అక్షర

కవి మనోగత అక్షర మాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలా రువ్వుదామా రంగులు
(కవిత్వం)
-విజయ్ కోగంటి
వెల: రూ.100/-
పేజీలు: 96
ప్రతులకు: డా.కోగంటి
విజయబాబు
8801823244
*
విజయ్ కోగంటి కవిత్వం స్నేహితుడిలా వచ్చి పక్కన కూచుంటుంది. కోపతాపాలు ప్రదర్శించకుండా చేతిలోకి చేతిని తీసుకుని నిమురుతూ -‘నీకూ ఇలాగే అనిపిస్తుందా లోకం?’ అని జవాబు కోసం కళ్లలోకి చూస్తుంది.
కవిత్వం ఎంత విస్తారంగా రాసినా, కవి కానరాని కవిత్వం నిర్జీవ సమానమే. కవిత్వం కవి కాల సామాజిక, ఆర్థిక, మానసిక పరిస్థితులకు బింబం కావాలి. అక్కడి శీతోష్ణస్థితి అక్షరాల స్పర్శలో ఉండాలి. దీని కనుగుణంగానే తెలుగు నేల నైసర్గికతను బట్టి రచనల్లో వస్తు గరిమ, పిడికిళ్ల వేడి మారుతూ ఉంది. మద్యాంధ్ర నుంచి వస్తున్న అనుభూతి కవిత్వం పై మాటకు బలం చేకూర్చుతుంది.
కవిత్వానికి మానవీయ కోణం ప్రాణం. గుండె గూటిలోని తల్లడింపులే అక్షరాల్లో మాగి కవిత్వంగా రూపుదిద్దుకుంటుంది. విజయ్ కోగంటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ కవిత్వంలో సింహభాగం సాత్విక పలకరింపులే. ఆలోచనల ప్రవాహాన్ని కాలువల్లోకి మళ్లించడమే. పెద్దపెద్ద ప్రతిజ్ఞలు చేయకుండా అక్షరాలతో చల్లని పిచ్చుకగూళ్లు కడుతూ సాగిపోవడమే. కవిత్వంలో ఇదే ఉండాలనే ఆంక్షలేమీ లేవు కాని కవిత్వం ఇలా ఉండాలనే లాక్షణికత మాత్రం ఉంది. రూప, శిల్పాల్లో భావం నిలబడితే చాలు. ఆ ప్రయత్నం విజయ్ కవిత్వంలో స్పష్టంగా కనబడుతుంది.
కవికి సమాజంతో తీవ్రమైన శతృత్వం లేదు గాని, సంతృప్తి మాత్రం లేదు. ‘మనుషుల మధ్య కురవాల్సిన వెనె్నల జల్లును/ కొంచెంగానేనా కురిపించేందుకు యత్నిద్దామా?’ ఆనే ఆకాంక్ష ఉంది.
‘నీవు రోజూ పలకరించిన/ యే పూల పరిమళమూ/ నిన్ను కదిలించదు’ అనే బెంగ ఉంది.
మనుషుల మధ్య ‘బంధం’ - భావాల/ మధ్య పెనవేసుకునేదీ/ అహంభావాల కుదుపుల్లో/ వౌనంగా నలిగిపోతున్నదీ కూడా అదే’నని గుర్తు చేస్తాడు. ఇలా వౌనంగా నలిగిపోతున్న బాధ ఈ కవితల్లో కొనసాగుతుంది కూడా. ‘అపుడపుడూ ఖాళీగా నా వైపు తిరిగి/ ననే్న పిలుస్తున్నట్లుండే వూయల’ అనడం ఒంటరి వౌనానికి చిహ్నమే. ‘అనుభూతిలేని అనుభవం జీవితమవుతుందా? అన్ని తెలిసి ఇలా జడంలా, ఎలా?’ అని కుదుపుతాడు.
పుట్టిన తేదీని జననం అని వాడుకుంటారు గాని కవి విజయ్ కోగంటి దృష్టిలో మాత్రం ‘అంతరాంతరాలలో/ పేరుకున్న/ కోరికలను దాహాలను అహాలను/ దహిస్తూ జ్వలించడమే జననం.’
‘పలకరించి చూడు’ అంటూ ‘ఓ ఆత్మీయమైన మాటకన్నా/ మన దాహం తీర్చగల తీయని సంద్రాలెక్కడున్నాయి నేస్తం?’ అని ప్రశ్నిస్తాడు. పలకరింపును తీయని సంద్రంగా తేల్చడంలో కొత్త నడక ఉంది.
పలకరింపును ‘ఒంటరి నడక’ కవితలో మరోసారి గుర్తుచేస్తూ ‘ఇన్ని చెట్లున్నా/ పనిగట్టుకు పలకరించి పోయే/ మలయమారుతం రాకుంటే/ అడవికెప్పటికీ గుబులే’ అంటాడు.
మరో కవితలోనూ ఇదే ప్రస్తావన మరింత హృద్యంగా- ‘ఈ చెట్లెప్పుడూ యింతే!/ పలకరిస్తే చాలు/ రేపటికంటూ చూసుకోకుం డా/ పూలన్ని కుమ్మరించేస్తుంది’ జీవమున్నదేదైనా పలకరింపునకు పొందే పరవశం కవికి తెలుసు.
‘హోళీ’ కవితలో రంగులకు పరమార్థం ఆపాదిస్తాడు కవి. ‘దుర్మార్గపు గుండెలవిసేలా/ అజ్ఞానపు రంగు/ వెలిసి రూపుమారిందాకా/ రువ్వుదామా రంగులు?’ అని సిద్ధమవుతాడు.
‘ఇంకా పరిమళించాల్సిన కోరికల మొగ్గలు/ నీ అడుగుల వెలుగులకై వేచి ఉన్నై’ పంక్తుల్లో కొత్త ఉపమ పరిమళించింది.
కవి సామాజిక కోణం ప్రతిఫలించే పలు వాక్యాలు విజయ్ కోగంటిని పరిపూర్ణత వైపు అడుగులేయిస్తాయి.
‘బహుపరాక్!’లో ‘మీ నుదిటి కుంకుమ చూసి/ పూజా దురంధరులనుకున్నామే కాని/ మీ అవిశ్రాంత నరమేధపు వెచ్చటి నెత్తుటి ఆనవాలనుకోలేదు’ అనే పంక్తులు కవి ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తాయి. ‘జగదతపూర్ జైల్ సెల్’ అనే నేను... కవి క్షోభను ప్రతిబింబించే మరో కవిత. దివంగత కవి, కవి మిత్రుడు గుడిహళల రఘునాథం గుర్తును ‘నీ జ్ఞాపకమెప్పటికీ/ ఓ సరియలిస్ట్ కవిత’ అని కదిలిపోతాడు కవి.
‘ఓసారి బయటకొక అడుగేసి’ కాలంతోపాటు వెళ్లి వద్దాం, వస్తావా’ అనే కవి కవితలు కవిని కూడా ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నలకు జవాబులే మంచి కవితలుగా పుట్టుకొస్తాయి.

-బి.నర్సన్