అక్షర

సమస్యల చీకటిలో చిరుదివ్వె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విప్లవ సూర్యుడు
-జాని బాషా చరణ్
తక్కెడశిల
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**
జాని తక్కెడశిల తెలుగు భాష ఉనికి సమసిపోకూడదని కృషి చేస్తున్న తెలుగు యువకుడు. తేలికైన పదాలతో క్లిష్టమైన భావాలను సూటిగా సంధించగల కవి.
తెలుగు పదానికి ఒరవడి చేగూర్చిన అన్నమయ్య జన్మించిన, తిరుగాడిన ప్రదేశానికి చెందిన జాని తాను కూడా ఆ పద కవితా పితామహుని వలెనే బ్రహ్మమొక్కటే అంటూ, కులాలకీ మతాలకీ అతీతమైన సమసమాజాన్ని స్థాపించాలని కలలు కంటూ కలాన్ని ఝళిపిస్తున్నాడు.
అఖిలాశ అనే కలం పేరుతో రాకెట్‌లా దూసుకెళ్తూ ప్రజలకు, పాలకులకు భారతంలో జరుగుతున్న అనేకానేక సమస్యలను కళ్లెదుట నిలుపుతూ సందేశాన్నివ్వడమే గాక, సమస్యా పరిష్కారానికి కూడా దారి చూపుతున్నాడు.
జాని వంటి యువకులు తమ కలాలకు పదును పెట్టి లక్షల్లో, కోట్లలో ఆధునిక యువతని ప్రగతిపథంలోకి తీసుకుని వెళ్లగలిగితే.. అకళంక, అవినీతి రహిత, ఆకలి కనరాని, ఆనంద భరతావని అతి త్వరలోనే ఆవిర్భవించక తప్పదు.
ఈ చిన్ని పుస్తకం పెద్దపెద్ద భావాలను ఘాటుగా చదువరుల మీదికి వదుల్తుంది. ఈ పుస్తకంలో ముప్పై కవితలున్నాయి.
ప్రస్తుతం సమాజంలోని చెడును, దోపిడీని, కుళ్లును ఎత్తిచూపే ‘ప్రభంజనం’ అనే కవితతో ఆరంభమై, దొంగల, దోపిడీ దొరల, దరిద్ర రాజ్యంలా అభివర్ణిస్తూ, పరిష్కారం ‘నురుూ్య, గొరుూ్య’ చూపే చావు కాదని మొదలుపెడతాడు కవి. కార్మికులు తలలెత్తి, దొరల దాష్టీకాన్ని దడదడలాడించాలని చెప్తాడు.
దగాపడ్డ దళితుడిని హెచ్చరిస్తాడు. అక్షరాస్యతతో అంధకారాన్ని తొలగించుకుని, కపట ప్రేమ కళ్లలో పెట్టుకుని పోషిస్తున్న రౌడీ నాయకుల గుండెలు బద్దలు కొట్టమని, ‘వెనె్నముక విరుచుకుని, వెనె్నముక వంచకురా!’ ‘కార్మిక కర్షక బలాన్ని చూపి బానిస బతుకుని వదిలెయ్యి, నీ ఆలిని దొర వద్దకు పంపకు... పంపనని ధైర్యంగా చెప్పు’ అని పదునైన పదాలతో ఏం చెయ్యాలో సూచిస్తాడు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, కుల వివక్షలు, దోపిడీలు, అత్యాచారాలు ఒకటి కాదు. ఆర్థికంగా, భౌతికంగా, మానసికంగా జరుగుతున్న హింస లన్నింటినీ ఉగ్ర నరసింహుడై చీల్చి చెండాడేశాడు కవిగా ఈ విప్లవ కవితల్లో.
‘నిప్పు కొండ పగిలిందట.. హాలాహలం చెలరేగిందట!!
కడలి విలయ తాండవం చేసిందట! వస్తున్నా వస్తున్నా’ అంటూ వచ్చి విశ్వశాంతితో జగమంతా జయిస్తానని వాగ్దానం చేస్తాడు.
నాకెవ్వరడ్డొచ్చినా, అగ్గిరవ్వనే అక్షరాలుగా చేసి కాల్చేస్తానంటాడు. స్ర్తి వ్యధకు కారణమైన వాడిని తూట్లు తూట్లుగా పొడుస్తానంటాడు.
అక్రమ వాదాన్ని, దౌర్జన్య దురహంకార వాదాల్ని, కామాగ్నిని నిరసిస్తూ, రాగద్వేషాలకు అతీతంగా ఉండు. చివరికి చేరేది, చితాగ్నికే అంటూ హెచ్చరిస్తాడు.
ఈ కవితల్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒక భాగం సమాజంలో వైరస్‌లాగ వ్యాపించిన చెడుని పదునైన వాక్యాలతో కళ్ల ముందు నిలిపి, ఇటువంటి నికృష్ట సమాజంలోనా మనం నివసిస్తున్నాం అనే జలదరింపును కలిగిస్తే, ఇంకొక భాగం, ఆ చెడుని నిర్మూలిస్తూ నిర్మలమైన సరికొత్త సమాజాన్ని నిర్మిద్దామనే పిలుపునిస్తుంది. ఈ తీరు ప్రతీ కవితలోనూ కనిపిస్తుంది.
‘రండి రండి, లేవండి అని పిలుస్తూ, వస్తున్నా వస్తున్నా ‘వర్ష వాయువులనే వాక్యాలుగా చేసి, కుంభవృష్టి కురిపించి బీదలను పీడించే వారిన నరక లోకానికి పంపిస్తా’నంటూ గర్జిస్తాడు కవి.
‘సంకల్పం’ అనే కవితలో సామాన్యుడు చేయవలసిన విధులను చెప్పి, అవినీతి నాయకులను చట్ట సభలకు పంపమని సంకల్పం చెప్పుకుందామంటాడు. పేదోళ్ల పిల్లలకు సమాన విద్య లేదు, నవ్వులు కరువైన నా దేశంలో మార్పు నా నేత్రాలతో చూడగలనో లేదో అని ఆక్రోశిస్తాడు.
‘మేము సైతం సమసమాజం ఏర్పడటానికి కృషి చేస్తాం, మనమంతా కలిసి పోరాడుదాం’ అంటూ పిలుపునిస్తాడు. కుమిలిపోకు, కుమిలిపోకు, నువ్వేమిటో నిరూపించు’ అని ‘బాటసారి’ని పిలుస్తాడు.
‘జీవిత సత్యం’ కవితలో ప్రతీ మనిషీ తెలుసుకోవలసిన వేదాంతం, మానవుల బలహీనతలన్నీ తెలియజెప్పే ‘విష సాగరం’ ‘వజ్రాయుధం’లో నీ కర్మను కాల్చి భస్మం చేయమనే సందేశం.. ప్రతీ వారినీ ఆలోచింపజేసే కవితలు.
నిత్య జీవనంలో నిలువెల్ల ‘దగా’ అంటాయి జాని పలుకులు.
మంచైనా చెడైనా అన్నిటా సగం సగం అని చెప్తూ, మనిషిగా పుట్టావు కానీ మానవ లక్షణాలు లేవు నీ దగ్గర అని నిష్ఠూరమాడతాడు. దేశ ప్రగతికి తోడ్పాటు అందించమని ‘్భరత పౌరునికి’ సందేశమిస్తూ, అందరూ సమానులే అనే భావనతో ‘నా దేశం మారేదెప్పుడో’ అంటూ విలపిస్తాడు.
నల్ల కుబేరుడికి నిలువెల్లా ‘విషం’ అంటూ అవినీతి ‘దుష్ట కుమారుడిని’ నిరసిస్తాడు.
దగా పడ్డ తమ్ములార మీ కోసం కలం పట్టి తురంగ భావాలనే బహిర్గతం చేస్తున్నా అని ధైర్యం ఇస్తాడు. మన జాతీయ పతాకానిదే కులం, పంచ భూతాలదీ ఏ కులం అని నిలదీస్తాడు.
పేద సోదరులకు సాంత్వన ఇచ్చినా, ‘నేను పాడేదే కావ్యం అది భీకర రూపం దాల్చి యుగాన్ని అంతం చేస్తాది’ అంటూ గర్జించినా.. నినదించినా, రైతు కష్టాలని ‘క్షేత్రకృత్తు’గా చెప్పినా ఈ విప్లవ కవికే చెల్లు.
చివరికి ఆగ్రహాన్ని, ఆవేశాన్ని నిగ్రహించుకుని, ‘ఓ మానవా’ అంటూ దిశా నిర్దేశం చేస్తూ, కాలుష్య రహిత ప్రపంచాన్ని తయారుచేస్తూ తీవ్రవాదాన్ని తరిమికొడ్తానని శపథం చేస్తాడు.

-డా.మంథా భానుమతి