అక్షర

అభ్యుదయ భావాల రసరమ్య గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నది రేపటి గీతం’!
‘రేడియం’
పేజీలు: 98,
వెల: రు.80/-
ప్రతులకు:
ఎం.రాఘవాచారి,
ప్లాట్ నెం: 41,
శాంతి చంద్రిక,
ఇం.నెం.3-148,
బాలాజీనగర్
మహబూబ్‌నగర్.
9490909792
---

మాగిన ఫలాల తియ్యటి వ్యాపనం... కవి కవితలు కావాలనీ.. ఉరుముల మెరుపుల విన్యాసం కవి కవితల్లో ధ్వనించాలని కాంక్షించే కవి ‘రేడియం’. ‘‘నది రేపటి గీతం’’ కవితా సంకలనాన్ని వెలువరించి తమ సృజనను చాటుకున్నారు. కవి కలం కదన క్రీడను సృజించినప్పుడు ప్రభుత్వాలు దిగి రావా! అని విశ్వసించే కవి ‘రేడియం’ తమ కవిత్వం నిండా అభ్యుదయ భావాలను గుప్పించి.. పాఠకులను మెప్పించ యత్నించారు. కలాలు సంకెళ్ళు తెంచుకుని హలాల్లా సాగుతున్నాయి పిడికెడు మట్టికోసం అని వినమ్రంగా విన్నవించుకున్న ఆయన ఈ గ్రంథంలో 49 కవితల్ని పొందుపరిచారు. చివర హైకులకు చోటు కల్పించారు.. ఈ కవితల్లో రేపటికి రూపం లేదనే వేదాంతిని, రేపటి రోజులో ఆశను వెతుక్కునే సామాన్యుణ్ణి, రేపటి దినం తన వెంటే వస్తుందనే విప్లవకారుణ్ణి చూడగలం!
ఈ నేలంతా అవినీతి చీకటి విపత్తు పురుడుపోస్తుంటే... నీతి నాగళ్ళతో సూర్య విత్తనాలను విత్తులేని జనం గురించి ఆలోచించే కవి ‘రేడియం’ ఎన్నాళ్ళీ నిశ్శబ్దత? అని ప్రశ్నించడాన్ని కవితల్లో గమనిస్తాం. స్తబ్దత వీడటానికి శ్రీశ్రీ మరో ప్రపంచ బావుటా ఎగరాలా? అని నినదించడాన్నీ ఈ గ్రంథంలో వీక్షిస్తాం!
మార్కెట్‌లో రేట్లు పెరిగితే.. పడిపోయేది రుపాయి విలువే... విద్యా విలువలు జనంలో పెరిగితే... పడిపోయేది చీకటి ప్రభుత్వమని కవి విడమరిచి చెప్పారు. తూర్పు వాకిలికి తెర గట్టాలనుకొనేవాడు కన్నీళ్ల జడివానకు... సంతోషంగా నాలుక తడుపుకునేవాడు నెత్తురు మరిగిన పులికాంతి కత్తులకు తెర చిరుగుతుందనీ... వాన వడికి నాలుక తెగుతుందనీ... ఎప్పుడో ఒకప్పుడు తప్పక పులి నేలకు ఒరగక తప్పదని ‘‘పులి బొమ్మ’’ కవితలో కవి నర్మగర్భంగా ప్రకటించిన భావాలు ప్రగతిశీలంగా ఉన్నాయి!
చలం కలాన్ని పరిశీలిస్తే కనిపించేది ఒక స్పందన... ఒక ఖడ్గ్ధార అనీ.. సూర్య చలనానికి మృత్యువు లేనట్లు... చలానికీ మృత్యువులేదని ‘‘చలం’’ కవితలో తేల్చి చెప్పారు.
చీకటి... పులి పంజా దెబ్బకు చిట్లిన రక్తం పలికిందొక వినూత్న సూక్తం... చిట్లిన ప్రతి రక్తబిందువుకాక మానదు ప్రళయ సింధువు అని భావించే కవి ‘రేడియం’... తలలో ఆలోచన బాకు దిగుతున్నప్పుడల్లా... బాధ... విచ్చుకున్న మందారం రెక్కల్ని చూచినప్పుడల్లా సంతోషమని ప్రకటించిన తీరు ప్రశంసనీయం!
‘‘చైతన్య బిందువును కేంద్రంగా చేసుకుని ఎదుగుతున్న సమాజాన్ని వ్యాసార్థంగా ఉంచుకుని... ఆలోచనల వృత్తలేఖిని ఆసరాతో ప్రగతి వృత్తాన్ని నిర్మిస్తున్నానంటూ... ‘‘చైతన్య వృత్తం’’కవితను తీర్చిదిద్దారు.
నది తన ఇరు తీరాల భుజాల మీద చరిత్రకందని సత్యాలను మోస్తున్నదనీ.. వో నదిలో అగ్నిగుండం రగులుతున్నదనీ... పిల్ల కాలువలు, తల్లికాలువలు కదిలిరాగా నది ఎర్రని నురుగులు కక్కుతున్నదనీ... ప్రాంతాలను విముక్తంచేసే జనవాహిని నది అంటూ ‘‘నది రేపటి గీతం’’ కవితను రూపకల్పన చేశారు.
‘‘సెలవు’’ కవితలో కవి ఆవిష్కరించిన భావాలు రమణీయంగా ఉన్నాయి. ఊహాసుందరి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ... నీవు నాకు మిగిల్చిపోయిన చిత్రపటంలో... ఆనందపు నందన వనాన్ని చూస్తున్నాను... నీ జాడల్ని పసిగట్టమని సూర్యునితో చుక్కలతో విన్నవించుకున్నాను... పువ్వులా పరిమళించే బ్రతుకు... తీరని కోరికల నిప్పుల్లో మండుతుందని’’ కవి రాసిన పంక్తులు అందరినీ ఆకట్టుకుంటాయి!
‘‘రాగం ఉంది తాళం కూడా ఉంది... కానీ నీవు మాత్రం లేవు మాటల ముత్యాలు దొర్లడం లేదని’’, ‘‘వలపువగవు’’ కవితలో వాపోయారు.
ఎర్ర మందారాల గుండెల్ని తొలుస్తున్న శబ్దం... శబ్దప్రకంపనాలకు తట్టుకోలేని జనం... చుక్కల్లా ఉండే జనం... సూర్యునిలో పొడుచుకొస్తారని ‘‘జనం’’కవితలో కవి తమ అభ్యుదయ భావాలను చక్కగా ప్రకటించారు.
నిత్య జాగృత కవి వరుడు... తెలంగాణ కవి జనమనోహరుడిగా ప్రజాకవి కాళోజీని ఒక కవితలో ఉన్నతంగా చిత్రీకరించారు. మరో కవితలో ఊరి చెరువుకు దండాలు సమర్పించారు. చెరువులు తరువులు ప్రజాజీవనంలో భాగం కావడానికి ప్రజలు గళంవిప్పాలని పిలుపునిచ్చారు.
ఈ గ్రంథం చివరన పొందుపరిచిన హైకూలు కవియొక్క ప్రగతిశీల భావాలను ప్రతిబింబించేలా ఉన్నాయి.. తిండి కొరకు... నెత్తురు పెట్టుబడి... మైనస్ బతుకు అని ఓ హైకూలో జీవన సత్యాన్ని చక్కగా ఆవిష్కరించారు.
మరో హైకూలో వర్గం... మతం ప్రపంచ రాజకీయం... బొమ్మాబొరుసు అని వ్యాఖ్యానించిన తీరు బాగుంది.
ఇలా.. ఈ గ్రంథంలో వచన కవితలతోపాటు హైకూలకు స్థానం కల్పించి... కవి ‘రేడియం’తమ కవిత్వాన్ని పండించ యత్నించారు. చాలా కవితల్లో కవిత్వాంశ కొరవడినప్పటికీ... పాఠకులు కవియొక్క సామాజిక చింతనను అభినందించకుండా ఉండలేరు!

-దాస్యం సేనాధిపతి