అక్షర

సహృదయ దర్పణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవుల తెలంగాణం
తెలంగాణ కవుల
కవిత్వ పరామర్శ
పుటలు: 207.. వెల: రూ.140
ప్రతులకు: నవ చేతన
పబ్లిషింగ్ హౌస్
హైదరాబాద్.
*
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సీనియర్ అకడమీషియన్, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసి రిటైరయినవారు. సాహిత్య నిబద్ధతతో కూడిన విద్వాంసులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతలు. రచయిత గ్రహించే వస్తువు, దాన్ని అభివ్యక్తం చేసే తీరు ద్వారా రచయితల వ్యక్తిత్వాలను అంచనా వేయవచ్చునని రాచపాళెం వారు విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఈ గ్రంథం అంకితం ఇవ్వడం ఎంతో ఔచితీమంతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాకారమైన తరుణంలో దాదాపు నలభైఏళ్ల సాహిత్య వ్యాసంగంలో తెలంగాణ రచయితల మీద రాసిన కొన్ని వ్యాసాలలో పదిహేడింటిని మాత్రం ఏర్చి కూర్చిన సంకలనమిది. తెలంగాణ సాధించిన పరిణామంగా దీనిని భావించవచ్చు.
ఈ వ్యాస సంకలంలో కాళోజి, సినారె, మాష్టార్జీ, గద్దర్, ఎన్.గోపి, అఫ్సర్, విమల, ఆశారాజు, నందిని సిధారెడ్డి, కందుకూరి శ్రీరాములు, ఎస్వీ సత్యనారాయణ, జూపాక సుభద్ర, జూలూరి గౌరీశంకర్, ఎన్.అరుణ, నవీన్‌ల రచనల మీద రాచపాళెం వారు చేసిన విశే్లషణలు సాధికారికంగా ఉన్నాయి. అదనంగా తెలంగాణ జానపద గేయాలు - సామాజిక జీవిత ప్రతిబింబాలు వ్యాసం చేరింది. దీని బదులు మరొక ఆధునిక కవి రచన ఉంటే ఏకరూపత వచ్చేదని అనిపించింది.
స్వాతంత్య్ర సమరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న కాళోజిలో నున్న బ్రిటిష్ వ్యతిరేకతను తదనంతర పరిణామాన్ని సోదాహరణంగా రాచపాళెం వారు వివరించారు.
బాపూజి బ్రతికిన యప్పటి/ సత్యాహింసల దుప్పటి
బొంకుల బొంతగ మారెను/ ఘనతలు సాంతము దీరెను.

అరచేతిలో స్వర్గం జూస్తూ/ నరకంలో పడతామని
కాంగ్రెసు వాదుల చేతనే/ గాంధీయిజం చస్తుందని-
అంటూ కాళోజి ఈ కవితను 1951లో రాశాడు. ఈ కవిత రాసిన 67 ఏళ్ల తర్వాత సైతం దీని ప్రాసంగికత తగ్గకపోను పెరగడం కాల పరిణామలీల.
శ్రామిక కులాలలో చైతన్యం తీసుకొని వచ్చి, సమాజంలో మార్పు కోసం ఉద్యమించే కదలికను వాళ్లలో కలిగించడానికి పాటను ఆయుధంగా చేసుకున్న ప్రజాకవి మాష్టార్జీ కవిత్వంలో భావస్పష్టత, భావనా తీక్షణత, భాషా నిశితతత్వం ఉన్నాయని రాచపాళెం వారు సోదాహరణంగా వివరించారు.
మార్క్సిస్టుల వర్గ పోరాటం మాత్రమే కాదు. అంబేద్కర్ స్ఫూర్తితో కుల పోరాటం కూడ ఉండాలి -అంటూ
వెనుకబడ్డ కూలన్నల కూడ గట్టుదాం
కుల పోరు, వర్గ పోరు కల్సి పోరుదాం
భూపోరులో మన పోరు మొదలుపెట్టుదాం
రైతు కూలి దండుగట్టి రాజ్యమేలుదాం.
నూతన ప్రజాస్వామిక విప్లవ సిద్ధాంతానికి దాని కార్యాచరణకు, కళాత్మక అభివ్యక్తి అయిన గద్దర్ పాటలను విశే్లషణాత్మకంగా వివరించారు.
కవిత్వంలో ఉత్తీర్ణత కోసం నేను రోజుకో ప్రవేశ పరీక్ష రాస్తుంటాను... అని భావించుకునే నిరంతర కవి ఆచార్య ఎన్.గోపి కవిత్వ పరిణామాన్ని విశే్లషిస్తూ రాచపాళెం తొలినాటి కవిత్వం జీవితాన్ని ప్రదర్శించి వివరించే దశ, మలి దశ కవిత్వంలో వస్తు వైవిధ్యం, వ్యాఖ్యానం, నిర్వచనం సూత్రీకరణ కనబడుతుంది. ప్రస్తుత దశ తాత్వికత, భావుకత కనబడుతున్నాయని వ్యాఖ్యానించడం వాస్తవాన్ని దర్శించడమే.
ఒకే దేశం అన్ని దేశాల అవకాశాలను అభివృద్ధిని గ్లోబలైజేషన్ పేరు మీద కొల్లగొట్టడాన్ని అఫ్సర్, తన కవిత్వంలో ఆక్షేపించడాన్ని విశే్లషించారు. గ్లోబలైజేషన్ వల్ల కలిగిన దుష్ఫలితాలను, దుష్పరిణామాలను ఎండగట్టాల్సిందే. మరికొన్ని సత్ఫలితాలు కూడా లేకపోలేదు. కుల మతాల ప్రాతిపదిక మీద రక్తసిక్తమవుతున్న సమాజాన్ని కవిత్వంలో అభివ్యక్తం చేయడానికి అఫ్సర్ రక్తం నెత్తురును ప్రధాన ఇమేజ్‌లుగా చేసుకున్నారని రాచపాళెం వారు గుర్తించారు. వార్తకు వచన కవిత్వానికి మధ్య ఉండే సున్నితమైన సరిహద్దును చెరిపేసి కవిత్వాన్ని పలచన చేసే వాళ్లలాగ కాకుండా వస్తు రూపాల మధ్య సమన్వయాన్ని సామరస్యాన్ని సాధించిన కవి ఆశారాజు అని వ్యాఖ్యానిస్తారు.
తెలంగాణ సాహిత్య అకాడెమీ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి కవిత్వం సాంద్రత నుండి సరళత వైపు పయనించిందన్నారు. సిధారెడ్డి కవిత్వంలోని క్రియాంత వాక్యాల సమాహారం మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. (పుట 127). సిధారెడ్డి కవిత్వం నిండా మనిషే వస్తువు. మనిషి శ్రమే వస్తువు. కులం, వర్గం పునాదుల మీద, ప్రాంతం మీద, పునాదుల మీద మనిషిని మనిషే దోపిడి చేసే అమానుషం మీద, మనిషి ఎన్నుకున్న పాలకులు చేసే దుర్మార్గం మీద, దోపిడీకి వివక్షకు వ్యతిరేకంగా తిరగబడే మనిషి మీద, రాజ్యం చేసే హింస మీద విమర్శ సిధారెడ్డి కవిత్వం. దానిన ఏ పద సమూహంలో అభివ్యక్తం చేయాలో, ఏ వాక్య సముదాయంలో బహిర్గతం చేయాలో సిధారెడ్డికి బాగా తెలుసునని రాచపాళెం వ్యాఖ్యాసిస్తారు. (పుట. 133)
ఎన్.అరుణ కవిత్వంలోని పల్లీయ పరిమళాన్ని, విమల ఉద్యమ కవిత్వంలోని వైవిధ్యాన్ని, నవీన్ (అంపశయ్య నవీన్ కాదు) కవిత్వంలోని ప్రపంచీకరణను అభిశంసించిన తీరును సోదాహరణంగా చర్చించారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారి ప్రతి వ్యాసం విషయ నిర్భరతతో, ఆయా విషయాల కనుగుణమైన విశే్లషణతో, స్వీయ దృక్పథంతో సాగుతాయి.

-వెలుదండ నిత్యానందరావు