అక్షర

నెహ్రూ భావజాలాన్ని ఎండగట్టిన రైతు పక్షపాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచార్య రంగ స్వీయ చరిత్ర
తెలుగు అనువాదం: రావెల సాంబశివరావు
పేజీలు: 446.. వెల: రూ.450
పీకాక్స్ బుక్స్,
పీపుల్స్ ట్రస్ట్ ప్రచురణ విభాగం
జి-2, బ్లాక్ నెం.6, పంచవటి, ప్రగతినగర్
జెఎన్‌టియుకు ఎదురుగా
నిజాంపేట్, హైదరాబాద్-500 090
*
భారత రాజకీయ రంగంలో పదవుల వెంట పడకుండా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం, పేద ప్రజలు, గ్రామీణ ప్రజలు, కర్షకుల అభ్యున్నతి కోసం జీవితం మొత్తం రాజీలేని పోరాటం జరిపిన యోధుడు, నిఖార్సైన భారతీయ ఆత్మకు ప్రతినిధి ఆచార్య ఎన్జీ రంగా. బహుశా పేద ప్రజలతో, గ్రామీణ ప్రజలతో అనుబంధం ఏర్పరచుకుని, ఆయనంత సుదీర్ఘ కాలం - సుమారు ఏడు దశాబ్దాలపాటు ప్రజా జీవనంలో మచ్చ లేకుండా ఒక ఋషి వలే జీవనం గడిపిన రాజకీయ నాయకుడు ఆధునిక భారతదేశంలో మరొకరు లేరని చెప్పవచ్చు.
సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, చిన్నతనం నుండే వ్యవసాయం, గ్రామీణ ప్రజలు, వారి సమస్యల పట్ల ఆసక్తి, ఆవేదనలను ఏర్పరచుకొని, ఇసిఎస్ చదవడం కోసం లండన్ వెళ్లి, ఆ సమయంలో మహాత్మాగాంధీని బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో ఆ ప్రభుత్వంలో అధికారిగా పనిచేసే చదువు తనకు వద్దనుకుని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రాజకీయ, అర్థ, సామాజిక శాస్త్రాలలో నిష్ణాతులయ్యారు. డాక్టరేట్ కూడా పొందారు. తిరిగి వచ్చి మద్రాస్‌లోని పచ్చపాస్ కళాశాలలో అధ్యాపకునిగా జీవితం ప్రారంభించి, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడం కోసం ఉద్యోగాన్ని వదిలివేసి, అతి సాధారణమైన రైతు జీవితం గడుపుతూ, దేశమంతా తిరిగి దేశ భవిష్యత్ రూపకల్పనలో నిర్ణయాత్మక పాత్ర వహించారు.
ఈ స్ఫూర్తికరమైన జీవితంలో బాల్యం నుండి ప్రారంభించి 1959లో స్వతంత్ర పార్టీలో చేరేవరకు తన జీవన ఘట్టాలను ఆయనే స్వయంగా వ్రాసుకున్న గ్రంథమే ఇది. దీనిని రావెల సాంబశివరావు సులభమైన శైలిలో తెలుగులో అందించారు. రంగ జీవన యాత్ర పట్ల స్పష్టమైన అవగాహన గల ఆయన రంగ స్ఫూర్తి నుండి ఎక్కడా పక్కకు జరుగకుండా, రంగ జీవితాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నామా అనే భావావేశం కలిగించే విధంగా ఈ గ్రంథ రచన జరిపారు.
స్వాతంత్య్రం రాక ముందు నుండి జవహర్‌లాల్ భావజాలాన్ని రంగ స్పష్టంగా వ్యతిరేకిస్తూ రావడమే కాదు ప్రతిఘటిస్తూ కూడా వచ్చారు. మరో వంక నాడు యువతను ఆకట్టుకొంటున్న కమ్యూనిజం డొల్లతనాన్ని కూడా వెల్లడించారు. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పరచాలని కమ్యూనిస్టులు కన్న కలలను భగ్నం చేసిన ఘనత ఆయనదే అని చెప్పవచ్చు.
ఇంగ్లండ్‌లో ఉండగానే ఆ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు భారతదేశంపై ఎదురైతే ఏ విధంగా పరిష్కరించాలి అనే అంశాలపై తీవ్ర అధ్యయనం, మేధోమథనం చేశారు. పలు ఐరోపా దేశాలలో పర్యటించి అక్కడి పరిస్థితులను, భారతదేశంలోని పరిస్థితులతో పోల్చి చూసి, మన దేశ పరిస్థితులకు అనువైన విధానాలు ఏ విధంగా చేపట్టాలో ఆలోచనలు సాగించారు.
‘ఆకర్షణీయంగా ఉండి ప్రమాదాల్లోకి లాగే విశ్వవిద్యాలయ యువ విద్యార్థులు జీవన సుడిగుండాల్లోకి నేనెన్నడూ పోలేదు. అందుకు కారణం భారతదేశంలోని గ్రామీణ జీవనం, రామకృష్ణ పరమహంస, వివేకానంద, రామతీర్థ రచనలు. నా ధ్యాసంతా భారతదేశంలోని పేదరికాన్ని ఎలా పోగొట్టాలనే’ అంటూ అక్కడ ఉన్నప్పుడు తన మానసిక స్థితి గురించి రంగ తన రచనలో చెప్పుకొచ్చారు.
అక్కడ కూడా రైతుల జీవన స్థితిగతులను పరిశీలిస్తూ భారతదేశంలో ‘పట్టణ ప్రజలకు చౌకగా తిండిగింజలను అందించడం కోసం ఆంగ్లేయులు వ్యవసాయాన్ని బలిపెట్టారనిపించింది’ అనే భావనకు వచ్చారు. భారతదేశంలో బ్రిటన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల వారి దేశంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఆయన గ్రహించారు.
ఆయన రష్యాలోని పరిస్థితులను, మార్క్సిజంను సహితం అధ్యయనం చేశారు. ‘్భరతదేశ సమస్యల విషయంలో గాని, రైతుల సమస్యల విషయంలో గాని అంతగా కొనియాడబడే మార్క్సిజంలో పరిష్కారాలు లభించవు’ అని నిర్థారణకు వచ్చారు. ‘ఈ సోషలిస్ట్‌లకు రైతుల సంగతి పట్టదా అని ఆందోళన చెందేవాణ్ని’ అంటూ చెప్పుకొచ్చారు.
మరో సందర్భంలో ‘మార్క్స్ సిద్ధాంతపు రచన ఆధారంగా చూస్తే కుటీర పరిశ్రమలకు మరణశిక్ష విధించినట్లు అయింది. చేనేత పరిశ్రమ బతికి బట్టకడుతుండే విశ్వాసం లేదు వారికి. ఉపాధి ఆధారంగా జీవనం సాగించే కుటీర పరిశ్రమలకు చెందిన కళాకారుల పట్ల వాళ్లకు సానుభూతి లేదు. వాళ్లను సంస్థాగతంగా తీర్చిదిద్దే నన్ను చూస్తే కమ్యూనిస్టులకు, సోషలిస్టులకు ఎగతాళిగా ఉండెడిది’ అంటూ వాపోయారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వారి ఆదర్శాలు, కార్యాచరణ నచ్చినా ‘నాకు నచ్చని అంశమేమంటే అవి కేవలం పారిశ్రామిక కార్మికులకు ఉద్దేశించడమే. అందులో ఇతరులకు (వ్యవసాయ కార్మికులకు) ప్రవేశం లేదు’ అంటూ పెదవి విరిచారు. నిడుబ్రోలు కేంద్రంగా ఆయన మొత్తం దక్షిణాదిలో సాగించిన రైతు ఉద్యమాలు మొత్తం దేశానికి, జాతీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచాయి.
1955లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్రలో అధికారంలోకి రాబోతున్నామనే ధీమాతో ముందుగానే కమ్యూనిస్టు పార్టీ తమ మంత్రివర్గాన్ని ప్రకటించింది. అయితే కేవలం రాజకీయ పొత్తులతో మాత్రమే కాకుండా గ్రామీణ ప్రజలకు, రాజకీయ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరతగులను రాష్ట్రం అంతా నిర్వహించడం ద్వారా వారిలో నూతన ఆలోచనలను కలిగించారు. స్వేచ్ఛ, ఉదారవాదం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, వ్యవసాయాన్ని బతికించుకోవడం వంటి అంశాలపట్ల దృష్టి కేంద్రీకరించేటట్లు చేశారు. దేశంలో ఇటువంటి మహోన్నత కృషి చేసిన నాయకుడు మరెవ్వరు లేరని చెప్పవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీకి చెందిన వారైనా రైతుల గురించి, గ్రామీణ సమస్యల గురించి మాట్లాడుతున్నారు అంటే వారు రంగ జరిపిన రాజకీయ పాఠశాలలో శిక్షణ పొందినవారే అని అనుకోవచ్చు. ఆయనతోపాటు ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్న ప్రముఖ కమ్యూనిస్టు నేత హిరేన్ ముఖర్జీ మాటలలో చెప్పాలి అంటే ‘ఆయనలో ఉదార భావన ఆయన్ను సహజసిద్ధంగా ఆవిర్భవించిన పార్లమెంట్ సభ్యునిగా వెలుగొందేటట్లు చేసింది. వాస్తవానికి ఆయన తన సొంత అభిప్రాయాలకు అంటిపెట్టుకొని ఉన్న సందర్భాల్లో తద్విరుద్ధ భావాలను వ్యతిరేకించాల్సి వస్తే దృఢంగానే అయినా నాగరికంగా వ్యతిరేకించేవారు.’
అన్ని సంవత్సరాలు ప్రధానిగా కొనసాగిన కాలంలో తాను జవహర్ లాల్జీ దయకు పాత్రుడిని కాదల్చుకోలేదని స్పష్టంగా చెప్పారు. ‘నేను జాతీయ రాజకీయాల్లో ముందు పంక్తిలోనే ఉండి, నా ప్రాథమిక విశ్వాసాలను, రాజకీయ స్తోమతను దేనికీ బలి పెట్టలేదు. మేమిద్దరం భారత ప్రజల ప్రణాళిక బద్దమైన అభివృద్ధి కోసమే పాటుబడ్డాం. అయితే మా మార్గాలు పరస్పర వ్యతిరేకాలు... భారతదేశాన్ని ప్రపంచంలో శక్తిసంపన్నమైన సురక్షిత ప్రాంతంగా నిలపదలచాం. అయితే టిబెట్ రాజకీయ స్వాతంత్య్రం సమకూర్చడం ద్వారా దాన్ని సాధించవచ్చని నేను భావిస్తే ఆయన చైనాతో చేతులు కలిపారు’ అంటూ తామిద్దరి ఆలోచనలోగల వౌలిక తేడాలను వివరించారు.
కార్మికులు, కర్షకులు, చిన్న సన్నకారు రైతులు, చేతి వృత్తి చేసుకొనేవారు.. వారి సమస్యల కోసం సుదీర్ఘ పోరాటాలు చేశారు. ‘్భరతదేశపు సామాన్యుల తరఫున శ్రద్ధగా మాట్లాడగల ఏకైక వ్యక్తివి నువ్వే’ అంటూ సెంట్రల్ అసెంబ్లీ సభ్యునిగా బ్రిటిష్ వారి గుర్తింపు కూడా పొందారు.రంగ కేవలం రైతుల గురించే కాకుండా జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత గల అన్ని అంశాలలో కీలకమైన పాత్ర వహించారు.
చాలామంది రంగ అభిమానులు 1951లో ఆయన కాంగ్రెస్ నుండి బయటకు రాకపోయి ఉంటే ఎన్నో ఉన్నత పదవులలో ఉండేవారని అనుకొంటూ వుంటారు. ఇటువంటి అభిప్రాయాలను సహితం ఆయన నిర్వార్థంగా త్రోసిపుచ్చారు. ‘నేను రాజాజీతో కలిసి స్వతంత్ర పార్టీని స్థాపించి ఉండకపోతే నెహ్రూ తలపెట్టిన జాతీయ స్థాయి సమష్టి వ్యవసాయ ఉద్యమాన్ని నిలవరించగలిగేవాడినా..? ప్లానింగ్ కమిషన్ రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతూ తప్పుడు విధానాలను ప్రవేశపెట్టడాన్ని స్వతంత్ర పార్టీ ఎండగట్టడం వల్లే దేశం ఊపిరి పీల్చుకోగలిగింది. కమ్యూనిజం దిశగా సాగే దాని ప్రణాళికలు, ప్రాధాన్యతలను పునఃపరిశీలించి దాని ప్రమాదాలను పసిగట్టేటట్లు చేయగలిగాము’ అంటూ పార్టీ మారడం ద్వారా దేశానికి ఎంతో మేలు జరిగిందని స్పష్టం చేశారు.
అయితే ఆ తరవాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆయన శిష్యులు చాలామంది జీర్ణించుకోలేక పోయారు. ‘కాంగ్రెస్‌లో అగ్రస్థానంలో ఉన్న రంగాజీ జవహర్‌లాల్‌తో విభేదించి, బయటకు రావడం ఒక పొరపాటైతే, తిరిగి 1972లో ఇందిరాగాంధీ పార్టీలో చేరడం మరొక గ్రహపాటు. కాంగ్రెస్‌లో చేరిన ఐదేళ్లకు రాజ్యసభ సభ్యుడిగా మూడేళ్లుండి, ఆ తరువాత మరో పదేళ్లు లోక్‌సభ సభ్యుడిగా కొనసాగి తనను తాను కుంచించుకున్నారు’ అని ఈ గ్రంథంలో ముందు మాట రాసిన మాజీ ఎం.పి. డా.యలమంచిలి శివాజీ పేర్కొన్నారు.

-చలసాని నరేంద్ర