అక్షర

గాంధీజీ మెచ్చిన అమరజీవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరజీవి పొట్టిశ్రీరాములు
-డా.వి.ఆర్.రాసాని
వెల: రూ.75/-
ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన పుస్తక విక్రయ కేంద్రాలు
**
పొట్టిశ్రీరాములు అనగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం కోసం ఆమరణ నిరాహారదీక్ష వహించి ప్రాణాలు అర్పించిన త్యాగశీలి సాక్షాత్కరిస్తాడు. గ్రంథకర్త ఈ అంశంతో పాటు శ్రీరాములు గాంధీయవాదిగా నిర్వహించిన అనేక కార్యక్రమాలకు సమ ప్రాధాన్యమివ్వడం విశేషం. దీక్ష ప్రారంభించడానికి ముందు శ్రీరాములు చేసిన ప్రకటన ఇలా మొదలవుతుంది: ‘నైజ గుణము చేత నేను నిర్మాణ కార్యక్రమములో కార్యకర్తను. నేను జీవితము అంతా ఆ కార్యక్రమములోనే ఇంతవరకు గడిపాను.’
స్వస్థలం కనిగిరి. జననం మద్రాసు (చెన్నై)లో. బాల్యంలోనే శ్రీరాములు కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఏడో ఏటనే తండ్రిని కోల్పోయాడు. పదో తరగతి పూర్తి కాకుండానే బొంబాయి వెళ్లి ప్లంబింగ్ విద్య (ఇంజనీరింగ్) చదివాడు. రైల్వేలో ఉద్యోగం వచ్చింది. వివాహమైంది. తల్లి, భార్య, కుమారుడు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం మాని గాంధీ ఆశ్రయం పొందాడు. సబర్మతీ ఆశ్రమంలో చేరి స్వల్పకాలంలోనే గాంధీ అభిమానం చూరగొన్నారు. నరుూతాలిమ్ నిర్మాణ కార్యక్రమం శ్రీరాముల్ని బాగా ప్రభావితం చేసింది. సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు శ్రీరాములు జైలుశిక్ష అనుభవించారు. సర్వోదయ కార్యక్రమం ఆయన్ని మానవతావాదిగా నిలిపింది. బీహారు భూకంప బాధితులకు శ్రీరాములు సేవ గురించి రచయిత ఇలా అన్నారు: ‘అన్నీ పోగొట్టుకున్న ఆ బాధితులకు తల్లి, తండ్రి, సోదరుడిగా మారి అన్నీ తానై నిర్విరామ కృషి సల్పి రోజుకి 3-4 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటూ సేవ చేశారు.’ - కుల నిర్మూలన, హరిజనోద్ధరణ వంటి గాంధీ కార్యక్రమాలు శ్రీరాములు చేపట్టి అకుంఠిత దీక్షతో నిర్వహించారు. మద్రాసులోని ఒక సభావేదికపైన గాంధీ శ్రీరాముల్ని ప్రశంసిస్తూ ‘మీ వంటి దేశభక్తి పరాయణులు ఇంకో పదిమంది ఉంటే చాలు. ఈ దేశానికి ఒక సంవత్సర కాలంలోనే స్వాతంత్య్రం సంపాదించగలదన్న నమ్మకం కలుగుతోంది’ అని స్పష్టంగా చెప్పారు. శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. జాతీయ స్థాయితోపాటు ప్రాంతీయంగా ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారాయన. హరిజన దేవాలయ ప్రవేశం, మద్యపాన నిషేధం, వితంతు వివాహం, అస్పృశ్యతా నివారణ వంటివి ప్రజలలో చైతన్య ఉద్దీపింపచేశాయి. నెల్లూరులో పాకీవారితోపాటు ‘్భంగీ కాలనీ’లో నివసిస్తూ వారికి సంస్కరణ సూచనలు చేశారు.
గాంధీ నిర్యాణంతో శ్రీరాములు తీవ్రంగా కలత చెందారు.
‘ఇంక మన దేశ రాజకీయాలలో అనూహ్యమైన పరిణామాలు రాబోతున్నాయి. ఈ సంఘటన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు వంటిది’ అన్నారాయన. గాంధీ స్మారక నిధి సంచాలకుడిగా శ్రీరాములు ఎంతో శ్రమించారు.
మద్రాసు నగరం గురించి శ్రీరాములుకు పూర్తి అవగాహన ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణంపై విస్తృత చర్చలు జరుగుతున్న కాలమది. ‘ఆంధ్రులు ఉమ్మడి రాష్ట్రంగా ఇలాగే కొనసాగితే అభివృద్ధి సాధించలేమనీ, కాబట్టి స్వరాష్ట్ర సాధనకై పాటుపడడానికి నేను దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నాను’ అని ఆయన ప్రకటించారు. స్వామి సీతారాం నిరాహారదీక్ష వినోబా జోక్యంతో విరమించుకోవడం చేత చాలా విమర్శలొచ్చాయి. ఇది శ్రీరాముల్ని బాధకు గురి చేసింది. ఇక నిశ్చయానికి వచ్చి తన స్థిర సంకల్పాన్ని ఇలా వెల్లడించారు: ‘నేను నా ఓపిక ఉన్నంతలో ఒకే పని చేయగలను. అమరణోపవాస దీక్ష వహించి అక్టోబర్ 19వ తేదీ నుండి బులుసు సాంబమూర్తి గారి వసతిలో ఈ బాధ్యతను నిర్వహించడానికి పూనుకుంటున్నాను. మదరాసు నగర విషయమై ప్రజలు ఈ లోపల ఒక ఒప్పందానికి రాగల్గినా, రాజ్యాంగం 131 సెక్షన్ అనుసరించి భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించదలచినట్టు ప్రకటన వచ్చినా ఈ దీక్షను విరమిస్తాను. లేకపోతే నా దీక్ష ఆమరణాంతం సాగిస్తాను.’
చెప్పినట్లే దీక్ష ప్రారంభించారు. 58వ రోజుకు దీక్ష చేరింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 1952 డిసెంబర్ 15 రాత్రి 11 గంటల 23 నిమిషాలకు ఆయన అమరుడయ్యారు.
ఎంతో పరిశోధన చేసి ఈ గ్రంథాన్ని రచించిన డా.వి.ఆర్.రాసాని కృషి ప్రశంసనీయం.

-జిఆర్కె