అక్షర

‘మఖ్దూం’ కవిత్వ సమగ్ర విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాయరె - తెలంగాణ
- మఖ్దూం మొహియుద్దీన్
-అబ్దుల్ వాహెద్
పేజీలు: 488
వెల: రూ.300
ప్రతులకు: నవతెలంగాణ
పబ్లిషింగ్ హౌస్
ఆజామాబాద్
హైదరాబాద్- 20
040-27660013

** ** **

షాయరె తెలంగాణ మఖ్దూం మొహియుద్దీన్ వ్యక్తిత్వంతోపాటు ఆయన కవిత్వాన్ని సమగ్రంగా చిత్రిస్తూ రచయిత వాహెద్ ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథంలో మఖ్దూం జీవితం.. కవిత్వాన్ని విశే్లషించిన అబ్దుల్ వాహెద్ మఖ్దూంను ఓ గొప్ప కార్మిక సంఘ నాయకునిగా, కమ్యూనిస్టు నేతగా ప్రజలతో మమేకమై.. ఆయన ప్రజా పోరాటాల్లో పాల్గొన్న తీరుతెన్నులను.. చక్కగా ఆవిష్కరించారు. మఖ్దూం తన అనుభవాలను రంగరించి.. ప్రజల పక్షాన నిలిచి.. ప్రజల ఆకాంక్షలను తన కవిత్వంలో బంధించిన మహామనీషి ‘మఖ్దూం’ అని వాహెద్ తేల్చి చెప్పారు.
ఈ గ్రంథకర్త వాహెద్ మఖ్దూం జీవితాన్ని ఓ కొత్త కోణంలో పాఠకులకు అందించారు. మఖ్దూం జీవితాన్ని... కవిగా ఆయన పండించిన కవిత్వాన్ని, కమ్యూనిస్టుగా ఆయన ప్రజలతో కలిసి కదం కలిపిన వైనాన్ని వాహెద్ విశే్లషించారు. మఖ్దూం కవితల్ని సేకరించి, చక్కని తెలుగు అనువాదాన్ని చేసి.. ఉర్దూ లిపితో పాటు తెలుగు లిపిలో కూడా ఇవ్వడంలో రచయిత వాహెద్ కృషిని అభినందించకుండా ఉండలేము. అంతేగాక మఖ్దూం సహచరులు, మిత్రులు రాసిన జ్ఞాపకాల దొంతరల నుండి.. సేకరించిన సమాచారాన్ని ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశారు. ఓ క్రమపద్ధతి మఖ్దూం గురించిన సమాచారాన్ని ఏర్చికూర్చి ఇందులో పొందుపరచడంలో రచయిత వాహెద్ కృతకృత్యులైనారు.
తెలంగాణ గడ్డపై విప్లవ వీరుడిగా భాసిల్లిన మఖ్దూంను ఉద్యమాలకు ఊపిరిపోసిన యోధుడిగా కవి యాకూబ్ తన ముందు మాటలో పేర్కొన్నారు. నిరంకుశ పాలనపై గర్జించిన తుపాకీ తూటా, ఫాసిజంపై ఎత్తిన కత్తిగా మఖ్దూంను అభివర్ణించారు. ‘మఖ్దూం’ మహా వ్యక్తిత్వాన్ని దర్పణమని ఎన్.వేణుగోపాల్ తన పీఠికలో అభిప్రాయపడ్డారు.
మఖ్దూం మొహియుద్దీన్, తెలంగాణ రాసుకున్న గజల్ అనీ, తెలంగాణ పోరాటాన్ని తన ఉర్దూ కవిత్వం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన కవి అని రచయిత వాహెద్ తేల్చి చెప్పారు. మఖ్దూం రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ‘తరానా’ ‘తెలంగాన్’ ‘ఇంక్విలాబ్’ కవితల్ని సోదాహరణంగా వాహెద్ తెలుగులో వివరించడం విశేషం!
భారతదేశపు మార్గదర్శి నా తెలంగాణ అని నినదించిన మఖ్దూం.. మండుటెండలో దప్పిక తీర్చే అమృతపాకం.. చీకటి రాత్రీ రొమ్ములో వెలిగే కాగడ తేజం! అని మఖ్దూం తెలంగాణ పట్ల కవిత్వీకరించిన విషయాన్ని ఈ గ్రంథం ద్వారా గుర్తుచేశారు. ఉర్దూలో మఖ్దూం రాసిన ‘తరానా’ను ప్రస్తావిస్తూ.. ‘దాయరె హింద్ కా వో రహ్బర్ తెలంగాణా.. బనారహా హై నరుూ సహర్ తెలంగాణా’ అన్న పంక్తుల్ని వాహెద్ ఉదహరించారు.
మెదక్ జిల్లా, అందోల్‌లో జన్మించిన మఖ్దూం బాల్యాన్ని - ఈ గ్రంథంలో వాహెద్ ‘మొలకెత్తిన పరిమళం’గా మనకు పరిచయం చేశారు. సంప్రదాయ కుటుంబంలో.. పుట్టినా... పేదరికంలోనే బాల్యాన్ని గడిపిన మఖ్దూంకు చిన్నప్పటి నుండే అధ్యయనంపై మక్కువ అనీ, ఆయన పినతండ్రి వ్యక్తిత్వం ప్రభావం ఆయనపై చాలా ఉందని వాహెద్ వివరించిన తీరు బాగుంది.
మఖ్దూం ఉస్మానియాలో విద్య నభ్యసించిన తీరుతెన్నులను, ఎం.ఏ తర్వాత ఉపాథి కోసం ఆయన పడిన యాతనలను - ఈ వ్యాసంలో విశే్లషించారు. కమ్యూనిజమే ‘నిజం’ అని గ్రహించిన మఖ్దూం జీవితాన్ని - తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను మరో వ్యాసంలో వాహెద్ చక్కగా ఆవిష్కరించారు. మఖ్దూం జైలు జీవితాన్ని, ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలను.. ఈ వ్యాసంలో పొందుపరిచారు. మఖ్దూం నాయకత్వంలో జులై 1943లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిందనీ.. మఖ్దూం సామ్రాజ్యవాదంపై, ఫ్యూడలిజంపైన కారుచిచ్చు లాంటి కవిత్వాన్ని రాశారనీ... మఖ్దూం కవిత్వపు ధారను ఈ వ్యాసంలో చక్కగా ప్రస్తావించారు. మఖ్దూం రాసిన ‘అంధేరా’ ఉర్దూ కవితకు తెలుగు అనువాదాన్ని అందించారు. ‘బాగీ’ శీర్షికన మఖ్దూం రాసిన ఉర్దూ పదాలను వాహెద్ చక్కగా పొందుపరిచారు.
వియత్నాం యుద్ధ నేపథ్యంలో మఖ్దూం రాసిన ‘మృత్యు కనుమ’ కవితలోని ఉర్దూ పదాలను వాహెద్ ప్రస్తావించిన తీరు బాగుంది.
‘రాత్రి చీకటిలో మరో తార రాలిపోయింద’ని లుముంబా హత్యకు ప్రతిస్పందనగా మఖ్దూం ‘వౌనం వద్దు’ కవితను రాశారు.
ఇలా మఖ్దూం జీవితం.. కవిత్వంలోని ముఖ్యాంశాలతో రచయిత అబ్దుల్ వాహెద్ ఎంతో శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దారు. గ్రంథం చివరన పొందుపరిచిన మఖ్దూం చిత్రాలు పుస్తకానికి నిండు శోభను కూర్చాయి. మఖ్దూం సహచరులు, అభిమానులు రాసిన అభిప్రాయాలు మఖ్దూం ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటేలా ఉన్నాయి. ఆయన జీవితమే పోరాటం! పోరాటమే కవిత్వంగా వెలుగొందిన మఖ్దూం గురించిన సమాచారమందించే గ్రంథమిది! ప్రతి ఒక్కరూ చదువదగినది.

-దాస్యం సేనాధిపతి