల్లన్న’ అని వేడుకుంటున్న ప్రజల కన్నీటిచెమ్మ ఈ అక్షరాల్లో ఇంకా ఆరనే లేదు.

-బి.నర్సన్