అక్షర

శ్రీవిష్ణు సహస్ర నామావళికి అర్థం.. పరమార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిష్ణులీలా వైభవం
(శ్రీవిష్ణు సహస్ర
నామావళి)
-అంబటిపూడి వేంకట సుబ్రహ్మణ్య శాస్ర్తీ
వెల: రూ.80
ప్రతులకు: రచయిత
ఇం.నెం.1-36/1/12
సి.ఎం.ఆర్. బ్లాక్ 1/101
సి.ఎం.ఆర్. రెసిడెన్సీ
ఎం.ఎన్.ఆర్.స్కూల్ ఎదురుగా
వేమన కాలనీ రోడ్
చందానగర్,
శేరిలింగంపల్లి
-500 050.
***
శ్రీకృష్ణ పరమాత్మ ఆనతి మేరకు, భీష్మాచార్యుడు అంపశయ్యపై నుండి, ధర్మరాజునకు ధర్మహిత బోధగా శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని ఉపదేశించినట్లుగా మహాభారత ప్రమాణం.
‘మహాభారత సారత్వాత్, ఋషిభిః పరిగానతః
వేదాచార్య సమాహారాత్, భీష్మోత్కృష్ట మతత్యయః
పరిగ్రహాతిశయతో గీతాధె్తైకార్ధ్యతశ్చనః
సహస్ర నామ్నా మధ్యాయః ఉపాదేయతమో మతః
(శ్రీపరాశర భట్టరు - శ్రీవిష్ణు సహస్ర నామ భాష్యం)
మహాభారత సారమై ఉండడం వలన, ఋషిపుంగవులు ప్రీతితో అనుసంధించి ఉండడం వలన, ఆ నామాలను వ్యాసమహర్షి స్తోత్రరూపంగా కూర్చి ఉండడం వలన, అత్యంత అభిమత ధర్మంగా భీష్మపితామహుడు దీనిని పఠించి ఉండడం వలన, ప్రామాణికు లందరిచేతనూ, అన్ని గ్రంథముల చేతనూ శ్రద్ధ్భాక్తి పురస్సరంగా పరిగ్రహించి ఉన్నందువల్లన, భగవద్గీత మొదలుగా అనేక గ్రంథాలతో ఏకీభవించి ఉండే అర్థాలను చెప్పి యున్నందు వలన - ఈ సహస్ర నామ స్తోత్రం పఠించడం అత్యంత ఆవశ్యకమనీ, ఐహిక ఆముష్మిక ఫలదమనీ పెద్దల నిర్ణయం.
‘ఆయిరనామం శొల్లి...’ అని, శ్రీవైష్ణవ సంప్రదాయానికి మూల పురుషులయిన ఆళువారులు కూడా శిరసావహించిన స్తోత్రం యిది. ఋషిభిః పరిగానతః - అన్నట్లు, మహర్షులు వారి ఉపదేశాలలోనూ, గ్రంథాలలోనూ శ్రీమన్నారాయణుని స్తుతిస్తూ చెప్పిన నామములు అవటంతో అర్థగాంభీర్యము కలిగినందువల్లన, సామాన్యులు అర్థమును తెలిసికొనుటకు సులభముగా ఉండదు.
అందుకోసమై, ముందుగా శ్రీశంకర భగవత్పాదులు, శ్రీవిష్ణు సహస్ర నామ భాష్యాన్ని వ్రాసారు. తరువాత కొన్నాళ్లకు, శ్రీపరాశర భట్టరు, శ్రీసంప్రదాయానుసారంగా మరొక విలక్షణమైన భాష్యాన్ని వ్రాసారు. శ్రీపరాశర భట్టరు వ్రాసిన భాష్యార్థాలను సులభంగా గ్రహించడానికి ‘నిరుక్తము’ అనే శ్లోకరూప గ్రంథం కూడా సామాన్యులకు అందని ద్రాక్షే. అదీగాక, ప్రస్తుతమా గ్రంథం అలభ్యం. ప్రస్తుతం, మహామహోపాధ్యాయ, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారి ‘శ్రీవిష్ణు సహస్రనామ భాష్యం’ అత్యంత ప్రామాణిక గ్రంథం.
ఇవికాక, తెలుగులో అనేకానేక భాష్యాలూ, అర్థ తాత్పర్యాలతో వెలయింపబడ్డ గ్రంథాలు చాలానే ఉన్నాయి. కానీ, ప్రస్తుత గ్రంథకర్త అంబటిపూడి వేంకట సుబ్రహ్మణ్య శాస్ర్తీగారి ‘శ్రీవిష్ణు లీలా విలాసము’ (శ్రీవిష్ణు సహస్ర నామావళి) గ్రంథం సర్వజనామోదకంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్లోకంలోని నామాలను వరుస క్రమంలో అమర్చి, ఆ నామాల భావార్థాన్ని సులభశైలిలో పాఠకులు గ్రహించేటట్టు వ్రాసేరు. ‘్ధర్మమర్ధాను సంధానేన’ అన్నట్టు, శ్రీవిష్ణు సహస్ర నామాలను అర్థం తెలుసుకొని మరీ చదువుకొన్నట్టయితే సత్వర భగవత్కృపకు పాత్రులవుతారు చదువరులు. సహస్ర నామాన్ని పురుడింట చదివేవారట. బాండు తన కాదంబరిలో ప్రస్తుతించాడు. అలాగే నామకరణం సందర్భంగా బారసాల నాడు పారాయణం చేయడం ఆచారం. ఆయుర్వేద వైద్యులు మందులతోపాటు అనుసానంగా సహస్ర నామ పారాయణాన్ని సూచించే సంప్రదాయం మనకి ఉంది. పూర్వోత్తర పీఠికలకు శ్లోకార్థాన్నిస్తూ, అనుబంధంలో ‘ముఖ్యపదాలు - వివరణ’, సూక్తాలూ, స్తోత్రాలు ఇవ్వడం బాగుంది. భావార్థ సంకలన కర్తలయిన శాస్ర్తీగారు బహుదా అభినందనీయులు.

-ఎస్.టి.పి.వేణుగోపాలస్వామి