అక్షర

శౌర్య ప్రతాపాల చరిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాలెగాడు’ ఘనత
పాలెగాడు (నవల)
-ఎస్.డి.వి.అజీజ్
వెల: రూ.120/-
ప్రతులకు: విశాలాంధ్ర
పుస్తక విక్రయ కేంద్రాలు
*
ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతంలో - అందులోను తెలుగునాట - బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పోరాడిన రేనాటి సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరోచిత గాథే ఈ నవల. ఈస్టిండియా కంపెనీ (కుంపిణి) తెలుగు ప్రాంతాలపై ఫ్రెంచి వారి నుంచి ఆధిపత్యం చేజిక్కించుకుంది. కాలక్రమంలో కుటిల వ్యూహాలతో, రాజ్యకాంక్షతో పాలనా ప్రాంతాలు పెంచుకుంది. సైన్య సహకారం పేరుతో, విభజన పన్నాగాలతో దేశాన్ని కబళించింది. నాల్గవ మైసూరు యుద్ధం ఫలితంగా అప్పటి రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాలు నిజాంకు లభించాయి. ఇక్కడ పాలెగార్ల వ్యవస్థ అమలులో ఉంది. ఒక విధంగా వీరు స్థానిక పాలకులు. ఈ ప్రాంతాన్ని నిజాం బ్రిటిషు వారికి లీజుకిచ్చాడు. అదే దత్త మండలమయింది. బ్రిటిషు ప్రభుత్వం ఇక్కడికి సైన్యాధికారులను పంపింది. మన్రో పాలెగార్లకు భరణం (తవర్జీ) ఏర్పాటు చేశాడు.
కడప జిల్లా జమ్మలమడుగు - కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మధ్య వున్న ప్రాంతానికి చెంచురెడ్డి వంశానికి చెందిన జయరామిరెడ్డి పాలెగాడు (నొస్సంకోట వీరిదే). ఆయన మనవడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. జననం 1805లో రూపనగుడిలో. ఉయ్యాలవాడలో పెరిగాడు. శిస్తు వసూలు విషయంలో ఏర్పడే వివాదాలను బ్రిటిషు వారు నిరంకుశంగా అణచివేసేవారు. నరసింహారెడ్డికి సొంత సైన్యం ఉంది. బ్రిటిషు పాలనను ఆయన నిరసించాడు. ఎదిరించి పోరాటం సాగించాడు. పోరాట ఘట్టాల చిత్రణే నవలకు ప్రధాన ఇతివృత్తమయింది. యోధుడు నమ్మిన అనుచరుడు ఓబయ్య విజ్ఞుడు. వ్యూహకర్త గోసాయి వెంకన్న, పాపాఖాన్ ఇత్యాది జాగీరుదార్లు పోరాటంలో భాగస్వాములయ్యారు.
పదేళ్లకొకసారి జరిగే పెద్దమ్మ దేవర జాతరలో ఎనుబోతు బలిపశువు. దానిని బలి ఇచ్చే బాధ్యత ఆచారం ప్రకారం ఊరి రజకుడిది. ఎనుబోతు బలి తప్పించుకుంది. జాతర బీభత్సంగా మారింది. నవల ఈ సన్నివేశంతో ఆరంభమవుతుంది. గోసాయి వెంకన్న బ్రిటిషు వారి అరాచకాలకు కుపితుడై వాటిని అంతం చేయించాలనుకున్నాడు. అందుకు తగిన వ్యక్తి నరసింహారెడ్డి అని భావించి, ఆయన నుంచి మాట తీసుకున్నాడు. కోయిలకుంట్ల తాసీల్దారు రాఘవాచారి దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. నరసింహారెడ్డిని ముష్టివాడని దూషించాడు. ‘రేయ్! రాఘవాచారి! కండకావరంతో ననే్న అవమానపరుస్తావా? రేపు మధ్యాహ్నం పనె్నండు గంటలకు ఈ నరసింహారెడ్డి నీ తల తీయడానికి నీ ట్రెజరీని కొల్లగొట్టడానికి వస్తున్నాడు. చేతనైతే నీ ప్రాణాలు, ట్రెజరీని రక్షించుకో! ’ అని లేఖ పంపాడు నరసింహారెడ్డి. అన్నంత పనీ చేశాడు. తర్వాత అధికారి వాట్సన్ వంతయింది. నొస్సంకోట క్షేమం కాదని నల్లమలలోని వారి వనదుర్గానికి స్థావరం మార్చారు. పీటర్ ఫారెస్ట్ రేంజర్. ముందు ఎలాగో ప్రాణాలు దక్కించుకున్నారు. అంగవైకల్యం కలిగింది. కాని చివరకు నరసింహారెడ్డి కత్తికి ఎర అయ్యాడు. కెప్టెన్ నార్టన్, కెప్టెన్ రో, కలెక్టర్ కాక్రేన్ అప్రమత్తులయ్యారు. నరసింహారెడ్డి ఆచూకీకి బహుమతి ప్రకటించారు. మల్లారెడ్డి వంటి వారు ప్రలోభపడ్డారు. రచయిత అజీజ్ ఈ సమరం వివరాలు ఉత్కంఠ కలిగించే విధంగా చూపారు. నరసింహారెడ్డి జమీందార్లకు లేఖ రాస్తూ ‘కుంపిణి ప్రభుత్వంపై పోరాటం రేనాటి ప్రాంతమంతా విస్తరింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేటికి 8వ రోజున నయనేలప్ప కొండ మీద సమావేశం జరుగుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఆంతరంగిక సలహాదారుడు ఓబయ్య వెంట రండి. రాలేని పరిస్థితుల్లో వుంటే మీ ప్రతినిధిని పంపండి’ అని కోరాడు. బ్రిటిష్ పాలకులు నరసింహారెడ్డి భార్య సుబ్బమ్మనూ, పిల్లల్ని బంధిస్తే నరసింహారెడ్డి ధైర్యం చేసి విడిపించగలిగాడు. ఆమె గాయపడింది. స్థావరం ఎర్రమలకు మార్చారు. భార్య మృతి చెందింది. పోరాటం చివరి దశకు చేరింది. గోసాయి వెంకన్న మరణించారు. 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని ఉరి తీశారు. ఆయన శిరస్సు పుర్రెగా మార్చి 1877 వరకు కోయిలకుంట్ల కోటగుమ్మానికి హెచ్చరికగా వేలాడుతూనే ఉంచారు. బ్రిటిష్ పాలకుల పైశాచికత్వానికి ఇది నిదర్శనం.
భావనైశిత్యంతోపాటు, పదునైన శైలితో సాగిన నవల ఈ ‘పాలెగాడు’. చరిత్రను శౌర్య ప్రతాపాలు చూపుతూ రచించిన అజీజ్ కృషి మెచ్చతగింది. నొస్సంకోట, నరసింహారెడ్డి సైన్యంలో ఫిరంగి, ట్రెజరీ మొదలైన ఛాయాచిత్రాలు కథన ప్రామాణికతను పెంచాయి. విప్లవ వీరుని చరిత్రను తెలిపే ఈ నవల తప్పక చదవతగింది.

-జిఆర్కె