అక్షర

బడుగుల గుండె చప్పుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చారాణా’
వహీద్‌ఖాన్ కథలు
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
***
ఉన్నత విద్యతోపాటు విస్తృత జీవితానుభవాల్నీ సొంతం చేసుకున్న వారు - అబ్దుల్ వహీద్‌ఖాన్. ఉపాధ్యాయునిగా, ఉద్యమకారునిగా, సామాజిక కార్యకర్తగా, క్రియాశీలంగా అభ్యుదయ పథంలో నడిచిన వారు, నడుస్తున్న వారు. తండ్రితో సహోపాధ్యాయునిగా పనిచేసే అరుదైన అవకాశం దొరికిన భాగ్యశాలి కూడా ఆయన. కథకునిగా సాహిత్య రంగంలో ప్రవేశించి కొద్దికాలంలోనే మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు.
వహీద్‌ఖాన్ మొదటి కథా సంపుటి ఈ ‘చారాణా’. ఇందులో 12 కథలున్నాయి. అన్నీ వివిధ పత్రికల్లో ప్రచురింపబడినవే. వీటిలో ‘చారాణా’ ‘ముక్కుపుడక’ అనే రెండు కథలకు - సాహిత్య ప్రస్థానం పత్రికలో వచ్చే కథల్లో ఉత్తమ కథకు జనార్దన మహర్షి ఇచ్చే బహుమతులు లభించాయి.
ఈ కథాసంపుటిలోని కథలన్నిటా కనిపించే స్పష్టమైన తేజోరేఖ - సమకాలీన సామాజిక వాస్తవికత. వస్తుపరంగా సమాజంలోని విభిన్న చీకటి కోణాలపై తన నిశితమైన చూపుని ప్రసరింపజేశారు వహీద్‌ఖాన్.
సంఘంలో కుడి ఎడమల రగులుతున్న కుల, మత, లింగ వివక్షల్ని నిరసించాడు రచయిత. అలాగే పర్యావరణం విషయంలో - జరగవలసిన పరిరక్షణకు బదులు, జరుగుతున్న సర్వభక్షని పారదర్శకం చేసి, ఆవేదనతో హెచ్చరికలు చేశాడు.
‘బూరిగాడు’ కథలో బూరిగాడు గిరిజన యువకుడు. సాహసి. అటవీ భూమిలో ఫ్యాక్టరీ పెట్టడానికీ, ఖనిజాల తవ్వకాలు జరపటానికీ పథకాలు పన్ని వచ్చిన అధికార గణం ఉన్న ‘క్యాంప్’ని చాకచక్యంగా - పులుల బారిన పడేట్టు చేస్తాడు. చివరికి ‘క్యాంప్’ అంతా నిర్జీవమైంది’ అంటూ గడుసుగా కథని ముగించాడు. ఇతివృత్తంలోని నూతనత్వం పాఠకుని మనసుని హత్తుకుంటుంది. ఒక అన్యాయాన్ని ఎదుర్కొనే వ్యూహానికి ఒక ఆక్రోశాన్ని కళాత్మకం చేశాడు.
‘చారాణా’ ముస్లిం కుటుంబాల్లోని పేదరికాన్నీ, బడుగు బతుకు గీతల్నీ చిత్రించింది. తండ్రినీ, తల్లినీ కోల్పోయిన చిన్నవాడు అమీర్. బన్ను రొట్టెలు అమ్మి జీవిస్తూ ఉంటాడు. అనూహ్యంగా ఒక విచిత్ర సన్నివేశంలో - అటు అత్తింటి వారి దుర్మార్గానికీ, ఇటు పుట్టింటి వారి నిర్లక్ష్యానికీ గురైన నిస్సహాయురాలు బుచ్చమ్మ - అమీర్‌కి తల్లిగా దొరుకుతుంది. మానవ సంబంధాల్లోని డొల్లతనాన్నీ, ఔన్నత్యాన్నీ కూడా భిన్న స్వభావాలు గల వ్యక్తుల చిత్రణ ద్వారా ధ్వనింపజేసి మంచి రచనని అందించారు రచయిత.
‘సూపర్ మదర్ రియాల్టీ షో’ కథ - ఈనాటి టీవీ షోల్లోని అవాంఛనీయతని కేంద్రకంగా చేసుకుని సాగిన పదునైన వ్యంగ్య బాణం.
‘గెలుపు గుర్తు’ స్కెచ్ రాజకీయాల దుర్గంధంపై మంచి సెటైర్.
‘ముక్కుపుడక’ కథానిక గంగపుత్రుల జీవితంలోని లోతుపాతుల్నీ, జీవన విధానంలోని లేమినీ, భార్యాభర్తల మధ్య అనురాగ ప్రస్తారాన్నీ ఉన్నతంగా చిత్రించింది. అదే అదనుగా - పెద్ద నోట్ల రద్దు బడుగు బలహీన వర్గాలకు చెందిన నిస్సహాయుల్ని ఎలాంటి ఇక్కట్ల పాలుచేసిందో ఈ కథలో అనుద్వేగకరంగా చెప్పాడు రచయిత. కథలోని రత్తాలు, గంగడు పాత్ర చిత్రణ ఎంతో సాత్వికంగా, సహజంగా వచ్చింది. ఈ కథ ఎత్తుగడలో చక్కటి భావస్ఫోరకమైన పోలికల్ని ప్రయోగించారు వహీద్.
‘వాల్‌రైటర్’ కథానిక ఈనాటి సామాజిక అస్తవ్యస్త పరిస్థితుల పట్ల, సాంఘిక సమస్యల పట్ల, సాధారణ జనం ఉదాసీనతనీ, మానసిక వైక్లబ్యాన్నీ తేటతెల్లం చేసింది. తెలుగు కథా సాహిత్యంలో ఒక అపూర్వమైన కథగా నిలవాల్సిన ఇతివృత్తం - శిల్ప రాహిత్యంవలన ఎంతో ఆశాభంగం కలిగించింది. వహీద్‌ఖాన్ ఈ కథాంశంతోనే కథా నిర్మాణం, కథనరీతీ, ఏకాంతశ కేంద్రీకరణం వంటి గుణ నైపుణ్యాల మీద దృష్టి పెట్టి మరో కథని రాయాలని కోరుతున్నాను.
మిగిలిన కథలన్నీ మానవ సంబంధాల పట్ల పెంపొందవలసిన గౌరవాదరణల్నీ, ప్రపంచీకరణ దుష్ఫలితాలు కల్పించిన బాధావ్యథల్నీ, సామాజిక పరిణామాల్లో చోటు చేసుకుంటున్న అవాంఛనీయతల్నీ కథాత్మకంగా ప్రదర్శించాయి.
కథల్లో మంచి ఇతివృత్త బలాన్ని చూపుతున్న వహీద్ ఖాన్ - కథానికని అనుభూతిప్రదం చేయగల కథన విధానాన్నీ, శిల్ప పరిణతినీ ఇతోధికంగా పెంపొందించుకొని అగ్రశ్రేణి కథకుడుగా రాణిస్తాడని ఆశిద్దాం.

-విహారి 9848025600