అక్షర

నేతిబీర చందం - అం.తె సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాలంలో
తెలుగు సాహిత్యం
-పుట్ల హేమలత
పేజీలు: 184
ప్రతులకు: రచయిత్రి, 86-15-4, జి-1,
శ్రీలియో టవర్స్, తిలక్‌రోడ్,
రాజమండ్రి - 533 103

***

నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా అని ఎవరినో అడిగితే, ఎందుకుండదండీ, నేతిబీరకాయ అనే పేరులో నెయ్యి ఉంది కదా అన్నాడట ఒకాయన. అంతర్జాలంలో తెలుగు సాహిత్యం అనే ఈ పుస్తకం, క్షమించాలి! పరిశోధనా గ్రంథం చూస్తే లేదా చదివితే ఔరా! ఇది నేతిబీరకాయా? అని అనిపించక మానదు.
వెబ్ సాహిత్యం పరిచయం, కంప్యూటర్‌లో తెలుగు సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాలంలో తెలుగు పత్రికలు, బ్లాగులు, వెబ్‌సైట్లు, అంతర్జాల పారిభాషిక పదాలు అని మొత్తం ఆరు అధ్యాయాల్లో సమాచారాన్ని పొందుపరిచారు రచయిత్రి. ఐతే, సిద్ధాంత వ్యాసాలను పుస్తక రూపంలో తెచ్చేటపుడు అంతో కొంతో మార్పులు అవసరం. ఈ విషయాన్ని రచయిత్రి గుర్తించినట్లు లేదు. అసలు ఈ పుస్తకానికి అంతర్జాలంలో తెలుగు వనరులు అని పేరు పెట్టి ఉంటే కొంతలో కొంత నయంగా ఉండేది. ఏ విషయాన్నీ నిశ్చయంగా, నిర్ధారణగా చెప్పలేక పోవడం ఈ పుస్తకంలో కొట్టొచ్చేలా కనిపించే అంశం. సాహిత్యం అనే పదం కనిపించినంతగా సాహిత్యం ఈ పుస్తకంలో కనిపించలేదు.
విషయ సేకరణ సమగ్రంగా లేదు. ఉన్న విషయాన్నీ పుస్తక రూపంలో సరిగ్గా తేలేదు. బ్లాగుల్లోని సాహిత్యం గురించి క్లుప్తంగా పరిచయం చేశారు. వనరుల గురించి ఎక్కువ ప్రస్తావించారు.
చివరి అధ్యాయంలో రచయిత్రి కొన్ని పారిభాషిక పదాలను పొందుపరిచారు. ఇన్ స్క్రిప్ట్ అనే పదానికి లిపి రూపంలో అని అర్థం చెప్పారు. ఇన్ స్క్రిప్ట్ అనేది తెలుగు టైపింగ్‌లో ఒక పద్ధతి. రికార్డ్ అంటే నమోదు అన్నారు. కంప్యూటర్ పరిభాషలో రికార్డ్ అనేది కొన్ని ఫీల్డుల సముదాయం. ఇలా చెబుతూ పోతే మరో అసలు సిసలు సిద్ధాంత వ్యాసం తయారవుతుంది.
కొందరు గొప్ప ప్రముఖులతో తాను చేసిన ఇంటర్వ్యూలను కూడా ఇందులో పొందుపరిచారు. కానీ, ఆయా సమాచారానికీ, అంతర్జాలంలో తెలుగు సాహిత్యానికీ ఏం సంబంధమో అర్థం కాదు. పైగా, ఒక ప్రముఖ బ్లాగరుట. అతనికే విషయం పూర్తిగా తెలీదు. తెలుగు ఫాంట్ల రూపకర్త ఎవరు, మొదటిసారిగా ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీ తెలుగు ఫాంట్లని కంప్యూటర్లలో ప్రవేశపెట్టింది అని ప్రశ్నిస్తే, అసలు విషయం ఆయనకే తెలీదు. సిడాక్ వారి శ్రీలిపి అనుకుంటా పేరు జ్ఞాపకం లేదు అని ఫాంటు పేరు చెబుతూ హేమలత అనుకుంటా గుర్తులేదు అనీ సమాధానం. ఆఖరుకి ఇస్కి ప్రమాణాల గురించి కూడా సరైన సమాచారం లేదు.
అసలు ఈ సిద్ధాంత వ్యాసానికి గ్రంథరూపాన్ని ఇవ్వడానికి ముందు రచయిత్రి మరోసారి కూలంకషంగా చదివి మార్పులూ చేర్పులూ చేసి ప్రచురించాల్సింది. విషయ సేకరణకు అంతర్జాలం మీదే ఎక్కువ ఆధారపడినా, విపులంగా లభిస్తున్న సమాచారాన్ని సమర్థవంతంగా వాడుకోలేక పోయారు.
కంప్యూటర్ విజ్ఞానం అనే మాస పత్రిక దాదాపు 12 ఏళ్లు నిరాటంకంగా తెలుగులో కంప్యూటర్ సాహిత్యాన్ని అందించింది. దానికెందరో రచయితలు ప్రామాణికమైన రచనలను అందించారు. వారిలో ఒక్కరినైనా సంప్రదించి ఉంటే ఈ పుస్తకం మరో విధంగా ఉండేది. కనీసం ఆ పత్రికలో వచ్చిన వ్యాసాలు, బోనస్ బుక్స్ చదివి ఉంటే ఈ పుస్తకం ఎంతో ప్రామాణికతను, విషయాన్నీ సంతరించుకునేదేమో. తెలుగు అకాడెమీ కంప్యూటర్ విజ్ఞానంలో ప్రామాణికమైన పుస్తకాలను అందించింది. ఇటీవలే కంప్యూటర్ నిఘంటువును అందుబాటులోకి తెచ్చింది కూడా. ఆయా రచయితలను సంప్రదించవచ్చు కదా. ప్రముఖ దిన, వార పత్రికలు కూడా చాలాకాలంగా కంప్యూటర్ పరిజ్ఞానం గురించి, ఇతర విషయాల గురించీ వ్యాసాలను అందిస్తూనే ఉన్నాయి. వాటినీ గమనించినట్లు లేదు.
అంతర్జాల పత్రికలు - వెబ్‌సైట్లు అని ఆర్కుట్.కామ్, వికీపీడియా తెలుగు, పబ్లిక్ లైబ్రరీస్ సైట్లను ప్రస్తావించారు. ఇవన్నీ తెలుగులో ఉంటే చివరిది మాత్రం నేషనల్ లైబ్రరీ వెబ్ సైటు అడ్రస్ ఇంగ్లీషులో ఉంది (అదీ అచ్చుతప్పులతో). ఆర్కూట్ అనేది సామాజిక మాధ్యమం. వాడుకలో లేదు. టిడిఐఎల్ భారత ప్రభుత్వ వెబ్‌సైటు ప్రస్తావన లేదు. దానిని చూసి ఉంటే తెలుగు ఫాంట్స్, ఇతర వనరుల గురించి తెలిసి ఉండేది.
పరిశోధనకు కేవలం 2007 తరువాత ప్రచురితమైన పుస్తకాలనే సంప్రదించారు. 1999లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సదస్సు, 2003 హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సదస్సుల జ్ఞాపికలలో, 2011లో కృష్ణా జిల్లా రచయితల సంఘం వెలువరించిన జ్ఞాపికలో, 2012 ప్రపంచ తెలుగు మహాసభల జ్ఞాపికలో అనేక విలువైన వ్యాసాలను రచయిత్రి చూసినట్లే లేదు. (అదే జ్ఞాపికలో ఇదే రచయిత్రి రాసిన వ్యాసం కూడా ఉంది.) 2010లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మన తెలుగు పేరున కొన్ని వారాలు అనేక మంది ప్రముఖుల ప్రసంగాలను ప్రసారం చేసింది. వాటిలో 14 వారాలు కేవలం తెలుగు - ఐ.టి, అంతర్జాల వనరులు అనే అంశంపైనే ప్రసారం అయ్యింది. వాటి గురించి కూడా రచయిత్రికి తెలిసినట్లు లేదు. అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించే విషయం ఈ రచయిత్రి అంతర్జాలంలో పత్రికలను నిర్వహిస్తున్నారు కూడా.
భవిష్యత్‌లో పరిశోధన చేయబోయే పరిశోధకులకు సలహాలు కూడా ఉన్న అసమగ్రమైన ఈ పుస్తకంలో, అచ్చుతప్పులూ లేకపోలేదు. ఆయా పరిశోధకులు పరిశోధన ఆరంభించే ముందే ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఏది ఏమైనా, నేటి కాలమాన పరిస్థితులలో తెలుగులో పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందడం ఎంత సులభమో, ఈ పుస్తకం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటికే తెలుగు కోసం తపించేవారు కూడా ఈ పుస్తకం చదివాక తామూ పరిశోధనలు చేసేస్తారు. ఇలా గ్రంథాలు ముద్రించేస్తారు కూడా.

-వి.వి.వి.రమణ