అక్షర

పూల లోయలో సహజీవనయానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్పావతి లోయలో...
(నవల)
-తరానా
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
తరానా రచించిన ‘పుష్పావతి లోయలో..’ విభిన్నంగా వుండే నవల.
ఇది పాపులర్ రొమాంటిక్ నవల కాదు. పరిణతి చెందిన వ్యక్తుల ప్రణయ కథ. 67 సంవత్సరాల వయసున్న కథానాయిక జయ, 69 సంవత్సరాల వయసున్న నరేన్‌ల ప్రణయగాథ. సమాజంలో అందరూ ఆమోదించని కథ.
ఈ నవల 1940 ప్రాంతంలో ఓ కుగ్రామంలో కథానాయకుడు నరేన్ బాల్యంతో మొదలవుతుంది. చిన్న వయసు నుండి నరేన్‌కు ప్రకృతి అందాల మీద ఉన్న ఆరాధన వయసొచ్చే కొద్దీ పెరిగి అతనొక హృదయ జీవిగా, ఉత్తమ పర్యాటకుడిగా, ఆధ్యాత్మిక జీవనం పట్ల అభిరుచి, ఆకర్షణ, గౌరవం వున్న వ్యక్తిగా ఎదుగుతాడు.
1954-55 విద్యా సంవత్సరంలో గోవా విమోచనోద్యమంలో భారీ ర్యాలీ నిర్వహించినపుడు తమతమ పాఠశాలల నుండి వచ్చి అందులో పాల్గొని, ప్రముఖంగా గుర్తించిన పదిహేనేళ్ల జయ, పదిహేడేళ్ల నరేన్ అక్కడే మొదటిసారి కలుస్తారు. ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులౌతారు. ఆ జ్ఞాపకాలు వారి మనసుల్లో శాశ్వతంగా ముద్రించబడుతాయి. కానీ పరిస్థితులు అనుకూలించక, వారి ప్రేమ ఫలించదు. కలిసిన మొదటి రోజు తర్వాత వారెప్పుడూ కలుసుకోరు. ఆనాటి సామాజిక కట్టుబాట్ల వలన కలిసే అవకాశం రాదు. ఆ తర్వాత వారు విడిపోతారు. యాభై ఏళ్ల తర్వాత హరిద్వార్‌లో నాటకీయంగా కలుస్తారు. చిన్న వయసులో కలిగిన ప్రేమ ఎన్నో ఏళ్ల తర్వాత కలిసినపుడు వారి మనసుల నుండి ధారాపాతంగా ఉప్పొంగి, వారిని వివశులను చేస్తుంది. మానసికంగా ఎంతో దగ్గరైన వారిద్దరూ, తమ శేష జీవితంలో కలిసి బ్రతకాలని తపిస్తారు. భర్త ముప్పైయేళ్ల క్రితమే చనిపోయి, ఒంటరిగా హరిద్వార్‌లో జీవిస్తున్న జయ నరేన్ తోడు, ప్రేమ లేకుండా బ్రతకలేనని గ్రహించి, సమాజాన్ని ఎదిరించి నరేన్‌తో కలిసి బతకాలని నిశ్చయించుకుంటుంది. ఆమెను ఎంతగానో ప్రేమించిన నరేన్ కూడా ఆమె సాన్నిధ్యం కోసం తపించి, సహజీవనం చేయాలని నిశ్చయించుకుంటాడు.
కథ ఢిల్లీ, హరిద్వార్, ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో, బెంగళూరు, మైసూర్, పడమటి గోవా, కుమావూన్ పర్వత శ్రేణుల్లో సాగుతుంది. ఈ ప్రాంతాల్లో జయ, నరేన్ కలిసి తిరుగుతారు.
పుష్పావతి లోయ (వేలీ ఆఫ్ ఫ్లవర్స్)లోని ప్రకృతి అందాలను రచయిత చాలా చక్కగా వర్ణించారు. తత్త్వం గురించి, సమాజం గురించి, దాంతో మనకున్న సంబంధం గురించిన చర్చ నవలలో కనపడుతుంది. కథనం సరళంగా సాగిపోతుంది.
నరేన్, జయలది అమలిన శృంగారంలా కనబడినా, వాస్తవానికి అలా వుండదనే చెప్పాలి. నౌకుచియాతాల్‌లోని హోటల్‌లో కార్తీక పౌర్ణమి నాటి వారి భావావేశం, రచయిత వర్ణన వారి ప్రేమ, అమలిన శృంగారం కాదని చెబుతాయి. నరేన్ మాటల్లోనే చెప్పాలంటే ‘ఎర్రగులాబీ గథ్వాల్ రాణి దశ నుండి ఆనంద్ బాబా, మాతా జయ వరకు చేసిన సుదీర్ఘ ప్రయాణమే ఈ నవలలోని కథ.
తరానా తొలిసారిగా నవల రాయడం వలన కాబోలు నవలలో కొన్ని సందర్భాల్లో వ్యక్తీకరణ సరిగా లేదని చెప్పవచ్చు.
యాభై ఏళ్ల తర్వాత హరిద్వార్‌లో నాటకీయంగా జయను కలిసిన నరేన్ మొదట ఆమెను గుర్తుపట్టడు. జయ కూతురి ఫొటోను చూస్తూ జయను గుర్తుపడతాడు. ఆ తర్వాత జయతో ‘నీ రూపంలో ఏ మార్పూ లేదు. కొంచెం లావెక్కావు. అంతే...’ అంటాడు. కొంతమంది మనుషుల్లో ఏ మార్పు లేకపోవడం మనం చూస్తూంటాం. కానీ 65 ఏళ్ల జయ పదిహేనేళ్ల పిల్లలా పాఠకులకు కనపడదు.. నరేన్ కళ్లతో చూస్తే తప్ప.
అలాగే ఓ సందర్భంలో నరేన్ వ్యక్తిత్వానికి తగని మాటలను ఆ పాత్ర చేత పలికించారు రచయిత. గోవా విమోచనం కోసం ఆవేశంగా ఉపన్యసించిన నరేన్, దక్షిణాది వాడైనా ఉత్తర భారతదేశాన్ని ఎంతగానో ప్రేమించే నరేన్ అసలైన జాతీయవాది. అటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు కాస్త విభిన్నంగా మాట్లాడుతాడు.
‘ఇక్కడి నీళ్లను అక్కడికి తరలించుకు పోతున్నారు.. ఆశకు అంతు లేదు.. జలకాలాటలు ఆడుతారు.. (నిజంగా జలకాలాటలు ఆడగలరా తరానాగారూ..)
‘కలిసి వుండడం సాధ్యమేనంటావా?’ అని జయను అడుగుతూ, ఆమె కుదరదని చెబితే..
‘కానీ బలిసిన వాడు అంటే బలిసిన కొద్దిమంది పెద్దలు కుదురుతుందంటారు. అలా కాకపోతే.. వాడు కొల్లగొట్టుకుపోవడం ఇక ముందు చేయలేడు. అందుకని వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు.. బైటకు తీసి దుమ్ము దులిపి పారాయణం చేస్తున్నారు... వాటిని అతిక్రమిస్తే శాపం తప్పదంటున్నారు...’
ఒక తత్త్వవేత్తలా సంయమనంతో వుండే నరేన్ ‘బలిసిన పెద్దలు’ అనడం సరికాదేమో. ఆధ్యాత్మికంగా ఎదిగి, మాతా చండీదేవి దర్శనం చేసుకునే నరేన్ వేదాలకు, పురాణాలకు, ఉద్యమాలకు ముడిపెట్టగలడా? తెలంగాణ ఉద్యమానికి, వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలకు అసలు సంబంధం వుందా? ఉన్నతమైన చదువు చదివిన, మానసిక శాస్త్ర అధ్యాపకులైన తరానా గారే ఇలా రాస్తే అది సమర్థనీయం కాదు. బలిసిన పెద్దలు వేదాలను అర్థం చేసుకోగలరా? వాటి దుమ్ము దులిపి పారాయణ చేసే స్థితిలో వారుంటారా? వాటిని అతిక్రమిస్తే శాపం తప్పదని వారు ఎలా అనగలరు? ఉద్యమాలు వేరు.. వేదాలు, పురాణాలు వేరని విశే్లషించే శక్తి నరేన్‌కు లేదా? ఇలాంటి మాటలు నరేన్‌కు కళంకాన్ని తెస్తాయి. రచయిత ఇటువంటి సన్నివేశాల్లో సంయమనం పాటిస్తే బాగుండేది.
‘హృదయానికి హద్దులు లేనట్లే రాష్ట్రాలకు సరిహద్దులు లేవు. ఉత్తర, దక్షిణ భారతదేశ వాసుల్ని సమైక్యం చేసే కథాబలం రచనకే వనె్నని చేకూర్చింది..’ అనే ప్రొ.ననుమాసస్వామి గారి మాటలు ఎంతో నిజం. మరి ఇంత గొప్ప విశాల హృదయాన్ని దక్షిణ భారతదేశంలో జరిగిన సమైక్య వాద ఉద్యమం పట్ల నరేన్ ఎందుకు ప్రదర్శించలేక పోయారనే ప్రశ్న పాఠకుల మనసుల్లో తలెత్తక మానదు. ఉద్యమాలలో ఎవరి వాదం వారికి ఉంటుంది కదా.
అలాగే భార్య మనస్తత్వం తెలిసిన నరేన్ మాట వరసకైనా జయ అనే తన స్నేహితురాలు తమ ఇంటికి వస్తోందనే విషయాన్ని ముందుగా చెప్పడు. అతిథి గురించి ముందుగా చెప్పాలనే కనీస సంస్కారాన్ని ప్రదర్శించడు. పైగా జయను చూసి తన భార్య సంతోషిస్తుందనీ, ఆదరిస్తుందనీ యాభై ఏళ్ల కిందటి తమ స్మృతులను గురించి జయ చెబుతుంటే తన భార్య ఆశ్చర్యచకితురాలవుతుందని అనుకుంటాడు. తీరా జయ వచ్చాక తనే తన చిన్ననాటి డ్రీమ్ గర్ల్ అని భార్యకు చెబుతాడు. ఈ ప్రపంచంలో ఏ భార్య అయినా ఇలాంటి విషయాలకు సంతోషిస్తుందా? సూట్‌కేస్ బైటకి విసిరిన పద్మ వాళ్లను ఇంటి నుండి వెళ్లమంటుంది. రచయిత నరేన్ వ్యక్తిత్వాన్ని దిగజార్చడం కనబడుతుంది.
ఇలాంటి లోపాలు మినహాయిస్తే, తరానా గారి నవల హాయిగా సాగుతూ ఆయన స్థాయి వారిని అలరించే రచనని చెప్పవచ్చు.

-హైమాభార్గవ్