అక్షర

మహిళల చుట్టూ తిరిగిన రచనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవలాత్రయం
-ఇంద్రగంటి జానకీబాల
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
**
శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల రచన ‘నవలాత్రయం’. ‘దేవకీ, వాళ్లక్క, అన్నయ్య’ ‘క్షమ’ ‘నిజానికీ అబద్ధానికీ మధ్య..’ అనే మూడు నవలలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ నవలలు విభిన్న ఇతివృత్తాలతో సాగినా స్ర్తిల జీవితాలలో వారు ఎదుర్కొనే సమస్యలను చాలా చక్కగా ఆవిష్కరించాయి.
జానకీబాల గారి నవలల్లో మొదటిది ‘దేవకీ, వాళ్లక్క, అన్నయ్య’.. ప్రధాన పాత్రయిన దేవకి గంగాస్నానం కోసం ఉత్తర భారతదేశ యాత్రకు బయల్దేరడం తో నవల మొదలౌతుంది. ఆ యాత్రలో దేవకి చూసిన పుణ్యక్షేత్రాలను చక్కగా వర్ణించారు రచయిత్రి. జీవితంలోని రకరకాల అనుభవాలు, ఎన్నో రకాలుగా ఆలోచించే మనుషులు, జీవితమనే యాత్రలో తటస్థపడే కొత్తవారు, దూరమైన బంధువులు ఆకస్మికంగా కనబడటం.. ఆ వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలు.. ఇలా నవలలోని కథను చాలా సహజంగా, ఒక ప్రవహంలాగా రచించారు. మన సమాజంలో స్ర్తిల జీవితాలు ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చాలా చక్కగా రాశారు. ఎన్నో స్ర్తి పాత్రల జీవితాలను అలవోకగా అల్లి, ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి వివరిస్తూ ఆయా స్ర్తి పాత్రల మీద మనకు ఎంతో సానుభూతి కలిగేలా చేస్తారు రచయిత్రి.
రెండో నవల ‘క్షమ’. ఇందులో కూడా కథ, కథనం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆడపిల్లల ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా పెళ్లి చేయడం, తెలిసీ తెలియని వయసులో ఆడపిల్ల తప్పు చేస్తే, తన ఇంట్లోనే ఆమె ఏ విధంగా శిక్షించబడుతుంది.. అందుకు ఇతరులు ఎలా సహకరిస్తారు.. అనే నేపథ్యంలో రాసిన నవల ఇది.
మూడో నవల ‘నిజానికీ అబద్ధానికీ మధ్య’. ఇందులో కూడా స్ర్తి సమస్య ప్రధానాంశం. తన తప్పు లేకుండా, ఎవరో పరాయి మగవాడు మృగంలా తన మీద అత్యాచారం చేస్తే ఆ స్ర్తి జీవితం ఎంత నరక యాతనకు గురౌతుంది, ఒకప్పటి సమాజంలో ఆ అత్యాచారం గర్భధారణకు దారితీస్తే పల్లెటూరిలో వుండే ఆ స్ర్తి ఎంత నిరాదరణకు గురౌతుంది.. అనే విషయాన్ని చక్కటి కథనంతో రాశారు రచయిత్రి. ఇలాంటి నేపథ్యం ఉన్న కథలో కూడా చక్కటి ప్రేమ, సున్నితమైన భావాలు వున్న నాయికా నాయకులు, వారి సంఘర్షణను.. ఆసక్తికరమైన మలుపులతో, కథనంతో రచించారు.
మొదటి నవల 2013వ సంవత్సరంలో ప్రచురించబడింది. మిగిలిన రెండు నవలలు 1984-85, 1989వ సంవత్సరాలలో ప్రచురించబడినవి. అందువల్ల ఆ కాలపు సామాజిక స్థితిగతులను మనం ఈ నవలల్లో చూస్తాము.
జానకీబాల గారి నవలల్లో జీవితం గురించిన చింతన, సమాజం గురించిన విమర్శ, మనుషుల వ్యక్తిత్వాల గురించి చర్చించేటపుడు ఉన్నత స్థాయి దృక్పథం ఈ నవలల్లో కనబడుతుంది.
ఏ కాలమైనా స్ర్తిల జీవితాల్లో విచిత్రమైన సమస్యలు, సంఘర్షణలు ఉంటాయి. వాటి గురించి రాసినా తన కథలతో, కథనంతో ఆసక్తికరంగా, చదివించగలిగేలా రాశారు జానకీబాల.

-హైమాభార్గవ్