అక్షర

జీవితంలో మెలకువ విలువల కలయిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనె్నం శారద కథలు
ప్రచురణ: జె.బి.పబ్లికేషన్స్
హైదరాబాద్
పేజీలు: 448
వెల: రూ.200/-
**
1979 నుంచి విడవకుండా రచన పరిశ్రమ చేస్తూ, ఇప్పటికి దాదాపు వెయ్యి కథలు, నలభై నవలలు, టీవీ సీరియల్ స్క్రిప్ట్‌లు రాసిన మనె్నం శారద రచనలలో నుంచి ఎన్నిక చేసి - నిజానికి ‘సేకరించి’ - ప్రచురణ చేసిన కథల సంపుటం ఇది. ఇందులో 36 కథలు మాత్రమే వున్నాయి. అన్ని కథలు కులాసాగా చదివించుకుపోయే ‘నేరేటివ్ స్టైల్’లో వ్రాసినవే. చదువరిని తికమకలు పెట్టకుండా, జీవితాన్ని అర్థం చేసుకుందుకు సహకరించే కథలు. కథలయినా నవలలయినా మనిషి జీవితం నుంచే పుట్టుకు వస్తాయి. మనిషి ఒంటరివాడు కాదు. అతని చుట్టూ కుటుంబం, స్నేహితులు, బంధువులు, ప్రపంచం, భూగోళం అంతా ఉంటుంది. వీటితో అతను పెంచుకునే సంబంధ బాంధవ్యాలు, వాతావరణ విస్తీర్ణతలు క్రియేటివ్ రైటింగ్‌లో చోటు చేసుకుంటాయి. జీవితపు విలువల కలయికలను సమకూరుస్తాయి. ఈ దశలో పయనిస్తూ చక్కని కళాఖండం లాంటి సన్నివేశాలను చదువరుల ముందు సాక్షాత్కరింపజేసిన రచయిత్రిని అభినందించడం విధాయకం.
ప్రేమించినా పెళ్లి చేసుకోలేని ప్రియుడు, మరో వివాహంతో కన్న కూతురిని తన కూతురుగానే ప్రేమించి పై చదువులు చెప్పిస్తున్న ఒక యువతి కథ మొట్టమొదటిది. ‘ఇది కథ కాదు’ అని దీనికి పేరు పెట్టినా, ఇటువంటి సందర్భాలు అతి అరుదుగా జీవితంలో తారసపడతాయి కనుక ‘కథ’ అనుకున్నా దోషం లేదు. అలాగే పెళ్లి చేసుకుందామనుకున్న జంట తాలూకు తల్లులు ఇదివరకే తెలిసిన వాళ్లయి వుండి, వాళ్ల ప్రేమ చరిత్రలు విభిన్నంగా వున్నప్పుడు ఈ కొత్త ప్రేమికులు తమ ఆలోచనలు ‘విత్‌డ్రా’ చేసుకోవడం, ‘విరిగిపడిన శిఖరం’ అనే చివరి కథ. ఈ కథల మధ్య మనకు ఎందరో పరిచయం అయిన పాత్రల పేర్లు పెట్టుకున్న మనుషులు కనిపిస్తారు. తాను పెంచుకుంటున్న పిల్ల తనను ఎక్కడ కాదంటుందోనని భయపడి జబ్బు తెచ్చుకున్న తల్లి, కూతురు కోసం మనవరాలిని యింకో కుటుంబానికి ఇచ్చి, ఆ రహస్యాన్ని తన గుండెలలోనే దాచుకున్న అమ్మమ్మ; అరకు వేలీలో అమ్మమ్మ చివరి రోజులు అర్థవంతంగా నడిపించే యువ మనవరాలు; అమెరికా వెళ్లిన దంపతుల ఇల్లు కుక్కలు దొంగల నుంచి కాపాడిన వైనం; మగశిశువు కలుగుతాడని ఎబార్షన్ చేయించుకుందామనుకున్న తల్లికి తనకు పుట్టబోయేది ఆడపిల్లే అని తెలుసుకున్న గర్భవతి ఆనందం; కొడుకు ప్రాణాలు కాపాడటానికి మనవడి పసిప్రాణం బలి ఇచ్చి పాపపరిహారం కోసం అన్నట్లుగా కాశీ ప్రయాణం చేసే తల్లి.. ఇలా మనకు కళ్లు తెరిచి చూడగలిగితే చెవులొగ్గి వినగలిగితే అడుగడుగునా చుట్టుపక్కల కనిపించే రూపాలు, మానవ హృదయ నాదాలు, ఎన్నో కథలతో మన ముందు ప్రత్యక్షమవుతాయి.
కథలు జీవితాలను ఆలోచింపజేస్తాయనీ, సరిదిద్దుకుందుకు సహాయపడతాయని, కథారచన అనేది కేవలం కాలక్షేపం కోసం కాదనీ, వినోదంతో పాటు విజ్ఞాన వీచికలు కూడా లభిస్తాయనీ నమ్మేవారందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఈ సంపుటం. ప్రేమలు ఎందుకు భగ్నం అవుతాయి, కుటుంబ జీవనం ఎందుకు ఛిన్నాభిన్నం అవుతోంది అని ఆందోళన పడే వాళ్లకు సమాధానాలు సమకూర్చే కథా సామాగ్రి ఇక్కడ పుష్కలంగా లభిస్తుంది.

-శ్రీవిరించి