అక్షర

కవిత్వం సరస్సులో విరిసిన నల్లకలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకలువలు నక్షత్రాలు
-ఎస్.వి.రామశాస్ర్తీ
పుటలు: 68.. వెల: రూ.70/-
ప్రతులకు: ఎన్.ఎస్.శైలజ
తీ/్య. ఎన్.వి.రామశాస్ర్తీ
సిండికేట్ బ్యాంక్ కాంపౌండ్, ఆర్.పి.రోడ్
తణుకు - 534 211.. ప.గో.జిల్లా
9866458290
**
కన్నీటి మేఘాలు ముసిరిన మానవ జీవనాకాశంలో కోటికాంతుల నక్షత్ర దీపాలు వెలిగిస్తుంది కవిత్వం. విజృంభించిన దానవత్వానికి వీడ్కోలు చెప్పి మానవత్వాన్ని పరిమళింపజేస్తుంది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త చూపునిస్తుంది. జీవితం మీద కొంత నమ్మకాన్ని, కొత్త ఆశను కలిగిస్తుంది. అలాంటి కవితా సంపుటి ఎస్.వి,రామశాస్ర్తీ ‘నల్లకలువలు - నక్షత్రాలు’.
రామశాస్ర్తీ కేవలం కవే కాదు. చిత్రకారుడు కూడా. ఒక చేత్తో కలం, మరో చేత్తో కుంచె పట్టుకొన్న సవ్యసాచి. ఈ సంపుటిలో పిల్లల గురించి, స్ర్తిల గురించి, ప్రకృతి గురించి ఎక్కువ కవితలున్నాయి.
చిన్నప్పుడు పిల్లలు అవీ ఇవీ పారబోసి వాటిని ఒంటికి అంటించుకుంటారు. రంగులతో నిండిన వారి శరీరం ఇంద్రధనస్సులా మెరుస్తుంది.. అని కవి వర్ణిస్తారు. ‘దేహ కేన్వాసు/ దాచి వున్న కాగితాలు/ తను రంగరించిన రంగులతో/ మెరిసిపోతుంటాయి/ ఇష్టమైన తినుబండారాల్ని తింటూ/ ఒళ్లంతా పులుముకున్నట్టు/ మోహించిన రంగుల్ని/ శరీరంపై హత్తుకొని/ వాటిని కాగితంపై అలుముతాడు/ ఒక్కోసారి చిన్ని పికాసోలా/ మారి వర్ణాలను చూసి మురిసిపోతాడు’ అని ‘రంగుల ప్రేమికుడు’ కవితలో కవి అంటారు. పిల్లవాణ్ణి చిత్రకారుడు పికాసోతో పోలుస్తారు. చిన్న పిల్లలకు రంగులంటే ఇష్టం. సీతాకోక చిలుకలను రంగుల పిట్టలను చూచి ఆనందిస్తాడు. ‘వాడు నడచినంత మేరా/ ఇంద్రధనస్సును/ నేలపై సృష్టిస్తాడు/ ఆ మాంత్రికుడు రంగుల ప్రేమికుడు’ అని అంటారు.
మామూలుగా ఇంద్రధనస్సు ఆకాశంలో ఉంటుంది. కానీ ఈ బాలుడు నేలమీదే ఆనందాల ఇంద్రధనస్సు సృష్టిస్తాడు. ఇదీ కవి చమత్కారం. చిన్నప్పుడు పిల్లలు ఎలా వున్నా, ఏం చేసినా ముద్దుగా ఉంటారు. పెద్దవాళ్లను ఆనంద సముద్రంలో ముంచి పరవశింపజేస్తారు. ఇంకా పిల్లల గురించి రాసిన ‘రెండు చేతుల్లో చినుకు’లో ఆకాశంలో/ నా చెప్పుల్లో వాడి కాళ్లు’ మొ. కవితలు చదివింపజేస్తాయి.
‘వినీలాకాశం’లో కవిత అంతరిక్ష యానం చేసిన సునీతా విలియమ్స్ గురించి రాసింది. ‘సగం ఆకాశం వద్దని/ ఇది అమ్మ సొమ్మని/ హక్కు నాదని/ అనకుండా/ శాంతంగా స్వంతం చేసుకుంది/ ఆమె/ ఈ రోజు/ తన పాదం మోపుతూ - అంతరిక్షంలో విహరించి ఆకాశంలో సగం కాదు మొత్తం నాదేనని అంది’ అని అంటూ ‘బాల్యంలో/ కన్న చందమామ కలల్ని/ నిజం చేస్తూ/ చంద్రయానం చేసావు/ స్ర్తి ఆత్మల కోరికల/ సంకెళ్లు తెగి/ రివ్వున ఆకాశానికి చేరినట్టు/ కక్ష్యను చుట్టి లక్ష్యాన్ని చేరావు/ సమస్త స్ర్తిలోకపు/ ఆశల హరివిల్లును/ వినీలాకాశంలో నిలబెట్టి/ విస్తరింపజేసి/ స్ర్తిలందరినీ/ భాగస్వాములను చేసావు కదా’ అంటారు. ఇది కేవలం ఆమె ఒక్క విజయం కాకుండా స్ర్తిలందరి విజయం’ అని కవి ఆమెను అభినందిస్తున్నారు.
‘మళ్లీ ఆ మెట్ల మీద’ దానాలు పట్టే బీద బ్రాహ్మణుని బతుకు వ్యథ. ‘మళ్లీ ఆ మెట్ల మీద/ తెల్లటి అంగోస్త్రం/ మొలకు చుట్టి/ భుజంపై కొన్ని పోచలు ఏటవాలుగా ధరించి/ పైన ఏ ఆచ్ఛాదనా లేకుండా/ తెలవారకుండా అర్ఘ్యంతో ఆదిత్యుని ఆహ్వానించి/ ఎదురుచూస్తుంటాడు/ పిండం తిని/ సంతృప్తిగా కాకి ఎగిరినట్టు/ అతడి ఇంట్లో ఉన్న నలుగురూ/ నాలుగు మెతుకులు తింటే/ ఆ రోజు పూర్తి అవుతుంది/ శ్రద్ధగా శ్రాద్ధకర్మలందించి/ అందుకున్న ఆ సరుకులు/ మూటలో సర్దుకుంటాడు/ దానం తీసికొన్న/ నాలుగు సొమ్ములూ/ బొడ్డున దోపుకుంటూ/ వేళకింత కతకలేక విరిగిన బతుకుబండి/ లాగిస్తుంటాడు’ అంటూ శ్రాద్ధకర్మలు చేస్తూ జీవించే అతని దుర్భర జీవితాన్ని బొమ్మ కట్టించేలా అక్షర చిత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ కవితా సంపుటిలో ప్రయాణం, నివేదన, మైండ్ ఫ్రీక్, అగ్గిపూలు, ఇందుమూలంగా, వెతుకుతూ.. మొ. కవితలు మనసును స్పందింపజేస్తాయి. ‘రంగుల పొగరు కేన్వాస్ కాగితంపై కవిత్వమై ఒలుకుతుంది. ఆలోచనాశ్వాలు బిగించిన ఫ్రేముల నుండి పరిగెడ్తాయి. ప్రేమ దారంతో కూర్చిన మాటల కదంబం, చల్లని మాటల చలివేంద్రాలు, ఆకాశపు అరణ్యంలో మేఘాల మదపుటేనుగులు ముచ్చటించుకున్నాయి. అక్షర విత్తనాలు చెట్లై కాలంతో విస్తరిస్తున్నాయి. ఎంత తోడినా మనిషి ఒక తడి ఆరని మాటల ఊటబావి అవుతాడు... మొదలైన రసార్ద్రమైన వాక్యాలు మనసులో మెత్తగా హత్తుకొంటాయి. ఎండిపోయిన అంతరంగపు బీడును ఒకింత తడిబారుస్తాయి. అపారమైన భావుకత, సున్నితమైన వ్యక్తీకరణ మానవతావాదం, సొగసులొలికే పదాల పోహళింపు, జీవన తాత్విక భావాల చిత్రీకరణ పాఠక హృదయాలను అవ్యక్త భావంతో పల్లవింపజేస్తాయి. అనేక రంగుల చిత్రమాలిక ఈ కవితా సంకలనం.

-మందరపు హైమవతి