అక్షర

సమగ్ర ఆలోచనల జీవన ముఖచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనుగువచన
కవితా సంకలనము
-డా.పి.వి.ఎల్.సుబ్బారావు
వెల: రూ.100
ప్రతులకు: రచయిత
204 సాయి ఎన్‌క్లేవ్,
లంక వీధి
విజయనగరం-535 002

ర్తమాన కవిత్వం ఆధునిక దృక్పథంలోంచి వస్తోంది. మనుషులతోపాటు ప్రపంచాన్ని, సమాజాన్ని చదివిన అనుభూతి కొంతమందే కలిగిస్తారు. అలాంటి ఆలోచనలతో ఊపిరి పోసుకున్నదే డా.పి.వి.ఎల్.సుబ్బారావు గారి ‘తెనుగు వచన కవితా సంకలనం’. ఇది పలు విభాగాల సమ్మిశ్రీతం. దీనిలో తలపులు, పిలుపులు, యెద-యెదతో, విశ్వాన వెలుగు భారతీయం, విశ్వాన భారతీయం వెలుగు అనే ఉపశీర్షికల సముదాయం కనిపిస్తుంది. వీటికి చెయ్యి తిరిగిన సాహితీవేత్తలు, కుటుంబ మిత్రులు, సహాధ్యాయులతో ప్రత్యేకంగా ‘ముందు మాటలు’ రాయించారు. ప్రముఖ కవి కరుణశ్రీ స్వదస్తూరితో రాసిన లేఖతోపాటు, లబ్దప్రతిష్ఠులైన సాహిత్యకారుల అభినందన సందేశాలు చివర్లో దర్శనమిస్తాయి. ఇవి మినీ కవితలు, కవితలు, పాటల సమాహారంగా చెప్పుకోవచ్చు. ఈ కవితల్లో వైజ్ఞానిక, సామాజిక, ప్రాపంచిక, వైయక్తిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, తాత్త్విక విశే్లషణలు సాంప్రదాయక శైలిలో కొనసాగుతాయి. ఇవి నాలుగు పంక్తుల నిడివితో తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తాయి. గతంలో నీ మనిషిని నేను, శాంకర సంవత్సరం, సకోరా, నిజం, అవతార్, కొమ్మలు - కంఠాలు, శంఖారావం, గుండె తలుపు తట్టాలి వంటి రచనలు ఈ కవి కలం నుండి జాలువారాయి. స్వతహాగా మంచి వక్త. ఆకట్టుకునే ఉచ్ఛారణతో చక్కని కంఠస్వరం ఇతని ప్రత్యేకత. స్పృశించిన ప్రతి ప్రక్రియలోనూ తనదైన సొంత ముద్ర కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని మూల అంశాలను ఒకసారి కవితాత్మకంగా తడిమే ప్రయత్నం చేద్దాం.
అంత్య ప్రాసల నియమంతో కవిత్వ రచన చెయ్యడం సుబ్బారావుగారికి వెన్నతో పెట్టిన విద్య. ఇందులోనూ ఆలోచనాత్మకమైన భావధ్వని సామాజిక వర్తమాన సమస్యగా చూపెట్టడంలో కవిలోని నేర్పరితనాన్ని పరిచయం చేస్తుంది.
‘రైతు సేద్యం/ ఆదాయం శూన్యం/ అంతా అయోమయం/ ఆత్మహత్యే శరణ్యమా’ అని ప్రశ్నిస్తాడు ఒకచోట కవి. దేశానికి అన్నం పెట్టే అన్నదాన ఆర్థిక దుస్థితిని చాలా ఆర్ద్రంగా వాస్తవిక దృష్టితో కళ్లకు కట్టించే ప్రయత్నం చేస్తారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా వస్తున్న మార్పులు అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. వ్యవసాయ రంగంలో దీని ప్రభావం అధికం. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి పాలకవర్గాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు మనుగడకు అవరోధంగా మారి, వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా తయారయ్యాయి. సకాలంలో వర్షాలు కురవక, నకిలీ ఎరువులు, కల్తీ విత్తనాలు, రసాయనిక క్రిమిసంహారక మందులు పాలుబడి రైతు బతుకు గాలిలో దీపంగా మారింది. సమయానికి సబ్సిడీలు అందక, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక, దళారీల దగాకోరుతనానికి మోసపోతూ తీవ్ర సందిగ్ధతలో నలిగి చిదిగిపోతున్నాడు. వీటికి తోడు ఆహార పంటలకు బదులు, వాణిజ్య పంటలు వేసి, ఆర్థికంగా నష్టపోయి, అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు రైతన్న. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో రైతు సేద్యం గగన కుసుమంగా మారింది. ఈ నేపథ్యాన్ని ఒడిసిపట్టుకోవడంలో సుబ్బారావుగారిది అందె వేసిన చెయ్యి. కాబట్టే కవిగా సఫలీకృతమయ్యారు.
‘కంటికి పచ్చదనం/ వొంటికి చల్లదనం/ చెట్టు గొప్పదనం/ వృక్షం కనిపించే దైవం’ అని పేర్కొనడంలో పరోపకార దృష్టిని పరోక్షంగా తెలియజేస్తారు కవి. ప్రకృతికి పచ్చదనాన్ని, మానవాళికి ప్రాణవాయువుని, పుడమికి నీడని, గాలి స్పర్శతో మబ్బుల వర్షాన్ని, ఈ భూగోళానికి అందించే త్యాగమయి వృక్షం. అటువంటి చెట్టుని దైవంతో పోల్చి, ఆపద్భాంధవునిగా చిత్రీకరించడం సుబ్బారావుగారి దూరదృష్టికి నిదర్శనం. ఈ తాత్త్విక దృష్టిని సృజనాత్మకంగా వ్యక్తీకరించడం మరో ప్రత్యేకత. ఇలాంటి లక్షణాలన్నీ పరిణతి చెందిన కవికే సాధ్యపడతాయి.
‘్భమిపై పుట్టని నీరు/ మనిషి కార్చే కన్నీరు/ మనసు బరువు తీరు/ బతుకు తీరం చేరు’ అంటూ ఉపదేశిస్తారు ఇంకో చోట కవి. జీవన తత్త్వం తెలిసిన మనిషికి ఈ పరమ రహస్య సారాంశం తెలియకుండా ఉండదు. మనసు కార్చే కన్నీటికి ఉపశమనంతోపాటు బతుకు భారాన్ని అధిగమించే శక్తి కూడా వస్తుంది. అదే జీవన తీరం చేరడం. ఈ పరమార్థ దృష్టితోనే లోచూపుతో ఆలోచించి సరైన నిర్వచనమిస్తారు. ఇందులో అంతుబట్టని ఆధ్యాత్మిక చింతన కూడా గోచరిస్తుంది.
‘అంతరిక్ష శోధనలు/ అద్భుత సాధనలు/ అగ్ర దేశాల్లో స్థానం/ విశ్వాన వెలుగు భారతీయం’ అన్న మకుటంతో సాగిపోయే అంత్యప్రాసల మినీ కవిత్వం భారతీయత వెలుగును విశ్వమంతా చాటి చెబుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలకు ప్రతీకలైన అంతరిక్ష శోధనలు అగ్రదేశాల సరసన భారతావనిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుందని కవి ఆకాంక్ష. అణ్వస్త్ర పరిశోధనలతోపాటు ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి సభ్య దేశాల మధ్య శాశ్వత స్థానాన్ని భారత్ పొందిన రోజే ఈ కల నిజమవుతుంది. ఆ క్షణాల కోసం ఆత్రంగా ఎదురుచూద్దాం.
‘దారి చూపించే చరిత్ర/ ప్రగతి పథాన వర్తమానం/ ఆశావాద ఉజ్జ్వల భవిష్యత్తు/ విశ్వాన భారతీయం వెలుగు’ అనే పలుకులు భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల ప్రతిబింబాలు. దారి మంచిదైతే సాధించే ప్రగతి ఉజ్జ్వల భవిష్యత్తుకు ఆశావాద ఊపిరిని ఊదుతుంది. ఈ భరోసా చాలు. భారతదేశ ఖ్యాతిని వెలుగుతున్న విశ్వంలో నిలబెట్టడానికి. సమకాలీన మానవ చరిత్రను తిరగేస్తే ఈ విషయం బోధపడుతుంది. అందుకనే దీనిని కవితా వస్తువుగా కవి ఎంచుకున్నారు.
‘అక్షరం శిల కాదు, ఒడిసెల/ కల కాదు, ఎగిసే అల/ హిమపాతం కాదు, ఉరికే జలపాతం/ ఆరిపోయిన అగ్ని కాదు/ మండుతున్న అగ్నిపర్వతం’ అంటారు ‘అక్షరం’ కవితలో. ఇది ముమ్మాటికీ అక్షర సత్యమే. స్తంభించిపోయిన మానవ జీవితాన్ని మేధస్సుతో ఉరకలేయించి చైతన్యపరుస్తుంది అక్షరం. సూక్ష్మదృష్టితో స్థూల దృక్పథాన్ని విశాలతరం చేస్తుంది. ఈ చూపును అందిపుచ్చుకోవడానికైనా అక్షరాన్ని అధ్యయనం చెయ్యాల్సిందే.
‘ప్రబోధ గీతం’లో కవి ఆశావహ దృక్పథం ఎల్లలు దాటి ప్రయాణిస్తుంది. ‘కాలం కలసిరానపుడు శిశిరంలో మోడయినా/ వసంతంలో చివురిస్తూ తలెత్తుకొనే తరువుకావా’ అని అడిగే ప్రయత్నం చేస్తారు ఓ చోట. అన్ని దారులూ మూసుకుపోయాక భవిష్యత్తులో తెరుచుకోబోయే కొత్త దారే జీవితానికి వెలుగునిస్తుంది. అలాంటి నమ్మకం వసంతకాలపు తరువు మీద మొలకెత్తిస్తారు కవి. గొప్ప ఆశావాదానికి బాటలు పరుస్తారు. ఈ ప్రేరణ నిరాశావాదుల పాలిట కల్పతరువుగా మారి వసంతోదయానికి ఆహ్వానం పలుకుతుంది. ఈ పిలుపు సందేశం సుబ్బారావుగారి అక్షరాక్షరమూ వినిపిస్తుంది. ప్రపంచ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేసిన అనుభవం సుబ్బారావుగారి ప్రతి రచనలోనూ కనిపిస్తుంది. పాత కొత్తల మేలు కలయికలా ఈ కవి శైలి విలక్షణంగా రూపుకడుతుంది. ఆధునిక కవిత్వం కొత్త అభివ్యక్తులతో పోటీ పడుతున్న తరుణంలో సాంప్రదాయక అభివ్యక్తీకరణ కవిలోని సనాతన సంస్కృతిని బయటపెడుతుంది. క్లుప్తత నిండిన సరళత సామాజిక స్పృహను కవితాత్మకంగా ధ్వనింపజేస్తుంది. ఇలా పలు అంశాలను పాఠకుల దృష్టికి సూటిగా చేరవెయ్యడంలో జాగరూకతను ప్రదర్శించిన కవి సుబ్బారావుగారు కృషిని మనస్ఫూర్తిగా అభినందించవలసిందే!

-మానాపురం రాజా చంద్రశేఖర్