అక్షర

చదివించే ‘నోబెల్’ మహిళల చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు
-ముకుంద రామారావు
అస్మిత.
వెల: రూ.70
పేజీలు. 86
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**

ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ పురస్కారం. ఈ నోబెల్ బహుమతి సూత్రధారి, స్థాపకుడు ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్. వీరి తదనంతరం వీరి ఆస్తిని అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యం, విజ్ఞానానికి బహుమతుల కోసం వినియోగించవలసిందిగా వీలునామా రాసి పెట్టారు. అవే బహుమతులు నోబెల్ బహుమతులుగా ప్రసిద్ధి చెందాయి. అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, డైనమైట్ లాంటి విధ్వంసకరమైన పేలుడు పదార్థాలని ఆవిష్కరించిన వారికి, ఇటువంటి బహుమతుల ఆలోచన రావడమేమిటని. దానికి ప్రముఖంగా చెప్పుకునే కారణం - 1888లో వీరి సోదరుడు లుడ్విగ ఫ్రాన్స్‌లో మరణించినప్పుడు, అక్కడి వార్తాపత్రికలు ఆల్ఫ్రెడ్ మరణించినట్టు రాసి ‘మరణ వ్యాపారి మరణించాడు’ అని ప్రముఖంగా రాసాయి. వీరి మరణానంతరం జరగబోయేది అదేనన్న ఊహ వీరిని తీవ్రంగా కలచివేసింది. దానిని బాపుకుందుకు ఏదో ఒక మంచి పని చేసి, మరణానంతరం అందరూ వారిని గుర్తించుకుందుకు వీలుగా ఈ బహుమతుల్ని నెలకొల్పారని అంటారు. వీరి జీవితాంతం వీరికి ఆసక్తిగా వున్న భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్యం, సాహిత్యం, శాంతి అనే అయిదు రంగాల్లో బహుమతుల నివ్వడానికి నిర్ణయించారు. 1901లో మొదలయిన ఈ బహుమతులను ఇప్పటివరకు 779 మందికి ఇవ్వగా, అందులో కేవలం 95 మాత్రమే మహిళలకు లభించాయి. అందునా సాహిత్య రంగానికి సంబంధించి 98 నోబెల్ బహుమతుల నివ్వగా మహిళలకు దక్కినవి 19 మాత్రమే.
1909లో నోబెల్ అందుకున్న తొలి మహిళా రచయిత్రి సెల్మా లోగెర్లోఫ్. స్వీడన్‌కు చెందిన ఈ రచయిత్రి బహుళ ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆమె రచనలు కాలంతోపాటు ప్రయాణిస్తూ ఈ తరం పాఠకుల్ని కూడా చదివిస్తున్నాయి. దాదాపు యాభై భాషల్లోకి ఆమె రచనలు అనువదింపబడ్డాయి. తన జీవితకాలంలోని సంప్రదాయాల్ని, ఆధ్యాత్మిక భావాల్ని, మహిళల జీవితాల్లోని భిన్న కోణాల్ని రచనల్లో చిత్రించారు. 1911 నుండి స్ర్తిల సమస్యల మీద, యుద్ధ వ్యతిరేక కార్యకలాపాల మీద సెల్మా ఎక్కువగా పని చేశారు. ప్రతీకాత్మక ఆధునికతల స్ఫూర్తితో, కథనాత్మక వచనానికి నూతన సృష్టికర్త అయి ప్రపంచ ప్రసిద్ధి చెందారు. 1926లో నోబెల్ సాహిత్య బహుమతికి ఎవరూ అర్హత పొందలేదని, అదే బహుమతిని 1927లో ఇటలీ దేశ రచయిత్రి, నవలాకారిణి గరాజ్సీ డేలెడ్డాకు ప్రదానం చేశారు. ఇటలీ నుండి నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ ఆమె. ‘మధ్య ప్రాచ్యంలో రెండవ అతి పెద్దదయిన, ఆమె పుట్టిన ద్వీపం సర్డీనియా జీవితం మీద సానుభూతితో లోతుగా ప్రధానంగా మానవ సమస్యల గురించి, మృదువైన స్పష్టతతో ఆదర్శపూర్వకంగా ప్రేరణ కలిగించే రీతిలో వీరి లేఖనం చిత్రిస్తుంది’ అని నోబెల్ బహుమతి ప్రదాతలు డేలెడ్డా గురించి వివరించారు. నార్వే సాహిత్యకారిణి, నాజీలను ఎదిరించిన సీగ్రిడ్ ఇండ్పెట్ 1928లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. స్కాండివేనియా మధ్యయుగంలోని జీవితాన్ని శక్తివంతంగా చిత్రించినందుకు ఈ బహుమతి లభించింది. వీరు రాసిన 36 పుస్తకాలలో మధ్యయుగానికి సంబంధించినవే కాకుండా సమకాలీన నవలలు, సాహిత్య చారిత్రక వ్యాసాలున్నాయి. అన్ని సమయాల్లోనూ, అన్ని ప్రదేశాలలోనూ, మానవ మేధస్సు పద్మవ్యూహాన్ని, విస్తారమైన వాస్తవిక పరిచయంతో చెప్పగలిగే ప్రావీణ్యం వున్న గొప్ప కథకురాలు ఆమె. పెర్ల్ ఎస్ బక్ పేరు చెప్పగానే ‘ది గుడ్ ఎర్త్’ నవల జ్ఞాపకం వస్తుంది. రచయిత్రిగా ఆమె విశిష్టతను ప్రపంచానికి చాటిన నవల ఇది. ఈ నవల ఇతివృత్తానికి కొనసాగింపుగా మరో రెండు నవలలు రాసి ట్రయాలజీగా వెలువరించారు. బహుశా నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న వారిలో అత్యధిక నవలలు (70) రాసి పేరు గడించిన వారిలో అగ్రభాగాన నిలుస్తారు. రచయిత్రిగానే కాదు మానవతా వాదిగా, ఉద్యమకారిణిగా, అనేకానేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ధైర్యంగా నిలచిన ధీశాలి పెర్ల్ ఎస్ బక్. ఆమె తన తల్లి తండ్రి జీవిత చరిత్రల్ని వేరువేరుగా రాయడమే కాదు, అమెరికా - ఆసియాల మధ్య పరివ్యాప్తమైన తన జ్ఞాపకాల్ని అద్భుతంగా సృజించారు. నలభై ఆరు ఏళ్ల వయసులోనే అనగా 1938లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. 1945లో నోబెల్ అందుకున్న గబ్రియేలా మిస్ట్రాల్ మొట్టమొదటి లాటిన్ అమెరికా నోబెల్ కవయిత్రి. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా విద్య, కవిత్వం మిస్ట్రాల్‌ని నిరాశా నిస్పృహలకు లోను కాకుండా చేశాయి. బాల్యం, ప్రేమ, ప్రకృతి, క్రైస్తవ మత నమ్మకం, మరణం, పునర్జన్మ ఎక్కువగా మిస్ట్రాల్ కవితా వస్తువులయ్యాయి. చిలీ మీద, లాటిన్ అమెరికా మీద కూడా మిస్ట్రాల్ కవిత్వం రాసింది. ఉత్తర అమెరికా ప్రాబల్యానికి విరుద్ధంగా, చిలీ సాంస్కృతిక గుర్తింపును కాపాడుకునేందుకు జరిగిన స్కాండినిస్తా గొరిల్లా ఉద్యమానికి, దేశీయ మూలాల్ని పునరుద్ఘాటిస్తూ వెన్నుదన్నుగా నిలిచింది. మిస్ట్రాల్ విషాదాంత జీవితమే ఆమె కవిత్వానికి ఇంధనం. మరణానికి దారితీసే ఒక నిగూఢ తీర్థయాత్ర జీవితం, ప్రపంచం నుండి ఒక తుది విముక్తి మరణం అని ఆమె కవితలు చెబుతాయి. ఇప్పటికీ, ఎప్పటికి చిలీ రచయిత్రులలో ఆమె అగ్రభాగాన నిలుస్తారు. నాజీల చేతుల్లో మారణహోమం నుండి బతికి బయటపడ్డ నెల్లీ సాచ్పా, నోబెల్ బహుమతి పొందిన మొదటి జర్మన్ యూదు కవయిత్రి. వారికి 1966లో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తూ ‘సమస్త యూదు ప్రజల విషాదం పట్ల భావోద్వేగ తీవ్రతతో, లయాత్మకంగా బాధాకరమైన అందాన్ని, పౌరాణిక నాటకీకరణలతో ఆమె ప్రపంచవ్యాప్తంగా తన స్వరం కలిపిందని, వారి ప్రతీకాత్మక భాష ఆధునికతను సంతరించుకున్న పురాణ కవిత్వం లాంటిదని, ప్రజలతో మమేకమై వారి మీద నమ్మకాన్ని కోల్పోక, వారి ఆచార వ్యవహారాల్ని, మార్మికతని ప్రతిబింబించి ప్రపంచ పద చిత్రాలతో, హింసల శిబిరాల్లోని అరాచకత్వాన్ని విస్మరించకుండా, ప్రతి హింసకి అతీతంగా మానవుని నీచంగా చేసిన నిజమైన దుఃఖాన్ని మాత్రమే వీరి రచనల్లో చూడవచ్చు’ అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా సంకట చరిత్రని అసమానమైన స్పష్టతతో, సున్నితంగా నిజాయితీగా నాదిన్ గోర్డిమెర్ రచనలు ప్రపంచానికి ఎత్తి చూపించాయి. నైతిక, మానసిక ఉద్రిక్తతలతో జాతిపరంగా అతలాకుతలమవుతున్న స్వదేశీ పరిస్థితులను తన కథలలో, నవలల్లో చూపించిన ధైర్యశాలి ఆమె. జాతి వివక్ష కారణంగా జరుగుతున్న అన్యాయాలు, దుర్మార్గాలు, కిరాతకాలకు సంబంధించిన సకాల కోణాల్ని ఆమె సాహిత్యం స్పృశించింది. నాదిన్ సాహిత్యం వల్లనే వర్ణ వివక్ష విశ్వరూపం, అక్కడి శిక్షా నియమాలని అంతర్జాతీయ పాఠకులు అర్థం చేసుకోగలిగారు. స్వేచ్ఛ లేకపోవటం, అర్ధరాత్రులు భద్రతా సిబ్బంది తలుపులు బాది భయోత్పాతాన్ని సృష్టించడం, విడుదలైన రాజకీయ ఖైదీలని వెంటనే మరో ఆరోపణతో అరెస్టు చేయడం ఆ సమయాల్లో అక్కడ సర్వసాధారణం. ఆమె పుస్తకాలు వాటిని అద్భుతంగా చిత్రించి, చదువరులను కూడా భీతిగొలిపేటట్టు చేయగలిగాయి. ఆమె రచనలు అప్పటి సామాజిక చరిత్రను అన్ని కోణాల్లో గ్రంథస్థం చేయగలిగాయని విమర్శకులు మెచ్చుకున్నారు. జాతి వివక్షపై నిరసన స్వరం వినిపించిన నాదిన్ గోర్డిమెర్ 1991లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.
టోనీ మోరిసన్ 1993లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని పొందిన మొదటి అమెరికన్ మహిళ. అందునా నల్లజాతి మహిళ. బీద నల్లవారి స్థానిక భాషలు, సంప్రదాయబద్దంగా టోనీ రచనలు ఉంటాయి. అది తెల్లవారికి అపరిచితమైన భాష. ఆ కారణంగా అతి కష్టమైనవని లేదా కవిత్వమయం అన్న విమర్శను ఆమె పట్టించుకోలేదు. ఆమె నవలల్లో శే్వతజాతి వారు ఎక్కడా ముఖ్య పాత్రల్లో ఉండరు. జాత్యహంకార పురుషాధిక్య సమాజంలో నల్లజాతి స్ర్తిల పాత్ర, అనుభవాల అనే్వషణ ఆమె రచనలు. ఆమె నవలలు ఐతిహాసిక ఇతివృత్తాలు. స్పష్టమైన సంభాషణ, శ్రేష్ఠమైన వివరణాత్మక నల్లజాతి పాత్రల చిత్రణతో అలరారుతూంటాయి. 1996లో నోబెల్ బహుమతిని అందుకున్న విస్లావా సింబోర్క్సా మొదటి పోలండ్ నోబెల్ కవయిత్రి. ఏకాంతంలో గడపడం విస్లావాకు ఎక్కువ ఇష్టం. ఆ ఏకాంతం ఆమె కవిత్వానిది చాలా ముఖ్యమైనదని, అది ఒక విధంగా తనకు ప్రేరణ అనేవారు. తాత్త్విక, నైతిక సంబంధమైన విషయాల్ని ప్రజ్ఞ సహానుభూతితో పరిశోధించడం ఆమె రచనలన్నింటిలోనూ కనిపిస్తుంది. ఆమె వాడే పదాల్లో లోనా బయటా ప్రేమ, నష్టం, వలసలు, చమత్కారం, అంతర్ద్రృష్టితో పాఠకుడు జవాబుల కోసం వెతుకుతాడు. చమత్కారం, వివేకం, ఉత్సాహం అన్నీ రంగరించి ఆమె ప్రతి కవిత అసాధారణంగానూ, మరిచిపోలేనివిగానూ ఉంటాయని ప్రసిద్ధ విమర్శకుడు స్టానిస్లా బరంకా అభిప్రాయపడ్డారు. రోజువారీ జీవితపు సాధారణ విషయాల్లోని అసాధారణ నిజాల్ని వెలికితీసే ప్రయత్నం ఆమె కవిత్వం.
ఇలా అనేకానేక నోబెల్ గ్రహీతల వివరాలను అందజేశారు. గతంలో ముకుంద రామారావు నోబెల్ బహుమతి పొందిన వారి జీవిత రేఖాచిత్రాలతోపాటు వారి కవిత్వాన్ని కూడా పాఠకులకు పరిచయం చేశారు. దీనికి కొనసాగింపుగానే ఈసారి నోబెల్ బహుమతి పొందిన మహిళల పరిచయాన్ని, వారి గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని వెలువరించారు. సమాచారాన్ని సేకరించడంలోనూ, దానిని అనువదించి, విశే్లషించుకొని వివరించడంలోనూ ముకుంద రామారావు చూపిన నేర్పు ప్రశంసనీయం. సాహిత్యకారులనే కాదు సామాన్య పాఠకులను కూడా ఆసక్తికరంగా చదివింపజేస్తుందీ పుస్తకం.

-కె.పి.అశోక్‌కుమార్