అక్షర

ఒక యోగి అనుభవసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మయోగి సత్యకథ- మొదటి భాగం
జీవన యోగం;
ఆత్మయోగి సత్యకథ-
రెండవ భాగం
యోగ జీవనం
మాస్టర్ శార్వరి,
వెల: ప్రతి భాగము
200 రూ.;
(మొత్తం200+200=400)
ప్రతులకు: మాస్టర్
యోగాశ్రమ్, ప్లాట్ 89,
కృష్ణా ఎన్‌క్లేవ్, మిలిటరీ డైరీఫామ్ రోడ్,
తిరుమలగిరి,
సికిందరాబాద్- 500 015
---

శార్వరి గురించి మొన్నటి తరానికి పరిచయం చేయవలసిన అవసరమే లేదు. ఆంధ్రప్రభ వారపత్రిక తెలుగు పాఠక లోకంలో వెలుగులు విరజిమ్మిన 1970లలో శార్వరి ఆ పత్రికలో సీనియర్ జర్నలిస్టు. అందులో తరచుగా రచనలు చేయడంతోపాటు సినిమా ఎడిటర్‌గానూ ఉన్నారు. ఆంధ్రప్రభ వారపత్రికను బాగా విస్తరింపజేసిన ప్రధాన పాత్రికేయుల్లో శార్వరి ఒకరు. అయితే ఆయన జీవితం ఒక్క మేగజైన్ జర్నలిజానికే పరిమితం కాలేదు. ఆయన బహుగ్రంథకర్త. పుస్తకం లోకంలోకి వచ్చిన వెంటనే ఆవురావురుమని చదివిన 1960లలో శార్వరి రచనలు చేశారు. పుస్తక పఠనానికి బాగా ఆదరణ తగ్గిన చేదు వాస్తవికత కన్పిస్తున్న ఈ ఇంటర్నెట్ యుగంలోనూ అదే వేగంతో రచనలు చేస్తున్నారు. గత పాతిక సంవత్సరాల కాల వ్యవధిలో శార్వరి రచనలు వైవిధ్య భరితంగా వెలువడ్డాయి. అవి పారమార్ధిక వాఙ్మయ సంపదలో భాగమైనవి. అనేక అనుభవాలతో కూడిన శార్వరి తన ఆత్మకథను ఇటీవలే వెలువరించారు. అది రెండు భాగాలుగా వచ్చింది. ఆత్మకథ శీర్షిక ‘‘ఆత్మయోగి సత్యకథ’’అనే ఉన్నప్పటికీ, తొలి భాగాన్ని జీవన యోగం అనీ, రెండవ భాగాన్ని యోగ జీవనం అనే పేరుతోనూ వెలువరించారు.
ఇటీవలి కాలంలో తెలుగులో ‘‘యోగం’’, ‘‘యోగ జీవనం’’ వంటి మాటలు వింటున్న వారికి శార్వరి పేరు తప్పకుండా గుర్తుకు వస్తుంది. అందులో ఆయన అంకితత్వం నిరుపమానమైనది. ‘‘ఆత్మయోగి సత్యకథ’’ లోనూ ప్రధానంగా ఈ అంశమే ఉంది. రెండవ భాగమైన యోగ జీవనంలో ఇది మరింత విస్తారంగా ప్రస్తావనలోకి వస్తుంది. యోగ జీవనంతో తన పరిచయం, అందులో వైవిధ్య భరితమైన సాధనా విశేషాలు; యోగసాధనతో తాను పొందిన అద్భుతమైన అనుభవాలు, యోగ సాధకులుగా రూపొందినవారు; గతంలో ఈ మార్గంలో పయనించిన ప్రముఖులు- ఇట్లా అనేక సంగతులు! నిజానికి, తెలుగులో ఇటువంటి అనుభవ ఘటనల అల్లికతో కూడిన యోగ సంబంధ రచనలు తక్కువగా వచ్చాయి. శార్వరి ఆత్మకథ ఇటు యోగ అనుభవాలతో సంబంధం ఉన్నవారికీ ఆ అంశం పట్ల మరింత అవగాహనను పెంచుతుంది; యోగానుభవాలతో ఇటువంటి పరిచయం లేని వారికి ఆ విలక్షణ సాధనపై ఆసక్తినే రూపొందిస్తుంది.
శార్వరి తొలుత కవిత్వాన్ని రచించారు. కవిత్వానువాదాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. కథానికా రంగంలోనూ కృషిచేశారు. పాత్రికేయుడిగా మంచి-చెడు రచనల తారతమ్యాన్ని గుర్తించే ప్రతిభ ఆయనకు ఉంది. ఇంగ్లీషు సాహిత్యంతోనూ గాఢమైన పరిచయం ఉంది. ఇంతటి విజ్ఞాన ఖని-డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి వంటి ప్రసిద్ధ సాహితీవేత్త ప్రశంసలు పొందడం ఆశ్చర్యం కాదు. శార్వరి ప్రసంగాన్ని విన్న గోపాలరెడ్డిగారు ఆయనను నెల్లూరుకు ఆహ్వానించి అక్కడ కూడా ఉపన్యాసాన్ని ఏర్పాటుచేయడం- ప్రశంసించడం- ఇటువంటి అనుభవాన్ని ఆత్మకథలో వివరించారు రచయిత. ఇవి ఎక్కడా ప్రత్యేకంగా తనను గురించి తాను చెప్పినట్టు కాకుండా ఆత్మకథలోనే లీనమవుతూ రావడం హుందాగా ఉంది.
‘‘జీవనయోగం’’అనే పేరుతో ఆత్మకథ తొలి భాగం ఉన్నట్టు ఈ సమీక్షలో ఇదివరకే ప్రస్తావించబడింది. ఇందులో శార్వరి జీవన పయనం ఆంధ్రా పారిస్ తెనాలినుండి హైదరాబాద్ నగరానికి చేరేవరకు ఉంది. నాటి తెనాలి విశిష్టతలు - అప్పటి జాతీయోద్యమ ఛాయలు, పాండిత్య మాధుర్యాలు, వివిధ రంగాలలో ప్రతిభావంతుల నిలయంగా నిలిచిన ఆ పట్టణం గొప్పతనం అన్నీ శార్వరి అనుభవాల్లో వ్యక్తమవుతాయి. ఆనాడు తెనాలిని గురించి సాహితీ సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఎందుకు గొప్పగా చెప్పేవారో ‘‘జీవన యోగం’’లోకి తెనాలి పరిచయం చెబుతుంది. వారపత్రిక జర్నలిజంలో ప్రవేశం; నార్ల వేంకటేశ్వరరావు; విద్వాన్ విశ్వం వంటి దిగ్గజాలతో పరిచయం; రావూరి భరద్వాజతో స్నేహం; వృత్తిబాధ్యతల్లో తనకు ఇబ్బందులు ఏర్పడిన సందర్భాలు- వీటిన్నింటినీ శార్వరి తమ ఆత్మకథలో విపుల రీతిలో పరిచయం చేశారు. ఎవరి గురించైనా వ్యాఖ్యానించాలనుకున్నప్పుడు- ఎక్కడా మొహమాటానికి తావునివ్వలేదు. సూటిగా కుండబద్దలు కొట్టినట్టుగా అభిప్రాయాలు ప్రకటించారు. (పుట 78) శార్వరి తన వ్యక్తిగత అనుభవాలతోపాటు, కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా ఆత్మకథలో పరిచయం చేశారు. అయితే ఇవి కూడా ప్రత్యేకంగా చెబుతున్నట్టు కాకుండా ఆత్మకథా స్రవంతిలో సహజంగా కలసిపోయి సాగుతాయి.
దశాబ్దాలపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్న శార్వరి తమ ఆత్మకథలో ‘‘కథనాత్మక వచన పద్ధతి’’ని ఎన్నుకున్నట్టుగా అనిపిస్తుంది. అనుభవాలన్నింటినీ కథన పద్ధతిలో వేగంగా చదివించే సంవిధానంతో చక్కగా కూర్చారు శార్వరి. ఆరంభంనుండి ముగింపువరకు చదివించే శైలి శార్వరి ఆత్మకథలోని మరో గొప్ప అంశం.
ఆత్మకథలు మొన్నటి తరం జీవితాలకు స్పష్టమైన ప్రతిబింబాలు. శార్వరి ఆత్మకథ కూడా అటువంటిదే. మొన్నటి జీవితాలను గురించి తెలుసుకోవాలనుకునే నేటి తరం ఆత్మకథల్ని తప్పక చదవాలి. ఈ దిశలో శార్వరి ఆత్మకథను కూడా చదవాలి-

-గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి