అక్షర

కాలప్రవాహానికి ‘అక్షర’ కైమోడ్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర హారతి
వెల: రూ.100/-
ప్రతులకు: డా.సమ్మన్న
302, శ్రీదుర్గా రాజీవ్ రెసిడెన్సీ
విజయపురి కాలనీ, తార్నాక,
హైదరాబాద్-17
మొబైల్: 98852 38654
--

జీవిత తాత్వికతను గురించిన అనే్వషణే జ్ఞానం అవుతుందా? ఏ ప్రశ్నకీ మనిషికి నిర్ధిష్టమైన సమాధానం లభించదు. సమాధానం దొరకదని తెలిసినా మనిషి అనే్వషణ ఆగదు. అటువంటి అంతుచిక్కని రమ్యమైన సృష్టి నిర్మాణానికి, సమస్త సృష్టి, స్థితి, లయకు కారణమైన సత్యానికి నిరంతరంగా సాగుతున్న కాలప్రవాహానికి కైమోడ్పులర్పిస్తూ సుందరతరమైన అక్షరానికి హారతినిస్తూ సృజనాత్మక ప్రేరణకు, ఆధ్యాత్మిక ఆవేశపు అసంకల్పిత అభివ్యక్తీకరణకు మూలమై గ్రహణశక్తికి అందని అమోఘ, అనిర్వచనీయ, అద్భుత, అదృశ్యశక్తికి వినమ్రతతో తలవంచి కవితా గానం చేసారు డా.సమ్మన్న.
ఏకోన్ముఖులైనవారు వారి హృదయం గురించి తెలిపేటప్పుడు ప్రపంచం అంతటినీ పవిత్రీకరిస్తారు. వారు నడచినంతమేర చీకటిని పారద్రోలుతూ ఆనందం తాండవించేలా చేస్తారు. వారి మాటల్లో, చేతల్లో ఆంతరంగిక యజ్ఞం, మస్తిష్కమధనం, వెలుగులా విస్తరించి చీకటి పటాపంచలవుతుంది. జీవితం పట్ల ‘కృతజ్ఞత’అనే జీవకాంతి భక్తిమార్గంలో పయనించి దీప్తీమంతుల్ని చేస్తుంది. అటువంటివారి మాటలు, భావాలు అపూర్వంగా వెలువడతాయి. ధరిత్రిపై ప్రతి చిన్న విషయం దేదీప్యమానంగా అక్షరరూపం దాల్చి కవితలై వెల్లివిరిసిన వీరి కవిత్వ సమాహార సంపుటి ఈ ‘‘అక్షర హారతి’’.
ప్రపంచీకరణ నేపధ్యంలో ఈనాడు మనిషి ఏకాకిగా, సంకుచితుడుగా మారిపోయాడు. డబ్బు తప్ప ఏదీ రాజ్యమేలని ఒక రాక్షస ప్రవృత్తి అంచెలంచెలుగా వ్యాప్తిచెందడంతో రాక్షసానికి మరో పేరుగా మారిపోతున్నాడు. ఉదారంగా, ఉన్నతంగా, విశాలంగా ఆలోచించగల సమున్నత సమాజంకోసం విశాల దృక్పథం, ఉదాత్తత లేనితనం, మానవత్వం ఇప్పటి మనిషిలో కనుమరుగైపోతోంది. ఆశావహ దృక్పథంతో ఆర్తిగా ‘ఓ మానవతా!’అంటూ తారల సందేశాన్ని మానవ జగతికి అందించే ప్రభాతంలా, బీటలువారిన పృథ్వీ హృదయంలో వర్షించే శ్రావణ మేఘంలా, అగాధమైన కడలి గుండెలో నింగికెగిసే కెరటంలో, వసంత ఋతు ఆగమనంలో ఆవిష్కరించే కోకిల కూజితంలా, క్రూర హృదయాల్లో కారుణ్య బీజాలు నాటి విశ్వప్రేమని బోధించే శాంతి దూతలా మనిషిలో మాయవౌతున్న మానవత్వానికి మానవతా విలువల్ని జీవంపోసే దివ్య సంజీవినివై రారమ్మని ఎలుగెత్తి పిలుస్తారు.
మంచు బిందువు బాల్యం. ఓ గమ్మతె్తైన చెదిరిపోని మధుర స్వప్నం. దురాశ, గర్వం, అసహనం, దురభ్యాసాలు, దురాలోచనలు జీవన గమనాన్ని నిర్దేశించే శక్తుల గురించి, బతుకు బాటలోని విస్ఫోటనాలు, సంక్లిష్ట జీవన కల్లోలాలు, కదలని భయంకర లక్షణాలు, పోటీ ప్రపంచంలో ఏమీతెలియని బాల్యానికి తప్పని రాజీ బతుకుల గురించిన ఊహే ఉండదన్న విషయాన్ని తట్టి చెప్పడం విశేషం! ఏమీ తెలియని బంగారు బాల్యం భువిలో సజీవ దివ్య స్వర్గం అంటారు ‘బాల్యం’ కవితలో.
విప్లవ జ్యోతుల్ని ప్రజ్వలింపజేసే ఉద్యమమే ఊపిరిగా ఊరేగే రోజులు, యువతను ఉర్రూతలూగించే రోజులు, ప్రభుత్వ దుశ్చర్యలను- నిర్భయంగా ఎదిరించే తిరుగుబాటు ధోరణులు, ఇజాల జెండాలను భుజాల వేసుకుని ఉక్కునిచ్చెన లాంటి కుల, మర్రివృక్షాల లాంటి వర్ణ, మేరు పర్వతంలాంటి రాజ్యవ్యవస్థను అలవోకగా కొనగోటితో కూల్చివేసి సామ్రాజ్యవాదాన్ని దిగంతాలకు తరిమే యుగాలను శౌర్యంతో, వీర పరాక్రమంతో తరిమివేయగల భావోద్వేగపు థ్రిల్లింగ్ రోజులు యవ్వనారంభపు రోజులనీ, క్రమంగా కుర్రహోరు తగ్గి, ఎదురుదెబ్బల అనుభవ పాఠాలతో లోకం అర్థమయి, సమస్త సృష్టలో క్రూర మృగాలకన్నా మారణాయుధాలకన్నా ‘సాటిమనిషే’ ప్రమాదకరమైన వాడని తెలిసి, నోట మాటరాని వాడౌతాడని ‘ఆత్మక్షోభ’అనే కవితలో కఠోర సత్యాలు ఆవిష్కరించిన విధానం హృదయాన్ని బరువెక్కిస్తుంది. మనిషిలోని స్వార్థప్రవృత్తిని, నేరప్రవృత్తిని తొలగించి మలినాలను కడిగేయలేని నిదర్శనాలుంటాయని- కలత చెందే వయనం కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది.
‘అభ్యర్థన’అనే కవితలో- ఈ చరాచర జగత్తుని నడిపే శక్తిని ప్రార్థించడం గమనార్హం. కుల మత వర్ణాలకతీతమైన హృదయ సంస్కారాన్ని విలక్షణ వ్యక్తిత్వాన్నివ్వమని, అహంలేని అణకువ నివ్వమనే అర్ధింపు. విఫలమైన ధరిత్రి సదస్సును ప్రతిస్పందనగా ‘నువ్వేనువ్వే’!అనే కవితా, ‘అంతు ప(ట్ట)ట్టిన రహస్యం’లో- భగవంతునికి, తనకూవున్న దివ్య సంబంధాన్ని ఆశ్చర్యరీతిలో అభివర్ణించడం పాఠకుల్ని మరొక్కసారి చదివించేలా చేస్తుంది. అంకరేఖా గణితాలకు, కొలతలకు అందడనీ, ఒడ్డూ, బరువుల తూకాలకు తూగడనీ, అంచనాలకే అందని అప్రమేయుడనీ, జ్ఞాని, అజ్ఞాని అని స్థారుూ బేధం ఎంచడనీ, చెప్తూ-‘శరణుజొచ్చిన వారిని ఆదరిస్తూ ఉంటాడుట’అనే సునిశితమైన హాస్యం ‘ట’మాటతో ముగించడం ఒక వైచిత్రి-
ఈ పుస్తకాన్ని ‘ఏదో పుస్తకంలే’అని తీసిపారెయ్యడానికి వీలుకాదు. కడుపులో అగ్నిరేఖలు రగులుతున్నా/ప్రశాంతంగా కనిపించే అగ్నిపర్వతంలా మదిలో గాయాలు నులిపెడుతున్నా/ మోహన రాగాల్ని ఆలపించే వేణువులా ఎగిసిపడే జ్వాలలు దేహాన్ని దహించివేస్తున్నా/ కాంతి పుంజాన్ని ఆవిష్కరించే ప్రమిదలా కంఠంలో హాలహాలాలు ప్రాణాల్ని హరిస్తున్నా/ నిర్లిప్త ఆనందతాండవం చేసే నీలకంఠుడిలా
‘వజ్ర సంకల్పంతో సుదీర్ఘఘోర తపస్సుచేస్తున్నా’ అంటారు ‘తపస్సు’అనే కవితలో. ఇది ఆకాశమంత ఎత్తుగల కవిత. హిమాలయమంత ఎత్తుగలది. ఆకాశాన్ని వెదికే ఆర్తిగలది. చివరికి ఏమీలేదనే వైరాగ్యం కలది. కల్మషం లేని వాక్కు, క్షమ, కారుణ్యభావ కుసుమాలతో కూడిన అనంత ప్రేమతత్త్వాన్ని ప్రసాదించమని, తద్వారా శత్రువునైనా ప్రేమించే ఉదాత్తమైన గుణాలు లభించగలవని హృదయ పూర్వకమైన ‘వినతి’ని సమర్పిస్తారు డా.సమ్మన్న.
పూజా కార్యక్రమానికి చివరి భాగం ‘హారతి’, ‘ఆరతి’అంటే పరిపూర్ణ ఆనందం. ఎలాంటి దుఃఖమూ లేనిది. ఈ హారతివల్ల మనిషి జీవితమే ‘కాంతి’అని తెలుస్తుంది. ‘మనస్సు పువ్వులా వికసించి, ఆ వికసించిన పూవులో అహంకారం లేకుండా పర్వతాలు, నదులు, వృక్షాలు, పక్షులు ఇలా సమస్త ప్రకృతివలె నేనూ ఒకటి అనే భావంతో ముగిసిన డా.సమ్మన్నగారి ‘‘అక్షర హారతి’’ కవితా సంపుటి హాయిగొలుపుతూ జ్ఞాన మార్గాన్ని సూచించే దిశగా కదుల్తుంది.

-బులుసు సరోజినీదేవి